గడుసుతనం కలబోసిన సౌందర్యానికి పెట్టింది పేరు జమున. వెండితెర సత్యభామగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన జమున సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. పొగరు, భక్తి, విలనిజం ఇలా నవరసాలు పలకించగలిగే అరుదైన నటిగా పేరు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె కోసమే కొన్ని పాత్రలు పుట్టాయేమో అనేంతలా నటించి మెప్పించారు.
ఆనాటి స్టార్ హీరోలందరితో జతకట్టిన జమున కెరీర్ సాఫీగా సాగుతున్న దశలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో విభేదాలు అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇకపై జమునతో నటించమని ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాయ్‌కాట్ కూడా విధించారు. దీంతో ఇక జమున కెరీర్ ముగిసిపోతుందేమో అనుకున్నారంతా. అయినా సరే చేయని తప్పుకు సారీ చెప్పేది లేదంటూ భీష్మించుకున్న తీరు ఆమె ఆత్మాభిమానానికి అద్దం పడుతుంది.
అగ్రస్థాయి హీరోలు పక్కన పెట్టినా లెక్కచేయకుండా హరనాథ్, జగ్గయ్య వంటి హీరోలతో నటించి వరుస విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత గుండమ్మ కథ సినిమా కోసం అప్పటి నిర్మాత చక్రపాణి జోక్యం చేసుకొని స్టార్ హీరో,హీరోయిన్ల మధ్య విభేదాలు సరైనవి కావని కాంప్రమైజ్ చేయడంతో జమున గుండమ్మ కథలో నటించారు. ఎన్టీఆర్‌కు జోడీగా సావిత్రి, ఏఎన్నార్ సరసన జమున అలరించారు. సావిత్రి సౌమ్యంగా నటించిన తీరు, జమున కొంటెతనంతో పలికించిన సంభాషణలు ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ చిరస్మరణీయమే.
Comments
Please login to add a commentAdd a comment