‘ఉల్లి’పై నిఘా నేత్రం! | sale of subsidized onions | Sakshi
Sakshi News home page

‘ఉల్లి’పై నిఘా నేత్రం!

Published Fri, Aug 7 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

‘ఉల్లి’పై నిఘా నేత్రం!

‘ఉల్లి’పై నిఘా నేత్రం!

సబ్సిడీ ఉల్లి విక్రయ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు
అధికారుల పర్యవేక్షణలో అమ్మకాలు
అక్రమాలకు అవకాశం లే కుండా ఆకస్మిక తనిఖీలు

 
సిటీబ్యూరో : రైతుబజార్లలో నిఘా మాటున సబ్సిడీ ఉల్లి విక్రయాలు సాగుతున్నాయి. సబ్సిడీ ఉల్లి విక్రయాల తీరును ఉన్నతాధికారులు బీఆర్‌కే భవన్ నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రైతుబజార్‌లో సబ్సిడీ కౌంటర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయడం ద్వారా  ఉల్లి అన్‌లోడ్ దగ్గరి నుంచి అమ్మకాల వరకు అన్ని దశల్లోనూ నిఘా పెట్టారు. ప్రధానంగా ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సరూర్‌నగర్ రైతుబజార్లలో వినియోగదారుల రద్దీ పెరుగుతుండటాన్ని ఆన్‌లైన్ ద్వారా గమనించిన ఉన్నతాధికారులు రద్దీని నియంత్రించేందుకు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా రెండు లైన్లు పెట్టాలని ఫోన్ ద్వారా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అలాగే  ఒక్కొక్కరికి 2 కేజీల కంటే ఎక్కువ పరిమాణంలో ఉల్లిని విక్రయిస్తున్నారా...? ఐడీ ప్రూఫ్స్ చూస్తున్నారా.. లేదా ? ఏ టైంకు కౌంటర్లు తెరిచారు ? ఒక్కొక్కరికి ఉల్లిని విక్రయించేందుకు ఎంత సమయం పడుతోంది ? గంట వ్యవధిలో ఎంతమందికి సరుకు అందజేస్తున్నారు..? ఎన్ని బ్యాగ్‌ల ఉల్లి అయిపోయింది ? వంటి విషయాలను సిబ్బందిని అడగకుండా కేంద్ర కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఒకవేళ జనాల రద్దీ అధికమై సరుకు సరిపోని పరిస్థితిని గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి అక్కడికి 2గంటల వ్యవధిలోగా సరుకును చేరవేసేలా చర్యలు చేపడుతున్నారు. రెండో రోజైన గురువారం మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలు మెహిదీపట్నం రైతుబజార్‌ను సందర్శించి సబ్సిడీ ఉల్లి విక్రయాల తీరును గమనించారు.

 పక్కాగా నిఘా..
 రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర మండిపోతుండటంతో సబ్సిడీ ఉల్లి బయటకు తరలి వెళ్లే అవకాశం ఉందని అనుమానించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ పక్కాగా నిఘా పెట్టారు.  ఓ వైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతుండగా... మరో వైపు విజిలెన్స్ టీంలు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ రైతుబజార్ల సిబ్బందిపై డేగ కన్ను వేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లోని 34 ఔట్‌లెట్స్ వద్ద కూడా ఉల్లి దారిమళ్లకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి మన కూరగాయల వాహనాలు ఏయే ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తున్నాయో అక్కడికి వెళ్లి మఫ్టీలో అమ్మకాల తీరును గమనిస్తున్నారు. రైతు బజార్లు, ఔట్‌లెట్స్‌లో  వినియోగదారుడు ఐడీ ప్రూఫ్ చూపగానే రెండేసి కిలోల ఉల్లి అందిస్తున్నారు.

నాణ్యమైన ఉల్లిని కేజీ రూ.20లకే అందిస్తుండటంతో వినియోగదారులు ఎగబడి కొనుగోళ్లు చేస్తుండటం కన్పించింది. అయితే... కొందరు చిరువ్యాపారులు తమ కుటుంబ సభ్యులను లైన్‌లో నిలబెట్టి ఒకరికి డ్రైవింగ్ లెసైన్స్, మరొకరికి ఆధార్ కార్డు, ఇంకొకరికి గ్యాస్ కనెక్షన్ ఐడీ, బ్యాంకు పాస్‌బుక్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటివి చూపుతూ సబ్సిడీ ఉల్లిని పెద్ద మొత్తంలో తీసుకొంటున్నారు. అలాగే ఒక రైతుబజార్‌లో పరిశీలించిన ఐడీ విషయం మరో రైతుబజార్‌లో తెలుసుకొనే అవకాశం లేకపోవడంతో ఒకేరోజు రెండు మూడు రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి కొని చిరువ్యాపారులు రిటైల్‌గా అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement