ఏ సీరియల్ చూసినా ఆ కథనంలో ఇమిడిపోయేలా అనిపిస్తారు. భిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. ‘ఒకేలాంటి పాత్రలు చేస్తూ ఉంటే బోర్ అనిపించవచ్చు. కానీ, భిన్నమైన పాత్రల వల్ల పనిని ఎంజాయ్ చేస్తున్నాను. వాటి వల్ల మనల్ని మనం నిరూపించుకోవచ్చు’ అంటున్నారు టీవీ నటుడు నిరుపమ్ పరిటాల. పుష్కరకాలంగా సీరియల్స్ ద్వారా ఆకట్టుకుంటున్న నిరుపమ్ ప్రస్తుతం కుంకుమపువ్వు, కార్తీకదీపం, ప్రేమ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నారు. తన గురించి ‘సాక్షి’తో పంచుకున్న కబుర్లు ఇవి..
‘చంద్రముఖి సీరియల్ నా జీవితంలో ఓ మైలు రాయి అని చెప్పవచ్చు. అది కెరియర్ పరంగానూ, జీవితంలో నిలదొక్కునేలా చేసింది. 2007లో మొదలైన ఈ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాను.
నాన్న నో చెప్పారు.. మా నాన్న ఓంకార్ పరిటాల. ఆయన నటుడు, రచయిత. నేను ఈ ఫీల్డ్‌కి రావడం నాన్నకి ఏ మాత్రం ఇష్టం లేదు. చదువుకునేటప్పుడు కెరియర్ అంటూ పెద్ద ఆలోచనలేవీ లేవు. సినిమాల్లోకి రావాలని ఉండేది. కానీ, సోర్స్ అంటూ ఏమీ లేదు. నాన్న మాత్రం ‘ముందు చదువుకో, తర్వాత ట్రై చేయవచ్చు’ అనేవారు. మాది విజయవాడ. నాన్న నటుడు కావడంతో నా చదువు అంతా చెన్నైలోనే సాగింది. ఇంజినీరింగ్ తర్వాత ఎంబీయే చేశాను. నేను సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వాలనుకున్నాం.
ఆ సమయంలోనే నాన్న చనిపోయారు. ఆ టైమ్‌లో రెండు విషయాలు ఆలోచించాను. ఒకటి ఉద్యోగం, రెండు సినిమా ఇండస్ట్రీ. ఆ సమయంలోనే నాన్న స్నేహితుల ద్వారా నాకు సీరియల్ అవకాశం వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా ఓకే చెప్పాను. మొదట్లో నాన్న పేరు నన్ను ఎదుటివారు గుర్తించే వరకే ఉపయోగపడింది. ఆ తర్వాత పనిని బట్టే విలువ ఏర్పడింది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తూ పెరిగాను. తను ఈ ఫీల్డ్ వద్దనడానికి కారణం ‘ఒకనాడు బాగుంటుంది, మరోసారి అంత బాగుండకపోవచ్చు’ అనే ఉద్దేశంతోనే. అన్నింటికీ సిద్ధపడే రంగంలోకి దిగాను. ఇక్కడ బిహేవియర్, డిసిప్లిన్, డెడికేషన్‌తో ఉంటేనే రాణించడం సాధ్యం. కొంతమంది వైఫల్యాలు చూసి పాఠాలు నేర్చుకున్నాను.
భిన్న పాత్రలు
‘కుంకుమపువ్వు’ సీరియల్ చేస్తున్న సమయంలో ‘కార్తీక దీపం’ సీరియల్ డిస్కషన్స్ జరిగాయి. ఆ సీరియల్ ప్రొడ్యూసర్‌తో అప్పటికే ‘మూగమనసులు’ సీరియల్ చేసున్నాను. ఆ తర్వాత కూడా ఆ టీమ్‌తో టచ్‌లో ఉండేవాడిని. కార్తీక దీపం హీరో వెతుకులాటలో నా సలహా అడిగితే ఒకరిద్దరి పేర్లు కూడా చెప్పాను. వాళ్లతో ఆడిషన్స్ చేసినా క్లియర్ అవ్వలేదు. దీంతో నన్నే చేయమన్నారు. అప్పటివరకు వాళ్ల మనసులో నేను ఉన్నాను అనే విషయం నాకు తెలియదు. ‘అత్తారింటికి దారేది’ సీరియల్‌లో విలన్ రోల్ చేశాను. జనాలకు ఎప్పుడూ ఒకేలా కనిపించకూడదు.. ‘ఇలాగ కూడా మెప్పించగలడు నిరుపమ్..’ అనుకోవాలి. ఆ ఆలోచనతో ఒప్పుకున్న పాత్ర అది. అందరూ బాగుంది అన్నారు కానీ, కొంతమంది నెగిటివ్ రోల్ వద్దులెండి అని చెప్పేవారు.
రచయితగా!
‘నెక్ట్స్ నువ్వే’ అనే సినిమాకి స్క్రిప్ట్ రాశాను. ఇప్పుడలాంటివేమీ లేవు. ఒక సీరియల్‌కి పది రోజుల షూటింగ్ షెడ్యూల్ ఉంటుంది. డబ్బింగ్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ పనుల్లోనే ఉన్నాను. మా ఆవిడ మంజుల కూడా ఇదే ఫీల్డ్. చంద్రముఖి సీరియల్‌లో ఇద్దరం కలిసి చేశాం. ప్రేమిం చి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.
సర్దుబాట్లు
మంజుల కూడా సీరియల్ నటి కావడంతో ఇండస్ట్రీలో వర్క్ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు. తన పని వేరు, నా పని వేరు. ఇద్దరం మెచ్యూర్డ్‌గా ఉంటాం. ఎప్పుడైనా చిన్న చిన్న వాదనలు వచ్చినా అర్థం చేసుకుంటాం. తనకోసం టీవీ షోస్‌లో కపుల్ డ్యాన్స్‌కి అవకాశం ఉంటే, ప్రాక్టీస్ చేసి మరీ ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను. టైమ్‌కి సంబంధించి. కంప్లైంట్స్ ఉంటాయి మా ఇద్దరికి. ఏదో విధంగా సర్దిచెప్పుకుంటాను.
ప్రొడక్షన్‌వైపుగా అడుగు
చంద్రముఖి నుంచి కార్తీక దీపం వరకు గ్రోత్ పరంగా చూసుకుంటూ ‘జీ తెలుగు’లో ఇప్పుడు ‘ప్రేమ’ సీరియల్‌తో ప్రొడక్షన్ వైపుగానూ వెళ్లాను. అనుకోకుండా వచ్చిన బాధ్యత ఇది. ఇందులో లీడ్ రోల్ కూడా చేస్తున్నాను. అన్నీ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళితే ఏదీ మిస్ చేసుకోలేం. రోజు మొత్తం ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఆలోచనలు, షెడ్యూల్.. ఉంటుంది కాబట్టి అన్నీ సాఫీగా సాగిపోతున్నాయి.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment