హృదయ సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హృద్రోగాల బారినపడి ఏటా లక్షలాదిమంది మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 2024 కూడా గుండె ఆరోగ్యానికి సవాలుగా నిలిచింది. గుండెపోటు, గుండె ఆగిపోవడం కారణంగా ఈ ఏడాది లక్షలాదిమంది మృతిచెందారు.
కరోనా మహమ్మారి తర్వాత భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో గుండె జబ్బులు అధికంగా నమోదవుతున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. 2024లో తీవ్రమైన గుండె సమస్యల కారణంగా మన దేశంలో లక్షలాది మంది మృతిచెందారు. 2024, ఫిబ్రవరి 20న ప్రముఖ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ (59) గుండెపోటుతో మరణించారు. రితురాజ్.. హిట్లర్ దీదీ తదితర టీవీ షోలలోనటించారు. అదేవిధంగా నటి కవితా చౌదరి కూడా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె ఉడాన్ తదితర సీరియళ్లలో నటించారు. టీవీ నటుడు, మోడల్ వికాస్ సేథి కూడా 48 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో కన్నుమూశారు.
గుండెపోటుతో పాటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు ఈ ఏడాది అందరిలోనూ ఆందోళనను పెంచాయి. 2024 జూన్ 9న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే(47) గుండెపోటుతో మరణించారు. కాగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ అనేవి రెండు వేర్వేరు స్థితులు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో అడ్డంకి ఏర్పడిన కారణంగా, గుండెకు రక్త ప్రసరణ అందడంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో గుండెపోటు వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ స్థితిలో గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోతుంది.
కరోనా ఇన్‌ఫెక్షన్, మరణాల ముప్పును తగ్గించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ టీకా గుండెపోటుతో పాటు మరణాల కేసులు పెరిగాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్‌లు పూర్తిగా సురక్షితమైనవని, ఎలాంటి సమస్యలు తలెత్తవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని, అందుకే ముందస్తుగా గుండెపోటు వస్తే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గుండెపోటు వచ్చిన బాధితునికి వెంటనే సీపీఆర్ అందించడం ద్వారా అతని ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. గుండె జబ్బుల ముప్పును నివారించడానికి సరైన జీవనశైలిని అనుసరించడం, పోషక ఆహారాన్ని తీసుకోవడం రక్తపోటును, షుగర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా..
Comments
Please login to add a commentAdd a comment