విమానం ఎక్కకుండా అఖిలేష్‌ను అధికారులు అడ్డుకుంటున్న దృశ్యం
లక్నో: అలహాబాద్ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను మంగళవారం పోలీసులు లక్నో విమానాశ్రయంలో అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సంగతి తెలుసుకున్న ఎస్పీ కార్యకర్తలు విమానాశ్రయం బయట, ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా నిరసనకు దిగారు. అఖిలేశ్ అలహాబాద్ వర్సిటీకి వెళ్తే శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతుందనే లక్నో విమానాశ్రయంలో ఆపినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇచ్చారు. అఖిలేశ్ అలహాబాద్ రాకుండా అడ్డుకోవాలని వర్సిటీ యాజమాన్యమే కోరిందని, ఆ మేరకే పోలీసులు వ్యవహరించారని తెలిపారు. విమానాశ్రయంలో తనను అడ్డుకోవడంలో కేంద్రం పాత్ర కూడా ఉందని అఖిలేశ్ ఆరోపించారు.
యోగి ప్రభుత్వానికి భయం పట్టుకుందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు. మరోవైపు, అఖిలేశ్‌కు మద్దతుగా నిలిచిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజా ఘటనను ఖండించారు. తమ నాయకుడిని విమానాశ్రయంలో అడ్డుకున్నారన్న సంగతి తెలియగానే ఎస్పీ కార్యకర్తలు అలహాబాద్, ఝాన్సీ, కనౌజ్, బలరాంపూర్, జలాన్, అజాంగఢ్, గోరఖ్‌పూర్ తదితర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. పలుచోట్ల వాహనాల అద్దాలు పగలగొట్టి, పోలీసులతో ఘర్షణలకు దిగారు. రాజ్యసభలోనూ: రఫేల్ ఒప్పందంపై విచారణకు పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయా లన్న డిమాండ్‌పై లోక్‌సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేయగా అఖిలేశ్‌ను అలహాబాద్ వెళ్లకుండా యూపీ ప్రభుత్వం అడ్డుకోవడంపై రాజ్యసభలో ఆందోళనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment