‘చిన్నప్పుడు క్రికెట్ ఆడుకొని ఇంటికి వచ్చాక టీవీ చూద్దామంటే ఇంట్లో అమ్మ, అక్కవాళ్లు సీరియల్స్ చూస్తుండేవాళ్లు. సినిమా పెట్టమంటే నన్ను బయటకు వెళ్లమని తిట్టేవారు. ఇప్పుడు నేను సీరియల్స్‌లో చేస్తూ మా అమ్మవాళ్లని చూడమని రిక్వెస్ట్ చేస్తుంటాను’ అని నవ్వుతూ తన నట ప్రయాణాన్ని పంచుకున్నారు సిద్దార్ధ. జీ తెలుగులో వచ్చే గంగ–మంగ సీరియల్‌లో ‘సిద్ధు’గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సిద్ధార్ధ పంచుకున్న కబుర్లివి.
ఐదేళ్లు అయ్యింది ఈ ఫీల్డ్‌కి వచ్చి. సినిమా అవకాశాల కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఆదాయం ఏమీ లేదు. ఇంటి దగ్గర నుంచి డబ్బు వచ్చే అవకాశం లేదు. అలాంటి సమయంలో మా కజిన్ నన్ను బాగా చూసుకున్నాడు.
బుల్లితెర ప్రయాణం
హైదరాబాద్‌లో ఉన్న మా బ్రదర్ తప్ప అంతకుమించి ఎవ్వరూ తెలియదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉండేవాణ్ణి. ఆరునెలల పాటు అందరి వెనకాల తిరిగాను. అందరూ చేద్దాం, చూద్దాం అంటున్నారు. ఇక ఇలా లాభం లేదని సీరియస్‌గా ట్రై చేద్దామని ఒక సీరియల్ మేనేజర్‌కి కాల్ చేశాను. లొకేషన్‌కి రమ్మనడంతో వెళ్లి మాట్లాడాను. వారం తర్వాత వాళ్లే ఫోన్ చేశారు ఆడిషన్స్‌కి రమ్మని. అలా ‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో నా టీవీ జర్నీ మొదలయ్యింది. అటు తర్వాత ‘కథలో రాజకుమారి‘, ‘మనసు మమత’ సీరియల్స్ చేశాను. ఇప్పుడు ‘గంగ మంగ’ సీరియల్ చేస్తున్నాను. రేపు ఎలా ఉంటుందో ఇక్కడ గ్యారంటీ ఏమీ లేదు. అవకాశాలు వస్తుంటాయి. వాటిని చేసుకుంటూ వెళ్లడమే.
గ్యాప్‌లో సినిమా
ఖాళీ దొరికితే చేసే పని సినిమాలు చూడ్డం. ఒకేసారి వరసబెట్టి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. చూస్తూ ఉంటాను. లేదంటే జిమ్‌లో ఉంటాను. ఇంకాస్త టైమ్ ఉంటే ప్రొడక్షన్ ఆఫీసుల వారిని కలుస్తుంటాను. ఒక సీరియల్ చేస్తూ మిగతా 15 రోజులు సినిమాలకు ట్రై చేస్తున్నాను. సినిమా, టీవీ రెండింటిలోనూ రాణించాలన్నది నా కల. ఒకప్పుడు మా ఊళ్లో చుట్టుపక్కల వాళ్లు ‘చదువుకొని కూడా మీ అబ్బాయి ఎందుకు లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నాడు’ అని అనేవారు. ఇప్పుడు మీ వాడు సూపర్ అంటుంటారు. ఈ మాటలు అమ్మానాన్నలు చెబుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మన పొజిషన్‌ను బట్టి బయటి వాళ్ల మాటలు ఉంటాయి. వారికేది అనిపిస్తే అది మాట్లాడుతుంటారు.
గైడ్‌గా నళినమ్మ!
సీరియల్ టీమ్ ఒక మంచి కుటుంబంలా కలిసిపోయింది. మాకందరికీ పెద్ద దిక్కు అంటే నళినమ్మ. చాలా మంచావిడ. లొకేషన్‌కి ఉదయం ఏడు గంటలకే రకరకాల వంటకాలు చేసుకొని మరీ మా కోసం తీసుకువస్తారు. ఒక కుటుంబంలా కలిసిపోయాం. నటనలో సలహాలు, సినిమా విశేషాలు ఒకప్పటి హీరోయిన్‌గా రాణించిన నళినమ్మే చెబుతుంటారు. అవన్నీ నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. షూటింగ్‌లో చిన్న గ్యాప్ దొరికినా నళినమ్మ చుట్టూతా కూర్చుంటాం. తను చూసొచ్చిన ఇండస్ట్రీ గురించి విషయాలు చెప్పమని అడుగుతుంటాం. అల్లరి చేస్తూ ఉంటాం.
షార్ట్ ఫిల్మ్ ప్లాన్
బీటెక్ చేశాను. అమ్మానాన్న వైజాగ్‌లోనే ఉంటారు. పదవ తరగతి పూర్తయినప్పటì æనుంచే షార్ట్‌ఫిల్మ్ తీయాలనే ప్లాన్‌లో ఉండేది మా స్నేహబృందం. హర్రర్, సస్పెన్స్ షార్ట్ ఫిల్మ్స్‌కి ట్రై చేసేవాణ్ణి. దీంతో కెమెరా, షూట్స్, స్క్రిప్ట్.. ఈ హంగామా అంతా బాగా ఆకట్టుకుంది. ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేశారు. చదువయ్యాక చిన్న మూవీ చేశాను. కానీ రిలీజ్ అవలేదు. ఇలా అయితే టైమ్ వేస్ట్ అవుతుందని హైదరాబాద్ వచ్చేశాను.
గంగ – మంగ
జీ తెలుగులో వచ్చే గంగ మంగ సీరియల్ కథనం చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రస్తుతం సీరియల్‌లో గంగకి, సిద్దుకి పెళ్లవదు. గంగ తనే తాళి కట్టేసుకుంటుంది. ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకోవాలని వాళ్ల ఆలోచన. మధ్యలో అడ్డంకులు వస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment