holidays for students
-
చైనా కాలేజీల్లో ‘లవ్ బ్రేక్’
బీజింగ్: వేసవి సెలవులు, పండగ సెలవులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే కాలేజీలకు సెలవులు ఇవ్వడం సర్వసాధారణం. కానీ చైనాలో కాలేజీలు విద్యార్థులు ప్రేమలో మునిగి తేలడానికి సెలవులు ఇచ్చారు. అవును.. నిజమే.. చైనాలో యువ జనాభా తగ్గిపోతున్న విషయం తెలిసిందే కదా. దశాబ్దాల తరబడి అయితే ఒక్కరు లేదంటే వద్దు అన్న ఆంక్షల చట్రంలో గడిపిన చైనీయులు ఇప్పుడు ప్రేమ, పెళ్లి, పిల్లలు అన్న పదాల పట్ల విముఖంగా ఉన్నారు. అందుకే నేటి తరంలో కాస్తయినా ప్రేమ భావనలు మొలకెత్తడానికి కొన్ని కళాశాలలు ఈ కొత్త ఆలోచన చేశాయి. ఏప్రిల్ అంటే వసంత కాలం. ఈ కాలంలో చెట్లన్నీ విరబూసి వాతావరణం అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. స్ప్రింగ్ సీజన్‌ని ఎంజాయ్ చేయడంతో పాటు లవ్‌లో కూడా పడండి అంటూ ఒక వారం రోజులు సెలవులు ప్రకటించాయి చైనా కాలేజీలు. ‘‘ప్రకృతిని ప్రేమించండి. . ప్రేమిస్తే ఎంత కొత్తగా వింతగా ఉంటుందో అనుభూతి చెందండి.లైప్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి’’ అని యువతకి ప్రేమించుకోవడానికి కొన్ని కాలేజీలు హాలీడేస్ ప్రకటించాయి. అలా ప్రేమలో పడ్డ జంటలైనా ఒక్కటై పిల్లల్ని కంటారని ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది. -
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. టెన్త్ పరీక్షలు, విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనం, ఇతర అకడమిక్ అంశాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉన్నందున టీచర్లందరూ యథావిధిగా పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. టీచర్ల హాజరుతో పాఠశాలలు ఈనెల 20 వరకు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ఇంతకు ముందే సర్క్యులర్ జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు నిర్వహించాలని, పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలను మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు నిర్వహించాలని కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ సూచించారు. అలాగే 2021–22 విద్యాసంవత్సరంలో ఒక బేస్‌లైన్ టెస్టు, 3 ఫార్మేటివ్, 2 సమ్మేటివ్, ఒక ప్రీ ఫైనల్ పరీక్ష నిర్వహించారు. వీటితో పాటు విద్యార్థులలో పద సంపద, పరిజ్ఞానం పెంచేందుకు ‘లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ పేరుతో బేస్‌లైన్ టెస్టు కూడా పెట్టారు. ఆ పరీక్షలకు సంబంధించి అన్ని జవాబు పత్రాలను మూల్యాంకనం పూర్తి చేసి పాఠశాల రిజిస్టర్లలో, ఆన్లైన్లో నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. ఈనెల 13లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను జూలై 4వ తేదీనుంచి పునఃప్రారంభిస్తామని ఇంతకు ముందే కమిషనర్ ప్రకటించారు. -
తెలుగు క్లాసిక్స్: విజయా వారి వేసవి
పిల్లలకు సెలవులు. ఈసారి ‘విజయా’ వారి వేసవి చూపించండి. అంటే? విజయ సంస్థ తీసిన సినిమాలు చూపించడమే. ఉపాయంతో మాంత్రికుణ్ణి హతమార్చే తోటరాముణ్ణి ‘పాతాళ భైరవి’లో, రాజ్యం లేకపోయినా శౌర్యానికి ఢోకా ఉండకూడదని చెప్పే అభిమన్యుడిని ‘మాయాబజార్’లో, లౌక్యం ఉంటే పనులు సాధ్యమవుతాయని చూపే ఎంటి.రావు, మేరీలను ‘మిస్సమ్మ’లో, గట్టిగా సంకల్పిస్తే ఏ కోరికైనా నెరవేర్చుకోవచ్చనే రాకుమారుడు ప్రతాప్‌ను ‘జగదేక వీరుని కథ’లో పరిచయం చేయడమే. పిల్లలకు ఈ సినిమాలు వినోదం మాత్రమే ఇవ్వవు... జీవన సూత్రాలను చెబుతాయి. తెలుగు మాట, పలుకు నేర్పుతాయి. ఇంకేటి... టివి ముందు కూచోబెట్టండి. ‘సాహసం సేయరా ఢింబకా’ అంటాడు నేపాళ మాంత్రికుడు ‘పాతాళ భైరవి’లో. సాహసం చేయకుండా ఉట్టినే కూచోడానికి కాదు పుట్టింది. చదువులోనో, ఉద్యోగంలోనో, బతుకులోనో ఏదో ఒక సందర్భంలో సాహసం చేయాలి. అప్పుడే విజయం వరిస్తుంది. రాకుమారి కూడా. కాని సాహసం చేసే దారిలో ఎన్నో అడ్డంకులుంటాయి. మనల్ని కాటేసే పాములుంటాయి. వాటి తల అణచాలి. ‘దేవికి సాష్టాంగ దండ ప్రమాణం సేయరా’ అంటాడు మాంత్రికుడు రాకుమారుడితో. సాష్టాంగపడితే తల నరకాలని అతడి దుష్టపన్నాగం. కాని దేవి సలహా వల్ల రాకుమారుడు ఆ మాంత్రికుణ్ణే సాష్టాంగపడటం ఎలాగో చూపమని చెప్పి అదే అదనుగా ఆ దుర్మార్గుడి తల నరుకుతాడు. ఇదంతా పిల్లలకు పాఠమే. ‘పాతాళ భైరవి’ చూస్తే వారికి సమయస్ఫూర్తి వస్తుంది. ప్రమాదం నుంచి బయటపడటం తెలుస్తుంది. మొదట కష్టాలు ఎదురైనా గట్టిగా కష్టపడితే విజయం వరిస్తుందని కూడా తెలుస్తుంది. తెలుగులో మాత్రమే కనిపించే ముచ్చటైన జానపద చిత్రం ఇది. ‘జగదేక వీరుని కథ’లో అర్ధరాత్రి అడవిలో నిదురిస్తుంటాడు రాకుమారుడు ఎన్.టి.ఆర్. తోడు రేలంగి. రెండు దెయ్యాలు వీరిని ఆటపట్టించడానికి బయలుదేరుతాయి. ఆ అరుపులు ఈ అరుపులు అరిచి రేలంగిని భయభ్రాంతం చేస్తాయి. కాని రాకుమారుడు భయపడతాడా? వాటి పిలకపట్టి సీసాలో బంధిస్తాడు. మూడు కోర్కెలు నెరవేరిస్తేనే వదులుతానంటాడు. వాటినే వాహనంగా చేసుకుని తాను వెళ్లాల్సిన చోటుకు వెళతాడు. దెయ్యాలు భూతాలు మనం భయపడే వరకే. మనం ధైర్యంగా ఉంటే వాటి పని అంతే. ఇదే సినిమాలో మూర్ఖపురాజు రాజనాల ఉంటాడు. అతడు రాకుమారుణ్ణి మంటల్లో తోద్దామనుకుంటే రాకుమారుడే తెలివిగా అతణ్ణి మంటల పాలు చేస్తాడు. పిల్లలకు ‘జగదేక వీరుని కథ’ మంచి కాలక్షేపం. క్లయిమాక్స్‌లో ఒకే రామారావు ఐదుగురిలా మారి పాడే ‘శివశంకరి’ పాట వాళ్లు ఇప్పుడూ ఎంజాయ్ చేస్తారు. మిస్సమ్మలో డిటెక్టివ్ ఏఎన్ఆర్ చాలా చురుగ్గా ఉంటాడు. చిన్నప్పుడు తప్పిపోయిన సావిత్రిని వెతికే పని అతనిదే. అతను వెతుకున్నది సావిత్రినే అన్నది మొదటి రీలులోనే తెలిసిపోతుంది. పిల్లలు కూడా నాగేశ్వరరావుతో పాటు సావిత్రిని ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పాలని చూస్తుంటారు. బతుకు బాదరబందీ కోసం ఎన్.టి.ఆర్, సావిత్రిలు ఆడే దొంగ నాటకాల వంటివి అవసరమే అన్నది తెలుసుకుంటారు. స్త్రీలతో ఎంత చక్కగా వ్యవహరించాలో కూడా. ఈ సినిమాలో ఎన్టిఆర్ సావిత్రితో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తాడు. బతకనేర్చిన రేలంగి కూడా వాళ్లు తెలుసుకోదగ్గ మోడలే. ఇక ‘జస్టిస్... జస్టిస్... ఐ వాంట్ జస్టిస్’ అంటూ తిరిగే అసలు సిసలు కేటుగాడు రమణారెడ్డిని కూడా వాళ్లు గమనిస్తారు. కొందరికి ముక్కు మీద కోపం వున్నా వారి మనసు మంచిది అని సావిత్రిని చూసి అర్థం చేసుకుంటారు. వెన్నెలను చూసి ‘రావోయి చందమామ’ అని పాడటం కూడా. ఇక ‘మాయాబజార్’లో పిల్లలకు నచ్చనిది ఏది? కృష్ణుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు, లక్ష్మణ కుమారుడు, శకుని... అందరూ వారి అభిమాన పాత్రలే. బాణం కొట్టి మెట్లు కట్టడం, ప్రియదర్శినిలో నచ్చిన మనుషులతో వీడియో కాల్, మనుషులు డబ్బుంటే ఒక లాగా డబ్బు లేనప్పుడు ఒకలాగ వ్యవహరిస్తారని చెప్పే రేవతి (ఛాయాదేవి) పాత్ర, అన్నింటినీ చక్రం తిప్పే శ్రీకృష్ణుడు, అమాయకంగా ఉండి అసాధ్యుడిగా మారే ఘటోత్కచుడు... అతని మాయలు... పొగడ్తలతో బతికిపోయే శర్మ, శాస్త్రులు, నోరు తిరగని రాక్షస శిష్యులు, తమాషా గురువు చిన్నమయ్య... ఈ వేసవిలో పిల్లలు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడాల్సిన సినిమాలు. ఈ సినిమాలలో మూడిటికి కె.వి.రెడ్డి, ఒకదానికి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. అన్నింటిని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. పింగళి నాగేంద్రరావు కొత్త కొత్త మాటలు కనిపెట్టడం నేర్పుతారు. ఆహ్లాదం ఇచ్చే వినోదం ఎలా ఉంటుందో ఈ సినిమాలు చూపుతాయి. పిల్లలకు తప్పక చూపించండి. -
11 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఈనెల 11వ తేదీనుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈసారి రెండో శనివారం, ఆదివారాలు కలసి రావడంతో సెలవు రోజుల సంఖ్య పెరగనుంది. 11వ తేదీనుంచి 16వ తేదీ వరకు ఆరు రోజుల పాటు దసరా సెలవులుగా పాఠశాల విద్యా క్యాలెండర్లో పొందుపరిచారు. అయితే ఈనెల 9వ తేదీ రెండో శనివారం, ఆ తరువాత 10వ తేదీ ఆదివారం కావడంతో పాఠశాలలు 8వ తేదీ వరకే పనిచేయనున్నాయి. ఇక 17వ తేదీ ఆదివారం రావడంతో పాఠశాలలు 18వ తేదీనుంచి పునఃప్రారంభం కానున్నాయి. దసరాకు మొత్తంగా 9 రోజులు సెలవులు కలసి రానున్నాయి. -
ఇంటర్ కాలేజీలకు 13 నుంచి సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. కాలేజీలను 16న పునఃప్రారంభించాలని సూచించింది. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్‌కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. -
ఎల్బీ నగర్ టు పనామా.. బస్సులే బస్సులు!
సంక్రాంతి సీజన్ మొదలైపోయింది. ఊళ్లకు వెళ్లేవాళ్లతో సిటీ చౌరస్తాలు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్ చౌరస్తా రాత్రిపూట చూస్తుంటే అక్కడేదో భారీ జాతర జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి పనామా గోడౌన్స్ వరకు ఉన్న దారి మొత్తం బస్సులు, వాటి కోసం వేచి చూసే ప్రయాణికులతో నిండిపోతోంది. మంగళవారం నుంచి పలు కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో అనుకోకుండా ప్రయాణాలు చేసేవాళ్లు సోమవారం రాత్రి మూట ముల్లె సర్దుకుని బస్సుల కోసం బయల్దేరారు. నిజానికి కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు సెలవులు ఎప్పటినుంచి ఇస్తామన్న విషయాన్ని ముందు ప్రకటించకుండా.. చివరి నిమిషంలో విద్యార్థులకు చెప్పడంతో.. వాళ్ల తల్లిదండ్రులు ముందు నుంచి పండగకు ఊళ్లు వెళ్లడానికి ప్లాన్ చేసుకునే వీలు లేకుండా పోయింది. దాంతో.. అప్పటికప్పుడు అన్నీ సర్దుకుని ఊళ్లు వెళ్లేందుకు వచ్చినవాళ్లతో ఎల్బీనగర్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు అక్కడి నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉన్న పనామా గోడౌన్స్ వరకు నిలిచి ఉంటున్నాయి. అటువైపు వెళ్లాల్సిన సిటీబస్సులు మిగిలిన కొద్దిపాటి రోడ్డులోనే వెళ్లాల్సి రావడంతో.. అక్కడంతా ట్రాఫిక్ జాం అవుతోంది. ఆర్టీసీ కంట్రోలర్లు ఒకవైపు వెళ్లాల్సిన బస్సులన్నింటినీ ఒకో ప్రాంతంలో పార్కింగ్ చేయిస్తూ, ప్రయాణికులకు కూడా వాటి వివరాలు చెబుతూ హడావుడిగా కనిపిస్తున్నారు. ప్రయాణికులు మాత్రం సరిపడగా బస్సులు లేవని, ఉన్నవి కూడా అన్నీ స్పెషల్ బస్సులే కావడంతో చార్జీలు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని వాపోతున్నారు. ప్రైవేటు బస్సుల్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఏలూరుకు 500-600 వరకు మామూలు బస్సు చార్జి ఉండేది. అలాంటిది ఇప్పుడు కనీసం వెయ్యి రూపాయల నుంచి టికెట్లు మొదలవుతున్నాయి. అయినా సరే, పెద్దపండగ వస్తోంది కాబట్టి సొంతూళ్లకు వెళ్లాలని అంటున్నారు.