చిక్కిపోయిన చీనీ | cheese cost low | Sakshi
Sakshi News home page

చిక్కిపోయిన చీనీ

Published Tue, May 2 2017 11:45 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

చిక్కిపోయిన చీనీ - Sakshi

- ధర భారీగా పతనం
- పెట్టుబడులూ రాని దైన్యం
- ఈ సీజన్‌లో రూ.400 కోట్ల వరకు నష్టం
- లబోదిబోమంటున్న రైతులు

 
అనంతపురం అగ్రికల్చర్‌ :
+ ఈ రైతు పేరు టి.వెంకటనాయుడు, బత్తలపల్లి మండలం యర్రాయపల్లి. రెండెకరాల్లో చీనీ తోట వేశాడు. బోర్లు ఎండిపోవడంతో కొత్తగా వేయించడానికి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయినా ఫలితం లేదు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలు చేసి చెట్లను బతికించుకున్నాడు. రెండు విడతలుగా 6.50 టన్నుల వరకు చీనీకాయలు పండించాడు. అనంతపురం మార్కెట్‌కు తీసుకురాగా మొదటిసారి టన్ను రూ.13 వేలు, మరోసారి రూ.16 వేలు పలికింది. అంతా కలిపి రూ.లక్ష లోపు వచ్చింది. ఇతను కొత్తగా బోర్లు వేయించడానికి రూ.3 లక్షలు, ట్యాంకర్లతో నీటి సరఫరాకు రూ.90 వేలు, పంట పెట్టుబడి కింద రూ.లక్ష వరకు ఖర్చు చేశాడు. అంటే దాదాపు రూ.5 లక్షలు వెచ్చించగా చేతికి వచ్చింది రూ.లక్ష మాత్రమే.

+ ఈ రైతు పేరు రామచంద్ర. ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లి. ఆరెకరాల్లో చీనీ తోట వేశాడు. ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉంది. ధర లేక కాయలు తెంపలేకపోతున్నారు. టన్ను కనీసం రూ.30 వేలు పలికితే కానీ గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో నెల రోజులుగా ఎదురుచూస్తున్నాడు. రామచంద్రతో పాటు కనగానపల్లి మండలం బద్దలాపురం, నరసంపల్లి, గార్లదిన్నె, ఆత్మకూరు, కూడేరు తదితర మండలాలకు చెందిన పలువురు రైతులు కూడా  అనంతపురం మార్కెట్‌కు రావడం, ధర గురించి తెలుసుకుని నిరాశతో వెనుదిరగడం నిత్యకృత్యమైంది.

        సంప్రదాయ పంటలు జిల్లా రైతులకు వరుస నష్టాలను తెచ్చిపెడుతున్నా  ఉద్యాన తోటలు అంతోఇంతో ఆదుకునేవి. అయితే..అవి కూడా ఈ సారి రైతులను కష్టాల్లోకి నెట్టేశాయి. చీనీ, మామిడి, అరటి, కళింగర లాంటి వాటికి ధరలు పతనం కావడంతో పెట్టుబడులు కూడా దక్కించుకోలేక దిక్కులు చూస్తున్నారు. వరుణుడు మొహం చాటేయడంతో భూగర్భజలాలు సగటున 26.50 మీటర్ల లోతుకు పడిపోయాయి. దీంతో చీనీ తోటలు ఎండుముఖం పట్టాయి. ఇప్పటికే పది వేల ఎకరాల్లో తోటలను వదిలేశారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యంతో పోరాటం సాగిస్తున్న రైతన్నకు.. ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం శరాఘాతం మారింది. ధరలు పడిపోవడంతో  తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

        ఐదారేళ్లతో పోల్చుకుంటే ఈ సారి చీనీ ధరలు గణనీయంగా పడిపోయాయి. టన్ను కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.16 వేలు పలుకుతోంది. సరాసరి రూ.13 వేలు ఉంది. గతేడాది ఇదే సమయంలో టన్ను కనిష్టం రూ.38 వేలు, గరిష్ట ధర రూ.52 వేలు ఉండేది. సరాసరి ధర రూ.45 పలికింది. నేరుగా తోటల్లో అయితే గరిష్టంగా రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పలికినట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కొనేవారు లేక, ధర పతనమై పక్వానికి వచ్చిన కాయలను తెంపడానికి రైతులు వెనకాడుతున్నారు. ఈ సమయంలో రోజూ అనంతపురం మార్కెట్‌యార్డుకు  20 నుంచి 30 లారీల సరుకు వస్తుండగా.. ఇప్పుడు ఐదారు లారీలకు మించడంలేదు. ఇక్కడికి తీసుకొస్తున్న కొందరు రైతులు ధర లేక చీనీకాయలను మార్కెట్‌లోనే వదిలేస్తున్నారు. గత రెండు నెలలుగా ధరల్లో మార్పు లేకపోవడంతో చీనీ రైతులకు ఈ సీజన్‌లో రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది.

మనుగడ కోసం పోరాటం
జిల్లా వ్యాప్తంగా 44 వేల హెక్టార్ల విస్తీర్ణంలో చీనీ తోటలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఎండుతున్న తోటలు, మరోవైపు గిట్టుబాటు లేక  రైతులు సతమతమవుతున్నారు.  ఈ సీజన్‌లో కాపునకు వచ్చిన తోటలు 28- 30 వేల హెక్టార్లలో ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.   గార్లదిన్నె, శింగనమల, తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, నార్పల, తాడిమర్రి, బత్తలపల్లి, రాప్తాడు, ఆత్మకూరు, ధర్మవరం, పెద్దపప్పూరు, ముదిగుబ్బ, పామిడి, కూడేరు, బుక్కరాయసమద్రం మండలాల్లో భారీ విస్తీర్ణంలో చీనీ తోటలు ఉన్నాయి. మరో 40 మండలాల్లో కూడా కొద్దిమేరకు సాగు చేస్తున్నారు. ఏటా 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల చీనీ దిగుబడులు వస్తున్నాయి. ఏడాదికి  రూ.1,100 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల వరకు టర్నోవర్‌ జరుగుతోంది. ఈసారి ధర పతనం కావడంతో  రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. జిల్లా మంత్రులు,  అధికార యంత్రాంగం స్పందించి చీనీకి గిట్టుబాటు కల్పించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement