పత్తా లేని సర్కారు ఉల్లి
సన్న బియ్యం విక్రయ కేంద్రాల బాటలో ఉల్లి విక్రయ కేంద్రాలూ చేరాయి. ఆర్భాటంగా ప్రారంభించి న వారానికే మూతపడ్డాయి. దీంతో కంటనీరు పెట్టిస్తున్న ఉల్లిగడ్డల ధరల నుంచి ఉపశమనం పొందాలనుకునే సామాన్యులకు నిరాశే ఎదురవుతోంది. కేంద్రాలు మూతపడ్డా తెరిపించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రిటైల్ మార్కెట్‌లో ఉల్లి గడ్డల ధర కిలోకు రూ. 60 దాటడంతో సామాన్యులకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిజామాబాద్ నగరంలోని రెండు రైతు బజార్లలో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతనెల 27న అప్పటి ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ ఈ కేంద్రాలను ప్రారంభిం చారు. 30 రూపాయలకు కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తామని ప్రకటించారు. డిమాండ్‌ను బట్టి కామారెడ్డి, బోధన్, ఆర్మూర్‌లలోనూ ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి మూడు రోజులు రూ. 30కి కిలో ఉల్లిగడ్డలు విక్రయించారు. తర్వాత ధర రూ. 32 కు పెంచారు. ఇలా నాలుగు రోజులు కొనసాగించి కేంద్రాలనే మూసేశారు. గతంలో సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరిగినప్పుడూ ఇలాగే విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవి సైతం కొన్ని రోజులకే మూతపడ్డాయి.
చేతులెత్తేసిన రెండు శాఖలు..
మార్కెటింగ్ శాఖ హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లిగడ్డలను కొనుగోలు చేసి, అదే ధరకు ఈ కేంద్రాల్లో రిటైల్‌గా అమ్మాలని నిర్ణయించింది. నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తీరా ఇప్పుడు రెండు శాఖలు చేతులెత్తేశాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లిధర క్వింటాలుకు రూ. 400లకు చేరిందన్న సాకుతో మార్కెటింగ్‌శాఖ ఉల్లి కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో అమ్మకాలు కూడా నిలిచిపోయాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ కేంద్రాల్లో విక్రయించింది 27 క్వింటాళ్లు మాత్రమే కావడం గమనార్హం.
చిత్తశుద్ధి లోపం
నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో సర్కారుకు చిత్తశుద్ధి లోపించింది. చుక్కల నంటుతున్న ధరలను అదుపు చేయడంలో అధికార యంత్రాంగమూ విఫలమవుతోంది. స్థానిక మార్కెట్‌లో కాకుండా తక్కువ ధరకు దొరికే చోట ఉల్లిగడ్డలను కొనుగోలు చేసి విక్రయిస్తే సామాన్యులకు ఉల్లి అందుబాటులో ఉండేది. కానీ ఈ దిశగా మార్కెటిం గ్ అధికారులు చొరవ చూపిన దాఖలాల్లేవు. మార్కెటింగ్ అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో ఉల్లి ధరల నియంత్రణ కోసం నిధులు కేటాయించాలని కోరుతూ సర్కారుకు ప్రతిపాదనలు పంపేవారే లేకుండా పోయారు.