మా అమ్మ కడుపులో తొమ్మిది నెలలు అపురూపంగా పెరిగిన నేను ఓ రోజు ఉదయాన్నే ఈ లోకంలోకి వచ్చాను. పనిలో పనిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేసేశారు మాయమ్మకు.
వీడు నా బిడ్డ కాదు మరోసారి గట్టిగా ఏడుస్తూనే చెప్పింది మాయమ్మ.ఉహూ మా అవ్వ విన్లే. క్యాగే దివానీ..తెరాబేటా నహీతో కిస్కావునే? మూ మూచ్‌లేకో దూద్ పిలా..బచ్చా రోతాహై (నీ కేమైనా పిచ్చా ..నీ కొడుక్కాకుంటే ఎవరి కొడుకు..నోర్మూసుకుని పాలు తాపు)పిల్లాడు పాల కోసం ఏడుస్తున్నాడు. అమ్మ మాత్రం పాలు ఇవ్వడంలేదు. పిల్లాడి ఏడుపు తల్లి మనసును పిండేస్తోంది. కానీ పాలు తాపించావు గదా ఎక్కడ నీకు పుట్టిన పిల్లోడే అంటారని భయంతో పాలివ్వనని మొండికేసింది. ఈ దృశ్యం...1963లో జమ్మలమడుగు మిషన్ ఆస్పత్రిలోనిది. ఆ రోజు మాతృత్వానికి అగ్ని పరీక్ష!ఉపోద్ఘాతం అర్థం కావాలంటే అంతకు ముందు ఏం జరిగిందనేది చెప్పాలి...మా అమ్మ కడుపులో తొమ్మిది నెలలు అపురూపంగా పెరిగిన నేను ఓ రోజు ఉదయాన్నే ఈ లోకంలోకి వచ్చాను. పనిలో పనిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేసేశారు మాయమ్మకు. మత్తు మందు కారణంగా స్పృహలో లేదు. మధ్యాహ్నం తర్వాత అమ్మ కళ్లు తెరిచింది. ఈలోగా బాబు పాల కోసం ఏడుస్తుంటే మాయవ్వ ఊయల్లో ఉన్న బాబును మా అమ్మ పక్కన పడుకోబెట్టి పాలు ఇవ్వమంది.
బాబును చూసి మా అమ్మ షాకైంది. బిడ్డ పుట్టంగానే చూసిన పిల్లోడికి, ఈ పిల్లోడికి రూపురేఖల్లో పోలికేలేదు. దాంతో ఏ మేరా బేటా నై (వీడు నా బిడ్డ కానేకాదు) అని ఏడ్వడం మొదలుపెట్టింది.వార్డులో ఉన్న బాలింతలు, వారికి తోడుగా వచ్చిన మహిళలు మా అమ్మ వైపు ఈమెకేమైనా పిచ్చా కడుపున పుట్టిన బిడ్డను కాదంటోంది అని ..అదోరకంగా చూస్తున్నారు.కాన్పయ్యాక చూసింది కొద్ది క్షణాలే అయినా నా రూపం అమ్మ మదిలో ముద్రపడిపోయింది. ఆపరేçషన్ తర్వాత ఆమె మగతలోకి జారి పోయింది. స్పృహలో లేదు కానీ బిడ్డ ముఖం బాగా గుర్తుండిపోయింది. అందుకే ఇప్పుడు తన ఒడిలో ఉన్న బిడ్డ తన బిడ్డ కాదని గట్టిగా వాదించడమే కాదు పిల్లాడికి పాలు కూడా ఇవ్వనని మొండికేసింది. ఎవరు ఎన్ని చెప్పినా వినడంలేదు. ఈ తతంగం ఇలా నడుస్తున్నప్పుడే మాయమ్మ దృష్టి తన బెడ్ పక్కన ఉన్న బాలింతపైనా..ఆమె ఒడిలోని బిడ్డపైనా పడింది. అంతే... మేరబచ్చా ఉదర్ హై (నా పిల్లోడు అక్కడుండాడు) అంటూ మళ్లీ ఏడ్వటం మొదలుపెట్టింది. ఈమెకు కచ్చితంగా మెంటలే అని నిర్ధారణకు వచ్చేశారంతా.హిస్టీరియా వచ్చినట్లు మిస్సమ్మకు బులావ్ (పిలవండి)..అని గట్టిగా అరవసాగింది మాయమ్మ. మిస్సమ్మపై అమ్మకు చాలా నమ్మకం. మొదటి కాన్పు తప్ప మిగతా మూడు కాన్పులు మిషన్ ఆస్పత్రిలోనే అయ్యాయి.పక్కనున్న బాలింత కూడా ముస్లిమే. ఆమె ఒడిలో ఉంది నా బిడ్డే అని మాయమ్మ చెపుతుంటే ఆమె.. మేరే బేటేకు తేరా బేటా కర్‌కో బోల్తీ క్యా (నాబిడ్డను నీ బిడ్డనిఅంటున్నావు) అని తిట్టడం మొదలుపెట్టింది. గొడవ ఎక్కువయ్యేసరికి ఈ సమస్యకు మిస్సమ్మే పరిష్కారం చూపిస్తుందని నర్సు ఆమెను తోడ్కొని వచ్చింది.మిస్సమ్మ ఆస్పత్రి ఇన్‌చార్జి. ఆమె అంటే ఆస్పత్రిలో అందరికీ గౌరవం. మిస్సమ్మ దగ్గరికి వచ్చాక ..మా అమ్మ బిడ్డను చూపిస్తూ ఈ బిడ్డ నాబిడ్డ కాదంటే వినడంలేదు అని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పింది.
బూమ్మా...బాగా చూడు నీ బిడ్డ కాదని ఎలా అంటావు? మిస్సమ్మ అనునయించే ప్రయత్నం చేసింది.
నాకు బాగా గుర్తు ఆ పక్క బెడ్‌పై ఉన్న బాలింత ఒడిలో ఉన్న బిడ్డే నా బిడ్డ అని ఏడుస్తోంది.అమ్మ కన్నీటి ధారల్లో నిజాయితీ మిస్సమ్మ గుండెను తాకిందేమో!పసిపిల్లలిద్దర్నీ చెరో చంకలోకి తీసుకుని ...నిజం చెప్పు ఈ పిల్లాడు నిజంగా నీ పిల్లాడేనా? పోలీసులను పిలవమంటావా? పక్క బెడ్ బాలింతను గద్దించింది మిస్సమ్మ.దేవుడి సాక్షిగా నాబిడ్డే మిస్సమ్మా..నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది.మధ్యమధ్యలో ఏడుస్తోంది. ఆమే ఒక తల్లే!ఆ కన్నీటిలో పుత్రవాత్సల్యం ఉంది. కానీ అమ్మతనం కనిపించినట్లు లేదు మిస్సమ్మకు.అప్పటికే మా నాయన, పక్క బెడ్ బాలింత భర్త అక్కడికి చేరారు. వారిద్దరి ముఖాలను, పిల్లల ముఖాలను మార్చిమార్చి చూసింది మిస్సమ్మ. ఆఖరిసారి చెపుతున్నా నీ బిడ్డ నీకు కావాలంటే నిజం చెప్పుఅనేసరికి భయపడిపోయిన బాలింత ..పిల్లోడు బాగుండాడనినా బిడ్డను పక్కనున్న ఊయల్లో పడుకోబెట్టి అక్కడ ఉన్న బిడ్డను తీసుకున్నానని ఒప్పుకుంది.అప్పటిదాకా అమ్మను దోషిలాగా చూసినవారు ముక్కున వేలేసుకున్నారు. బాలింతకుచీవాట్లు పెట్టారు. లౌక్యం ప్రదర్శించిన మిస్సమ్మను పొగడ్తలతో ముంచెత్తారు. మా అమ్మా,నాయనయితే సంతోషం పట్టలేకపోయారు.ఆస్పత్రిలో శుభం కార్డు పడ్డాక అమ్మ ఒడిలో నేను..వాళ్లమ్మ ఒడిలో వాడు వెచ్చగా బజ్జున్నాం. కానీ..నన్ను చూసింది ఒకట్రెండు నిమిషాలే ..అయినా అమ్మ నాతో కనెక్టు అవడమే ఓ అద్భుతం. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అంటే ఇదేనేమో? అమ్మకు అమ్మేసాటి అనేది అందుకేనేమో? డీఎన్‌ఏ పరీక్షలు, సీసీ కెమెరాల్లేని రోజులు.. పోలీసు కేసులు, కోర్టు తీర్పుల్లేకుండా..ఓ క్లిష్టమైన సమస్య కేవలం ఓ తల్లి ‘నమ్మకం’ పునాదిపై పరిష్కారం అయిందంటేనమ్మశక్యం కాని విషయం. ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం. ఓ తల్లి హృదయ స్పందనే సాక్షిగా అప్పటి మిస్సమ్మ ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఈ తరం వైద్యరంగానికి గొప్పపాఠం.(నాకు ఊహ తెలిశాక అమ్మ చెపుతుంటే కలిగిన ఉద్వేగాన్ని ఇప్పుడు మాటల్లో చెప్పలేను.కానీ..అమ్మ మాటలు అలా నా జ్ఞాపకాల దొంతరలో భద్రంగా నిలిచిపోయాయి. నన్ను అపహరించిన ఆవిడ భర్త అప్పట్లో వీధుల్లోతిరిగి గాజులమ్మేవారని..నేను అక్కడే పెరిగి పెద్దయి ఉంటే గాజులోయ్..అంటూ వీధులు పట్టుకుని తిరిగేవాడినని నన్ను ఇంట్లో ఆటపట్టించేవారు)
– నజీర్
రైల్వే కొండాపురం, వైఎస్‌ఆర్ కడప జిల్లా
Comments
Please login to add a commentAdd a comment