ఘట్టమనేని దేవేంద్రగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు పవన్‌సాయి. ‘జీ తెలుగు’లో వచ్చే ‘ముద్దమందారం’ సీరియల్‌లో పెద్దబాబుగా ఆకట్టుకున్నాడు. వరుస సీరియల్స్‌తో పలకరిస్తున్న పవన్‌సాయి తన జర్నీ గురించి ఆనందంగా వివరించాడు.
‘పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నేను అన్నయ్య, ముగ్గురు అక్కచెల్లెల్లు. అందరికీ మంచి చదువులు చెప్పించారు అమ్మనాన్న. అన్నయ్య ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాను. యాక్టింగ్ ఫీల్డ్ అన్నప్పుడు మా వాళ్ల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. ‘నీ ఇష్టమే మా ఇష్టం’ అన్నారు.
ఏం చేసినా టాప్‌లో!
అనుకోకుండా ఈ రంగం వైపు వచ్చాను. టెన్త్ క్లాస్ అయిపోయాక వేసవి సెలవుల్లో ఓ రోజు నా స్నేహితుడితో కలిసి ఈవెనింగ్ వాక్‌కి వెళ్లాను. మేం వెళ్లేదారిలో ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య డ్యాన్స్ క్లాస్ ఉంది. అన్నయ్యను కలవాలని తనతో పాటు నన్నూ తీసుకెళ్లాడు నా ఫ్రెండ్. అక్కడికి వెళితే కొంతమంది గ్రూప్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లని చూసి ‘నేనూ డ్యాన్స్ నేర్చుకుంటాను’ అన్నాను. మా ఫ్రెండ్ అన్నయ్య ‘డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్ కూడా నేర్పిస్తా’ అన్నాడు. ముందు డ్యాన్స్ క్లాస్‌లో జాయిన్ అయ్యాను. రెగ్యులర్‌గా డ్యాన్స్ క్లాస్‌కి వెళ్లేవాడిని. ముందుగా వెళ్లిన రోజు యాక్టింగ్ కోసం వచ్చిన స్టూడెంట్స్ ప్రాక్టీస్ చూసి నేనూ నేర్చుకునేవాడిని. అలా కాలేజీ రోజులూ గడిచిపోయాయి.
ఏ పని చేసినా టాప్‌లో ఉండాలనేది నా తపన. అక్కణ్ణుంచి ఫొటోస్ దిగడం, ప్రతీ ఒక్క సినిమా, సీరియల్స్ ప్రొడక్షన్ ఆఫీసులకు ఇవ్వడం చేస్తుండేవాడిని. ఈ ప్రయాణంలో చాలా మంది సహాయపడ్డారు. డ్యాన్స్ నేర్చుకున్న నాటి నుంచి అన్ని ఆఫీసులకు వేల ఫోటోలు ఇచ్చి ఉంటాను. ప్రొడక్షన్ మేనేజర్లకు వారానికి రెండుసార్లు ఫోన్ చేసి నన్ను నేను పరిచయం చేసుకునేవాడిని. ఫస్ట్‌టైమ్ కామెడీ రోల్ ఉన్న హ్యాపీడేస్ సీరియల్‌లో ‘బ్లూటూత్’ అనే క్యారెక్టర్‌కి అవకాశం వచ్చింది.
హ్యాపీగా జర్నీ
హ్యాపీడేస్ టైమ్‌లోనే గుర్తింపు వచ్చిన మరో సీరియల్ మొగలిరేకులు. ఇది చేస్తుండగానే ముద్దుబిడ్డ సీరియల్‌కు అవకాశం. ముగింపులో ‘శ్రావణసమీరాలు’. ఆ తర్వాత ఏడాదికి ‘ముద్దమందారం’ స్టార్ట్ అయ్యింది.
ముద్దమందారం.. పెద్ద కొడుకు
ఒక సీరియల్ తర్వాత మరో సీరియల్ అంటూ ఒక నియమం పెట్టుకున్నాను. దీని వల్ల ఆ వర్క్‌లో, ఆ క్యారెక్టర్‌లో లీనమై నటించే అవకాశం ఉంటుందని నమ్ముతాను. అలా ఐదేళ్లుగా ముద్దమందారం సీరియల్‌లో నటించాను. టీమ్ అందరితోనూ ఒక మానసికమైన బంధం ఏర్పడింది. టీమ్ అంతా బయట కూడా నన్ను పెద్ద కొడుకులా చూసుకున్నారు. హరితమ్మ, తనూజ, సురేశ్.. అంతా ఇంట్లో పెద్దబ్బాయిని ఎలా ట్రీట్ చేస్తారో అలా చూసేవారు. ఈ జర్నీ చాలా అద్భుతం.
ఆటలంటే పిచ్చి
నటన తర్వాత పిచ్చి ప్రేమ ఆటలమీదనే. చాలా స్పోర్టీ పర్సన్‌ని. క్రికెట్ కోసం ఎక్కడెక్కడో గ్రౌండ్స్ వెతికేవాడిని. ఇదొక్కటే కాదు బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, షటిల్, వీడియోగేమ్స్.. అన్నీ ఇష్టమే. ఇంట్లో ఉన్నానంటే టీవీకే అంకితం. సమయం అంతా టీవీ చూడ్డంతోనే అయిపోతుంది. చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉంది. ఈ ఇండస్ట్రీలోకి రావడానికి టీవీ చూడ్డం హాబీయే కారణం అనుకుంటాను.’
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment