అలహాబాద్ : లాక్‌డౌన్ వేళ సొంతూరుకు వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లను దాటుకుంటూ వారు అడిగే ప్రశ్నలను తప్పించుకొని ఎలాగోలా చేరుకుంటున్నాము. కానీ ప్రేమ్ మూర్తి పాండే అనే వ్యక్తి ఎలాగైనా సొంతూరుకు చేరుకోవాలనే తపనతో కాస్త భిన్నంగా ఆలోచించాడు. అందుకోసం ఏకంగా ఒక ట్రక్కును కొని దానిలో 25 టన్నుల ఉల్లిగడ్డల లోడ్‌ను నింపి మరీ ముంబై నుంచి సొంతూరుకు చేరుకున్నాడు. వివరాలు.. అలహాబాద్‌కు చెందిన ప్రేమ్ మూర్తి పాండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పని చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఎయిర్‌పోర్ట్ మూతపడడంతో ప్రేమ్ ఇంటికి వెళ్లాలనుకున్నాడు . ('నాతో చేయి కలపండి.. వారికి సాయం చేద్దాం')
అయితే ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తారని ప్రేమ్ అనుకున్నాడు. కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా ఉండడంతో ఎవరిని వేరే రాష్ట్రాలకు అనుమతించడం లేదు. ఒక్క నిత్యావసరాలకు మాత్రమే మినహాయింపు ఉందని తెలుసుకున్న ప్రేమ్ తాను కూడా కూరగాయల వ్యాపారం పేరుతో అక్కడినుంచి వెళ్లిపోవాలని భావించాడు. అందుకోసం మొదట రూ. 10వేలకు 1300 కిలోల వాటర్‌మిలన్ కాయలు కొన్నాడు. ఏప్రిల్ 17న మినీ ట్రక్కులో వాటిని లోడ్ చేసుకొని నాసిక్ వరకు వచ్చాడు. అక్కడ లోడ్‌ను అమ్మేసి ట్రక్కును తిరిగి ముంబైకి పంపించేశాడు. ఆ వచ్చిన డబ్బులతో పాటు తన దగ్గర ఉన్న డబ్బుతో మొదట రూ. 77500కు ట్రక్‌ను మళ్లీ అద్దెకు తీసుకొని , తర్వాత రూ. 2.32 లక్షల విలువైన 25 టన్నుల ఉల్లిగడ్డను ట్రక్‌లోకి ఎక్కించుకొని ఏప్రిల్ 20వ తేదీన బయలుదేరాడు. మొత్తం 1200 కిలోమీటర్లు ప్రయాణించి ఏప్రిల్ 23న అలహాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఉల్లిగడ్డ లోడ్ తీసుకొని అలహాబాద్‌లోని ముందేరా హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చాడు. అయితే ఉల్లిగడ్డను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో తన సొంతూరైన కొత్వా ముర్బక్‌పూర్‌కు ట్రక్కును తీసుకెళ్లిపోయాడు.
అయితే ఇంటికి చేరుకున్న పాండే శుక్రవారం దూమ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అసలు విషయం వివరించాడు. వెంటనే పోలీసు సిబ్బంది అతన్ని మెడికల్ పరీక్షలకు పంపగా రిపోర్టులో కరోనా నెగిటివ్ అని వచ్చింది. అయితే ముందు జాగ్రత్తగా అతన్ని హోం క్వారంటైన్‌కే పరిమితం కావాలని ఆదేశించారు. అంత డబ్బు ఖర్చు చేసి ఇంటికి చేరుకున్నావు బాగానే ఉంది ... మరి ఉల్లిగడ్డలన్ని ఏం చేస్తావు అని ప్రేమ్‌ను ప్రశ్నించగా.. నేను ముంబై నుంచి ఇంటికి చేరుకోవడం గురించే ఆలోచించాను. అందుకోసం ఎంత డబ్బు ఖర్చు చేసైనా సరే వెళ్లాననుకున్నాను. ఇక నా ఉల్లిగడ్డలకు వచ్చిన కష్టం ఏం లేదు. ప్రస్తుతం ఉల్లిగడ్డకు కొరత లేకపోవడంతో దళారులు ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. అయితే ఏదో ఒకరోజు మంచి ధరకు అమ్ముడుపోతాయి.. ఆ విషయంలో నాకు దిగులు లేదు' అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment