'మిస్సమ్మ'ను కోల్పోయిన ప్రియమణి
తాను చేసిన సినిమాల్లో కొన్ని బాక్సాఫిస్ దగ్గర విజయం సాధించేసి, కాస్తంత పాపులారిటీ వచ్చేస్తే చాలు నిర్మాతల దగ్గర చాంతాడంత గొంతెమ్మ కోరికల చిట్టా విప్పే నటీనటులకు ప్రస్తుత కాలంలో కొదవేలేదు. ఇలాంటివారి జాబితాలో నటి ప్రియమణి మినహాయింపేమీ కాదండోయ్. అయితే నిర్మాత బడ్జెట్ను తెలుసుకోకుండా ఖరీదూన తన కోరికల చిట్టాను డిమాండ్ చేసినందుకు ప్రియమణి ఓ సినిమానే వదులుకోవాల్సి వచ్చింది. ఇందుకు సబంధించిన వివరాలపూ ఓ లుక్ వేస్తే...శివాజీ, లయ, భూమిక ప్రధాన పాత్రధారులుగా నీలకంఠ దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన 'మిస్సమ్మ' చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'నమస్తే మేడమ్' అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో శివాజీ పాత్రలో శ్రీనగర కిట్టి, లయ పాత్రలో నిఖీషా పటేల్ (పులి ఫేమ్), భూమిక పాత్రలో ప్రియమణిలను మొదటగా ఎంపిక చేశారు. అయితే తన సినిమాలో ధరించబోయే యాక్ససరీస్తో పాటు నగలను కూడా తాను చెప్పిన డిజైనర్ దగ్గరే డిజైన్ చేయించాలని, తాను వాడబోయే ప్రతి వస్తువు తనకు నచ్చినట్లుగానే ఉండాలని ప్రియమణి షరతులు విధించడం మొదలుపెట్టిందట. ఇందుకు సదరు ఆ సినిమా నిర్మాత దుస్తుల వరకు అయితే ఓకేగానీ నగల కోసం కూడా ప్రత్యేకంగా డిజైనర్లను ఆశ్రయించాలంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని ప్రియమణికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారట.
కానీ ప్రియమణి వింటేనా, దీంతో ఆ సినిమా నుండే ప్రియమణిని నిర్మాత తప్పించినట్లు శాండల్ వుడ్ వర్గాల సమాచారం. ఇక ప్రియమణి స్థానంలో శాండల్వుడ్లో ప్రముఖ నటి రాగిణి ద్వివేదిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై ప్రియమణిని ప్రశ్నిస్తే మాత్రం...'నిర్మాత నన్ను సినిమా నుంచి తప్పించడం ఏంటి, కథ, కథలోని కొన్ని అంశాలు నచ్చక నేనే సినిమాను వదులుకున్నాను' అని చెప్పుకోవటం విశేషం.