‘నిన్న రాత్రి నేను చేసిన పోస్టు అపార్థాలకు దారి తీసింది. నేను స్వలింగ సంపర్కుడిని(గే) కాదు. ఏదేమైనప్పటికీ ఎల్బీజీటీ కమ్యూనిటీ నుంచి నాకు అద్భుతమైన మద్దతు లభించింది. ఈ విషయాన్ని నేనెన్నటికీ మరచిపోలేను. ఎవరిదైనా ప్రేమే. ఇక రోబుస్టా నాకు మంచి స్నేహితుడు. ఇంకో విషయం.. రాత్రి చెప్పినట్లు ఐదేళ్లుగా కలిసి ఉండటం అంటే ఒకే ఇంట్లో ఉంటున్నామని ఉద్దేశం. అయినా ప్రతీ ఒక్కరూ ఈ విషయంలో మద్దతుగా నిలవడం చాలా బాగుంది’ అంటూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ తాను గేను కానని స్పష్టం చేశాడు.
కాగా సోమవారం తన 29వ పుట్టినరోజు సందర్భంగా స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను ఫాల్క్‌నర్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ‘నా బాయ్‌ఫ్రెండ్ రొబుస్టాతో పాటు మా అమ్మతో కలిసి పుట్టిన రోజు డిన్నర్’ అంటూ టుగెదర్‌ఫర్5ఇయర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఫాల్క్‌నర్ గే అని, స్వలింగ సంపర్కుడినంటూ ప్రకటన చేసిన తొలి ఆసీస్ క్రికెటర్ అని పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఫాల్క్‌నర్‌తో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కూడా ఈ కథనాలపై క్లారిటీ ఇచ్చింది.
ఈ విషయం గురించి సీఏ అధికార ప్రతినిధి కరీనా కేస్లెర్ మాట్లాడుతూ.. ‘ వ్యాపార భాగస్వామి, హౌజ్‌మేట్ అయిన స్నేహితుడితో తనకు ఉన్న అనుబంధం గురించి ఫాల్క్‌నర్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. అతడు చేసిన ఈ జోక్ కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నాం. పత్రికలు కూడా ఈ విషయం గురించి ప్రచురించే ముందు అతడిని సంప్రదించలేదు. దీంతో గందరగోళం నెలకొంది. ఎల్జీబీటీ కమ్యూనిటీకి జేమ్స్, సీఏ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 69 వన్డేలు, 24 టి20లు ఆడిన ఫాల్క్‌నర్... ఏడాదిన్నరగా జట్టులోకి ఎంపిక కాలేదు. కాగా, తాను ‘గే’నంటూ చెప్పుకొన్న తొలి అంతర్జాతీయ క్రికెటర్ ఇంగ్లండ్‌కు చెందిన స్టీవెన్ డేవిస్. 2011లో అతడీ మేరకు ప్రకటన చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment