తిరువనంతపురం: కేరళకు చెందిన లెస్బియన్ జంట అదిలా నసరీన్, ఫాతిమా నూరా ఎట్టకేలకు ఒక్కటయ్యింది. బీచ్‌లో ఘనంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకొని కొత్త జీవితానికి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
కోర్టు తీర్పుతో
ఈ ఇద్దరూ స్కూల్‌లో చదువుకునే సమయం నుంచే స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి జీవించాలనుకున్నారు. కానీ ఈ జంట ప్రేమ విషయం తెలిసినప్పుడు ఇద్దరి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సమాజంలో తమ పరువు ఏమవుతుందని ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది మేలో ఇద్దరూ కోజికోడ్ పారిపోయారు. ఎల్‌జీబీటీక్యూ సొసైటీ ఆశ్రమంలో ఉన్నారు.
అయితే తల్లిదండ్రులు వారి వద్దకు వెళ్లి పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లను తీసుకెళ్లారు. కానీ ఇంటికెళ్లాక పెళ్లి కుదరదని మాట మార్చారు. తన ప్రేమను దక్కించుకునేందుకు నసరీన్ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు అనుకూలంగా వచ్చింది. వీరిద్దరికి కలిసి జీవించే హక్కు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
చట్టబద్దమైన చిక్కులు వీడటంతో ఎల్‌జీబీటీక్యూ సొసైటీ వీరి కోసం బీచ్‌లో వేడుక ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లోనే ఇద్దరూ రింగ్‌లు మార్చుకుని ఒక్కటయ్యారు. లెహంగా ధరించి, పూలదండలు వేసుకుని ఎంతో సంతోషంగా కన్పిస్తున్న ఈ జంట ఫొటోలను నసరీన్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీచ్‌లో ఇలాంటి ఫొటో షూట్‌లు నిర్వహించడం ఆసక్తిగా ఉందని నసరీన్ చెప్పింది. భవిష్యత్తులో తామిద్దరం పెళ్లి చేసుకుంటామని పేర్కొంది.
తండ్రి పేరుతో ఇబ్బంది..
నసరీన్, ఫాతిమా కుటుంబాలు వీళ్లను దూరం పెట్టాయి. అయితే ఇంకా ఏవైనా ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు తల్లిదండ్రుల పేర్లు ఉపయోగించాల్సి వస్తోందని, ఇది తమకు ఇబ్బందిగా ఉందని నజరీన్ చెబుతోంది. ఇటీవల తామిద్దరం ఆస్పత్రిలో చేరినప్పుడు హాస్పిటల్ ఫాంలో తండ్రి పేరు అడిగారని చెప్పుకొచ్చింది.
స్వలింగ సంపర్క వివాహాలకు భారత్‌లో ఇంకా చట్టబద్దత లేదు. సేమ్ సెక్స్ రిలేషన్స్ నేరమని నిబంధనలు ఉన్నప్పటికీ 2018లో వాటిని నిలిపివేశారు. అయితే కొంతమంది స్వలింగ సంపర్కులు మాత్రం వేడుకలు నిర్వహించి అధికారికంగా ఒక్కటవుతున్నారు. ఘనంగా వివాహాలు కూడా చేసుకుంటున్నారు.
చదవండి: పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు..
Comments
Please login to add a commentAdd a comment