ముత్యాల ముగ్గు భూమిగా యామిని తెలుగింటి వారికి సుపరిచితమే. ఇతర భాషా హీరోయిన్స్ మన తెలుగు సీరియల్స్‌ను ఏలేస్తున్నా యామిని మాత్రం తన అందం, అభినయంతో వారికి గట్టిపోటీ ఇస్తూ సీరియల్స్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ‘కళ్లతో అన్నీ కనిపిస్తాయి కానీ కొన్ని మాత్రం మనసుతోనే చూడాలి’ అంటూ జీ తెలుగు సీరియల్‌లో ప్రసారమయ్యే మీనాక్షి సీరియల్ ద్వారా మరోసారి ఆకట్టుకోనుంది యామిని.
‘మొదటిసారి తెలుగు సీరియల్‌లో అనుకోకుండా ఆఫర్ వచ్చినప్పుడు ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. చాలా ప్రయాసమీద అమ్మానాన్నలను ఒప్పించి మరీ చేశాను. జీ తెలుగు మంచి ప్రాజెక్ట్స్‌తో నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. భూమిగా ముత్యాలముగ్గు సీరియల్‌లో చాలా మంచి పేరొచ్చింది. నేను పుట్టి పెరిగింది వరంగల్‌లోనే. తెలుగమ్మాయినని గర్వంగా చెప్పుకుంటాను ఇండస్ట్రీలో. డిగ్రీ పూర్తి చేశాను. స్కూల్‌లో ఉన్నప్పుడు కల్చరల్ ఈవెంట్స్‌లో చురుగ్గా పాల్గొనేదాన్ని. డ్యాన్స్ అంటే ఉండే ఇష్టం వల్ల ఫ్యామిలీలో ఏ అకేషన్ అయినా సందడి చేసేదాన్ని. ఈవెంట్స్ ఆర్గనైజర్ ద్వారా సీరియల్ అవకాశం వచ్చింది. ముత్యాల ముగ్గు సీరియల్ ఇప్పటికి మూడేళ్లు అవుతోంది. దీనికి ముందు చిన్నకోడలు, పుట్టింటిపట్టుచీర.. వంటి సీరియల్స్ చేశాను. ఒక్కో సీరియల్‌కి ఒక్కో ప్రాధాన్యత ఉంది.
మనసున్న మీనాక్షి
పల్లెటూరి అమ్మాయిగా, పెద్దింట్లో కోడలుగా చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అయితే అంధురాలిగా యాక్ట్ చేసే పాత్ర ఒక సవాల్. మీనాక్షి సీరియల్ నాకా అవకాశం ఇచ్చింది. ఆడిషన్స్ టెస్ట్ చేసిన డైరెక్టర్ నేనే ఆ పాత్రకు సూటబుల్ అవుతాను అన్నారు. బ్లైండ్ క్యారెక్టర్ ఎలా చేయాలి అని భయంతో ముందు వద్దనుకున్నాను. అలాగే రెండు సీరియల్స్ ఒకే టైమ్‌లో ఎలా చేయడం అని సందేహించాను. కానీ, నా టీమ్ ఇలాంటి అవకాశాలు కావాలనుకున్నా దొరకవు అన్నారు. అప్పుడే ఇదొక ఛాలెంజ్‌గా ఎంచుకున్నాను. మీనాక్షి పాత్ర చాలా జోవియల్‌గా అంతకుమించి ధైరస్తురాలిగా ఉంటుంది. ముత్యాల ముగ్గు సీరియల్‌లో భూమి క్యారెక్టర్‌కు నాకు చాలా దగ్గర పోలిక ఉన్నట్టు అనిపిస్తుంది.
అమ్మ కూచిని...
నాకు మా కుటుంబంతో టైమ్ స్పెండ్ చేయడం అంటే ఎక్కువ ఇష్టం. అందుకే అమ్మను నాతోపాటే ఉండమని కోరాను. మా అమ్మ రోజుమొత్తం నాతోనే ఉంటుంది. తనకు చాలా సహనం ఎక్కువ. తన సపోర్ట్ లేకపోతే నేను లేను. నెలలో ఇరవై రోజులు షూటింగ్‌లో పాల్గొంటే మిగతా రోజులు ఇల్లు వదిలి బయటకి రాను. ఇంట్లో ఉంటే టీవీ చూస్తూ గడిపేస్తాను. పాత సినిమా అయినా సరే మళ్లీ మళ్లీ చూస్తాను.
ఇతర భాషల కథానాయికలు
ఇక్కడ తెలుగమ్మాయిలకూ మంచి స్కోప్ ఉంది. అయితే, ఇతర భాషల అమ్మాయిలు ఎక్కువ కనిపించడానికి కారణం వాళ్లు ఈ వాతావరణంలో త్వరగా అడ్జెస్ట్ అవుతారని, ఫ్యామిలీ దూరంగా ఉన్నా భయపడరు, బాధపడరు అని. ఈ ఇండస్ట్రీ గురించి వారికి ఎక్కువ అవగాహన ఉంది. మన దగ్గరా ఈ రంగం పట్ల ఆసక్తి చూపేవారున్నారు.
టర్నింగ్ పాయింట్స్
మాది పెద్ద కుటుంబం. మంచి జాబ్ ఉండాలి. ట్యాగ్‌వేసుకొని సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయాలి అనుకున్నదాన్నే. కానీ, లైఫ్‌లో చాలా టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. వాటిని నేర్పుగా మలచుకోవాలని నా జీవితం నుంచే నేను నేర్చుకున్నాను. నా ఫెర్‌ఫార్మెన్స్ పట్ల మాత్రమే నేను శ్రద్ధ పెడతాను. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోను. చాలా మంది సినీనటి సౌందర్య లాగా అనిపిస్తారు అని అంటుంటారు. నాకు ఆ మాట చాలా ఆనందాన్నిస్తుంది. వారి మాటలకోసమైనా ఆమెలా నటించేందుకు ప్రయత్నిస్తుంటాను. నా కోసం తెలుగులో అవకాశాలు ఉన్నంతవరకు ఈ ఫీల్డ్‌లో కొనసాగుతాను’.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment