ప్రేమ మీట‌ర్‌ | Love songs of the silver screen | Sakshi
Sakshi News home page

ప్రేమ మీట‌ర్‌

Published Sun, Feb 10 2019 12:31 AM | Last Updated on Sun, Feb 10 2019 12:31 AM

Love songs of the silver screen - Sakshi

వెండి తెర ప్రేమను వెలిగించిన పాటలు

మేము కొన్ని అనుకున్నాం... మీకు ఇంకేవేవో గుర్తుకురావచ్చు... హ్యాపీ వాలెంటైన్స్‌ డే (ఫిబ్రవరి 14)

డ్రామా లేని ప్రేమ పండిన దాఖలాలు లేవు. అడ్డంకులు, అవరోధాలు లేకుండా సాఫీగా ఉన్న ప్రేమ గొప్ప ప్రేమగా జ్ఞాపకాల్లో నిలువలేదు. ప్రేమ పొందేది కాదు. సాధించుకునేది. గెలుచుకునేది.నిలబెట్టుకునేది. అందులో పడ్డవాళ్లను చెడ్డవాళ్లని లోకం అనుకున్నా లెక్క చేయరు. పగవాళ్లని దూరం పెట్టినా పట్టించుకోరు. అబ్బాయి అమ్మాయి కోసం ఎదురు చూస్తుంది. అమ్మాయి కోసం అబ్బాయి కోట గోడల్ని అయినా లతలు పట్టుకొని పాకి సాహసంగా లోపలికి లంఘిస్తాడు. రాకుమారి స్వయంవరం ప్రకటించి వచ్చిన వందమందిలో ఒకరిని ఎంచుకుంటే ఏం చోద్యం ఉంది? అదే తోటలో పని చేసే ఒక కూలివాణ్ణి కోరుకుంటే అసలైన కథ ఉంది. ‘పాతాళ భైరవి’లో రాకుమారి అలా ఒక తోట రాముణ్ణి ప్రేమించి తెలుగునాట వెండి తెర మీద ప్రేమకు గట్టిగా తెర తీసింది. ‘నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది’ అని ఆమె చందురుణ్ణి చూసి పాడుతుంటే ఆ పదం విని తోటలో రాముడు ‘కలవరమాయే మదిలో నా మదిలో’ అని అరచేతిని ఛాతీకి రుద్దుకుంటాడు. ఆ కలవరం తీర్చుకోవడానికి అతడు రిస్క్‌ తీసుకోవడానికి వెనుకాడడు. మాంత్రికుడి వలలో పడటానికి సందేహించడు. ‘ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు’ అని ప్రేక్షకులు జాలి పడేలా చేసుకోగలిగాడు. ఏమైనా ఈ ప్రేమ సుఖాంతమైంది. ఆ పాతాళభైరవి తల్లి వల్ల పది కాలాలు నిలిచింది.

అయితే ప్రేమలో ఉన్నట్టుగా ప్రేమికులకు తెలియకపోవడం కూడా ఒక తియ్యటి విషయమే. ‘మిస్సమ్మ’లో టీచరమ్మ సావిత్రి, పంతులు ఎన్‌.టి.ఆర్‌ ఒకే ఇంట్లో భార్యభర్తలుగా దొంగనాటకం ఆడుతూ కాపురం పెడతారు. నిజానికి వారు దొంగ భార్యభర్తలే కాని నిజం ప్రేమికులు. ఆ సంగతి వారికి తెలియదు. అర్థం చేసుకోరు. ఒకరికొకరు చెప్పుకోరు. ప్రేమంతా లోపల ఉంటుంది. కయ్యాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఇది వింత ప్రేమ. అందుకే ‘రావోయి చందమామ... మా వింతగాథ వినుమా’ అని వారు పాడుకుంటే ఇలాంటి వింత ప్రేమలో పడటానికి ప్రేక్షకులు కూడా రెడీ అయ్యారు.అయితే ప్రేమ అంటేనే ప్రమాదం. ప్రేమ అంటేనే శోకం. ప్రేమ అంటేనే వేదన. ప్రేమ అంటే మరణం అని ‘దేవదాసు’ చెప్పింది. చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డ పారు జీవితంలో దక్కకపోతే ఏ దేవదాసైనా దేవదాసే అవుతాడు. అటువంటి సమయంలో ఆ ప్రేమికుడికి తాత్త్వికత వస్తుంది. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌’ అంటాడు. ‘జగమే మాయ బతుకే మాయ’ అని భౌతిక జీవితాన్ని ఈసడిస్తాడు. ‘ఓ... దేవదా’ అని ఆమె పాడితే ‘ఓ.. పార్వతి’ అని ఇతడు పాడిన రోజులు మాత్రమే అతడికి వాస్తవం. అవి తప్పిపోయిన మిగలిన అన్ని రోజులూ మత్తే. అందులో చిత్తే. ఆఖరుకు మరణం మాత్రమే అతడి ప్రేమను మరిపించగలిగింది. ఆ ప్రేమను ఇప్పటికీ ప్రేక్షకులు ఇష్టంగా నిందగా ఇష్టపడుతూనే ఉన్నారు.అయితే ప్రేమ అంటే ఏమిటి? శరీరమా, మనసా, ఆ రెంటి మీద ఆధిపత్యమా? ఏమిటి ప్రేమంటే? దానికీ తెలుగు సినిమా జవాబు చెప్పింది.‘డాక్టర్‌ చక్రవర్తి’లో శ్రీశ్రీ కలం ఆ ప్రశ్నకు ఇలా బదులు పలికింది. ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరునించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ’... నిజమే కదా. ‘చీకటి మూసిన ఏకాంతంలో తోడుగా నిలవడమే కదా’ ప్రేమంటే. 

ఇప్పుడు ప్రేమకు యువతీ యువకులు సిద్ధంగా ఉన్నారు. పడటానికి ఉవ్విళ్లూరుతున్నారు. కాని వారికి రాయబారి కావాలి. ప్రేమ వ్యక్తం చేసే మార్గం కావాలి. ‘ప్రేమలేఖ’ ఆ కార్యాన్ని నెరవేర్చింది. ఎన్ని వేల, లక్షల ప్రేమ లేఖలు లోకాన ఒకరి నుంచి మరొకరికి అంది ఉంటాయో. ఇక్కడ చూడండి. టక్‌ చేసుకున్న హరనాథ్‌. రెండు జడలు వేసుకున్న జమున. వాళ్లకు తోడు నిలవడానికి గొంతు సవరించుకున్న పి.బి.శ్రీనివాస్, సుశీల. ‘అందాల ఓ చిలుకా... అందుకో నా లేఖ... నా మదిలోని కలలన్నీ... ఇక చేరాలి నీ దాకా’... ఇలా కాగితం మీద రాసుకున్న ప్రేమలేఖలు ఉంటాయి. రాయడం రాక, రాయలేక పూలతో చెట్లతో నివేదించుకున్న ప్రేమ లేఖలు కూడా ఉంటాయి. ‘మూగ మనసులు’ సినిమాలో ఆ పాట గుర్తుందా?... ‘ముద్దుబంతి పూవులో మూగకళ్ల ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలియులే’. ప్రేమలో పడ్డవాళ్లు ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’ అని కూడా ఈ పాట చెప్పింది. సఫలమైతే ఒకలాగా. విఫలమైతే ఒకలాగా. ఇది కొంచెం నయం. ఎదురుగా ఉన్న మనిషితో ఏదో వంక పెట్టి మనసులో మాట చెప్పొచ్చు. అసలు కళ్లెదుటే లేని మనిషైతే? ‘మల్లీశ్వరి’లో ఆ బావామరదళ్ల కష్టం వర్ణనాతీతం. అతడు ఎక్కడో ఉన్నాడు. ఆమె మరెక్కడో ఉంది. ఉత్తరాలు అందవు. మాటలు వినపడవు. ఇక సందేశం అందించాల్సిన భారం మేఘం తీసుకుంది. ‘ఏడ తానున్నాడో బావా జాడ తెలిసిన పోయి రావా అందాల ఓ మేఘమాల’ అని వారు పాడుకుంటే ఆ విరహానికి అది కూడా బరువెక్కి వర్షించింది.

కాలం మారింది. బండ్లు పోయి మోటారు బండ్లు వచ్చాయి. పంచెలు పోయి ప్యాంట్లు వచ్చాయి. మొలతాళ్లు పోయి బెల్ట్‌లు వచ్చాయి. కాలేజీ చదువులు చదివే వారి సంఖ్య పెరిగింది. లవ్‌కు వెజిటేరియన్, నాన్‌ వెజిటేరియన్‌ అనే తేడా ఎందుకు అనగలిగే తెగింపు వచ్చింది. తెలుగైతే ఏమిటి తమిళం అయితే ఏమిటి అన్నారు. ఇటువైపు తెలుగింట్లో అమ్మాయి అటువైపు తమిళింట్లో అబ్బాయి ప్రేమించుకున్నారు.వాళ్ల ప్రేమకు రోడ్లు చాల్లేదు. బీచ్‌లు చాల్లేదు. గుడి మెట్లు చాల్లేదు. ఆఖరుకు స్ట్రక్‌ అయిన లిఫ్ట్‌లో కూడా ప్రేమించుకున్నారు ‘కలసి ఉంటే కలదు సుఖమూ కలిసి వచ్చిన అదృష్టమూ’ అని చిందులేశారు.‘మరోచరిత్ర’ ప్రేమ పాటల్లో కూడా చరిత్ర సృష్టించింది. అమ్మాయిలు అంతటితో ఆగలేదు. చాలా బారికేడ్లను బ్రేక్‌ చేశారు. ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా’ అని ప్రియుడి సమక్షంలో పాడి పెద్దవాళ్ల గుండెలను బేజారెత్తించారు. ‘వయసు పిలిచింది’ సినిమాకు బదులు పలికినవాళ్లు బహుమంది.

ప్రేమకు పెరిగిన ఈ గిరాకీని సీనియర్‌ హీరోలు గమనించారు. ప్రేమను ప్రేమించడంలో మేమేమీ తక్కువ తినలేదు అన్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ ‘నేనొక ప్రేమ పిపాసిని’ అని పాడి ఇప్పటికీ ఆ పాటను హిట్‌ చేస్తూనే ఉన్నారు. అక్కినేని ‘నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని’ అంటూ షర్ట్‌ మీద జర్కిన్‌ వేసి స్టెప్స్‌తో మోతెక్కించారు. శోభన్‌బాబు ‘ఎలా ఎలా దాచావు అలవిగాని అనురాగం’ అని నది ఒడ్డున సుజాతను రెండు చేతులతో పైకెత్తుకున్నారు. ఎన్‌.టి.ఆర్‌ ‘రెండక్షరాల ప్రేమ రెండు క్షణాల ప్రేమ’ అని నల్లడ్రస్సులో ఆవేశంగా పాడి చెట్టు కొమ్మను పట్టుకుని ఊపి పారేశారు. కాని నిజంగానే తరం మారింది.కాలేజీ వయసు కంటే ఇంకా తక్కువ వయసులోనే ప్రేమించేసుకునే పిల్లలు వచ్చారు. ‘ముద్దమందారం’ సినిమాలో ప్రదీప్‌–పూర్ణిమ కలిసి ఆ రోజులలోనే పారిపోయారు. పెళ్లి చేసుకున్నారు.‘అలివేణి ఆణిముత్యమా’... ఒకరి సమక్షంలో ఒకరు లాలిత్యంతో పాడుకున్నారు. ‘నాలుగు స్తంభాలాట’లో నరేశ్‌–పూర్ణిమ ‘చినుకులా రాలి నదులుగా పారి వరదలై పోయి కడలిలా పొంగు నీ ప్రేమ నా ప్రేమ’ అని పాడుకుంటే వయసుకు, శరీరానికీ ఆవల ఉన్న ఆరాధనను కొత్తతరం అందిపుచ్చుకుందన్న నమ్మకం కుదిరింది. 

నాగార్జున వెంకటేశ్‌ జనరేషన్‌ వచ్చింది. మృత్యువు ప్రేమను నిరోధించలేదని చెప్పింది. నాగార్జున ‘గీతాంజలి’ ఒక ఊటీ నీటి ఆవిరిలాంటి సినిమా. ‘నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగ మారదు ప్రేమ సత్యము’ అని ఆ సినిమా చెప్పింది. హీరో చచ్చిపోతాడని తెలిసినా హీరోయిన్‌ చనిపోతుందని తెలిసినా ప్రేమ బతికే ఉంటుందన్న నమ్మకంతో ఈ సినిమా చూసి హాలు నుంచి బయటకు వస్తాడు ప్రేక్షకుడు.వెంకటేశ్‌ ‘ప్రేమ’ ఇళయరాజా సాయంతో ఒక మంచి ప్రేమ డ్యూయెట్‌ను ఇచ్చింది. ‘ఈనాడే ఏదో అయ్యింది. ఏనాడూ నాలో జరగనిది’... కాని చివరిలో హీరోయిన్‌ చనిపోతుంది. ఇంతమంచి ప్రేమను చంపేస్తారా అని ప్రేక్షకులకు కోపం వస్తే బతికించినట్టు చూపాల్సి వచ్చింది. అదీ ప్రేమ ఎఫెక్ట్‌.అయితే ప్రేమ దెబ్బ మెగాస్టార్‌ కూడా తినకతప్పలేదు. కాకపోతే ఆయన ‘పెంటమ్మ’తో ప్రేమలో పడాల్సి వచ్చింది.‘రుద్రవీణ’లో ఆయన తొలి చూపులోనే ప్రేమించిన అమ్మాయి శోభన తమాషాకు తన పేరు పెంటమ్మ అని చెబుతుంది. పేరేదైనా ప్రేమ ప్రేమే అని తన మనసు ఆమె పాదాల దగ్గర పెడతాడు. తన హృదయంలో ‘లలిత ప్రియ కమలం విరిసినది’ అని చెబుతాడు. కాని ఊరి మేలు కోసం ఆ ప్రేమనే త్యాగం చేస్తాడు. ఆ సమయంలోనే ప్రేమ సఫలం కావడానికి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి వచ్చిన యువకుడిగా రాజేంద్రప్రసాద్‌ ‘ముత్యమంత ముద్దు’లో కనిపిస్తారు. సీతతో ఆయన పాడిన ‘ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది’ పాట పెద్ద హిట్‌. సంగీతం కన్నడ దేశం నుంచి హంసలేఖ మోసుకొచ్చారు. ఈ సందర్భంలో ‘సాగర సంగమం’లో కమలహాసన్, జయప్రదల మధ్య చిగురించిన మూగప్రేమను చెప్పకుండా ఉండలేము. ఇద్దరూ మాట్లాడుకోకుండా ‘మౌనమేలనోయి ఈ మరపురాని రేయి’ అని పాడుకుంటూ ఉంటే ఆ నిశ్శబ్దప్రేమను ప్రేక్షకులు చెవి వొగ్గి విన్నారు.

ఆ తర్వాత కొన్నాళ్లు కథలు అటూ ఇటూ నడిచాయి. జనం ప్రేమను మర్చిపోయారు అనుకుంటూ ఉండగా కరుణాకర్‌ వచ్చి ‘తొలి ప్రేమ’తో పెద్ద హిట్‌ కొట్టాడు. ప్రేమ సత్యమైనదే అయితే గెలిచే తీరుతుందని చెప్పాడు. ‘నీ మనసే... సే.. సే.. సే’... అని పవన్‌ కల్యాణ్‌ పాడిన పాట పెద్ద హిట్‌. ఆ తర్వాత దర్శకుడు తేజా వచ్చి ప్రేమే ‘చిత్రం’ అన్నాడు. అబ్బాయి అమ్మాయి ‘నువ్వు–నేను’గా ఉండాలన్నాడు. అలాంటి వాళ్లే జీవితంలో ‘జయం’ సాధిస్తారనన్నాడు. ఈ సినిమాలతో తెలుగునాట మళ్లీ ప్రేమ దుమారం వచ్చింది. ‘నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను’, ‘అందమైన మనసులో అంత అలజడెందుకో ఎందుకో ఎందుకో’ పాటలు పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ మూడ్‌ను ‘మనసంతా నువ్వే’ పీక్‌కు తీసుకెళ్లింది. ‘చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా’ పాట అడ్రస్‌ సరిగా లేని కుర్రాళ్లని కూడా ప్రేమలో పడేలా చేసింది.తరుణ్‌ కూడా తన పాత్ర తాను పోషించాడు. ‘నువ్వంటే నాకిష్టం నాకన్నా నువ్విష్టం’ అని ఇష్టాన్ని స్పష్టం చేశాడు. అయితే ఫ్యాక్షన్‌ సినిమాలో కూడా చిరుగాలి వంటి ప్రేమ పూస్తుందని ‘ఒక్కడు’లో మహేష్‌బాబు డాబా మీద పాడి నిరూపించాడు. ‘చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి’ పాట ప్రేక్షకుల యదను గిల్లింది. 

ప్రభాస్‌ నేను తక్కువ తినలేదని నిండా ‘వర్షం’లో మునిగి ‘మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం...’ అంటూ త్రిషకు దగ్గరయ్యాడు.అల్లు అర్జున్‌ ఈ ప్రేమకు కొత్త డైమన్షన్‌ తెచ్చాడు. ఎస్‌ చెప్పొద్దు నో చెప్పొద్దు ‘ఫీల్‌ మై లవ్‌’ అన్నాడు. ఈ భావన కూడా బాగుందే అని ప్రేక్షకులు అనుకున్నారు. ఆ తర్వాత ‘కొత్త బంగారులోకం’ వచ్చింది. ‘నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా’ పాటను ఇచ్చింది. ‘ఏమాయ చేశావే’ వచ్చింది. ‘ఈ హృదయం...’ అని రెహమాన్‌ ట్యూన్‌ను తెచ్చింది. అంతవరకూ మౌనంగా ఉన్న ఇళయరాజా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా కోసం తిరిగి హార్మోనియం అందుకున్నారు. ‘ఇలా ఇలా ఇలా హాయి నీదే సుమా’ పాట ఎంతో హిట్‌ చేశారు. అప్పుడు దర్శకుడు హను రాఘవపూడి ‘అందాల రాక్షసి’ తీశాడు. లావణ్య త్రిపాఠి వెంట నవీన్‌చంద్ర పడి ‘వెన్నంటే ఉంటున్నా కడదాక వస్తున్నా’... అంటూ చేసే అల్లరిని మణిరత్నం స్టయిల్‌లో చూపించాడు.  ప్రేమ యాత్ర కొనసాగింది. రామ్‌ ‘నేను శైలజా’ చేశాడు. ఎన్నాళ్లు గడిచినా ప్రేమ అనేది ‘క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్‌’ అని చెప్పాడు. శర్వానంద్‌ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చేశాడు. ‘ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై’ పాట నిత్యా మీనన్‌ ప్రెజెన్స్‌లో రంగులు పులుముకుంది. ప్రేమకు తిరుగులేదు అనడానికి నిన్న మొన్నటి సినిమాలు నిన్న మొన్న వచ్చిన హీరోలు కూడా సాక్ష్యం పలికారు.‘అర్జున్‌ రెడ్డి’ పెద్ద హిట్‌. ‘ఆర్‌ ఎక్స్‌ హండ్రెడ్‌’ ఇంకా పెద్ద హిట్‌. ‘గీత గోవిందం’ సూపర్‌ డూపర్‌ హిట్‌.

‘ఊపిరాగుతున్నదే ఉన్నపాటున ఇలా’ ‘అర్జున్‌ రెడ్డి’లో, ‘పిల్లా రా నువ్వు కనపడవా’ పాట ‘ఆర్‌ ఎక్స్‌ 100’లో, ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాట ‘గీత గోవిందం’లో ఇటీవలి ఆకర్షణలుగా నిలిచాయి.ప్రేమ– పాట ఒక జోడి.ప్రేమ– ప్రేక్షకుడు కూడా ఒక జోడి.ప్రేమ– ప్రపంచం ఒక జోడి.ప్రపంచం ఉన్నంత కాలం ప్రేమ ఉంటుంది.ప్రేమ ఉన్నంత కాలం మంచి పాట కూడా ఉంటుంది.మంచి మంచి పాటలు అందించిన ఆయా గేయకర్తలకు, సంగీత దర్శకులకు, గాయనీ గాయకులకు, నిర్మాత దర్శకులకు, నటీ నటులకు వాలెంటైన్స్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు.తమిళనటుడు కార్తిక్‌ తెలుగులో రెండు అందమైన ప్రేమకథల్లో నటించాడు. ఒకటి సీతాకోక చిలుక, రెండు అభినందన. రెంటికీ ఇళయరాజానే సంగీతం. రెంటిలోని ప్రేమపాటలన్నీ చాలా హిట్‌ అయ్యాయి. ‘మాటే మంత్రమూ’, ‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ పల్లె’ పాటలు సీతాకోక చిలుకలో. ‘ఎదుటానీవే... యదలోనా నీవే’, ‘ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం’ పాటలు అభినందనలో ప్రేమికులను కట్టిపడేశాయి. 
కథనం: కె

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement