వెరైటీ మిస్సవుతోంది వరూధినీ!
ఆనాడు ‘మనుచరిత్ర’లో ప్రవరాఖ్యుడి ప్రేమ కోసం పరి పరి విధాల ప్రయత్నించింది వరూధిని. భర్త ఆదరణను, నమ్మకాన్ని చూరగొనడం కోసం పడరాని పాట్లు పడుతోంది నేటి వరూధిని. అదేనండీ... బుల్లితెర వరూధిని. జీ తెలుగులో ప్రసారమవుతోన్న ‘వరూధినీ పరిణయం’లో హీరోయిన్. అమ్మాయిలంటే ఏమాత్రం ఇష్టపడని హీరోకి భార్య అవుతుంది హీరోయిన్. మొదట్లో పిల్లీ ఎలుకల్లా పోట్లాడుకున్నా, మెల్లగా ఇద్దరి మనసులూ కలుస్తాయి ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలూ పెరుగుతాయి.
హమ్మయ్య, అంతా బాగుంది అనుకునేలోపే రకరకాల సమస్యలు. చెప్పలేనని కష్టాలు. మళ్లీ ఇరువురి మధ్యా దూరం. దానికి తోడు ఆమె క్యారెక్టర్‌నే వేలెత్తి చూపించే అపనిందలు. అబ్బబ్బబ్బ... ఒక్కటి కాదు, వంద కష్టాలు వరూధినికి. కాకపోతే సమస్య ఏమిటంటే... ఈ కష్టాలన్నీ ఆల్రెడీ చాలా సీరియళ్లలో, సినిమాల్లో హీరోయిన్లు పడినవే కావడం. మొదట్లో సరికొత్త పాయింట్‌తో చక్కగా మొదలైన ఈ సీరియల్... ఉండేకొద్దీ పాత మూసలోకి మారిపోయింది. ఓ మామూలు సీరియల్ తరహాలోనే సాగిపోతోంది. ఆ విషయాన్ని గమనించి దర్శకుడు కాస్త ఆసక్తి కరమైన మలుపులు సృష్టిస్తే మంచిదేమో!