
ఆ పెద్దావిడ నన్ను పెళ్లాడతానంది! : ప్రదీప్
టీవీక్షణం
యాంకరంటే అమ్మాయే, యాంకరింగ్ చేస్తే అమ్మాయిలే చేయాలి అన్న ఆలోచనకు కాలం చెల్లింది. కొందరు అబ్బాయిలు కూడా యాంకర్లుగా అదరగొడుతున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవాడు... ప్రదీప్. కాస్త అల్లరి, ఇంకాస్త కామెడీ, మరికాస్త సందడి కలిపితే ప్రదీప్! తనదైన శైలితో మేల్ యాంకర్స్ రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించిన ఈ తుంటరి పిల్లాడు ఫన్‌డేతో చెప్పిన కబుర్లు...
మీరు మొదట ఆర్జే కదా? ఆర్జే ఆవ్వాలని ఎందుకనిపించింది?
చిన్నప్పట్నుంచీ మాట్లాడ్డం మొదలెడితే ఆపేవాడిని కాదు. ఇంజినీరింగ్ చేసేటప్పుడు అందరూ ఏడిపించేవారు... డబ్బాలో కంకరరాళ్లు వేసినట్టు వాగుతుంటానని. ఆర్జేకి ఇంతకన్నా గొప్ప క్వాలిటీ ఇంకే కావాలి? అందుకే రేడియో మిర్చిలో ఆడిషన్ జరుగుతోందని తెలిసి వెళ్లాను. సెలెక్టయ్యాను.
ఆ ఫీల్డ్‌లో ఉండే పాజిటివ్, నెగిటివ్ అంశాలు చెప్పగలరా?
అదో అద్భుతమైన మీడియమ్. ఏ విషయం మీదయినా మాట్లాడవచ్చు. హద్దులు ఉండవు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటే ఎన్నో మంచి విషయాలను చెప్పేందుకు అది మంచి వేదిక. తక్కువ టైములో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి నెగిటివ్ అంశాలేమీ లేవందులో.
మరి అలాంటి ఫీల్డ్‌ని వదిలి టీవీకెందుకు వచ్చారు?
నాకు ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయడం ఇష్టం. కొత్త కొత్త వ్యక్తులతో కనెక్ట్ కావడం ఇష్టం. రేడియోలోనూ ఆ సౌలభ్యం ఉంది. కానీ టీవీ ద్వారా అయితే ఇంకా ఆస్కారం ఎక్కువ. పెద్ద పెద్ద బ్యానర్లలో మంచి మంచి షోలు చేస్తున్నాను. అయామ్ హ్యాపీ.
కానీ ఓ లేడీస్ షో చేయడం... ఇబ్బంది అనిపించలేదా?
అసలు ‘గడసరి అత్త సొగసరి కోడలు’ చేయమని అడిగినప్పుడే షాకయ్యా. సుమ, ఝాన్సీ లాంటి వారు అలాంటి షోలకు ఓ సిగ్నేచర్ ఇచ్చారు. నేను వాళ్లలాగా చేయగలనా అని భయపడ్డాను. కానీ ఆ షో నా లైఫ్‌ని మార్చేస్తుందని నేనూహించలేదు. ఆ షో నాకు బెస్ట్ యాంకర్‌గా నంది అవార్డును తెచ్చిపెట్టింది.
రేడియోకీ, టీవీకి తేడాలేంటి? ఏది ఎక్కువ నచ్చింది?
రెండూ ఒకటే. రెండూ సమానమే. రేడియోలో ఎవరికీ కనిపించకుండా, మన వాయిస్‌తోనే ఇంప్రెస్ చేయాలి. టీవీలో ఆడియోతో పాటు వీడియో కూడా ఉంటుంది. అంతే తేడా!
ఓ యాంకర్‌కి అతి కష్టమైనది ఏంటి?
గంటో గంటన్నరో వచ్చే షోని మేం నాలుగయిదు గంటలు షూట్ చేస్తాం. ఓసారి మొదలెట్టాక పూర్తయ్యేవరకూ చేయాల్సిందే. పదింటికి వచ్చే షోని మేము తెల్లారుజామున ఏ నాలుగింటికో షూట్ చేయాల్సి రావచ్చు. అంతసేపూ ఆ ఎనర్జీని క్యారీ చేయాలి. మనం డౌన్ అయితే షో డౌన్ అవుతుంది. అది చాలా కష్టం!
మర్చిపోలేని ప్రశంస?
అత్తారింటికి దారేది షూటింగప్పుడు పవన్ కళ్యాణ్‌గారు ‘నీ షో ఎలా నడుస్తోంది’ అని అడిగారు. బాగా చేస్తున్నావ్ అని మెచ్చుకున్నారు. నా ఆనందం అంతా ఇంతా కాదు. కోట శ్రీనివాసరావుగారు, భరణి గారు, మెహర్ రమేష్, ఇంకా చాలామంది సెలెబ్రిటీలు నా షో చూస్తారట. అయామ్ గ్లాడ్!
బాధపెట్టిన విమర్శలేమైనా ఉన్నాయా?
లేదు. ఎందుకంటే నాకేదైతే చూసేందుకు నచ్చదో, దాన్ని నేను చేయను. అందరూ ఆస్వాదించగలిగేవే చేస్తాను. ఓసారి ఓ తొంభయ్యేళ్ల ముసలావిడ... ‘నేను లేట్‌గా పుట్టినా, నువ్వు ముందు పుట్టినా, నేను నిన్నే పెళ్లి చేసుకుని ఉండేదాన్ని’ అంది. అమెరికాలో ఉండే ఇద్దరు డాక్టర్లు, ‘ఎప్పుడూ రక్తం, శవాలను చూసి డిప్రెస్ అయ్యే మాకు, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తోంది నీ షో’ అన్నారు. ఇవన్నీ విన్నప్పుడు నేను వెళ్తోన్న రూట్ కరెక్టేననిపిస్తుంది.
మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువే అనుకుంటా?
(నవ్వుతూ) కాస్త ఎక్కువే.
మీకెలాంటి అమ్మాయిలు నచ్చుతారు?
మా ఇంట్లో కలర్, క్యాస్ట్, స్టేటస్ వంటి వాటి గురించి మాట్లాడే అలవాటు లేదు. నా ఫ్రెండ్స్‌లో కొందరి క్యాస్ట్ ఏమిటో కూడా నాకు తెలియదంటే, అది మా అమ్మానాన్నలు నేర్పిన సంస్కారం. పైగా హైదరా బాద్‌లోనే పుట్టి పెరిగాను కాబట్టి అలాంటి భావాలు ఒంట బట్ట లేదు. అందుకే నాకు కొలమానాలు లేవు.
భవిష్యత్ ప్రణాళికలేంటి?
ముందే ప్లాన్ చేసుకునే అలవాటు లేదు. ఇంజినీరింగ్ చేసి ఆర్జే అయ్యా. అనుకోకుండా టీవీ కొచ్చా. ఊహించకుండా సినిమాల్లోకి వెళ్లా. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఏం జరిగినా మన మంచికే.
-సమీర నేలపూడి
ప్రదీప్
జులాయి ఆడిషన్‌కి వెళ్లినప్పుడు ... త్రివిక్రమ్‌గారిని ఎలా ఫేస్ చేయాలి, ఎలా మాట్లాడాలి అని టెన్షన్ పడుతూ వెళ్లాను. తీరా వెళ్లాక ఆయనే కూర్చున్నవారు లేచి వచ్చి మరీ నన్ను ఆప్యాయంగా పలకరించారు. నేను నీ ఫ్యాన్‌ని అన్నారు. వల్గారిటీకి, కామెడీకి మధ్య ఉన్న గీతను నువ్వెప్పుడూ దాటవు అంటూ మెచ్చుకున్నారు. ఇంతకంటే పెద్ద ప్రశంసను జీవితంలో అందుకోగలనా!