సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం సహా పలు సున్నితమైన కేసుల్లో తుది నిర్ణయాన్ని కేంద్రం కోర్టుల విచక్షణకు వదిలేస్తుండటంపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని నేషనల్ లా వర్సిటీలో 19వ బోధ్‌రాజ్ సావ్నీ స్మారక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఈ రాజకీయ నాయకులు కొన్నిసార్లు తమ అధికారాలను న్యాయమూర్తులకు ఎందుకు అప్పగిస్తున్నారు? ఈ తరహా వ్యవహారాలు సుప్రీంకోర్టులో నిత్యకృత్యంగా మారిపోయాయి. ‘ఐపీసీ సెక్షన్ 377(స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటోంది)పై నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నాం’ అనడం జడ్జీలకు చాలా సమ్మోహనపరిచే మాట.
పొగడ్తలు ఎన్నటికైనా చేటు తెస్తాయనీ, వాటి కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని జడ్జీలు గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. స్వలింగ సంపర్కం నేరంకాదని ప్రకటించిన ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. ఇతరులు, సమాజంతో మన కలివిడి కారణంగానే వ్యక్తిత్వం ఏర్పడుతుందనీ, లైంగికత అలా ఏర్పడదని ఆయన అన్నారు. సెక్షన్ 377లోని కొన్ని నిబంధనలు ‘పురుషులంటే ఇలానే ఉండాలి, స్త్రీలంటే ఇలాగే ఉండాలి’ అంటూ ఉందనీ వెల్లడించారు. దీని కారణంగా స్వలింగ సంపర్కులపై కొందరు చాదస్తపు మనుషులు వివక్ష చూపారన్నారు. ప్రజలపై జాతి, లైంగికత, మతం, ప్రాంతం, రంగు ఆధారంగా వివక్ష చూపరాదని రాజ్యాంగంలోని 15వ అధికరణ చెబుతోందనీ, సెక్షన్ 377 దీన్ని స్పష్టంగా ఉల్లంఘించిందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment