Alahabad
-
ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది?
మీరు ప్రయాణాలను ఇష్టపడేవారైతే అన్ని నగరాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు. పలు నగరాలు ఎంతో చారిత్రాత్మకమైనవి. వాటి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భారతదేశానికి కేవలం ఒక రోజు రాజధానిగా ఉన్న ఒక నగరం ఉందని, చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరిగిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారతదేశానికి ఒక్కరోజు కోసం ఏ నగరాన్ని రాజధానిగా చేశారో.. అలా ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. అలహాబాద్ చరిత్ర ఇప్పుడు మన అలహాబాద్ సంగమ నగరం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ అని పిలుస్తున్నారు. చరిత్రలొని వివరాల ప్రకారం మొఘల్ పాలకుడు అక్బర్ ఈ నగరానికి అలహాబాద్ అనే పేరు పెట్టాడు. దీని అర్థం ‘అల్లా నగరం’. తర్వాత అది అలహాబాద్‌గా మారింది. మొఘల్ పాలనలో ఈ నగరం ప్రాంతీయ రాజధానిగా ఉండేది. మొఘల్ పాలకుడు జహంగీర్ 1599 నుండి 1604 వరకు నగరంలో తన ప్రధాన పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్క రోజు రాజధాని మొఘలులు పతనం అనంతరం భారతదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పుడు అలహాబాద్ ఒక రోజు రాజధానిగా ఉంది. 1772 నుంచి కలకత్తా రాజధానిగా మనదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది. కాగా 1857లో మీరట్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనినే ప్రథమ స్వాతంత్ర్యపోరాటంగా చెబుతుంటారు. దీనిని అణచివేశాక ఇండియా పాలన బాధ్యతలను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోవాలని భావించింది. దీనిపై 1858లో క్వీన్ విక్టోరియా ఆర్డర్స్ కలిగిన లెటర్ అప్పటి వైస్రాయ్ జనరల్ లార్డ్ క్యానింగ్‌కు చేరింది. ఆ సమయంలో ఆయన అలహాబాద్‌లో ఉన్నారు. ఆయన వెంటనే అందుబాటులో ఉన్న స్థానిక రాజులు, చక్రవర్తులు, భూస్వాములతో సమావేశం ఏర్పాటుచేశారు. క్వీన్ విక్టోరియా పంపిన ఉత్తరం చదివి, పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆ ఒక్కరోజుకు అలహాబాద్‌ను ఇండియాకు రాజధానిగా ప్రకటించారు. ఈ విధంగా ఇండియాకు ఒక్కరోజు రాజధానిగా అలహాబాద్ చరిత్రలో నిలిచింది. పర్యాటక కేంద్రంగా.. ప్రయాగ్‌రాజ్ చాలా కాలం పాటు పరిపాలన, విద్యా కేంద్రంగా ఉంది. ఇది పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. నగరంలో, చుట్టుపక్కల అనేక చారిత్రక, మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది వస్తుంటారు. ఇక్కడ మూడు పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతి సంగమిస్తాయి. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. చూడవలసిన ప్రదేశాలు మీరు ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్నట్లయితే సంగమ స్థలితోపాటు ఖుస్రో బాగ్ సందర్శించవచ్చు. ఇక్కడి మొఘల్ వాస్తుశిల్పం అమితంగా ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఆనంద్ భవన్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది ఒకప్పుడు పండిట్ నెహ్రూ కుటుంబానికి చెందిన భవనం. 1970లో నాటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ భవనాన్ని భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుండి ఈ భవనాన్ని ఆనంద్ భవన్ అని పిలుస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో అక్బర్ కోట కూడా సందర్శించదగిన ప్రదేశంగా నిలిచింది. ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం? -
కోటి యూట్యూబ్ సబ్స్క్రైబర్లు: 8500 కోట్లతో సొంత కంపెనీ
న్యూఢిల్లీ: చాలా తెలివైన విద్యార్థి. కష్టపడి చదివేవాడు.10, 12వ తరగతిలో టాపర్.. IITలో సీటు కోసం కష్టపడ్డా... దొరక్కపోవడంతో కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ కాలేజీలో అడ్మిషన్ తో సరిపెట్టుకున్నాడు. అయితేనేం ఇపుడు కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయనే UPకి చెందిన అలఖ్ పాండే. ఐఐటీ రాలేదని నిరాశ చెందకుండా ట్యూషన్ టీచర్‌గా కెరియర్ మొదలు పెట్టి ఇప్పుడు విజయవంతమైన ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగాడు. ఆన్లైన్ లర్నింగ్ ప్లాట్‌ఫాం ద్వారా బిలియనీర్‌గా ఎదిగాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం ఏలతాడు అన్నట్టు తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అలహాబాద్ కుర్రోడు బిలియనీర్‌గా అలహాబాద్‌కు చెందిన అలఖ్ పాండే ఇంటర్ చదువుతున్నపుడు ఐఐటీ గురించి కలలు కన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అది సాధ్యం కాలేదు. అయినా కుంగిపోలేదు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోనే చదువుకు టాటా చెప్పేసాడు. సొంత కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్ టీచర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. ట్యూటర్‌గా అతని తొలి సంపాదన రూ. 5వేలు మాత్రమే. మరిపుడు వేల కోట్ల విలువైన "ఫిజిక్స్ వాలా" అనే కంపెనీ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా శబాష్ అనిపించుకుంటున్నాడు. యూట్యూబర్ కూడా అయిన అలఖ్ పాండే విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తాడు. అలాగే తన యాప్ ద్వారా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు రోజుకు కనీసం 1.5 గంటలు శిక్షణ తీసుకుంటున్నారంటే అతని క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిజిక్స్ వాలాలో జేఈఈ-నీట్ శిక్షణను కూడా ప్రారంభించాడు. అంతేకాదు ఈనెల (ఫిబ్రవరి) 28న విశ్వాస్ దివస్ పేరుతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెస్ట్ లాంచ్ చేయబోతున్నానని ప్రకటించాడు అలఖ్ పాండే. ఫిజిక్స్ వాలా ఆవిర్భావం ఇంజినీరింగ్ వదిలి అలహాబాద్ తిరిగొచ్చి 2016లో ఫిజిక్స్ వాలా ఛానెల్‌ని ప్రారంభించాడు. దీని తరువాత 2020లో ఒక యాప్‌ను కూడా ప్రారంభించాడు. ఇటీవల భారీ పెట్టుబడులతో పాండే కంపెనీ మొత్తం నికర విలువ రూ.8500 కోట్లుగా నిలిచింది. అలఖ్ యూట్యూబ్ ఛానల్ కు 9.75 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. గతేడాది ఆయన కంపెనీ రూ.350 కోట్లు ఆర్జించింది. కంపెనీలో 19వేల మంది ఉద్యోగులు ఉన్నారు. బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ఫిజిక్స్‌వాలా దేశంలోని 101వ యునికార్న్‌గా ఉంది. తాజాగా ఆయన రూ.777 కోట్ల పెట్టుబడులను సమీకరించారు. దేశీయ 101వ యూనికార్న్ ఫిజిక్స్ వాలా ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్ ఫిజిక్స్ వాలా (PWగా పాపులర్) వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, GSV వెంచర్స్ నుండి సిరీస్ A ఫండింగ్ 100 మిలియన్లను సేకరించడం ద్వారా భారతదేశపు 101వ యునికార్న్‌గా అవతరించింది. 2020, 2021లో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వంటి పోటీ పరీక్షలలో 10వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని కంపెనీ గతంలో ప్రకటించింది. భారతదేశంలో కనీసం ఆరుగురిలో ఒకరు వైద్య విద్యార్థులు, 10మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఫిజిక్స్వాలాకి చెందిన వారుంటారని పేర్కొంది. అలాగే బైజూస్, వేదాంతా వంటి ఇతర అనేక ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా ఇప్పటికే 18 నగరాల్లో 20 కంటే ఎక్కువ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేశారు పాండే. 300 మంది సామూహిక వివాహాలకు ఫండింగ్ ఫిబ్రవరి 22న జర్నలిస్ట్ శివాని దూబేతో ఏడు అడుగులు వేశాడు అలఖ్. మరో విశేషం ఏమిటంటే తమ పెళ్లి సందర్బంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహాలకు ఫండింగ్‌కు ముందుకొచ్చాడు. అంతేకాదు పెళ్లి తరువాత కూడా చదువు కొనసాగించాలనుకునే వారికి చదువుకునేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు పాండే. మార్చి ప్రారంభంలో ప్రయాగ్‌రాజ్, తేలియార్గంజ్లోని NRIPT గ్రౌండ్లో 300మందికి సామూహిక వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah) -
వావ్! వాట్ యాన్ ఐడియా 'ప్రేమ్‌జీ'
అలహాబాద్ : లాక్డౌన్ వేళ సొంతూరుకు వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లను దాటుకుంటూ వారు అడిగే ప్రశ్నలను తప్పించుకొని ఎలాగోలా చేరుకుంటున్నాము. కానీ ప్రేమ్ మూర్తి పాండే అనే వ్యక్తి ఎలాగైనా సొంతూరుకు చేరుకోవాలనే తపనతో కాస్త భిన్నంగా ఆలోచించాడు. అందుకోసం ఏకంగా ఒక ట్రక్కును కొని దానిలో 25 టన్నుల ఉల్లిగడ్డల లోడ్‌ను నింపి మరీ ముంబై నుంచి సొంతూరుకు చేరుకున్నాడు. వివరాలు.. అలహాబాద్‌కు చెందిన ప్రేమ్ మూర్తి పాండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పని చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఎయిర్పోర్ట్ మూతపడడంతో ప్రేమ్ ఇంటికి వెళ్లాలనుకున్నాడు . ('నాతో చేయి కలపండి.. వారికి సాయం చేద్దాం') అయితే ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తారని ప్రేమ్ అనుకున్నాడు. కేంద్రం మే 3 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా ఉండడంతో ఎవరిని వేరే రాష్ట్రాలకు అనుమతించడం లేదు. ఒక్క నిత్యావసరాలకు మాత్రమే మినహాయింపు ఉందని తెలుసుకున్న ప్రేమ్ తాను కూడా కూరగాయల వ్యాపారం పేరుతో అక్కడినుంచి వెళ్లిపోవాలని భావించాడు. అందుకోసం మొదట రూ. 10వేలకు 1300 కిలోల వాటర్‌మిలన్ కాయలు కొన్నాడు. ఏప్రిల్ 17న మినీ ట్రక్కులో వాటిని లోడ్ చేసుకొని నాసిక్ వరకు వచ్చాడు. అక్కడ లోడ్‌ను అమ్మేసి ట్రక్కును తిరిగి ముంబైకి పంపించేశాడు. ఆ వచ్చిన డబ్బులతో పాటు తన దగ్గర ఉన్న డబ్బుతో మొదట రూ. 77500కు ట్రక్‌ను మళ్లీ అద్దెకు తీసుకొని , తర్వాత రూ. 2.32 లక్షల విలువైన 25 టన్నుల ఉల్లిగడ్డను ట్రక్‌లోకి ఎక్కించుకొని ఏప్రిల్ 20వ తేదీన బయలుదేరాడు. మొత్తం 1200 కిలోమీటర్లు ప్రయాణించి ఏప్రిల్ 23న అలహాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఉల్లిగడ్డ లోడ్ తీసుకొని అలహాబాద్‌లోని ముందేరా హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చాడు. అయితే ఉల్లిగడ్డను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో తన సొంతూరైన కొత్వా ముర్బక్పూర్కు ట్రక్కును తీసుకెళ్లిపోయాడు. అయితే ఇంటికి చేరుకున్న పాండే శుక్రవారం దూమ్గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అసలు విషయం వివరించాడు. వెంటనే పోలీసు సిబ్బంది అతన్ని మెడికల్ పరీక్షలకు పంపగా రిపోర్టులో కరోనా నెగిటివ్ అని వచ్చింది. అయితే ముందు జాగ్రత్తగా అతన్ని హోం క్వారంటైన్కే పరిమితం కావాలని ఆదేశించారు. అంత డబ్బు ఖర్చు చేసి ఇంటికి చేరుకున్నావు బాగానే ఉంది ... మరి ఉల్లిగడ్డలన్ని ఏం చేస్తావు అని ప్రేమ్‌ను ప్రశ్నించగా.. నేను ముంబై నుంచి ఇంటికి చేరుకోవడం గురించే ఆలోచించాను. అందుకోసం ఎంత డబ్బు ఖర్చు చేసైనా సరే వెళ్లాననుకున్నాను. ఇక నా ఉల్లిగడ్డలకు వచ్చిన కష్టం ఏం లేదు. ప్రస్తుతం ఉల్లిగడ్డకు కొరత లేకపోవడంతో దళారులు ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. అయితే ఏదో ఒకరోజు మంచి ధరకు అమ్ముడుపోతాయి.. ఆ విషయంలో నాకు దిగులు లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. -
‘నా కొడుకు కోసం ఏం చేయలేకపోతున్నాను’
లక్నో: ‘నా కుమారుడి కోసం ఏం చేయలేకపోతున్నాను.. ఉద్యోగ విరమణ తర్వాత ఎన్నో వ్యాపార ప్రయత్నాలు చేశాను. కానీ అవేవీ ఫలించలేదు. ఇందుకు యూపీఏ ప్రభుత్వం, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం నిర్ణయాలే కారణం’ అంటూ ఓ విశ్రాంత ఐఏఎఫ్ అధికారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. అస్సాంకు చెందిన బిజన్ దాస్ ఈ నెల 6న ఉత్తరప్రదేశ్, అలహాబాద్‌లోని ఓ లాడ్జీలో దిగాడు. అయితే ఆదివారం రోజున ఆయన గది బయటకు రాకపోవడమే కాక ఆహారం కూడా తీసుకోలేదు. అనుమానం వచ్చిన వెయిటర్ ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో వారు గది లోపలికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరేసుకున్న బిజన్ దాస్ వారికి కనిపించాడు. గదిలో రెండు వేల రూపాయలతో పాటు ఓ ఐదు పేజీల సూసైడ్ నోట్ కూడా లభించింది. దానిలో తన కుమారుడి కోసం ఏం చేయలేకపోతున్నాని.. ఉద్యోగ విరమణ తర్వాత వ్యాపారం ప్రారంభించినప్పటికి కలిసి రాలేదని తెలిపాడు బిజన్ దాస్. ఇందుకు గత యూపీఏ ప్రభుత్వాన్ని, చిదంబరాన్ని తప్పు పట్టాడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌లు, తప్పుడు నిర్ణయాల వల్ల మాంద్యం పరిస్థితులు తలెత్తాయని.. ఫలితంగా రిటైర్మెంట్ తర్వాత తాను ప్రారంభించిన వ్యాపారాలేవి కలిసి రాలేదని బిజన్ దాస్ ఆరోపించాడు. అంతేకాక ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల వల్ల తాత్కలిక ఇబ్బందులు మాత్రమే ఎదుర్కొన్నాం.. కానీ యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుత మాంద్యం పరిస్థితులు తలెత్తాయన్నాడు. తన కుమారుడు బాగా పాడతాడని.. ఓ టీవీ షోలో కూడా పాల్గొన్నాడని తెలిపాడు. తాను చనిపోవడంతో తన కుమారుడు దిక్కులేని వాడవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడు అతని కలలను సాకారం చేసుకునేందుకు మోదీ సహకరించాలని బిజన్ దాస్ విజ్ఞప్తి చేశాడు. అంతేకాక అలహబాద్లోనే తన అంత్య క్రియలు పూర్తి చేయాలని అందుకు గాను రూ. 1500లను గదిలో ఉంచానని చెప్పాడు. హోటల్ గది అద్దె చెల్లించడం కోసం మరో 500 రూపాయలను కూడా ఉంచుతున్నట్లు పేర్కొన్నాడు. తాను మరణించాననే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపవద్దని కోరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ కుటుంబంలో 66 ఓట్లున్నాయ్!
అలహాబాద్‌లోని బహ్రయిచా గ్రామానికి చెందిన రామ్ నరేశ్ భుర్తియా కుటుంబ సభ్యులు మొత్తం 82 మంది. వారిలో ఓటు హక్కున్న వాళ్లు 66 మంది. కాబట్టే అభ్యర్ధులంతా భుర్తియాను బుజ్జగించేందుకు వస్తారు. ప్రత్యేకంగా హామీలు కూడా ఇస్తారు. అయితే, వాటిని నెరవేర్చడం లేదని 98 ఏళ్ల నరేశ్ ఆరోపిస్తున్నారనుకోండి. వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న ఈ ఉమ్మడి కుటుంబం ఆర్థికంగా మంచి స్థానంలోనే ఉంది. ప్రస్తుతం వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అది మట్టి ఇల్లు. దాని స్థానంలో పక్కా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు.అయితే, ఆ ఇంటి మీదుగా హై టెన్షన్ కరెంటు వైర్లు వెళుతున్నాయి. వాటిని తొలగిస్తే తాము పక్కా ఇల్లు కట్టుకుంటామని నరేశ్ ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థులను కోరడం, వారు హామీ ఇవ్వడం జరుగుతోందే కాని ఇంత వరకు పని కాలేదు.అయినా వాళ్లు ఓట్లువేయడం మానడం లేదు. వచ్చే సారి మాత్రం మా సమస్య పరిష్కరించిన వారికే ఓటు వేస్తామని కచ్చితంగా చెబుతున్నాడు నరేశ్ మనుమడు శంకర్. -
గెలవాలంటే.. వాళ్లింటికి వెళ్లాల్సిందే!!
ఒక్క ఓటు చాలు గెలుపోటములను నిర్ణయించేందుకు.. అందుకే పోలింగ్ దగ్గర పడిందంటే చాలు ఓటర్లు ఎక్కడ ఉన్నా సరే.. వారిని స్వస్థలానికి రప్పించేందుకు నాయకులు ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శిస్తారు.. అలాంటిది ఒకే కుటుంబంలో 66 మంది ఓటర్లు ఉండే విడిచిపెడతారా.. తమకే ఓటు వేయాలంటూ వారి వెంటపడటం సహజం. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యూపీకి చెందిన రామ్ నరేష్ భుర్టియా కుటుంబం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. వివిధ పార్టీల నాయకుల రాకతో ఆయన ఇంట్లో సందడి నెలకొంది. మొత్తం 82 మంది సభ్యులు.. అలహాబాద్‌లోని బహ్రెచా గ్రామానికి చెందిన రామ్ నరేష్(98) కుటుంబంలో మొత్తం 82 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ఒకే ఇంటిలో నివసిస్తారు. వీరిలో 66 మందికి ఓటు హక్కు ఉంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందే ఈ కుటుంబంలో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ముంబైలో పనిచేస్తున్నారు. కొడుకులు, మనవలతో కళకళలాడే కుటుంబం గురించి యజమాని రామ్ నరేష్ మాట్లాడుతూ.. ‘ ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. అందరికీ కలిపి ఒకే వంటగది ఉంటుంది. మా భోజనం కోసం రోజుకు 15 కిలోల బియ్యం, 20 కిలోల కూరగాయలు వండుతారు. రొట్టెల కోసం 10 కిలోల పిండి అవసరమవుతుంది. ఇన్నేళ్లుగా ఏ ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా వేరుగా ఉండాలన్న ఆలోచన కాలేదు. మాలాగే జాతి మొత్తం ఒకే కుటుంబంలా ఉండాలని కోరుకుంటా. ఈసారి మా కుటుంబంలో ఎనిమిది మంది ఆదివారం కొత్తగా ఓటు వేయబోతున్నారు. వారెంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఒకే పోలింగ్ బూత్‌లో మాకు ఓటు వేసే అవకాశం కల్పించారు. అక్కడికి వెళ్లేందుకు మాకోసం ప్రత్యేకంగా బస్సు కూడా వస్తుంది. ప్రతీసారి కలిసికట్టుగా విధిగా ఓటు వేసే మమ్మల్ని పోలింగ్ అధికారులు సాదరంగా ఆహ్వానిస్తారు’ అని ఆనందం వ్యక్తం చేశాడు. హామీలకే పరిమితం.. గ్రామంలో అత్యధిక మంది ఓటర్లు ఉన్న కుటుంబంగా గుర్తింపు పొందిన రామ్ నరేష్ కుటుంబంపై స్థానిక నాయకులతో పాటు బడా నాయకులు కూడా ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఓట్ల పండుగ రాగానే వీరి ఇంటికి చేరుకుంటారు. అయితే తమకున్న సమస్యలు తీరుస్తామంటూ హామీ ఇస్తారే తప్ప ఎన్నికలు పూర్తవ్వగానే కనీసం తమవైపు కూడా చూడరంటూ ఈ కుటుంబానికి చెందిన శంకర్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘ ఎన్నికలు రాగానే అభ్యర్థులు మా ఇంటికి లైన్లు కడతారు. మట్టిగోడలతో కూడిన పాత ఇంటిని కూల్చి.. పక్కా ఇళ్లు కట్టుకోవాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నాం. అయితే మా ఇంటిపై హై టెన్షన్ వైర్లు ఇందుకు అడ్డుగా ఉన్నాయి. ఇంట్లో అమ్మాయిలకు కూడా ప్రత్యేక గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా నాయకులను, ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ వాళ్లను ఎన్నోసార్లు అడిగాం. ఎన్నికల సమయంలో హామీ ఇస్తారే గాని, ఆ తర్వాత మా గురించి పట్టించుకోరు. మా సమస్య తీర్చిన తర్వాతే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం. కానీ బాధ్యత గల పౌరులుగా ఓటు వేయకుండా ఉండలేకపోతున్నాం అంటూ అన్ని సౌకర్యాలు, అవకాశాలు ఉండికూడా ఓటు వేయడానికి బద్ధకించే ఎంతో మంది వ్యక్తులకు శంకర్ ఆదర్శంగా నిలిచాడు. -
శాస్త్రి గారి జోడెద్దులకే మీ ఓటు!
అలహాబాద్‌లో బిజీగా ఉండే ఖిలోనా మార్కెట్లోకి అడుగుపెడితే.. అక్కడ ఒక గోడపై ఎర్ర రంగుతో రాసిన ఎన్నికల ప్రచార నినాదం కనిపిస్తుంది.‘శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఓటెయ్యండి. ఎన్నికల గుర్తు జోడెద్దులు’ అనేది ఆ నినాద సారాంశం. ఎప్పటి లాల్ బహదూర్ శాస్త్రి?, ఎప్పటి జోడెద్దులు?, దాని గురించి ఇప్పుడు ప్రచారమేమిటని ఆశ్చర్యపోయారా?.. నిజమే ఆ ప్రకటన 60 ఏళ్ల కిందటిది. వెలిసిపోయినా ఇప్పటికీ అక్కడికి వెళ్లిన వాళ్లందరినీ ఆకట్టుకుంటోంది. ‘1957లో లాల్ బహదూర్ శాస్త్రి అలహాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు జోడెద్దులు. ఆ ఎన్నికల్లో శాస్త్రి గెలిచారు. ఎన్నికలైపోయినా ఈ గోడపై రాసిన నినాదాన్ని మాత్రం ఎవరూ చెరపలేదు. ఆరు దశాబ్దాలుగా అలాగే ఉంది. అయితే, ‘రంగు వెలిసిపోయింది’ అంటూ అసలు సంగతి చెప్పారు శాస్త్రి మనవడు ప్రభాకర శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి అలహాబాద్ నుంచి 1957, 1962లో వరుసగా గెలిచారు. ‘అప్పట్లో శాస్త్రి గారిలాంటి వాళ్ల కోసం పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇలా అక్కడక్కడ గోడలపై రాస్తే సరిపోయేది’ అన్నారు యూపీసీసీ ప్రతినిధి కిశోర్. -
అఖిలేశ్‌కు చేదు అనుభవం
లక్నో: అలహాబాద్ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను మంగళవారం పోలీసులు లక్నో విమానాశ్రయంలో అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సంగతి తెలుసుకున్న ఎస్పీ కార్యకర్తలు విమానాశ్రయం బయట, ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా నిరసనకు దిగారు. అఖిలేశ్ అలహాబాద్ వర్సిటీకి వెళ్తే శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుందనే లక్నో విమానాశ్రయంలో ఆపినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇచ్చారు. అఖిలేశ్ అలహాబాద్ రాకుండా అడ్డుకోవాలని వర్సిటీ యాజమాన్యమే కోరిందని, ఆ మేరకే పోలీసులు వ్యవహరించారని తెలిపారు. విమానాశ్రయంలో తనను అడ్డుకోవడంలో కేంద్రం పాత్ర కూడా ఉందని అఖిలేశ్ ఆరోపించారు. యోగి ప్రభుత్వానికి భయం పట్టుకుందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు. మరోవైపు, అఖిలేశ్‌కు మద్దతుగా నిలిచిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజా ఘటనను ఖండించారు. తమ నాయకుడిని విమానాశ్రయంలో అడ్డుకున్నారన్న సంగతి తెలియగానే ఎస్పీ కార్యకర్తలు అలహాబాద్, ఝాన్సీ, కనౌజ్, బలరాంపూర్, జలాన్, అజాంగఢ్, గోరఖ్‌పూర్ తదితర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. పలుచోట్ల వాహనాల అద్దాలు పగలగొట్టి, పోలీసులతో ఘర్షణలకు దిగారు. రాజ్యసభలోనూ: రఫేల్ ఒప్పందంపై విచారణకు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయా లన్న డిమాండ్‌పై లోక్‌సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేయగా అఖిలేశ్‌ను అలహాబాద్ వెళ్లకుండా యూపీ ప్రభుత్వం అడ్డుకోవడంపై రాజ్యసభలో ఆందోళనలు మిన్నంటాయి. -
కుంభమేళాతో రూ 1.2 లక్షల కోట్ల రాబడి
లక్నో : జనవరి 15న ప్రారంభమై మార్చి 4న ముగిసే మహా కుంభమేళా యూపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించనుంది. ఈ చారిత్రక అతిపెద్ద ఆథ్యాత్మిక మేళా ద్వారా యూపీ సర్కార్‌కు రూ 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రముఖ పరిశ్రమ సంస్థ సీఐఐ అంచనా వేసింది. పలు రంగాలకు చెందిన ఆరు లక్షల మందికి పైగా ఈ ఉత్సవాలతో ఉపాధి లభిస్తుందని పేర్కొంది. మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం రూ 4200 కోట్లు కేటాయించి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక సీఐఐ అంచనా ప్రకారం దేశ, విదేశీ టూరిస్టుల రాకతో ఆతిథ్య రంగంలో కొత్తగా 2,50,000 మందికి, టూర్ ఆపరేటర్లుగా 45,000 మంది ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్‌లో దాదాపు 1,50,000 మందికి ఉపాధి సమకూరుతుందని, మెడికల్, ఎకో టూరిజంలో 85,000 మందికి ఉపాధి లభిస్తుందని సీఐఐ అథ్యయనం అంచనా వేసింది. వీటితో పాటు టూర్ గైడ్స్, ట్యాక్సీ డ్రైవర్లు, వాలంటీర్లు వంటి అసంఘటిత ఉద్యోగాలు పెద్దసంఖ్యలో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కుంభమేళాకు ఆస్ర్టేలియా, బ్రిటన్, కెనడా, మలేషియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, మారిషస్, జింబాబ్వే, శ్రీలంక సహా పలు దేశాలకు చెందిన టూరిస్టులు తరలిరానున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కుంభమేళాను నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా మార్చి 4న మహాశివరాత్రి రోజున ముగిసే మహా కుంభమేళాకు దాదాపు 12 కోట్ల మంది హాజరై ప్రయాగరాజ్‌లో పవిత్ర నదీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు. -
కుంభమేళాలో కిన్నెర అఖాడా
ప్రయాగ్‌రాజ్: కుంభమేళా సందర్భంగా ట్రాన్స్జెండర్లతో కూడిన కిన్నెర అఖాడా సభ్యులు మంగళవారం పవిత్ర స్నానాలు ఆచరించి చరిత్ర సృష్టించారు. జునా అఖాడా సభ్యులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చిన కిన్నెర అఖాడా సభ్యులు త్రివేణీ సంగమంలో స్నానం చేశారు. ఈ సందర్భంగా ‘హరహర మహాదేవ్’ అంటూ నినాదాలు మిన్నంటాయి. కార్యక్రమానికి హాజరైన వారంతా కిన్నెర అఖాడా సభ్యులను ఆసక్తిగా తిలకించారు. కాగా, కుంభమేళాకు ట్రాన్స్జెండర్లను అనుమతించడం ఇదే ప్రథమం. సంప్రదాయ వాదుల నుంచి వారికి గట్టి ప్రతిఘటన కూడా ఎదురైందని అఖాడా వర్గాలు తెలిపాయి. ‘ప్రాచీన భారతంలో ట్రాన్స్జెండర్లకు ఎలాంటి గౌరవం దక్కిందో మన మత గ్రంథాలు చెబుతున్నాయి. అప్పట్లో మాదిరిగా సమాజం మమ్మల్ని అంగీకరించేందుకే ఈ ప్రయత్నం. రానున్న తరాల వారు మా మాదిరిగా వివక్షకు గురి కాకుండా చూసేందుకే ఇక్కడికి వచ్చాం’ అని కిన్నెర అఖాడా అధిపతి లక్ష్మి నారాయణ్ త్రిపాఠీ(40) తెలిపారు. ‘ట్రాన్స్జెండర్లు బిచ్చగాళ్లుగానే ఉండాలని మీ రెందుకు భావిస్తున్నారు? ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా సంస్థలు ఇష్టపడటం లేదు’ అని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమె పలు హిందీ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. మందిరం కోసం 33 వేల దీపాలు అయోధ్యలో రామాలయం నిర్మించాలంటూ కుంభమేళా సందర్భంగా సాధువులు రోజుకు 33వేల దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయం కోసం ఈ నెలలో 11 లక్షల దీపాలను వెలిగించనున్నట్లు వారు తెలిపారు. కాగా, కుంభ్‌నగరిలో టాయిలెట్లు పనిచేయకపోవడంతో కుంభమేళా ప్రారంభమైన మొదటి రోజు తరలివచ్చిన సుమారు కోట్ల మందిలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. -
ప్రారంభమైన కుంభమేళా..
అలహాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా ప్రారంభమైంది. ప్రయగ్‌రాజ్‌లో మంగళవారం ఉదయం 5.15 గంటలకు రాజయోగ స్నానాలతో కుంభమేళా ఉత్సవం మొదలైంది. అర్ధ కుంభమేళాకు 15 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభామేళా పూర్తయ్యేసరికి 4,300 కోట్ల రూపాయల వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఈ సారి భక్తులకు అక్షయ్ వాత్, సరస్వతి కుప్ల వద్ద పూజల చేసుకునే అవకాశం కల్పించారు. కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యూపీ ప్రభుత్వం 100 హెక్టార్లలో గుడారాలు ఏర్పాటు చేసింది. మకర సంక్రాంతి సందర్భంగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభమయిన ఈ మహా జనయజ్ఞం మార్చి 4వ తేదీ వరకు అంటే మహాశివరాత్రి దాకా కొనసాగనుంది. 12 ఏళ్లలో రెండు పర్యాయాలు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అర్థ కుంభ్‌గా పిలుస్తుంటారు. కానీ, యూపీ ప్రభుత్వం ఇటీవల ఆ పేరును కుంభ్‌గా మార్చింది. ఈ కార్యక్రమంలో అందరినీ ఆకర్షించే అఖాడాలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు. తాత్కాలిక మహానగరి సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు 50 రోజులపాటు సాగే ఈ క్రతువులో 12 కోట్ల మంది వరకు పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లు చేపట్టాయి. గంగా–యమున నదీ తీరాన 32 వేల హెక్టార్లలో ఏర్పాటు చేసిన కుంభ్‌నగరి ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా రికార్డు కెక్కింది. ఇందులో 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 20 వంతెనలు, ఇంకా ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు..ఇలా ఒక నగరంలో ఉండే అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. కుంభ్ నగరిలోకి అత్యవసర సేవలందించే వాటిని తప్ప మిగతా అన్ని రకాల వాహనాలను నిషేధించారు. ఇక్కడ 15 రాష్ట్ర ప్రభుత్వాలు 261 కార్యక్రమాలను చేపట్టాయి. యూపీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు 28, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆరు విభాగాలు ఈ కుంభమేళా నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి. 2013లో జరిగిన పూర్ణ కుంభమేళా కంటే దాదాపు మూడు రెట్లు నిధులు అంటే రూ.4,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అప్పటి కంటే ఇప్పుడు ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కానీ, చాలా లోపాలున్నాయి. మా టెంట్లో లైట్లు బిగించటానికి రూ.200 లంచం ఇవ్వాల్సి వచ్చిందని జునా అఖాడాకు చెందిన ఓ సాధువు తెలిపారు.లౌడ్ స్పీకర్లలో వినిపించే ఆధ్యాత్మిక గీతాలు.. దిగంబర దేహ మంతటా విబూధి రేఖలు, గంజాయి నింపిన చిలుంలను పీలుస్తూ నాగా సాధువులు చేసే ఆనంద నృత్యాలు.. వీటన్నిటినీ ఆసక్తిగా తిలకిస్తూ ఫొటోలు తీసుకునే విదేశీ యాత్రికులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. దీంతోపాటు ఇక్కడ మత రాజకీయాల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. మేళా సందర్భంగా అయోధ్యలో రామాలయంపై వివిధ హిందుత్వ సంస్థలు ‘ఇప్పుడు నీవు రామ మందిరం నిర్మించ లేకుంటే ముందు తరాల వారికి ఎలా మొహం చూపిస్తావు’ అంటూ హోర్డింగులు ఏర్పాటు చేశాయి. 13 అఖాడాలు 8వ శతాబ్దానికి చెందిన హిందూ గురువు ఆదిశంకరాచార్య సనాతన ధర్మాన్ని రక్షించే లక్ష్యంగా సాధువులకు చెందిన వివిధ సంస్థలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అఖాడాలను నెలకొల్పారు. ఒక్కో అఖాడా ఒక్కో సిద్ధాంతం, ఆచార సంప్రదాయాలను పాటిస్తాయి. ఆరాధన విధానాన్ని బట్టి శైవ, వైష్ణవ, ఉదాసీన్ అనే మూడు ముఖ్యమైన అఖాడాలున్నాయని అఖిల భారతీయ అఖాడా పరిషత్(ఏబీఏపీ) అధ్యక్షుడు నరేంద్ర గిరి తెలిపారు. మొత్తం 13 అఖాడాల్లో ఏడు శైవ, మూడు వైష్ణవ, 2 ఉదాసీన, ఒక సిక్కు అఖాడాలున్నాయని తెలిపారు. అఖాడా అంటే అఖండం, విడదీయరానిదని అర్థం అని ఆయన వివరించారు. జునా అఖాడా అతి ప్రాచీనమైంది, అన్నిటి కంటే పెద్దదిగా చెబుతుంటారు. జన వాక్కు ‘సౌకర్యం, అసౌకర్యాల గురించి ఆలోచించొద్దు. ఆ గంగామాతను స్మరించుకోండి. మీ కష్టం, అలసట అంతా దూరమవుతుంది..’ అన్నారు కనౌజ్ నుంచి కుంభ్నగరికి చేరుకున్న ప్రమోద్ ప్రకాశ్(55) అక్కడున్న మిగతా వారిని చూపిస్తూ. ఈయన బరువైన మూడు బ్యాగులను మోసుకుంటూ స్థానిక రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చారు. ‘స్వచ్ఛమైన భక్తిభావం ఇక్కడి వారిలో చూస్తున్నాం. కుంభమేళా నిర్వహణ కూడా చాలా బాగుంది. మేం మాటల్లో చెప్పలేం. ఈ అద్భుతాన్ని ఎవరైనా చూసి నమ్మాల్సిందే. ఇంతపెద్ద కార్యక్రమం, అసంఖ్యాక జనం, కొంత గందరగోళం అనిపించినా, ప్రతి ఒక్కటీ సజావుగా సాగిపోతోంది. వీటన్నిటి వెనుకా ఏదో అతీతశక్తి ఉంది’ అన్నారు ఇటలీ నుంచి వచ్చిన అలాసియో దంపతులు. పిల్లలు తప్పిపోకుండా ట్యాగ్లు కుంభమేళా సందర్భంగా తప్పి పోయిన పిల్లలను గుర్తించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్ఎఫ్)ట్యాగ్‌లను అందజేస్తున్నారు. వొడాఫోన్ కంపెనీ సహకారంతో 40వేల ట్యాగ్‌లను సమకూర్చుకున్నట్లు డీఐజీ వివరించారు. అత్యంత పవిత్రమైన 6 త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు పవిత్రమైనవి ఆరు రోజులు. అవి మకర సంక్రాంతి పర్వదినం కాగా, పౌష్ పూర్ణిమ(జనవరి 21), మౌని అమావాస్య(ఫిబ్రవరి 4), వసంత పంచమి(ఫిబ్రవరి 10), మాఘి పూర్ణిమ (ఫిబ్రవరి 19), ఆఖరిది మార్చి 4వ తేదీ మహాశివరాత్రి. కాగా, వీటిలో మొదటి, ఆఖరి రోజులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో వేకువజామున 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు స్నానం చేయడం శుభప్రదంగా చెబు తారు. భద్రత నీడలో కుంభమేళా సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు డీజీపీ అభినయ్ పాండే తెలిపారు. మేళాలో బందోబస్తు కోసం 20వేల పోలీసులు, 6 వేల హోంగార్డులు, 40 పోలీస్ స్టేషన్లు, 40 ఫైర్ స్టేషన్లు, 80 కంపెనీల కేంద్ర బలగాలు, ఇతర బలగాలను మోహరించినట్లు చెప్పారు. 30 మహిళా పోలీస్స్టేషన్లు, సంఘటన జరిగిన 10 నిమిషాల్లోనే చేరుకునేలా 317 పోలీస్ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. డ్రోన్ కెమెరాలు, వాచ్ టవర్లు, బ్యాగేజీ స్కానర్లు, ఆధునిక సమాచార వ్యవస్థను నెలకొల్పామన్నారు. ‘1, 200 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర కమాండ్–కంట్రోల్ రూం నెలకొల్పాం. భారీగా జనం గుమికూడినా, తొక్కిసలాటలు జరిగే అవకాశమున్నా వెంటనే గుర్తించేందుకు వీడియో అనలిటిక్స్‌ను వినియోగిస్తున్నాం. ఉగ్రవాదులు, అనుమానితులను గుర్తించేందుకు త్రినేత్ర యాప్‌ను వాడుకలోకి తెచ్చాం’ అని అన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సభ్యులు -
కుంభమేళా కోసం ప్రత్యేక మొబైల్ యాప్
లక్నో: అలహాబాద్‌లో జనవరి 15 నుంచి జరగనున్న కుంభమేళా కోసం నార్త్ సెంట్రల్ రైల్వే(ఎన్సీఆర్) ప్రత్యేకంగా ’రైల్ కుంభ సేవా మొబైల్ యాప్’ ను ఆవిష్కరించింది. కుంభ మేళాలో పాల్గొనేందుకు అలహాబాద్‌ను సంద ర్శించే భక్తులు, పర్యాటకులు, ఇతర ప్రయా ణికులకు అవసరమైన సమాచారాన్ని అందించ డానికి ఈ యాప్‌ను రూపొందిం చినట్టు ఎన్సీఆర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అమిత్ మాల్వియ తెలిపారు. ఈ యాప్ కుంభమేళా ప్రత్యేక రైళ్లకు సంబంధించిన సమాచారం, రిజర్వ్ సీట్లు, రిజర్వు కాని సీట్ల వివరాలను తెలియజేస్తుందని ఆయన చెప్పారు. ఏ సమ యంలోనైనా, ఎక్కడినుంచైనా కుంభమేళా కు సంబంధించిన సమాచారం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. భక్తులు తమ ప్రస్తుత స్థానంతో పాటు, అలహాబాద్‌లోని అన్ని రైల్వేస్టేషన్లు, మేళా ప్రాంతం, ప్రధాన హోట ళ్ళు, బస్స్టేషన్లు, ఇతర సౌకర్యాలకు సంబం ధించిన సమాచారం కూడా ఈ యాప్ ద్వారా పొందొచ్చని చెప్పారు. పార్కింగ్, అల్పాహార గదులు, వేచి ఉండు గదుల సమాచారం కూడా ఈ యాప్ అందిస్తుందన్నారు. -
ఏడాదిలో 25 ప్రాంతాల పేర్లు మార్పు
న్యూఢిల్లీ: ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాలు, గ్రామాల పేర్లను మార్చేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ పేర్ల మార్పు ప్రతిపాదనల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. అయితే, పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’ గా మార్చాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇటీవల అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా పేరు మారుస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంలో ఆంధ్రపదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిని రాజమహేంద్రవరంగా, ఒడిశాలోని భద్రక్ జిల్లా ఔటర్ వీలర్‌ను ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్‌గా, కేరళలోని మలప్పుర జిల్లా అరిక్కోడ్‌ను అరీకోడ్‌గా, హరియాణాలోని జింద్ జిల్లా పిండారిని పందు–పిండారగా, నాగాలాండ్‌లోని కిఫిరె జిల్లా సాంఫూర్‌ని సాన్‌ఫూరెగా పేర్లు మార్చారు. ఈ ప్రతిపాదనలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం హోంశాఖ అమలు చేస్తుంది. కాగా, అహ్మదాబాద్‌ను కర్ణావతిగా పేరు మార్చాలన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు. ఫైజాబాద్‌పై మిశ్రమ స్పందన ఫైజాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయంపై స్థానికుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అవసరం లేకుండానే కేవలం రాజకీయ కారణాలతో పేరును మారుస్తున్నారని, దీని వల్ల చారిత్రక నగరానికి ఉన్న గుర్తింపు తెరమరుగవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ..అది అయోధ్య కీర్తిప్రతిష్టల్ని మరింత ఇనుమడింపజేస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. -
ఆ నగరం పేరు మార్చండి
లక్నో: అలహాబాద్‌కు కొత్త గుర్తింపు కోసం యూపీ సర్కార్ తహతహలాడుతోంది. అలహాబాద్ నగరం పేరును ప్రయాగ్‌గా మార్చాలని కోరుతూ యూపీ మంత్రి సిద్ధార్ధ్ నాథ్ సింగ్ గవర్నర్ రామ్ నాయక్‌కు లేఖ రాశారు. గతంలో మహారాష్ట్ర గవర్నర్‌గా రామ్ నాయక్ బొంబాయి పేరును ముంబైగా మార్చారని, ఇప్పుడు అదే తరహాలో అలహాబాద్ పేరును ప్రయాగ్‌గా మార్చేందుకు చొరవ చూపి తమకు సాయపడాలని లేఖ తాను కోరానని సింగ్ చెప్పారు. కాగా ఇప్పటికే అలహాబాద్ పేరును ప్రయాగ్ లేదా ప్రయాగ్‌రాజ్‌గా మార్చేందుకు యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో యూపీ మం త్రి గవర్నర్‌కు లేఖ రాయడం గమనార్హం. అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని ఈ ఏడాది మేలో కొందరు హిందూ సన్యాసులు అఖిల భారత అఖారా పరిషద్ ఆధ్వర్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రతిపాదనకు సీఎం యోగి ఆదిత్యానాథ్ సైతం ఆమోదం తెలిపారు. దీనిపై తమ ప్రభుత్వం ఓ ప్రతిపాదనను కేంద్రం ఆమోదం కోసం పంపుతుందని ఈ సందర్భంగా వారికి సీఎం హామీ ఇచ్చారు.1580లో మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రయాగ పేరును అలహాబాద్‌గా మార్చినట్టు చరిత్రకారులు చెబుతారు. -
గంగానదిపై భారీ వంతెనకు క్లియరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ : అలహాబాద్‌లో గంగా నదిపై రూ 1948 కోట్లతో పది కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలహాబాద్‌లోని ఫపమూ వద్ద రూ 1948 కోట్లతో ఆరు లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి సీసీఈఏ ఆమోదం తెలిపిందని రహదారులు, హైవేల మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిసెంబర్ 2021 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో ప్రస్తుత రెండు వరుసల వంతెనపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయని ఓ ప్రకటనలో తెలిపింది. అలహాబాద్‌లో జరిగే కుంభమేళా, అర్థ కుంభ్ ఇతర కార్యక్రమాల్లో ట్రాఫిక్ రద్దీని సైతం ఈ ప్రాజెక్టుతో అధిగమించవచ్చని పేర్కొంది. మధ్యప్రదేశ్ నుంచి లక్నో, ఫైజాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు కూడా ఈ బ్రిడ్జి ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కార్మికులకు దాదాపు 9.2 లక్షల పనిదినాలు కల్పించవచ్చని పేర్కొంది. అలహాబాద్ నుంచి ఫరక్కా వరకూ గంగానదిపై 2014 వరకూ కేవలం 13 వంతెనలే ఉండగా, ఇప్పుడు అదనంగా 20 వంతెనల నిర్మాణం చేపట్టామని, వీటిలో 5 వంతెనలను ఇప్పటికే ప్రారంభించగా ఏడు వంతెనలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపింది. -
అలహాబాద్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
-
పాదగయకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
పిఠాపురం: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి నారాయణ శుక్లా కుటుంబ సభ్యులతో కలసి గురువారం పాదగయ క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ మర్యాదలతో ఆయనకు వేదపండితులు స్వాగతం పలికారు. పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేసిన శుక్లా అనంతరం శ్రీ కుక్కుటేశ్వరస్వామిని, పురుహూతికా అమ్మవారిని, రాజ రాజేశ్వరీదేవిని, దత్తాత్రేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రసాదాలను ఆయనకు ఈఓ చందక దొరబాబు అందజేశారు. సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద పండితులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శించుకుని వేదపండితులు ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట ఆలయ సూపరింటెండెంట్ డీవీఎస్ కృష్ణారావు, న్యాయశాఖ అధికారులు ఉన్నారు.