తీర్పులో ఏం చెప్పారు? | Top quotes by Dipak Misra's judgment that defines it in spirit and letter | Sakshi
Sakshi News home page

తీర్పులో ఏం చెప్పారు?

Published Fri, Sep 7 2018 3:16 AM | Last Updated on Fri, Sep 7 2018 3:16 AM

Top quotes by Dipak Misra's judgment that defines it in spirit and letter - Sakshi

జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌

జస్టిస్‌ దీపక్‌ మిశ్రా
‘భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 377 ప్రస్తుత రూపం పౌరుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను నిర్వచించే రాజ్యాంగంలోని ఆరిక్టల్‌ 19(1)(ఏ)ను ఉల్లంఘిస్తోంది. మేజర్లయిన ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషులు లేదా స్త్రీ, పురుషుల మధ్య శృంగారాన్ని రాజ్యాంగవిరుద్ధంగా పరిగణించలేం. ఎవరైనా స్త్రీ, పురుషులు జంతువులతో అసహజ శృంగారానికి పాల్పడితే సెక్షన్‌ 377 కింద వారిని శిక్షించవచ్చు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు రెండో వ్యక్తి సమ్మతి లేకుండా శృంగారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్‌ 377 కింద నేరమవుతుంది. సమాజంలోని ఓ వర్గం లేదా మైనారిటీ ప్రజల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు న్యాయస్థానాల పాత్రకు మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది. సమాజంలోని వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ, అల్పసంఖ్యాకుల హక్కులను హరించేందుకు చేపట్టే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవాలని రాజ్యాంగ నైతికత అనే భావన న్యాయశాఖ సహా అన్ని ప్రభుత్వ విభాగాలను కోరుతుంది’.

జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌
‘స్వలింగ సంపర్కులకు సమాజంలో గౌరవంగా బతికే ప్రాథమిక హక్కు ఉంది. వాళ్లు ఎలాంటి మానసిక సమస్యలతో బాధపడటం లేదు. సెక్షన్‌ 377 అన్నది బ్రిటిష్‌ హాయాంలో నైతికతను వివరిస్తూ తెచ్చింది. కాలం చెల్లిన ఈ చట్టాన్ని కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదు. స్వలింగ సంపర్కుల విషయంలో సెక్షన్‌ 377 వైఖరి ఏకపక్షంగా ఉంది. ఇటీవల జరిగిన సైకియాట్రిక్‌ అధ్యయనాలు గే, ట్రాన్స్‌జెండర్లు మానసిక రోగులు కాదని, కాబట్టి వారిని శిక్షించరాదని చెబుతున్నాయి. ప్రాథమిక హక్కులన్నవి రాజ్యాంగం అనే విశ్వంలో ధ్రువ నక్షత్రం లాంటివి. ప్రభుత్వాల పరిధికి దూరంగా ఉన్న ప్రాథమిక హక్కులకు కస్టోడియన్‌ సుప్రీంకోర్టే. ఈ హక్కులు ఎన్నికలను బట్టి, ప్రభుత్వాలను బట్టి మారవు. స్వలింగ సంపర్కులకు ఈ సమాజంలో గౌరవంగా బతికే హక్కుంది. చట్టాల ప్రకారం వీరికి రక్షణ కల్పించడంతో పాటు ఎలాంటి వివక్ష లేకుండా మనుషులుగానే చూడాలి. ఈ తీర్పుపై కేంద్రం విస్తృత ప్రచారం కల్పించాలి’.

జస్టిస్‌ చంద్రచూడ్‌
‘స్వలింగసంపర్కులు భయంతో బతకడానికి వీల్లేదు. 158 ఏళ్లు ఈ వర్గం అవమానాలను సహిస్తూ బతికింది. స్వాతంత్య్రం తరువాత కూడా ఇది కొనసాగింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా చెబుతున్న సెక్షన్‌ 377 రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం వంటి భావనలను ఉల్లంఘించింది. లైంగిక భాగస్వామిని ఎన్నుకునే హక్కును నిరాకరించడం గోప్యత హక్కును నిరాకరించడమే. రాజ్యాంగంలో రాసిన రాతలకు ఏమాత్రం అర్థం ఉన్నా స్వలింగ సంపర్కులు భయంతో బతకటానికి వీల్లేదు. ఈ డిజిటల్‌ యుగంలోనూ లైంగికత అన్నది దోపిడీకి అస్త్రంగా మారిపోయింది. ఈ సెక్షన్‌ను కొనసాగించడం ద్వారా మూస ఆలోచనలను, వివక్షను ప్రభుత్వం ప్రోత్సహించింది. భారత రాజ్యాంగం సమాజంలో వివక్షతను నిషేధించింది. తమ లైంగికత ఆసక్తుల ఆధారంగా ఎల్జీబీటీ వర్గంపై వివక్ష
చూపరాదు’.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement