cost low
-
‘రంగు’ మారుతోంది!
- మిర్చి పంటకు ధరాఘాతం – నిల్వ చేయడానికి గోదాములు లేవు – ఇళ్ల వద్ద, తోటల్లో భద్రపరిచిన రైతులు – ఎండలకు రంగు మారుతోందని ఆవేదన – ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు - రాయదుర్గం మండలం టి.వీరాపురం రైతు ఈడిగ వెంకటేశులు రూ.3 లక్షల దాకా పెట్టుబడి పెట్టి ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తొలి విడతగా గ్రేడింగ్ చేసుకుని 30 సంచుల మిర్చిని కర్ణాటకలోని బ్యాడిగ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. నాణ్యమైన మిర్చి క్వింటాల్ రూ.4,199, రెండోరకం రూ.911 పలికింది. మొత్తం 9.50 క్వింటాళ్లకు రూ.13,392 చేతికొచ్చింది. ఇంత తక్కువ ధరతో మిగిలిన మిర్చిని అమ్మలేక, అలాగే ఉంచుకున్నాడు. నిల్వ చేయడానికి గోదాములు లేకపోవడంతో ఇంటి వద్దనే టెంకాయ పట్టలు కప్పి కాపాడుకుంటున్నాడు. రాయదుర్గం : జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో మిర్చి పంటను అధికంగా సాగు చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో 24 వేల ఎకరాలు, రాయదుర్గం పరిధిలో 2,250 ఎకరాల్లో పంట వేశారు. బోర్లలో వచ్చే అరకొర నీటితోనే పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. అయితే..ధర ఉన్నట్టుండి పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అత్యధిక శాతం మంది రైతులు బ్యాడిగ రకం మిర్చి సాగు చేశారు. దీన్ని రాయదుర్గానికి 200 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా బాగల్‌కోట తాలూకా బ్యాడిగ పట్టణానికి మాత్రమే తీసుకెళ్లి అమ్ముకోవాల్సి ఉంది. ఈ రకం మిర్చికి మిగతా ఎక్కడా మార్కెటింగ్ సౌకర్యం లేదు. ఇక్కడి నుంచి మార్కెట్‌కు రవాణా చేయాలంటే 30 కిలోల బస్తాకు రూ.75దాకా వెచ్చించాల్సి ఉంది. పంటచేతికొచ్చిన తొలినాళ్లలో క్వింటాల్ ధర రూ.22 వేల వరకు పలికింది. తీరా పంట పూర్తిస్థాయిలో చేతికొచ్చేసరికి ధర అథఃపాతాళానికి పడిపోయింది. పంటను గిట్టుబాటు ధర వచ్చేవరకు నిల్వ చేసుకుందామనుకున్న రైతులకు ఎక్కడా గోదాముల సౌకర్యం లేదు. దీంతో పొలాలు, ఇంటి ఆవరణల్లో నిల్వ చేసుకున్నారు. మండే ఎండలతో సరుకును సంరక్షించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎండవేడిమికి మిర్చి రంగు మారుతుండటంతో ధర పలకదని ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి.. గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎకరాకు రూ.30 వేల పరిహారమివ్వాలి రాయదుర్గం నియోజకవర్గంలో చాలా మంది రైతులు బ్యాడిగ రకం మిర్చి సాగుచేశారు. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల దాకా పెట్టుబడులు పెట్టారు. కౌలు రైతులకైతే మరో రూ. 20వేలు అదనం. ధరలు ఘోరంగా పడిపోవడంతో రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. నిల్వ చేసుకోవడానికి గోదాములు లేవు. గుంటూరు రకం కాకపోవడంతో కర్ణాటకలోనే ఈ పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ విషయం మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులుకు కూడా తెలుసు. తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.30 వేల ప్రకారం పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలి. - గౌని ఉపేంద్రరెడ్డి , వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
చిక్కిపోయిన చీనీ
- ధర భారీగా పతనం - పెట్టుబడులూ రాని దైన్యం - ఈ సీజన్లో రూ.400 కోట్ల వరకు నష్టం - లబోదిబోమంటున్న రైతులు అనంతపురం అగ్రికల్చర్ : + ఈ రైతు పేరు టి.వెంకటనాయుడు, బత్తలపల్లి మండలం యర్రాయపల్లి. రెండెకరాల్లో చీనీ తోట వేశాడు. బోర్లు ఎండిపోవడంతో కొత్తగా వేయించడానికి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయినా ఫలితం లేదు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసి చెట్లను బతికించుకున్నాడు. రెండు విడతలుగా 6.50 టన్నుల వరకు చీనీకాయలు పండించాడు. అనంతపురం మార్కెట్‌కు తీసుకురాగా మొదటిసారి టన్ను రూ.13 వేలు, మరోసారి రూ.16 వేలు పలికింది. అంతా కలిపి రూ.లక్ష లోపు వచ్చింది. ఇతను కొత్తగా బోర్లు వేయించడానికి రూ.3 లక్షలు, ట్యాంకర్లతో నీటి సరఫరాకు రూ.90 వేలు, పంట పెట్టుబడి కింద రూ.లక్ష వరకు ఖర్చు చేశాడు. అంటే దాదాపు రూ.5 లక్షలు వెచ్చించగా చేతికి వచ్చింది రూ.లక్ష మాత్రమే. + ఈ రైతు పేరు రామచంద్ర. ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లి. ఆరెకరాల్లో చీనీ తోట వేశాడు. ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉంది. ధర లేక కాయలు తెంపలేకపోతున్నారు. టన్ను కనీసం రూ.30 వేలు పలికితే కానీ గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో నెల రోజులుగా ఎదురుచూస్తున్నాడు. రామచంద్రతో పాటు కనగానపల్లి మండలం బద్దలాపురం, నరసంపల్లి, గార్లదిన్నె, ఆత్మకూరు, కూడేరు తదితర మండలాలకు చెందిన పలువురు రైతులు కూడా అనంతపురం మార్కెట్‌కు రావడం, ధర గురించి తెలుసుకుని నిరాశతో వెనుదిరగడం నిత్యకృత్యమైంది. సంప్రదాయ పంటలు జిల్లా రైతులకు వరుస నష్టాలను తెచ్చిపెడుతున్నా ఉద్యాన తోటలు అంతోఇంతో ఆదుకునేవి. అయితే..అవి కూడా ఈ సారి రైతులను కష్టాల్లోకి నెట్టేశాయి. చీనీ, మామిడి, అరటి, కళింగర లాంటి వాటికి ధరలు పతనం కావడంతో పెట్టుబడులు కూడా దక్కించుకోలేక దిక్కులు చూస్తున్నారు. వరుణుడు మొహం చాటేయడంతో భూగర్భజలాలు సగటున 26.50 మీటర్ల లోతుకు పడిపోయాయి. దీంతో చీనీ తోటలు ఎండుముఖం పట్టాయి. ఇప్పటికే పది వేల ఎకరాల్లో తోటలను వదిలేశారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యంతో పోరాటం సాగిస్తున్న రైతన్నకు.. ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం శరాఘాతం మారింది. ధరలు పడిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐదారేళ్లతో పోల్చుకుంటే ఈ సారి చీనీ ధరలు గణనీయంగా పడిపోయాయి. టన్ను కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.16 వేలు పలుకుతోంది. సరాసరి రూ.13 వేలు ఉంది. గతేడాది ఇదే సమయంలో టన్ను కనిష్టం రూ.38 వేలు, గరిష్ట ధర రూ.52 వేలు ఉండేది. సరాసరి ధర రూ.45 పలికింది. నేరుగా తోటల్లో అయితే గరిష్టంగా రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పలికినట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కొనేవారు లేక, ధర పతనమై పక్వానికి వచ్చిన కాయలను తెంపడానికి రైతులు వెనకాడుతున్నారు. ఈ సమయంలో రోజూ అనంతపురం మార్కెట్‌యార్డుకు 20 నుంచి 30 లారీల సరుకు వస్తుండగా.. ఇప్పుడు ఐదారు లారీలకు మించడంలేదు. ఇక్కడికి తీసుకొస్తున్న కొందరు రైతులు ధర లేక చీనీకాయలను మార్కెట్లోనే వదిలేస్తున్నారు. గత రెండు నెలలుగా ధరల్లో మార్పు లేకపోవడంతో చీనీ రైతులకు ఈ సీజన్లో రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. మనుగడ కోసం పోరాటం జిల్లా వ్యాప్తంగా 44 వేల హెక్టార్ల విస్తీర్ణంలో చీనీ తోటలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఎండుతున్న తోటలు, మరోవైపు గిట్టుబాటు లేక రైతులు సతమతమవుతున్నారు. ఈ సీజన్లో కాపునకు వచ్చిన తోటలు 28- 30 వేల హెక్టార్లలో ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. గార్లదిన్నె, శింగనమల, తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, నార్పల, తాడిమర్రి, బత్తలపల్లి, రాప్తాడు, ఆత్మకూరు, ధర్మవరం, పెద్దపప్పూరు, ముదిగుబ్బ, పామిడి, కూడేరు, బుక్కరాయసమద్రం మండలాల్లో భారీ విస్తీర్ణంలో చీనీ తోటలు ఉన్నాయి. మరో 40 మండలాల్లో కూడా కొద్దిమేరకు సాగు చేస్తున్నారు. ఏటా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల చీనీ దిగుబడులు వస్తున్నాయి. ఏడాదికి రూ.1,100 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతోంది. ఈసారి ధర పతనం కావడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగం స్పందించి చీనీకి గిట్టుబాటు కల్పించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
మిర్చి రైతు కంటతడి
- జిల్లాలో మూడింతలు పెరిగిన మిరప విస్తీర్ణం - ధర భారీగా పతనం, పెట్టుబడి కూడా రాని వైనం - గుంటూరు యార్డుకు వెళ్లేందుకు సవాలక్ష షరతులు - లబోదిబోమంటున్న రైతులు అనంతపురం అగ్రికల్చర్ : గిట్టుబాటు ధర లేక కుదేలైన అరటి, మామిడి, చీనీ రైతుల మాదిరిగానే ఇప్పుడు మిరప రైతులు కూడా కంటతడి పెడుతున్నారు. జిల్లాలలో మిరప సాధారణ సాగు విస్తీర్ణం 2,500 హెక్టార్లు కాగా.. గతేడాది మంచి ధరలు పలకడంతో రైతులు ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో పంట వేశారు. ఒక ఎకరా వేసే రైతులు రెండు, మూడు ఎకరాలు సాగు చేశారు. దీంతో విస్తీర్ణం మూడింతలు పెరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7,700 హెక్టార్ల విస్తీర్ణంలో మిరప సాగైంది. గుంతకల్లు, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, రాయదుర్గం, కణేకల్లు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుత్తి, పామిడి తదితర మండలాల్లో ఎక్కువగా పంట వేశారు. భారీగా పెట్టుబడి జిల్లాలో బ్యాడిగ, బ్యాడిగ కడ్డీ, బ్యాడిగ డబ్బీ, 232, 273, ఎల్సీఏ 334, తేజ్ లాంటి మిరప రకాలు సాగు చేశారు. ఇది తొమ్మిది నెలల పంట. ఎకరాకు రూ.75 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ సారి తెగుళ్లు ఎక్కువగా సోకడంతో ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నందున గతేడాది మాదిరి ధరలు పలికితే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశించారు. దిగుబడుల పరంగా ఆశాజనకంగా వచ్చినా ధరలు మాత్రం భారీగా పతనమయ్యాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. పెట్టిన పెట్టుబడులు పరిగణనలోకి తీసుకుంటే క్వింటాల్ ఎండుమిర్చి రూ.9 వేల నుంచి రూ.10 వేలు పలికితే నష్టం ఉండదు. కానీ.. ప్రస్తుతం మార్కెట్లో రూ.5 వేలకు కాస్త అటూఇటు పలుకుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గుంటూరులో అమ్ముకునేందుకు అష్టకష్టాలు జిల్లాతో పాటు బళ్లారి మార్కెట్లో కూడా మిర్చి ధరలు పతనమయ్యాయి. కొనేవారు కరువయ్యారు. ఎండుమిర్చికి కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైసెస్–ఎంఎస్పీ) విధానం కూడా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు మిర్చి యార్డులో క్వింటాల్ రూ.8 వేల కన్నా తక్కువకు అమ్ముడుపోయిన రైతులకు క్వింటాల్‌పై రూ.1,500 చొప్పున ప్రోత్సాహం ప్రకటించింది. దీంతో జిల్లా రైతులు అక్కడికి వెళుతున్నారు. అనంతపురం నుంచి గుంటూరుకు సరుకు తీసుకెళ్లాలంటే క్వింటాల్‌పై రూ.200 వరకు రవాణా భారం పడుతుంది. అక్కడికి తీసుకెళ్లిన వెంటనే కొనుగోలు చేసే పరిస్థితి లేదు. పంట సాగు చేసినట్లు వ్యవసాయ లేదా ఉద్యానశాఖ అధికారుల ద్వారా అన్ని వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలి. గుంటూరు యార్డులో అమ్ముతున్నట్లు అక్కడి నుంచి మరో ధ్రువీకరణ పత్రం తెప్పించుకుని.. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతే సరుకును లోపలికి అనుమతిస్తారు. ధ్రువీకరణ పత్రం పంట పొలాలు పరిశీలిస్తే కానీ ఇవ్వలేమని అధికారులు మెలిక పెడుతుండటంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. అలాగే అమ్మిన 20 రోజులకు కాని బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కాదంటున్నారు. రూ.8 వేలు పలికినా పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. పురుగుమందులు, ఎరువుల అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి పండించిన పంటను అమ్ముకునేందుకు ఇన్ని కష్టాలు పడాలా అంటూ నిట్టూరుస్తున్నారు. మిరప రైతుల కష్టాలను జిల్లా మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మార్కెట్ సదుపాయం నిల్ మిరప పంట విస్తీర్ణం ఇటీవల పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైనా మార్కెట్ సదుపాయం కల్పించకపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి కోల్డ్‌స్టోరేజీలు, మౌలిక సదుపాయాలు లేవు. కోల్ట్స్టోరేజీలను ఏర్పాటు చేయడంతో పాటు రైతుబంధు పథకం వర్తింపజేస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చిన సమయంలో అమ్ముకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. -
కుప్పకూలిన అరటి ధరలు
- వారంలో రూ.15 వేల నుంచి రూ.5వేలకు పెద్దపప్పూరు : మార్కెట్లో అరటి ధరలు అమాంతం కుప్పకూలాయి. నెల క్రితం టన్ను అరటి కాయలు రూ.30 వేలు ఉండగా, పదిరోజుల క్రితం రూ.15 వేలకు పడిపోయాయి. ఇప్పుడు రూ.5వేలకు మించిపోవడం లేదు. గత ఏడాది ఇదే సమయంలో మార్కెట్లో అరటి ధరలు దాదాపు రూ.20వేలుగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 వేల హెక్టార్లలో అరటి సాగవుతోంది. తాడిపత్రి నియోజకవర్గంలో దాదాపు 5వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మండుతున్న ఎండలకు అరటి చెట్లు విరిగిపడిపోతున్నాయి. దీంతో రైతులు కాయ పక్వానికి రాక మునుపే మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధపడుతున్నారు. వ్యాపారులు తోటలవైపు రావడం మానేశారని, దీంతో వచ్చిన కాడికి చాలనుకుంటూ అమ్ముకుంటున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
రండమ్మా.. రండి! కిలో రూ.ఐదే
- నడిబజారులో ఉల్లి విక్రయాలు -పెట్టుబడి రాలేదంటూ కర్నూలు జిల్లా రైతు ఆవేదన అనంతపురం అగ్రికల్చర్ : ధర లేక ఉల్లి రైతులు రోడ్డు పడ్డారు. పంట సాగుకు రూ.లక్షలు ఖర్చు చేసిన రైతులకు ఇపుడు పెట్టుబడులు కూడా అందడం లేదు. ధరలు పతనం కావడంతో పాటు పెద్ద నోట్ల రద్దుతో మరింత ఇబ్బందుల్లో పడ్డారు. మార్కెట్లో కిలో ఉల్లి రూ.5 కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు ఎకరాల్లో ఉల్లి సాగుకు రూ.లక్షకు పైగా ఖర్చు పెట్టగా ఇపుడు రూ.40 వేలు కూడా రావడం కష్టమంటున్నారు రైతు మద్దిలేటి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం, కల్లూరు మండలం, బొల్లవరం గ్రామానికి చెందిన రైతు మద్దిలేటి పండించిన ఉల్లిని అమ్ముడుపోవడం కష్టం కావడంతో స్వంతూరు నుంచి అనంతపురం నగరానికి తీసుకువచ్చి అమ్ముకుంటున్నాడు. స్థానిక ఓవర్‌బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కన ఉల్లి బస్తాలు వేసుకుని 'రండమ్మా... రండి' అంటూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, సాంస్కృతిక విభాగం నాయకుడు రిలాక్స్‌నాగరాజు తదితరులు రైతును పలకరించి ఆయన బాధలు, నష్టాలు ఆలకించారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని వారు విమర్శించారు.