స్వలింగ సంపర్కం నేరం కాదు | Supreme Court Ends Section 377 Decriminalising Homosexuality | Sakshi
Sakshi News home page

స్వలింగ సంపర్కం నేరం కాదు

Published Fri, Sep 7 2018 3:00 AM | Last Updated on Fri, Sep 7 2018 5:16 AM

Supreme Court Ends Section 377 Decriminalising Homosexuality - Sakshi

సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక బెంగళూరులో సంబరాలు చేసుకుంటున్న ఎల్‌జీబీటీ వర్గీయులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సెక్షన్‌ 377పై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. సమానత్వపు హక్కును హరిస్తున్న ఈ సెక్షన్‌లోని పలు వివాదాస్పద నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. మైనార్టీ తీరిన ఇద్దరు పరస్పర అంగీకారంతో ప్రైవేటు ప్రదేశంలో స్వలింగ శృంగారంలో పాల్గొనడం ఇకపై ఏమాత్రం నేరం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గురువారం పేర్కొంది. ‘స్వలింగ సంపర్కం హేతుబద్ధం కాదని, సమర్థించలేమని, నిరంకుశమని ఐపీసీ సెక్షన్‌ 377లోని నిబంధనలు చెబుతున్నాయి.

అయితే బ్రిటీష్‌ కాలంనాటి 158 ఏళ్ల నాటి ఈ నిబంధన సరికాదు. సమాజంలో ఎల్‌జీబీటీక్యూ (లెస్పియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌ జెండర్, క్వీర్‌)లు దేశంలోని మిగిలిన పౌరుల్లాగే అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులను పొందవచ్చు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్‌ 377 సమాజంలో వేళ్లూనుకుపోయిన పాతతరం ఆలోచనలకు ప్రతిరూపమని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది.

న్యాయమూర్తులంతా స్వలింగ సంపర్కులకు హక్కులు కల్పించడంలో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వర్గానికి ఇన్నాళ్లుగా సరైన న్యాయం జరగలేదని పేర్కొన్నారు. 2013లో సురేశ్‌ కౌశల్‌ కేసులో ‘అంగీకారం ఉన్నప్పటికీ.. అసహజ శృంగారం నేరమంటూ’ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేశారు. జంతువులు, చిన్న పిల్లలు, మైనర్లతో, అలాగే మేజర్లతోనూ పరస్పర అంగీకారం లేకుండా జరిగే లైంగిక కేసుల విషయంలో 377 సెక్షన్‌లోని నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

‘నవభారతంలో మరింత సమగ్రమైన సమాజాన్ని నిర్మించేందుకు చీకటి నుంచి వెలుగులోకి వచ్చే సమయమిది’ అని చెప్పి తీర్పును సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ముగించారు. తాజా తీర్పు ద్వారా ప్రపంచంలో స్వలింగ సంపర్కాన్నీ చట్టబద్ధం చేసిన 26వ దేశంగా భారత్‌ నిలిచింది. ఎల్‌జీబీటీక్యూ కార్యకర్తలు, న్యాయ నిపుణులు, హక్కుల కార్యకర్తలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి సహా పలు సంస్థలు సుప్రీం తీర్పును స్వాగతించాయి.

అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
లైంగికవాంఛ సహజమైన జీవసంబంధమైన ప్రక్రియని.. దీన్ని సాకుగా చూపి వివక్ష కనబరచడం స్వలింగ సంపర్కుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని కోర్టు పేర్కొంది. ‘18 ఏళ్లు నిండిన వారి స్వలింగ సంపర్కాన్ని సెక్షన్‌ 377 నేరంగా పరిగణిస్తోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 15, 19, 21లకు విఘాతం కల్గించడమే. అయితే వీరి మధ్య శృంగారం పరస్పర అంగీకారంతోనే, నిర్బంధ రహితంగానే జరగాలి’ అని 493 పేజీల తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్‌ 377 కారణంగానే ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా దేశంలో ద్వితీయశ్రేణి పౌరుల్లా బతకాల్సి వచ్చిందని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు.

‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 377.. మైనారిటీ తీరిన హోమోసెక్సువల్స్‌ (ఇద్దరు పురుషులు), హెటిరో సెక్సువల్స్‌ (ఓ ఆడ, ఓ మగ), లెస్బియన్స్‌ (ఇద్దరు ఆడవాళ్లు) మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాన్ని ఏర్పర్చుకోవడం నేరం, రాజ్యాంగ వ్యతిరేకం అని చెబుతోంది. ఇదే సెక్షన్‌ ఓ మగాడైనా, ఆడదైనా.. జంతువుతో శృంగారంలో పాల్గొనటాన్నీ తప్పుబట్టింది. అంతేకాదు, పరస్పర అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య బలవంతంగా లైంగిక చర్య జరగటాన్నీ నేరంగానే పరిగణిస్తోంది. ఇలాంటి కేసులకు సెక్షన్‌ 377 గరిష్టంగా జీవిత ఖైదు, కనీసం పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తోంది’ అని ధర్మాసనం గుర్తుచేసింది.  

శృంగార వాంఛ నేరం కాదు: నవ్‌తేజ్‌ జౌహార్, జర్నలిస్ట్‌ సునీల్‌ మెహ్రా, చెఫ్‌ రితూ దాల్మియా, హోటల్‌ యజమానులు అమన్‌నాథ్, కేశవ్‌ సూరీ, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ అయేషా కపూర్‌ సహా 20 మంది ఐఐటీ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ చారిత్రక తీర్పునిచ్చింది. ‘శృంగారమనేది జీవసంబంధమైన ప్రక్రియ. ఇది సహజం, ప్రతి ఒక్కరిలోనూ న్యూరోలాజికల్, బయాలాజికల్‌గా అంతర్గతంగా కలిగే మార్పు. పరస్పర ఆకర్షణ కలిగినపుడు శృంగార భావన ఏర్పడటం సహజం. ఇలాంటి వారిని నేరస్తులుగా చూడడం ఎల్జీబీటీక్యూల భావప్రకటన హక్కుకు విఘాతం కల్గించినట్లే’ అని కోర్టు తీర్పు పేర్కొంది. ఎల్‌జీబీటీక్యూల హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలపై భారత్‌ కూడా సంతకాలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.

ఇక మేమూ సమాజంలో భాగమే!
17 ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించినందుకు ఢిల్లీ సహా దేశంలోని పలుచోట్ల ఎల్‌జీబీటీక్యూ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కేక్‌లు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వరా>్గన్ని ప్రతిబింబించే ఇంద్రధనస్సు రంగుల జెండాలను ఊపుతూ తీర్పును స్వాగతించారు. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కాన్ని ఈ సమాజం అడ్డుకోలేదంటూ నినాదాలు చేశారు. ‘మా ఆవేదనను అర్థం చేసుకుని భారత న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచేలా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. మొత్తానికి మేం కూడా సమాజంలో భాగస్వాములమయ్యాం’ అని ఎల్‌జీబీటీక్యూల కోసం డెల్టా యాప్‌ను రూపొందించిన ఇషాన్‌ సేథీ పేర్కొన్నారు.   

స్వాగతించిన న్యాయనిపుణులు: సుప్రీం తీర్పును సీనియర్‌ న్యాయవాదులు, న్యాయ నిపుణులు స్వాగతించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ మిగిలిన వారితో సమానంగా, హుందాగా బతికే హక్కు ఉందన్నారు. ఇది సంబరాలు జరుపుకునే తీర్పు అని మాజీ అటార్నీ జనరల్‌ సోలీ సొరాబ్జీ పేర్కొన్నారు. ఈ తీర్పు రాజకీయాలను, మానవ విలువలను మారుస్తుందని సీనియర్‌ న్యాయవాది ఆనంద్‌ గ్రోవర్‌ అభిప్రాయపడ్డారు.

ప్రముఖుల మద్దతు
బాలీవుడ్‌ ప్రముఖులు, రచయితలు, టీచర్లు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల్లోని వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్గానికి ప్రాథమిక మానవ హక్కులు కల్పించేలా సుప్రీం తీర్పు ఉందన్నారు. గే అయినందుకు తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న చిత్ర దర్శకుడు హన్సల్‌ మెహతా ఈ తీర్పు కొత్త ఆరంభానికి సూచకమన్నారు. బాలీవుడ్‌ సినీ నిర్మాత కరణ్‌ జోహార్‌ ‘దేశానికి మళ్లీ ఆక్సీజన్‌ అందింది’ అని ట్వీట్‌ చేశారు. ‘భవిష్యత్తులో ఒకరోజు ఎవరు ఏంటి అనే ముద్ర వేయడం ఉండదు. అలాంటప్పుడు దేశం స్వర్గం అవుతుంది’ అని నటి సోనమ్‌ కపూర్‌ పేర్కొన్నారు. నైతికత పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాయడం ఎవరి తరం కాదని నటి స్వరా భాస్కర్‌ అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కుల హక్కులపై మాట్లాడినందుకు తనను లోక్‌సభలో అడ్డుకున్న బీజేపీ ఎంపీలంతా సిగ్గుపడాలని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు. కోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

చరిత్ర వీరికి క్షమాపణ చెప్పాలి: జస్టిస్‌ ఇందు మల్హోత్రా
‘తోటి సమాజమంతా స్వలింగ సంపర్కం పూర్తిగా సహజమైన ప్రక్రియ అని గుర్తించలేకపోవడంతో ఎల్‌జీబీటీక్యూలు ఇన్నాళ్లుగా భయం భయంగా బతుకుతున్నారు. ఏదో మహాపరాధం చేశామన్న భావనలో పడిపోయారు. వీరికి, వీరి కుటుంబ సభ్యులకు న్యాయం జరగడంలో, హక్కులు కల్పించడంలో ఆలస్యమైనందుకు చరిత్ర వీరికి క్షమాపణలు చెప్పాలి. శతాబ్దాలుగా వీరు అవమానాలకు గురయ్యారు. సమాజానికి వీరి గురించి సరైన అవగాహన లేకపోవడమే కారణం. అందువల్ల ఆర్టికల్‌ 14 కల్పించిన ప్రాథమిక హక్కులను ఎల్‌జీబీటీక్యూలు కోల్పోయారు’ అని తన తీర్పులో పేర్కొన్నారు.


సెక్షన్‌ 377 నేపథ్యమిదీ..
భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 16వ అధ్యాయంలో 377వ సెక్షన్‌ ఉంది. ఈ సెక్షన్‌ ముసాయిదాను బ్రిటిష్‌ పాలనలో 1838లో థామస్‌ మెకాలే రూపొందించగా 1861లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం బ్రిటిష్‌ సొడొమీ చట్టం(బగ్గరీయాక్ట్‌ 1533) ఆధారంగా రూపొందింది. సహజ విరుద్ధంగా జరిగే ఎలాంటి శృంగారమైనా నేరమేనని ఈ చట్టం చెబుతోంది. నేరస్తులకు పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించేందుకు వీలు కల్పించింది.


ఢిల్లీలో సెక్షన్‌377 రాసి ఉన్న కేక్‌ కట్‌ చేస్తున్న దృశ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement