
PC: CA
ఎట్టకేలకు విండీస్ వేదికగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్(West Indies Vs Australia) మధ్య ఫ్రాంక్ వొరెల్ ట్రోఫీ(Frank Worrell Trophy) నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరుజట్లు కరేబియన్ గడ్డ మీద ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో పోటీపడనున్నాయి. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గురువారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు త్వరలోనే తమ దేశంలో పర్యటించనుందని తెలిపింది.
డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో తొలి సిరీస్
మరోవైపు.. ఈ విషయం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి బెన్ ఓలివర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ క్రికెట్ బోర్డులకు ఘనమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు.
పదేళ్ల తర్వాత ఇరుజట్లు టెస్టు సిరీస్ ఆడటం శుభసూచకమని.. ఈ సిరీస్‌ను మూడు మ్యాచ్‌లకు పెంచినట్లు వెల్లడించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025-2027 ఎడిషన్‌లో ఇదే తమకు ఇదే తొలి సిరీస్ అని.. ఈసారీ ఫ్రాంక్ వొరిల్ ట్రోఫీని తామే సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
అదే విధంగా ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌తో ఐదు టీ20లు కూడా ఆడనున్నట్లు ఓలివర్ తెలిపారు. ఏడాది తర్వాత జరునున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇదే ఆరంభ సన్నాహకం కానుందని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఆసీస్ ప్రస్తుతంశ్రీలంక పర్యటనలో ఉంది. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఇక ఆసీస్ ఇప్పటికే డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లకు షెడ్యూల్
మూడు టెస్టులు
తొలి టెస్టు: జూన్ 25- 20- బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్
రెండో టెస్టు: జూలై 3-7- సెయింట్ జార్స్, గ్రెనెడా
మూడో టెస్టు: జూలై 12- 16- కింగ్‌స్టన్, జమైకా
టీ20 సిరీస్
తొలి టీ20- జూలై 20- కింగ్‌స్టన్, జమైకా
రెండో టీ20- జూలై 22- కింగ్‌స్టన్, జమైకా
మూడో టీ20- జూలై 25- బసెటెరె, సెయింట్ కిట్స్
నాలుగో టీ20- జూలై 26- బసెటెరె, సెయింట్ కిట్స్
ఐదో టీ20- జూలై 28- బసెటెరె, సెయింట్ కిట్స్
అతడి జ్ఞాపకార్థం
వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో విజేతకు ఫ్రాంక్ వొరిల్ అవార్డు ప్రదానం చేస్తారు. వెస్టిండీస్ జట్టు తొలి నల్లజాతి కెప్టెన్‌గా పేరొందిన వొరిల్ జ్ఞాపకార్థం ఈ ట్రోఫీని ప్రవేశపెట్టారు. 1960-61లో తొలిసారి ఆస్ట్రేలియాలో ఈ ట్రోఫీని ప్రదానం చేశారు.
ఇక 1995 నుంచి ఇప్పటి దాకా ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అయితే, గతేడాది జరిగిన టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ ఆసీస్ ఆధిపత్యాన్ని తగ్గించింది. గబ్బాలో అనూహ్య విజయంతో సిరీస్‌ను 1-1తో డ్రా చేసి.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్‌పై టెస్టు విజయం నమోదు చేసింది.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లు ముగిసిన తర్వాత వెస్టిండీస్ పాకిస్తాన్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రిజ్వాన్ బృందంతో సొంతగడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. జూలై 31 నుంచి టీ20లు, ఆగష్టు 8 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.
Comments
Please login to add a commentAdd a comment