subsidy onion
-
సినిమా టికెట్ల కోసం కాదు....
తాండూరు: ఏదో కొత్త సినిమా విడుదలైన మొదటిరోజు మార్నింగ్ షో చూసేందుకు థియేటర్ వద్ద టికెట్ల కోసం క్యూ కట్టినట్లుగా ఉంది కదూ ఈ చిత్రాన్ని చూస్తే.. అదేం కాదు.. సబ్సిడీ ఉల్లిగడ్డల కోసం తాండూరు మార్కెట్ యార్డు వద్ద జనాలు ఇలా భారీగా బారులు తీరారు. సబ్సిడీ ఉల్లి విక్రయాల్లో క్రితం రోజు పరిస్థితి పునరావృతం కాకుండా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నానికే ఉల్లి నిల్వలు నిండుకోవడంతో కేంద్రంలో నో స్టాక్ బోర్డు పెట్టారు. దీంతో జనాలు నిరాశతో వెనుదిరిగారు. రాత్రికిరాత్రే ఉన్నతాధికారులు తాండూరు కేంద్రానికి 50.60క్వింటాళ్ల ఉల్లి స్టాక్‌ను పంపించారు. క్రితం రోజు ఉల్లి లభించకపోవడంతో బుధవారం ఉదయం 8గంటలకే జనాలు మార్కెట్ యార్డు కేంద్రం వద్ద బారులు తీరారు. గంటకుపైగా క్యూలో నిల్చొని ఉల్లిని కొనుగోలు చేశారు. వచ్చిన స్టాక్‌లో 838మందికి 16.66 క్వింటాళ్ల ఉల్లి విక్రయించామని మార్కెట్ కమిటీ సూపర్వైజర్ హబీబ్ అల్వీ తెలిపారు. మేడ్చల్‌లో కుళ్లిపోయిన ఉల్లి సరఫరా.. మేడ్చల్: స్థానిక రైతు బజారులో కుళ్లిపోయిన సబ్సిడీ ఉల్లిని సరఫరా చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం 10 గంటలకు కేంద్రాలను తెరవాల్సిన అధికారులు 12 గంటలకు తెరుస్తుండటంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు బజారులో కుళ్లిపోయిన ఉల్లిని సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు బజారులో ఏర్పాటు చేసిన ఉల్లి కేంద్రాన్ని పర్యవేక్షించాల్సిన మేడ్చల్ మార్కెట్ కమిటీ కార్యదర్శి అపర్ణ ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో తెలియడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. -
‘ఉల్లి’పై నిఘా నేత్రం!
సబ్సిడీ ఉల్లి విక్రయ కౌంటర్ల వద్ద సీసీ కెమెరాలు అధికారుల పర్యవేక్షణలో అమ్మకాలు అక్రమాలకు అవకాశం లే కుండా ఆకస్మిక తనిఖీలు సిటీబ్యూరో : రైతుబజార్లలో నిఘా మాటున సబ్సిడీ ఉల్లి విక్రయాలు సాగుతున్నాయి. సబ్సిడీ ఉల్లి విక్రయాల తీరును ఉన్నతాధికారులు బీఆర్కే భవన్ నుంచి నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రైతుబజార్లో సబ్సిడీ కౌంటర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఉల్లి అన్లోడ్ దగ్గరి నుంచి అమ్మకాల వరకు అన్ని దశల్లోనూ నిఘా పెట్టారు. ప్రధానంగా ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్పల్లి, సరూర్‌నగర్ రైతుబజార్లలో వినియోగదారుల రద్దీ పెరుగుతుండటాన్ని ఆన్లైన్ ద్వారా గమనించిన ఉన్నతాధికారులు రద్దీని నియంత్రించేందుకు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా రెండు లైన్లు పెట్టాలని ఫోన్ ద్వారా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అలాగే ఒక్కొక్కరికి 2 కేజీల కంటే ఎక్కువ పరిమాణంలో ఉల్లిని విక్రయిస్తున్నారా...? ఐడీ ప్రూఫ్స్ చూస్తున్నారా.. లేదా ? ఏ టైంకు కౌంటర్లు తెరిచారు ? ఒక్కొక్కరికి ఉల్లిని విక్రయించేందుకు ఎంత సమయం పడుతోంది ? గంట వ్యవధిలో ఎంతమందికి సరుకు అందజేస్తున్నారు..? ఎన్ని బ్యాగ్‌ల ఉల్లి అయిపోయింది ? వంటి విషయాలను సిబ్బందిని అడగకుండా కేంద్ర కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఒకవేళ జనాల రద్దీ అధికమై సరుకు సరిపోని పరిస్థితిని గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి అక్కడికి 2గంటల వ్యవధిలోగా సరుకును చేరవేసేలా చర్యలు చేపడుతున్నారు. రెండో రోజైన గురువారం మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలు మెహిదీపట్నం రైతుబజార్‌ను సందర్శించి సబ్సిడీ ఉల్లి విక్రయాల తీరును గమనించారు. పక్కాగా నిఘా.. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర మండిపోతుండటంతో సబ్సిడీ ఉల్లి బయటకు తరలి వెళ్లే అవకాశం ఉందని అనుమానించిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ పక్కాగా నిఘా పెట్టారు. ఓ వైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతుండగా... మరో వైపు విజిలెన్స్ టీంలు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ రైతుబజార్ల సిబ్బందిపై డేగ కన్ను వేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లోని 34 ఔట్లెట్స్ వద్ద కూడా ఉల్లి దారిమళ్లకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి మన కూరగాయల వాహనాలు ఏయే ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తున్నాయో అక్కడికి వెళ్లి మఫ్టీలో అమ్మకాల తీరును గమనిస్తున్నారు. రైతు బజార్లు, ఔట్‌లెట్స్‌లో వినియోగదారుడు ఐడీ ప్రూఫ్ చూపగానే రెండేసి కిలోల ఉల్లి అందిస్తున్నారు. నాణ్యమైన ఉల్లిని కేజీ రూ.20లకే అందిస్తుండటంతో వినియోగదారులు ఎగబడి కొనుగోళ్లు చేస్తుండటం కన్పించింది. అయితే... కొందరు చిరువ్యాపారులు తమ కుటుంబ సభ్యులను లైన్లో నిలబెట్టి ఒకరికి డ్రైవింగ్ లెసైన్స్, మరొకరికి ఆధార్ కార్డు, ఇంకొకరికి గ్యాస్ కనెక్షన్ ఐడీ, బ్యాంకు పాస్‌బుక్, ఓటర్ ఐడీ, పాన్ కార్డు వంటివి చూపుతూ సబ్సిడీ ఉల్లిని పెద్ద మొత్తంలో తీసుకొంటున్నారు. అలాగే ఒక రైతుబజార్లో పరిశీలించిన ఐడీ విషయం మరో రైతుబజార్లో తెలుసుకొనే అవకాశం లేకపోవడంతో ఒకేరోజు రెండు మూడు రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి కొని చిరువ్యాపారులు రిటైల్‌గా అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. -
పత్తా లేని సర్కారు ఉల్లి
సన్న బియ్యం విక్రయ కేంద్రాల బాటలో ఉల్లి విక్రయ కేంద్రాలూ చేరాయి. ఆర్భాటంగా ప్రారంభించి న వారానికే మూతపడ్డాయి. దీంతో కంటనీరు పెట్టిస్తున్న ఉల్లిగడ్డల ధరల నుంచి ఉపశమనం పొందాలనుకునే సామాన్యులకు నిరాశే ఎదురవుతోంది. కేంద్రాలు మూతపడ్డా తెరిపించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రిటైల్ మార్కెట్లో ఉల్లి గడ్డల ధర కిలోకు రూ. 60 దాటడంతో సామాన్యులకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిజామాబాద్ నగరంలోని రెండు రైతు బజార్లలో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతనెల 27న అప్పటి ఇన్చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ ఈ కేంద్రాలను ప్రారంభిం చారు. 30 రూపాయలకు కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తామని ప్రకటించారు. డిమాండ్‌ను బట్టి కామారెడ్డి, బోధన్, ఆర్మూర్లలోనూ ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి మూడు రోజులు రూ. 30కి కిలో ఉల్లిగడ్డలు విక్రయించారు. తర్వాత ధర రూ. 32 కు పెంచారు. ఇలా నాలుగు రోజులు కొనసాగించి కేంద్రాలనే మూసేశారు. గతంలో సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరిగినప్పుడూ ఇలాగే విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవి సైతం కొన్ని రోజులకే మూతపడ్డాయి. చేతులెత్తేసిన రెండు శాఖలు.. మార్కెటింగ్ శాఖ హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లిగడ్డలను కొనుగోలు చేసి, అదే ధరకు ఈ కేంద్రాల్లో రిటైల్‌గా అమ్మాలని నిర్ణయించింది. నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తీరా ఇప్పుడు రెండు శాఖలు చేతులెత్తేశాయి. హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లిధర క్వింటాలుకు రూ. 400లకు చేరిందన్న సాకుతో మార్కెటింగ్‌శాఖ ఉల్లి కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో అమ్మకాలు కూడా నిలిచిపోయాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ కేంద్రాల్లో విక్రయించింది 27 క్వింటాళ్లు మాత్రమే కావడం గమనార్హం. చిత్తశుద్ధి లోపం నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో సర్కారుకు చిత్తశుద్ధి లోపించింది. చుక్కల నంటుతున్న ధరలను అదుపు చేయడంలో అధికార యంత్రాంగమూ విఫలమవుతోంది. స్థానిక మార్కెట్లో కాకుండా తక్కువ ధరకు దొరికే చోట ఉల్లిగడ్డలను కొనుగోలు చేసి విక్రయిస్తే సామాన్యులకు ఉల్లి అందుబాటులో ఉండేది. కానీ ఈ దిశగా మార్కెటిం గ్ అధికారులు చొరవ చూపిన దాఖలాల్లేవు. మార్కెటింగ్ అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో ఉల్లి ధరల నియంత్రణ కోసం నిధులు కేటాయించాలని కోరుతూ సర్కారుకు ప్రతిపాదనలు పంపేవారే లేకుండా పోయారు.