మహారాణిపేట(విశాఖ దక్షిణ), సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఉల్లిపాయల డిమాండ్ తగ్గే వరకు అన్ని రైతు బజార్లుకు ఇస్తున్న వారంతపు సెలవులను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. గిరాకీ తగ్గి సాధారణ పరిస్దితులు నెలకొనే వరకు జిల్లాలోని 13 రైతుబజార్లు ప్రతిరోజూ పని చేస్తాయి. సబ్సిడీ ఉల్లి విక్రయాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఒక వ్యక్తే పలుమార్లు లైన్లలో నిల్చొని ఎక్కువ పరిమాణంలో ఉల్లి కొనుగోలు చేస్తుండటంతో మరికొంతమందికి ఉల్లి అందకుండా పోతోంది. దీన్ని నిరోధించేందుకు గుర్తింపు కార్డు ఉన్నవారికే ఉల్లి విక్రయించే పద్ధతి చేపట్టాలన్న ఆలోచన అధికారవర్గాల్లో ఉంది. గోపాలపట్నం రైతుబజార్‌లో రేషన్ కార్డు, ఇతర గుర్తింపు కార్డు జెరాక్స్ కాపీ తీసుకొని సబ్సిడీ విక్రయాలను ప్రయోగాత్మకంగా సోమవారం ప్రవేశపెట్టినట్లు జాయింట్ కలెక్టర్ టి.శివశంకర్ చెప్పారు. ఇది విజయవంతమైతే అన్ని రైతుబజార్లకు వర్తింపజేస్తామన్నారు.
23 రోజులు.. 410 టన్నులు..
జిల్లాలో గత నెల 16 నుంచి ఇప్పటి వరకు 410 టన్నుల ఉల్లిపాయలు సబ్సిడీ ధరపై విక్రయించారు. సోమవారం ఒక్క రోజే 42165 కిలోల ఉల్లిపాయలు విక్రయించారు. ఇంతవరకు మహరాష్ట్రలోని షోలాపూర్, మన రాష్ట్రంలోని కర్నూలు నుంచి తెప్పిస్తున్న అధికారులు.. డిమాండ్‌ను తట్టుకునేందుకు కె.పి.రకం ఉల్లిని కూడా తెప్పిస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉండటంతో కిలో రూ.50 రేటుకు రైతుబజార్లలో విక్రయిస్తున్నారు. దీనితోపాటు రూ.25 రకం ఉల్లి విక్రయాలు కూడా కొనసాగుతున్నాయి.
నేడూ సీతమ్మధారలో అమ్మకాలు..
ఉల్లి డిమాండ్ తగ్గేవరకు వారాంతపు సెలవులు రద్ద చేయడంతో సీతమ్మధార రైతు బజారు మంగళవారం కూడా పని చేయనుంది. సోమవారం ఈ బజారులో 2925 కిలోల కర్నూలు ఉల్లి రూ.25 రేటుకు అమ్మారు. మధ్యాహ్నం రూ.50 రేటుతో కె.పి.రకం ఉల్లి అందుబాటులోకి తెచ్చారు. రకాల్లో తేడా తెలియక పలువురు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నా పోలీసులు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. మరోవైపు మంగళవారం సీతమ్మధార రైతుబజారులో షోలాపూర్ ఉల్లి 3150 కిలోలు మంగళవారం విక్రయించనున్నారు. ఉదయం 6.30 నుంచే విక్రయాలు ప్రారంభమవుతాయని రైతుబాజరు ఈవో వరహాలు తెలిపారు. జనం రద్దీని తట్టుకొని విక్రయాలు సాఫీగా జరిగేందుకు వీలుగా రైతుబజార్లలోని ఉల్లి కౌంటర్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వినియోగదారుడికి కిలో ఉల్లి అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెటింగ్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment