న్యూఢిల్లీ: చాలా తెలివైన విద్యార్థి. కష్టపడి చదివేవాడు.10, 12వ తరగతిలో టాపర్.. IITలో సీటు కోసం కష్టపడ్డా... దొరక్కపోవడంతో కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ కాలేజీలో అడ్మిషన్ తో సరిపెట్టుకున్నాడు. అయితేనేం ఇపుడు కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయనే UPకి చెందిన అలఖ్ పాండే. ఐఐటీ రాలేదని నిరాశ చెందకుండా ట్యూషన్ టీచర్‌గా కెరియర్ మొదలు పెట్టి ఇప్పుడు విజయవంతమైన ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగాడు. ఆన్‌లైన్ లర్నింగ్ ప్లాట్‌ఫాం ద్వారా బిలియనీర్‌గా ఎదిగాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం ఏలతాడు అన్నట్టు తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
అలహాబాద్ కుర్రోడు బిలియనీర్‌గా
అలహాబాద్‌కు చెందిన అలఖ్ పాండే ఇంటర్ చదువుతున్నపుడు ఐఐటీ గురించి కలలు కన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అది సాధ్యం కాలేదు. అయినా కుంగిపోలేదు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోనే చదువుకు టాటా చెప్పేసాడు. సొంత కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్ టీచర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. ట్యూటర్‌గా అతని తొలి సంపాదన రూ. 5వేలు మాత్రమే. మరిపుడు వేల కోట్ల విలువైన "ఫిజిక్స్ వాలా" అనే కంపెనీ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా శబాష్ అనిపించుకుంటున్నాడు. యూట్యూబర్ కూడా అయిన అలఖ్ పాండే విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తాడు. అలాగే తన యాప్ ద్వారా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు రోజుకు కనీసం 1.5 గంటలు శిక్షణ తీసుకుంటున్నారంటే అతని క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిజిక్స్ వాలాలో జేఈఈ-నీట్ శిక్షణను కూడా ప్రారంభించాడు. అంతేకాదు ఈనెల (ఫిబ్రవరి) 28న విశ్వాస్ దివస్ పేరుతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెస్ట్ లాంచ్ చేయబోతున్నానని ప్రకటించాడు అలఖ్ పాండే.
ఫిజిక్స్ వాలా ఆవిర్భావం
ఇంజినీరింగ్ వదిలి అలహాబాద్ తిరిగొచ్చి 2016లో ఫిజిక్స్ వాలా ఛానెల్‌ని ప్రారంభించాడు. దీని తరువాత 2020లో ఒక యాప్‌ను కూడా ప్రారంభించాడు. ఇటీవల భారీ పెట్టుబడులతో పాండే కంపెనీ మొత్తం నికర విలువ రూ.8500 కోట్లుగా నిలిచింది. అలఖ్ యూట్యూబ్ ఛానల్ కు 9.75 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గతేడాది ఆయన కంపెనీ రూ.350 కోట్లు ఆర్జించింది. కంపెనీలో 19వేల మంది ఉద్యోగులు ఉన్నారు. బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ఫిజిక్స్‌వాలా దేశంలోని 101వ యునికార్న్‌గా ఉంది. తాజాగా ఆయన రూ.777 కోట్ల పెట్టుబడులను సమీకరించారు.
దేశీయ 101వ యూనికార్న్ ఫిజిక్స్ వాలా
ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఫిజిక్స్ వాలా (PWగా పాపులర్) వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, GSV వెంచర్స్ నుండి సిరీస్ A ఫండింగ్ 100 మిలియన్లను సేకరించడం ద్వారా భారతదేశపు 101వ యునికార్న్‌గా అవతరించింది. 2020, 2021లో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వంటి పోటీ పరీక్షలలో 10వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని కంపెనీ గతంలో ప్రకటించింది. భారతదేశంలో కనీసం ఆరుగురిలో ఒకరు వైద్య విద్యార్థులు, 10మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఫిజిక్స్‌వాలాకి చెందిన వారుంటారని పేర్కొంది. అలాగే బైజూస్, వేదాంతా వంటి ఇతర అనేక ఎడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా ఇప్పటికే 18 నగరాల్లో 20 కంటే ఎక్కువ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేశారు పాండే.
300 మంది సామూహిక వివాహాలకు ఫండింగ్
ఫిబ్రవరి 22న జర్నలిస్ట్ శివాని దూబేతో ఏడు అడుగులు వేశాడు అలఖ్. మరో విశేషం ఏమిటంటే తమ పెళ్లి సందర్బంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహాలకు ఫండింగ్‌కు ముందుకొచ్చాడు. అంతేకాదు పెళ్లి తరువాత కూడా చదువు కొనసాగించాలనుకునే వారికి చదువుకునేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు పాండే. మార్చి ప్రారంభంలో ప్రయాగ్‌రాజ్, తేలియార్‌గంజ్‌లోని NRIPT గ్రౌండ్‌లో 300మందికి సామూహిక వివాహ వేడుకలను నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment