మాట ఇవ్వడం.. మరచిపోవడం.. ప్రజలు గుర్తు చేసినా పట్టించుకోకపోవడం.. ఎన్నికల సమయంలో మళ్లీ అదే మాట ఇవ్వడం.. ఓట్లు అభ్యరి్థంచడం.. కొందరు ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది. అయితే ఇందుకు భిన్నంగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇచ్చిన మాటమీద నిలబడ్డారు. పత్తికొండ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల ‘దారి’్రద్యాన్ని తొలగించారు. ఆయా ప్రాంతాల ప్రజల మధ్య అనుబంధాలకు ‘వారధి’ వేశారు. దూదేకొండ – కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు(అర్బన్): వర్షాకాలం వచ్చిందంటే వారిలో వణుకు ప్రారంభమయ్యేది. ఊరి సమీపంలోని వాగు పొంగితే సమీప గ్రామాలకు రాకపోకలు ఆగిపోయేవి. పంట పొలాలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. అరోగ్యం బాగాలేకపోయి, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలన్నా నరకాన్ని అనుభవించాల్సి వచ్చేది.. ఈ దుస్థితిని ఆ గ్రామ ప్రజలు ఎందరికో వివరించారు. చూద్దాం.. చేద్దాం అన్నారు తప్పితే చిత్తశుద్ధితో ఎవరూ ప్రయత్నం చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పత్తికొండ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంగాటి శ్రీదేవి.. గ్రామ ప్రజల కష్టాన్ని విన్నారు. తాను గెలిచిన వెంటనే బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని దూదేకొండ – కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.
రూ. 6.62 కోట్ల ఖర్చు
పత్తికొండ మండలం దూదేకొండ – కొత్తపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగుపై లోలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.62 కోట్ల ఏపీఆర్‌ఆర్‌పీ నిధులు మంజూరయ్యాయి. దీంతో ఈ రెండు గ్రామాలను కలుపుతూ ఉన్న మట్టి రోడ్డును పూర్తిగా తవ్వేసి, రోడ్డు మ«ధ్యలో ఉన్న వంకపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జికి రెండు వైపులా 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును వేశారు. బ్రిడ్జి నిర్మాణానికి నాలుగు శ్లాబ్‌లను పూర్తి చేసి రోడ్డుకు అవసరమైన ప్రాంతాల్లో 10 కల్వర్టులను (మోరీలు) నిర్మించారు. ఈ బ్రిడ్జీ, రోడ్డు నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో దూదేకొండ నుంచి కొత్తపల్లి మీదుగా పులికొండ తదితర గ్రామాలకు వెళ్లేందుకు మార్గం సులభమైంది.
పెరగనున్న రవాణా సౌకర్యాలు
రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు జాతీయ, జిల్లా రహదారులను అభివృద్ధి చేస్తూనే, మరో వైపు పల్లె రోడ్లకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్‌పీ) నిధులతో జిల్లాలోని పలు రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో రూ.30 కోట్ల వ్యయంతో పత్తికొండ నియోజకవర్గంలోని దూదేకొండ – కొత్తపల్లి, కోడుమూరు నియోజకవర్గంలోని గోరంట్ల హంద్రీ నదిపై బ్రిడ్జీల నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే ఒక బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తయ్యాయి. మరో రోడ్డు, బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు బ్రిడ్జీలు పూర్తి అయితే పది గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు 15 కిలోమీటర్ల దూరం కూడా తగ్గనుంది. ఈ రెండు ప్రాంతాల్లో బ్రిడ్జీలను నిర్మించాలనే ప్రజల కోరికను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ బ్రిడ్జీలకు మోక్షం లభించింది.
మరో రెండు వంతెనలకు రూ.8.10 కోట్లతో అంచనాలు
పత్తికొండ నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు వంతెనల నిర్మాణాలకు సంబంధించి పంచాయతీరాజ్ ఇంజినీర్లు రూ.8.10 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఈఏడాది జూన్ 1వ తేదిన పత్తికొండకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఈ రెండు వంతెనల అంశాన్ని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తీసుకువెళ్లారు. అందుకు ముఖ్యమంత్రి వెంటనే సమ్మతించిన నేపథ్యంలో పీఆర్ ఇంజినీర్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. రూ.70 లక్షలతో కంభాలపాడు – కోయిలకొండ మార్గంలో లోలెవెల్ వంతెన, కృష్ణగిరి మండలం గోకులపాడులో రూ.7.40 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణాలకు త్వరలోనే మంజూరు ఉత్తర్వులు వెలువడనున్నాయి.
హంద్రీ నదిపై సాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు
హంద్రీ నదిపై వేగంగా బ్రిడ్జి పనులు
కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి ఆనుకొని ప్రవహిస్తున్న హంద్రీ నదిపై రూ.24.12 కోట్ల ఏపీఆర్‌ఆర్‌పీ నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు పియర్స్ పనులు పూర్తి అయ్యాయి. పియర్ క్యాప్స్, హెడ్ హారŠమ్స్ పూర్తి చేసిన అనంతరం శ్లాబ్ వేయనున్నారు. నిరీ్ణత సమయంలోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ... హంద్రీ నదికి ఇటు పక్క ఉన్న కృష్ణగిరి మండలంలోని బీ ఎర్రబాడు, మన్నేకుంట, ఎస్‌హెచ్ ఎర్రగుడి, కొత్తపల్లి, రామక్రిష్ణాపురం, మల్లాపురం తదితర గ్రామాల ప్రజలకు ఉన్న రాకపోకల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పైగా ఈ మండలంలోని కంభాలపాడు, ఎరుకులచెర్వు తదితర గ్రామాల నుంచి జిల్లా కేంద్రమైన కర్నూలుకు వచ్చేందుకు 15 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 330 మీటర్ల పొడవుతో బ్రిడ్జి, 5.9 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభమైన ఈ పనులను నిరీ్ణత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment