ఒకే ఇంటికి చెందిన ఒకేలా ఉన్న ఇద్దరు కవల పిల్లల కథే అక్కాచెల్లెళ్లు. ఈ ఇద్దరూ ఒకే అత్తారింటికి చేరుతారు. ‘జీ తెలుగు’లో వచ్చే ఈ సీరియల్‌లో శ్రావణిగా, భరణిగా తానే నటిస్తోంది చైత్రారాయ్. ‘ద్విపాత్రాభినయం అనేది ఓ పెద్ద ఛాలెంజ్’ అంటూ తన మనసులోని మాటలు ఇలా చెప్పుకొచ్చింది చైత్ర.
అష్టాచమ్మా, మనసున మనసై సీరియల్స్ ద్వారా తెలుగువారికి సుపరిచితురాలైన చైత్ర పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. కన్నడ సీరియల్స్‌తో ఆకట్టుకున్న నటన ఆమెను తెలుగు బుల్లితెరకు పరిచయం చేసింది.
రొటీన్‌కి భిన్నంగా..
ఒకప్పుడు వేరే ఆర్టిస్టులు ద్విపాత్రాభినయం చేస్తున్నప్పుడు అలాంటి రోల్ ఒకటి నాకూ వస్తే బాగుండనే ఆశ ఉండేది. ఇన్నాళ్లకి రెండు పాత్రల్లోనూ నేనే లీడ్ రోల్‌లో నటించడం చాలా సంతోషంగా ఉంది. హీరోయిన్ అనగానే పాజిటివ్‌గానూ, కొంచెం రొటీన్‌గానూ ఉంటుంది. దీనికి భిన్నమైన ఆపోజిట్ క్యారెక్టర్ చాలా ఛాలెంజ్డ్‌గా ఉంది. ఇలా రెండు పాత్రలు ఒకేసారి చేయడంతో చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతున్నాను. అయితే, ఇందులో కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. ఇద్దరమ్మాయిల లుకింగ్‌లో చాలా డిఫరెన్స్ చూపించాలి. క్యాస్ట్యూమ్స్‌లోనూ, అలాగే యాక్టింగ్‌లోనూ ఇద్దరికీ ఏ మాత్రం పోలిక లేకుండా చూపించాలి. కానీ, కష్టపడితేనే మంచి పేరొస్తుంది. అలాంటి అవకాశం ఇప్పుడు నాకొచ్చింది అని సంతోషంగా ఉంది.
కన్నడ అమ్మాయిని
తెలుగులో నా మొదటి సీరియల్ ‘అష్టాచెమ్మా.’ అంతకు ముందు కన్నడ సీరియల్స్ చేసేదాన్ని. ఉంటున్నది బెంగుళూరులోనే. షూటింగ్స్ సమయంలో హైదరాబాద్ వస్తుంటాను. కానీ చాలా మంది నేను ఇక్కడి అమ్మాయినే అనుకుంటారు. అంతగా ఇక్కడివారు నాతో కలిసిపోయారు. మొదట హైదరాబాద్ వచ్చినప్పుడు భయపడ్డాను. భాష రాదు, ఎవరేం మాట్లాడినా నాకు అర్థమయ్యేది కాదు. నన్ను ఇక్కడి నుంచి రిజెక్ట్ చేస్తున్నారేమో లేదంటే నా గురించి ఏమనుకుంటున్నారో అని ఫీలయ్యేదాన్ని. ఇప్పుడు నేనుగా చెబితే తప్ప ఎవరూ నేను కన్నడ అమ్మాయినని అనుకోరు. కన్నడ సీరియల్ చేస్తున్నప్పుడు ఆ షాట్‌గ్యాప్‌లో ‘అష్టాచమ్మా’ సీరియల్‌కి ఆడిషన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో నా చేత కన్నడలోనే రెండు డైలాగ్స్ చెప్పమన్నారు. అలా నేను సెలక్ట్ అయ్యి, తెలుగులోకి ఎంటర్ అయ్యాను. ఈ ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిదేళ్లయ్యింది. కానీ, నా జర్నీ హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉందనిపిస్తుంది. ఇక్కడే మంచి మంచి సీరియల్స్‌లో అవకాశాలు వస్తున్నాయి.
భవిష్యత్తు గురించిన ఆలోచనే లేదు
హోటల్ మేనేజ్‌మెంట్‌కోర్స్ చేసేటప్పుడు అక్కడికి సీరియల్ టీమ్ వచ్చారు షూటింగ్‌కి. సీరియల్స్‌లో యాక్ట్ చేయడానికి ఇంట్రస్ట్ ఉందా అని అడిగారు. కానీ, నేనేమీ చెప్పలేదు. డైరెక్ట్‌గా మా అమ్మను కలిసి విషయం చెప్పారు. అమ్మ ఓకే చేయడం, నేను సీరియల్స్‌లో యాక్ట్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఫ్యూచర్ గురించి పెద్ద పెద్ద ఆలోచనలైతే లేవు. పదవతరగతి అయిపోయాక ఇంటర్ చేయాలి, ఆ తర్వాత డిగ్రీ చేయాలని మాత్రమే అనుకునేదాన్ని.
ఒకసారి మాత్రం టీచర్ అయితే బాగుంటుంది అనుకున్నాను. కానీ, ఇలాగే నా లైఫ్ ఉండాలనే ఆలోచన అయితే లేదు. ఈ సీరియల్‌లో డ్యుయెల్ రోల్‌లో యాక్ట్ చేస్తునప్పుడు నాకూ ఒక చెల్లి ఉంటే ఇద్దరమూ స్క్రీన్‌ని షేర్ చేసుకునేవాళ్లం కదా అనిపిస్తుంది. ఆ వెంటనే నవ్వుకుంటాను. నాకు చెల్లెలు లేదు కానీ ఓ తమ్ముడు ఉన్నాడు. వాడి చదువు పూర్తయ్యింది. ఈ ఫీల్డ్ అంటే వాడికీ ఇంట్రస్ట్ ఉంది. అక్కగా నా ఎక్స్‌పీరియెన్స్ వాడితో షేర్ చేసుకుంటుంటాను. నా నటనకు సంబంధించిన మొదటి క్రిటిక్ కూడా మా తమ్ముడే. మంచి సలహాలు, సూచనలు చేస్తుంటాడు.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment