సాక్షి, న్యూఢిల్లీ : అలహాబాద్‌లో గంగా నదిపై రూ 1948 కోట్లతో పది కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలహాబాద్‌లోని ఫపమూ వద్ద రూ 1948 కోట్లతో ఆరు లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి సీసీఈఏ ఆమోదం తెలిపిందని రహదారులు, హైవేల మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిసెంబర్ 2021 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో ప్రస్తుత రెండు వరుసల వంతెనపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయని ఓ ప్రకటనలో తెలిపింది.
అలహాబాద్‌లో జరిగే కుంభమేళా, అర్థ కుంభ్ ఇతర కార్యక్రమాల్లో ట్రాఫిక్ రద్దీని సైతం ఈ ప్రాజెక్టుతో అధిగమించవచ్చని పేర్కొంది. మధ్యప్రదేశ్ నుంచి లక్నో, ఫైజాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు కూడా ఈ బ్రిడ్జి ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కార్మికులకు దాదాపు 9.2 లక్షల పనిదినాలు కల్పించవచ్చని పేర్కొంది. అలహాబాద్ నుంచి ఫరక్కా వరకూ గంగానదిపై 2014 వరకూ కేవలం 13 వంతెనలే ఉండగా, ఇప్పుడు అదనంగా 20 వంతెనల నిర్మాణం చేపట్టామని, వీటిలో 5 వంతెనలను ఇప్పటికే ప్రారంభించగా ఏడు వంతెనలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment