ప్రారంభమైన కుంభమేళా.. | Kumbh Mela 2019 Prayagraj | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 15 2019 3:43 AM | Last Updated on Tue, Jan 15 2019 5:19 PM

Kumbh Mela 2019 Prayagraj - Sakshi

అలహాబాద్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా  ప్రారంభమైంది. ప్రయగ్‌రాజ్‌లో మంగళవారం ఉదయం 5.15 గంటలకు రాజయోగ స్నానాలతో కుంభమేళా ఉత్సవం మొదలైంది. అర్ధ కుంభమేళాకు 15 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభామేళా పూర్తయ్యేసరికి 4,300 కోట్ల రూపాయల వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఈ సారి భక్తులకు అక్షయ్‌ వాత్‌, సరస్వతి కుప్‌ల వద్ద పూజల చేసుకునే అవకాశం కల్పించారు. కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం యూపీ ప్రభుత్వం 100 హెక్టార్లలో గుడారాలు ఏర్పాటు చేసింది. 

మకర సంక్రాంతి సందర్భంగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభమయిన ఈ మహా జనయజ్ఞం మార్చి 4వ తేదీ వరకు అంటే మహాశివరాత్రి దాకా కొనసాగనుంది. 12 ఏళ్లలో రెండు పర్యాయాలు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అర్థ కుంభ్‌గా పిలుస్తుంటారు. కానీ, యూపీ ప్రభుత్వం ఇటీవల ఆ పేరును కుంభ్‌గా మార్చింది. ఈ కార్యక్రమంలో అందరినీ ఆకర్షించే అఖాడాలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నారు.

తాత్కాలిక మహానగరి
సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు 50 రోజులపాటు సాగే ఈ క్రతువులో 12 కోట్ల మంది వరకు పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగినట్లుగా భారీ ఏర్పాట్లు చేపట్టాయి. గంగా–యమున నదీ తీరాన 32 వేల హెక్టార్లలో ఏర్పాటు చేసిన కుంభ్‌నగరి ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా రికార్డు కెక్కింది. ఇందులో 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 20 వంతెనలు, ఇంకా ఆస్పత్రులు, పోలీస్‌ స్టేషన్లు, బ్యాంకులు..ఇలా ఒక నగరంలో ఉండే అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు.

కుంభ్‌ నగరిలోకి అత్యవసర సేవలందించే వాటిని తప్ప మిగతా అన్ని రకాల వాహనాలను నిషేధించారు. ఇక్కడ 15 రాష్ట్ర ప్రభుత్వాలు 261 కార్యక్రమాలను చేపట్టాయి. యూపీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు 28, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆరు విభాగాలు ఈ కుంభమేళా నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి. 2013లో జరిగిన పూర్ణ కుంభమేళా కంటే దాదాపు మూడు రెట్లు నిధులు అంటే రూ.4,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అప్పటి కంటే ఇప్పుడు ఏర్పాట్లు చాలా బాగున్నాయి. కానీ, చాలా లోపాలున్నాయి.

మా టెంట్‌లో లైట్లు బిగించటానికి రూ.200 లంచం ఇవ్వాల్సి వచ్చిందని జునా అఖాడాకు చెందిన ఓ సాధువు తెలిపారు.లౌడ్‌ స్పీకర్లలో వినిపించే ఆధ్యాత్మిక గీతాలు.. దిగంబర దేహ మంతటా విబూధి రేఖలు, గంజాయి నింపిన చిలుంలను పీలుస్తూ నాగా సాధువులు చేసే ఆనంద నృత్యాలు.. వీటన్నిటినీ ఆసక్తిగా తిలకిస్తూ ఫొటోలు తీసుకునే విదేశీ యాత్రికులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. దీంతోపాటు ఇక్కడ మత రాజకీయాల ప్రస్తావన కూడా కనిపిస్తుంది. మేళా సందర్భంగా అయోధ్యలో రామాలయంపై వివిధ హిందుత్వ సంస్థలు ‘ఇప్పుడు నీవు రామ మందిరం నిర్మించ లేకుంటే ముందు తరాల వారికి ఎలా మొహం చూపిస్తావు’ అంటూ హోర్డింగులు ఏర్పాటు చేశాయి.

13 అఖాడాలు
8వ శతాబ్దానికి చెందిన హిందూ గురువు ఆదిశంకరాచార్య సనాతన ధర్మాన్ని రక్షించే లక్ష్యంగా సాధువులకు చెందిన వివిధ సంస్థలను ఏకతాటిపైకి తెచ్చేందుకు అఖాడాలను నెలకొల్పారు. ఒక్కో అఖాడా ఒక్కో సిద్ధాంతం, ఆచార సంప్రదాయాలను పాటిస్తాయి. ఆరాధన విధానాన్ని బట్టి శైవ, వైష్ణవ, ఉదాసీన్‌ అనే మూడు ముఖ్యమైన అఖాడాలున్నాయని అఖిల భారతీయ అఖాడా పరిషత్‌(ఏబీఏపీ) అధ్యక్షుడు నరేంద్ర గిరి తెలిపారు. మొత్తం 13 అఖాడాల్లో ఏడు శైవ, మూడు వైష్ణవ, 2 ఉదాసీన, ఒక సిక్కు అఖాడాలున్నాయని తెలిపారు. అఖాడా అంటే అఖండం, విడదీయరానిదని అర్థం అని ఆయన వివరించారు. జునా అఖాడా అతి ప్రాచీనమైంది, అన్నిటి కంటే పెద్దదిగా చెబుతుంటారు.

జన వాక్కు
‘సౌకర్యం, అసౌకర్యాల గురించి ఆలోచించొద్దు. ఆ గంగామాతను స్మరించుకోండి. మీ కష్టం, అలసట అంతా దూరమవుతుంది..’ అన్నారు కనౌజ్‌ నుంచి కుంభ్‌నగరికి చేరుకున్న ప్రమోద్‌ ప్రకాశ్‌(55) అక్కడున్న మిగతా వారిని చూపిస్తూ. ఈయన బరువైన మూడు బ్యాగులను మోసుకుంటూ స్థానిక రైల్వే స్టేషన్‌ నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చారు.  

‘స్వచ్ఛమైన భక్తిభావం ఇక్కడి వారిలో చూస్తున్నాం. కుంభమేళా నిర్వహణ కూడా చాలా బాగుంది. మేం మాటల్లో చెప్పలేం. ఈ అద్భుతాన్ని ఎవరైనా చూసి నమ్మాల్సిందే. ఇంతపెద్ద కార్యక్రమం, అసంఖ్యాక జనం, కొంత గందరగోళం అనిపించినా, ప్రతి ఒక్కటీ సజావుగా సాగిపోతోంది. వీటన్నిటి వెనుకా ఏదో అతీతశక్తి ఉంది’ అన్నారు ఇటలీ నుంచి వచ్చిన అలాసియో దంపతులు.

పిల్లలు తప్పిపోకుండా ట్యాగ్‌లు
కుంభమేళా సందర్భంగా తప్పి పోయిన పిల్లలను గుర్తించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌)ట్యాగ్‌లను అందజేస్తున్నారు. వొడాఫోన్‌ కంపెనీ సహకారంతో 40వేల ట్యాగ్‌లను సమకూర్చుకున్నట్లు డీఐజీ వివరించారు.  

అత్యంత పవిత్రమైన 6
త్రివేణీ సంగమంలో స్నానమాచరించేందుకు పవిత్రమైనవి ఆరు రోజులు. అవి మకర సంక్రాంతి పర్వదినం కాగా, పౌష్‌ పూర్ణిమ(జనవరి 21), మౌని అమావాస్య(ఫిబ్రవరి 4), వసంత పంచమి(ఫిబ్రవరి 10), మాఘి పూర్ణిమ (ఫిబ్రవరి 19), ఆఖరిది మార్చి 4వ తేదీ మహాశివరాత్రి. కాగా, వీటిలో మొదటి, ఆఖరి రోజులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో వేకువజామున 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు స్నానం చేయడం శుభప్రదంగా చెబు తారు.

భద్రత నీడలో
కుంభమేళా సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు డీజీపీ అభినయ్‌ పాండే తెలిపారు. మేళాలో బందోబస్తు కోసం 20వేల పోలీసులు, 6 వేల హోంగార్డులు, 40 పోలీస్‌ స్టేషన్లు, 40 ఫైర్‌ స్టేషన్లు,  80 కంపెనీల కేంద్ర బలగాలు, ఇతర బలగాలను మోహరించినట్లు చెప్పారు. 30 మహిళా పోలీస్‌స్టేషన్లు, సంఘటన జరిగిన 10 నిమిషాల్లోనే  చేరుకునేలా 317 పోలీస్‌ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. డ్రోన్‌ కెమెరాలు, వాచ్‌ టవర్లు, బ్యాగేజీ స్కానర్లు, ఆధునిక సమాచార వ్యవస్థను నెలకొల్పామన్నారు. ‘1, 200 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర కమాండ్‌–కంట్రోల్‌ రూం నెలకొల్పాం. భారీగా జనం గుమికూడినా, తొక్కిసలాటలు జరిగే అవకాశమున్నా వెంటనే గుర్తించేందుకు వీడియో అనలిటిక్స్‌ను వినియోగిస్తున్నాం. ఉగ్రవాదులు, అనుమానితులను గుర్తించేందుకు త్రినేత్ర యాప్‌ను వాడుకలోకి తెచ్చాం’ అని అన్నారు.


యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement