Onion sales
-
ఉల్లి విక్రయాలకు తొలగిన అడ్డంకి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి క్రయవిక్రయాల్లో గత నెల 17 నుంచి నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. యార్డులో నెలకొన్న సమస్యలు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చొరవతో పరిష్కారమయ్యాయి. మార్కెట్‌కు ఉల్లిగడ్డలు తెప్పించేందుకు, ఈ–నామ్ అమలుకు కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు అంగీకరించారు. దీంతో ఈ నెల 11 నుంచి కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి సహా అన్ని రకాల పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయి. కొత్తగా మినుములు, కొర్రలను కూడా కొనుగోలు చేసే సదుపాయాన్ని మార్కెట్ కమిటీ కల్పించింది. శనివారం ఉదయం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో సమావేశమయ్యారు. ఉల్లి క్రయవిక్రయాల్లో మరింత పారదర్శకతను పెంపొందించేందుకు, వ్యాపారుల మధ్య పోటీ ఉండటం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ఉల్లికి కూడా ఈ–నామ్ అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు విధిగా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సహకరించకపోతే కొత్త కమీషన్ ఏజెంట్లు, కొత్త వ్యాపారులను రంగంలోకి దింపి ఉల్లి సహా అన్ని పంటలను ఈ–నామ్లో కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో దిగివచ్చిన కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఈ నెల 11 నుంచి తాము కూడా ఈ–నామ్లో కొంటామని సంసిద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి, కమీషన్ ఏజెంట్ల సంఘం నేతలు కట్టా శేఖర్, శ్రీనివాసరెడ్డి, జూటూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వావ్! వాట్ యాన్ ఐడియా 'ప్రేమ్‌జీ'
అలహాబాద్ : లాక్డౌన్ వేళ సొంతూరుకు వెళ్లాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లను దాటుకుంటూ వారు అడిగే ప్రశ్నలను తప్పించుకొని ఎలాగోలా చేరుకుంటున్నాము. కానీ ప్రేమ్ మూర్తి పాండే అనే వ్యక్తి ఎలాగైనా సొంతూరుకు చేరుకోవాలనే తపనతో కాస్త భిన్నంగా ఆలోచించాడు. అందుకోసం ఏకంగా ఒక ట్రక్కును కొని దానిలో 25 టన్నుల ఉల్లిగడ్డల లోడ్‌ను నింపి మరీ ముంబై నుంచి సొంతూరుకు చేరుకున్నాడు. వివరాలు.. అలహాబాద్‌కు చెందిన ప్రేమ్ మూర్తి పాండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పని చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఎయిర్పోర్ట్ మూతపడడంతో ప్రేమ్ ఇంటికి వెళ్లాలనుకున్నాడు . ('నాతో చేయి కలపండి.. వారికి సాయం చేద్దాం') అయితే ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తారని ప్రేమ్ అనుకున్నాడు. కేంద్రం మే 3 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా ఉండడంతో ఎవరిని వేరే రాష్ట్రాలకు అనుమతించడం లేదు. ఒక్క నిత్యావసరాలకు మాత్రమే మినహాయింపు ఉందని తెలుసుకున్న ప్రేమ్ తాను కూడా కూరగాయల వ్యాపారం పేరుతో అక్కడినుంచి వెళ్లిపోవాలని భావించాడు. అందుకోసం మొదట రూ. 10వేలకు 1300 కిలోల వాటర్‌మిలన్ కాయలు కొన్నాడు. ఏప్రిల్ 17న మినీ ట్రక్కులో వాటిని లోడ్ చేసుకొని నాసిక్ వరకు వచ్చాడు. అక్కడ లోడ్‌ను అమ్మేసి ట్రక్కును తిరిగి ముంబైకి పంపించేశాడు. ఆ వచ్చిన డబ్బులతో పాటు తన దగ్గర ఉన్న డబ్బుతో మొదట రూ. 77500కు ట్రక్‌ను మళ్లీ అద్దెకు తీసుకొని , తర్వాత రూ. 2.32 లక్షల విలువైన 25 టన్నుల ఉల్లిగడ్డను ట్రక్‌లోకి ఎక్కించుకొని ఏప్రిల్ 20వ తేదీన బయలుదేరాడు. మొత్తం 1200 కిలోమీటర్లు ప్రయాణించి ఏప్రిల్ 23న అలహాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఉల్లిగడ్డ లోడ్ తీసుకొని అలహాబాద్‌లోని ముందేరా హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చాడు. అయితే ఉల్లిగడ్డను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో తన సొంతూరైన కొత్వా ముర్బక్పూర్కు ట్రక్కును తీసుకెళ్లిపోయాడు. అయితే ఇంటికి చేరుకున్న పాండే శుక్రవారం దూమ్గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అసలు విషయం వివరించాడు. వెంటనే పోలీసు సిబ్బంది అతన్ని మెడికల్ పరీక్షలకు పంపగా రిపోర్టులో కరోనా నెగిటివ్ అని వచ్చింది. అయితే ముందు జాగ్రత్తగా అతన్ని హోం క్వారంటైన్కే పరిమితం కావాలని ఆదేశించారు. అంత డబ్బు ఖర్చు చేసి ఇంటికి చేరుకున్నావు బాగానే ఉంది ... మరి ఉల్లిగడ్డలన్ని ఏం చేస్తావు అని ప్రేమ్‌ను ప్రశ్నించగా.. నేను ముంబై నుంచి ఇంటికి చేరుకోవడం గురించే ఆలోచించాను. అందుకోసం ఎంత డబ్బు ఖర్చు చేసైనా సరే వెళ్లాననుకున్నాను. ఇక నా ఉల్లిగడ్డలకు వచ్చిన కష్టం ఏం లేదు. ప్రస్తుతం ఉల్లిగడ్డకు కొరత లేకపోవడంతో దళారులు ఎవరు కొనడానికి ముందుకు రాలేదు. అయితే ఏదో ఒకరోజు మంచి ధరకు అమ్ముడుపోతాయి.. ఆ విషయంలో నాకు దిగులు లేదు' అంటూ చెప్పుకొచ్చాడు. -
వేస్తున్నారు.. ఉల్లికి కళ్లెం
మహారాణిపేట(విశాఖ దక్షిణ), సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఉల్లిపాయల డిమాండ్ తగ్గే వరకు అన్ని రైతు బజార్లుకు ఇస్తున్న వారంతపు సెలవులను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. గిరాకీ తగ్గి సాధారణ పరిస్దితులు నెలకొనే వరకు జిల్లాలోని 13 రైతుబజార్లు ప్రతిరోజూ పని చేస్తాయి. సబ్సిడీ ఉల్లి విక్రయాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఒక వ్యక్తే పలుమార్లు లైన్లలో నిల్చొని ఎక్కువ పరిమాణంలో ఉల్లి కొనుగోలు చేస్తుండటంతో మరికొంతమందికి ఉల్లి అందకుండా పోతోంది. దీన్ని నిరోధించేందుకు గుర్తింపు కార్డు ఉన్నవారికే ఉల్లి విక్రయించే పద్ధతి చేపట్టాలన్న ఆలోచన అధికారవర్గాల్లో ఉంది. గోపాలపట్నం రైతుబజార్లో రేషన్ కార్డు, ఇతర గుర్తింపు కార్డు జెరాక్స్ కాపీ తీసుకొని సబ్సిడీ విక్రయాలను ప్రయోగాత్మకంగా సోమవారం ప్రవేశపెట్టినట్లు జాయింట్ కలెక్టర్ టి.శివశంకర్ చెప్పారు. ఇది విజయవంతమైతే అన్ని రైతుబజార్లకు వర్తింపజేస్తామన్నారు. 23 రోజులు.. 410 టన్నులు.. జిల్లాలో గత నెల 16 నుంచి ఇప్పటి వరకు 410 టన్నుల ఉల్లిపాయలు సబ్సిడీ ధరపై విక్రయించారు. సోమవారం ఒక్క రోజే 42165 కిలోల ఉల్లిపాయలు విక్రయించారు. ఇంతవరకు మహరాష్ట్రలోని షోలాపూర్, మన రాష్ట్రంలోని కర్నూలు నుంచి తెప్పిస్తున్న అధికారులు.. డిమాండ్‌ను తట్టుకునేందుకు కె.పి.రకం ఉల్లిని కూడా తెప్పిస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉండటంతో కిలో రూ.50 రేటుకు రైతుబజార్లలో విక్రయిస్తున్నారు. దీనితోపాటు రూ.25 రకం ఉల్లి విక్రయాలు కూడా కొనసాగుతున్నాయి. నేడూ సీతమ్మధారలో అమ్మకాలు.. ఉల్లి డిమాండ్ తగ్గేవరకు వారాంతపు సెలవులు రద్ద చేయడంతో సీతమ్మధార రైతు బజారు మంగళవారం కూడా పని చేయనుంది. సోమవారం ఈ బజారులో 2925 కిలోల కర్నూలు ఉల్లి రూ.25 రేటుకు అమ్మారు. మధ్యాహ్నం రూ.50 రేటుతో కె.పి.రకం ఉల్లి అందుబాటులోకి తెచ్చారు. రకాల్లో తేడా తెలియక పలువురు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నా పోలీసులు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. మరోవైపు మంగళవారం సీతమ్మధార రైతుబజారులో షోలాపూర్ ఉల్లి 3150 కిలోలు మంగళవారం విక్రయించనున్నారు. ఉదయం 6.30 నుంచే విక్రయాలు ప్రారంభమవుతాయని రైతుబాజరు ఈవో వరహాలు తెలిపారు. జనం రద్దీని తట్టుకొని విక్రయాలు సాఫీగా జరిగేందుకు వీలుగా రైతుబజార్లలోని ఉల్లి కౌంటర్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వినియోగదారుడికి కిలో ఉల్లి అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. -
రండమ్మా.. రండి! కిలో రూ.ఐదే
- నడిబజారులో ఉల్లి విక్రయాలు -పెట్టుబడి రాలేదంటూ కర్నూలు జిల్లా రైతు ఆవేదన అనంతపురం అగ్రికల్చర్ : ధర లేక ఉల్లి రైతులు రోడ్డు పడ్డారు. పంట సాగుకు రూ.లక్షలు ఖర్చు చేసిన రైతులకు ఇపుడు పెట్టుబడులు కూడా అందడం లేదు. ధరలు పతనం కావడంతో పాటు పెద్ద నోట్ల రద్దుతో మరింత ఇబ్బందుల్లో పడ్డారు. మార్కెట్లో కిలో ఉల్లి రూ.5 కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు ఎకరాల్లో ఉల్లి సాగుకు రూ.లక్షకు పైగా ఖర్చు పెట్టగా ఇపుడు రూ.40 వేలు కూడా రావడం కష్టమంటున్నారు రైతు మద్దిలేటి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం, కల్లూరు మండలం, బొల్లవరం గ్రామానికి చెందిన రైతు మద్దిలేటి పండించిన ఉల్లిని అమ్ముడుపోవడం కష్టం కావడంతో స్వంతూరు నుంచి అనంతపురం నగరానికి తీసుకువచ్చి అమ్ముకుంటున్నాడు. స్థానిక ఓవర్‌బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కన ఉల్లి బస్తాలు వేసుకుని 'రండమ్మా... రండి' అంటూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, సాంస్కృతిక విభాగం నాయకుడు రిలాక్స్‌నాగరాజు తదితరులు రైతును పలకరించి ఆయన బాధలు, నష్టాలు ఆలకించారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని వారు విమర్శించారు. -
‘నల్ల’ ఉల్లిపై ఉక్కుపాదం
-
‘నల్ల’ ఉల్లిపై ఉక్కుపాదం
అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం ఉల్లిపై మంత్రి రాంవిలాస్ ఉన్నతస్థాయి సమీక్ష * జీఎస్టీ ఆమోదం పొంది ఉంటే ధరను నియంత్రించేవాళ్లమని వెల్లడి * ధరలు మరింత పెరిగే అవకాశం.. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు సాక్షి, న్యూఢిల్లీ/ముంబై: నల్ల బజారులో ఉల్లి అమ్మకాలపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. అక్రమంగా నిల్వచేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఉల్లిని కోయకుండానే జనం కన్నీరు పెడుతున్న నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సోమవారం ఢిల్లీలో అత్యవసరంగా వినియోగదారుల వ్యవహారాలు, వ్యవసాయ విభాగంఅధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఉల్లి నిల్వలు, ధర, ఎగుమతులు, దిగుమతులపై సమీక్షించారు. ఉల్లిధరను నియంత్రించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిఘా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమ నిల్వలు, బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడుతున్నవారిపై నిత్యావసర వస్తువుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని పాశ్వాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ప్రధానంగా ఆసియాలో అతి పెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్గావ్లో అక్రమ నిల్వలకు పాల్పడుతున్న వ్యాపారులను కఠినంగా నియంత్రించాలని మహారాష్ట్ర సర్కారును కేంద్రం ఆదేశించింది. ఒకవేళ వస్తుసేవల పన్ను చట్టం(జీఎస్టీ) బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది ఉంటే.. ఉల్లి ధరల నియంత్రణ తేలికయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరను అదుపు చేయటంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని పాశ్వాన్ ఆరోపించారు. కావలసినంత నిల్వలు ఉన్నప్పటికీ ఆప్ సర్కారు బ్లాక్ మార్కెట్ వ్యాపారులను అదుపుచేయటానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దేశంలో ఉల్లి దిగుబడి కేవలం 5లక్షల టన్నులు మాత్రమే తగ్గిందని, అయితే ఈ పరిస్థితిని అదనుగా చూసుకుని వ్యాపారులు కొరత సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉల్లి ధర పెరుగుదల తాత్కాలికంగా వచ్చే న్యుమోనియా జ్వరం వంటిదేనన్నారు. 10 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవలసిందిగా ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటీసీని ఆదేశించామని మంత్రి వివరించారు. ధరలు పైపైకి..: దేశంలో ఉల్లి సృష్టిస్తున్న ప్రళయం ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. పది రోజులుగా అన్ని రాష్ట్రాల్లో ప్రజల్ని కంటతడిపెట్టిస్తున్న ఉల్లి రోజు రోజుకూ మరింత అందనంత ఎత్తుకు వెళ్లిపోతోంది. హోల్‌సేల్ వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత.. దాని వల్ల మార్కెట్‌కు సరఫరా లేక.. అవసరాలు తీర్చలేని దిగుమతులు ఉల్లి ధరను కొండెక్కేలా చేశాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.80కి చేరుకున్న కిలో ఉల్లి ధర.. మరో పది శాతం పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశంలో అతి పెద్ద మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లోనే ఉల్లి ధర కిలో రూ. 60కి చేరింది. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లిని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నా అవసరాలకు సరిపోవటం లేదని ముంబై వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సహకార సంస్థ డెరైక్టర్ అశోక్ వలుంజ్ తెలిపారు. అఫ్ఘాన్ నుంచి రోజుకు ఆరు నుంచి 7 ట్రక్కుల్లో ఉల్లి దిగుమతి అవుతోంది. 30 టన్నుల సామర్థ్యం ఉన్న 100 నుంచి 200 ట్రక్కుల్లో దిగుమతి చేసుకోనున్న ఉల్లిని దేశమంతటా పంపిణీ చేస్తామని వివరించారు. వచ్చే నెలలో ఈజిప్ట్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోనున్నట్లు వివరించారు. అయితే, ఒక్క ముంబై మహానగరానికే వంద లారీల ఉల్లి అవసరమైన నేపథ్యంలో, ప్రస్తుతం చేసుకుంటున్న దిగుమతులు అవసరాలను తీరుస్తాయని భావించలేమని పేర్కొన్నారు. 2వేల కిలోల చోరీ దేశంలో దొంగలకు ఇప్పుడు డబ్బులక్కర లేకుండా పోయాయి.. బంగారం దొంగతనం మీదా మోజు పోయింది. ఇప్పుడు హాట్‌కేక్‌లా సొమ్ములు కురిపించే అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉందా అంటే.. అది ఉల్లిపాయే.. రోజుకోచోట దొంగలు ఉల్లిపాయల్ని దర్జాగా దోచుకుపోతున్నారు. ఆదివారం ముంబై సబర్బన్‌లోని ఓ దుకాణం నుంచి 700 కిలోల ఉల్లిని కొందరు దొంగలు దోచుకుని పోతే.. సోమవారం దేశంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన నాసిక్‌లో ఏకంగా రెండు వేల కిలోల ఉల్లిపాయల్ని దొంగలు రాత్రికి రాత్రి దొంగతనం చేశారు. నాసిక్‌లోని నందగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబాసాహెబ్ పవార్ అనే రైతు తన గోదాములో దాచుకున్న 2వేల కిలోల ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగల కోసం గాలింపు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘ఉల్లి’పై నిఘా నేత్రం!
సబ్సిడీ ఉల్లి విక్రయ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు అధికారుల పర్యవేక్షణలో అమ్మకాలు అక్రమాలకు అవకాశం లే కుండా ఆకస్మిక తనిఖీలు సిటీబ్యూరో : రైతుబజార్లలో నిఘా మాటున సబ్సిడీ ఉల్లి విక్రయాలు సాగుతున్నాయి. సబ్సిడీ ఉల్లి విక్రయాల తీరును ఉన్నతాధికారులు బీఆర్కే భవన్ నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రైతుబజార్లో సబ్సిడీ కౌంటర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఉల్లి అన్లోడ్ దగ్గరి నుంచి అమ్మకాల వరకు అన్ని దశల్లోనూ నిఘా పెట్టారు. ప్రధానంగా ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్పల్లి, సరూర్‌నగర్ రైతుబజార్లలో వినియోగదారుల రద్దీ పెరుగుతుండటాన్ని ఆన్లైన్ ద్వారా గమనించిన ఉన్నతాధికారులు రద్దీని నియంత్రించేందుకు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా రెండు లైన్లు పెట్టాలని ఫోన్ ద్వారా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అలాగే ఒక్కొక్కరికి 2 కేజీల కంటే ఎక్కువ పరిమాణంలో ఉల్లిని విక్రయిస్తున్నారా...? ఐడీ ప్రూఫ్స్ చూస్తున్నారా.. లేదా ? ఏ టైంకు కౌంటర్లు తెరిచారు ? ఒక్కొక్కరికి ఉల్లిని విక్రయించేందుకు ఎంత సమయం పడుతోంది ? గంట వ్యవధిలో ఎంతమందికి సరుకు అందజేస్తున్నారు..? ఎన్ని బ్యాగ్‌ల ఉల్లి అయిపోయింది ? వంటి విషయాలను సిబ్బందిని అడగకుండా కేంద్ర కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఒకవేళ జనాల రద్దీ అధికమై సరుకు సరిపోని పరిస్థితిని గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి అక్కడికి 2గంటల వ్యవధిలోగా సరుకును చేరవేసేలా చర్యలు చేపడుతున్నారు. రెండో రోజైన గురువారం మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలు మెహిదీపట్నం రైతుబజార్‌ను సందర్శించి సబ్సిడీ ఉల్లి విక్రయాల తీరును గమనించారు. పక్కాగా నిఘా.. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర మండిపోతుండటంతో సబ్సిడీ ఉల్లి బయటకు తరలి వెళ్లే అవకాశం ఉందని అనుమానించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ పక్కాగా నిఘా పెట్టారు. ఓ వైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతుండగా... మరో వైపు విజిలెన్స్ టీంలు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ రైతుబజార్ల సిబ్బందిపై డేగ కన్ను వేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లోని 34 ఔట్లెట్స్ వద్ద కూడా ఉల్లి దారిమళ్లకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి మన కూరగాయల వాహనాలు ఏయే ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తున్నాయో అక్కడికి వెళ్లి మఫ్టీలో అమ్మకాల తీరును గమనిస్తున్నారు. రైతు బజార్లు, ఔట్‌లెట్స్‌లో వినియోగదారుడు ఐడీ ప్రూఫ్ చూపగానే రెండేసి కిలోల ఉల్లి అందిస్తున్నారు. నాణ్యమైన ఉల్లిని కేజీ రూ.20లకే అందిస్తుండటంతో వినియోగదారులు ఎగబడి కొనుగోళ్లు చేస్తుండటం కన్పించింది. అయితే... కొందరు చిరువ్యాపారులు తమ కుటుంబ సభ్యులను లైన్లో నిలబెట్టి ఒకరికి డ్రైవింగ్ లెసైన్స్, మరొకరికి ఆధార్ కార్డు, ఇంకొకరికి గ్యాస్ కనెక్షన్ ఐడీ, బ్యాంకు పాస్‌బుక్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటివి చూపుతూ సబ్సిడీ ఉల్లిని పెద్ద మొత్తంలో తీసుకొంటున్నారు. అలాగే ఒక రైతుబజార్లో పరిశీలించిన ఐడీ విషయం మరో రైతుబజార్లో తెలుసుకొనే అవకాశం లేకపోవడంతో ఒకేరోజు రెండు మూడు రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి కొని చిరువ్యాపారులు రిటైల్‌గా అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు.