ముకేశ్ అంబానీ, అరుంధతి కట్జూ, మేనక గురుస్వామి
న్యూయార్క్: రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ప్రజా ప్రయో జన వ్యాజ్యాలతో మానవ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామిలకు అరుదైన గుర్తింపు లభించింది. టైమ్స్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది రూపొందించే ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపించిన 100 మంది జాబితాలో భారత్ నుంచి వారికి చోటు లభించింది. మార్గదర్శకులు, నాయకులు, కళాకారులు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలతో 2019 సంవత్సరానికి టైమ్స్ మ్యాగజైన్ బుధవారం ఈ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండో అమెరికన్ కమేడియన్, టీవీ హోస్ట్ హసన్ మిన్‌హాజ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాక్ ప్రధాని ఇమ్రాన్, గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్‌వుడ్స్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరంతా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ముద్ర వేశారో టైమ్స్ వారి ప్రొఫైల్స్‌లో వివరించింది.
అరచేతిలో ప్రపంచం
ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ భారత వాణిజ్య రంగంలో అద్భుతమైన దార్శనికుడని, రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేయడంలో ఆయన పాత్రను మరువలేమని ముకేశ్ ప్రొఫైల్‌ని రాసిన మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహేంద్ర అన్నారు. అరచేతిలో∙ప్రపంచమంటూ ముఖేశ్ చేసిన రిలయన్స్ జియో ఆవిష్కరణతో ఆయన ప్రతిష్ట పెరిగిందన్నారు. స్వలింగ సంపర్కులు హక్కుల కోసం, సెక్షన్ 377ను (దీని ప్రకారం స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరం. ఈ సెక్షన్‌ను 2018 సెప్టెంబర్‌లో సుప్రీం రద్దు చేసింది) రద్దు కోసం పోరాడి సుప్రీంకోర్టులో విజయం సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న పిటిషన్‌దారులు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామి. ‘ఎల్‌జీబీటీక్యూ హక్కుల కోసం అరుంధతి, మేనక చిత్తశుద్ధితో చేసిన న్యాయపోరాటం మరువలేనిది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఎలుగెత్తి చాటి భారత్ సామాజిక పురోగతికి ముందడుగు వేశారు’ అని నటి ప్రియాంక అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment