రండమ్మా.. రండి! కిలో రూ.ఐదే
- నడిబజారులో ఉల్లి విక్రయాలు
-పెట్టుబడి రాలేదంటూ కర్నూలు జిల్లా రైతు ఆవేదన
అనంతపురం అగ్రికల్చర్ : ధర లేక ఉల్లి రైతులు రోడ్డు పడ్డారు. పంట సాగుకు రూ.లక్షలు ఖర్చు చేసిన రైతులకు ఇపుడు పెట్టుబడులు కూడా అందడం లేదు. ధరలు పతనం కావడంతో పాటు పెద్ద నోట్ల రద్దుతో మరింత ఇబ్బందుల్లో పడ్డారు. మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.5 కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు ఎకరాల్లో ఉల్లి సాగుకు రూ.లక్షకు పైగా ఖర్చు పెట్టగా ఇపుడు రూ.40 వేలు కూడా రావడం కష్టమంటున్నారు రైతు మద్దిలేటి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం, కల్లూరు మండలం, బొల్లవరం గ్రామానికి చెందిన రైతు మద్దిలేటి పండించిన ఉల్లిని అమ్ముడుపోవడం కష్టం కావడంతో స్వంతూరు నుంచి అనంతపురం నగరానికి తీసుకువచ్చి అమ్ముకుంటున్నాడు.
స్థానిక ఓవర్‌బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కన ఉల్లి బస్తాలు వేసుకుని 'రండమ్మా... రండి' అంటూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, సాంస్కృతిక విభాగం నాయకుడు రిలాక్స్‌నాగరాజు తదితరులు రైతును పలకరించి ఆయన బాధలు, నష్టాలు ఆలకించారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని వారు విమర్శించారు.