సినిమా టికెట్ల కోసం కాదు....
తాండూరు: ఏదో కొత్త సినిమా విడుదలైన మొదటిరోజు మార్నింగ్ షో చూసేందుకు థియేటర్ వద్ద టికెట్ల కోసం క్యూ కట్టినట్లుగా ఉంది కదూ ఈ చిత్రాన్ని చూస్తే.. అదేం కాదు.. సబ్సిడీ ఉల్లిగడ్డల కోసం తాండూరు మార్కెట్ యార్డు వద్ద జనాలు ఇలా భారీగా బారులు తీరారు. సబ్సిడీ ఉల్లి విక్రయాల్లో క్రితం రోజు పరిస్థితి పునరావృతం కాకుండా మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నానికే ఉల్లి నిల్వలు నిండుకోవడంతో కేంద్రంలో నో స్టాక్ బోర్డు పెట్టారు.
దీంతో జనాలు నిరాశతో వెనుదిరిగారు. రాత్రికిరాత్రే ఉన్నతాధికారులు తాండూరు కేంద్రానికి 50.60క్వింటాళ్ల ఉల్లి స్టాక్‌ను పంపించారు. క్రితం రోజు ఉల్లి లభించకపోవడంతో బుధవారం ఉదయం 8గంటలకే జనాలు మార్కెట్ యార్డు కేంద్రం వద్ద బారులు తీరారు. గంటకుపైగా క్యూలో నిల్చొని ఉల్లిని కొనుగోలు చేశారు. వచ్చిన స్టాక్‌లో 838మందికి 16.66 క్వింటాళ్ల ఉల్లి విక్రయించామని మార్కెట్ కమిటీ సూపర్‌వైజర్ హబీబ్ అల్వీ తెలిపారు.
మేడ్చల్‌లో కుళ్లిపోయిన ఉల్లి సరఫరా..
మేడ్చల్: స్థానిక రైతు బజారులో కుళ్లిపోయిన సబ్సిడీ ఉల్లిని సరఫరా చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఉదయం 10 గంటలకు కేంద్రాలను తెరవాల్సిన అధికారులు 12 గంటలకు తెరుస్తుండటంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు బజారులో కుళ్లిపోయిన ఉల్లిని సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు బజారులో ఏర్పాటు చేసిన ఉల్లి కేంద్రాన్ని పర్యవేక్షించాల్సిన మేడ్చల్ మార్కెట్ కమిటీ కార్యదర్శి అపర్ణ ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళుతున్నారో తెలియడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.