1,400 ఏళ్లకిందటే చైనా ప్రజలకు ఇష్టమైన గమ్యస్థానం
‘తీర్థరాజ్’గా బిరుదు పొందిన ప్రయాగరాజ్
ప్రయాగరాజ్: మహా కుంభమేళాకు ఆతిథ్యమివ్వనున్న ప్రయాగరాజ్(Prayagraj) పుణ్యక్షేత్రాల నగరంగా కీర్తికెక్కింది. దాదాపు 1,400 సంవత్సరాలుగా చైనా ప్రజలకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. భారత సాంస్కృతిక వారసత్వం పట్ల చైనాకు ఆకర్షణ నాటినుంచే బలంగా ఉందని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏడవ శతాబ్దపు చైనీస్ యాత్రికుడు యాత్రికుడు జువాన్జాంగ్ తన రచనలలో పేర్కొన్న విషయాలను ప్రభుత్వం ప్రస్తావించింది.
హర్షవర్ధనరాజు పరిపాలనలో...
చరిత్రలోకి వెళ్తే.. హ్యూయెన్ త్సాంగ్ అని కూడా పిలుచుకునే జువాన్జాంగ్ 16 ఏళ్ల పాటు భారతదేశంలోని (India) వివిధ ప్రాంతాలపై అధ్యయనం చేశారు. అందులో భాగంగా ప్రయాగరాజ్‌నూ సందర్శించారు. క్రీ.శ. 644లో హర్షవర్ధన రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాన్ని ఆయన ప్రశంసించారు. ధాన్యం సమృద్ధిగా ఉందని చాటి చెప్పారు. అలాగే అనుకూలమైన వాతావరణం, ఆరోగ్యం, సమృద్ధిగా పండ్లు ఇచ్చే చెట్లు ఉన్న ప్రాంతంగా ప్రయాగ్‌రాజ్‌ను ఆయన అభివర్ణించారు. ప్రయాగరాజ్, దాని పరిసరాల్లోని ప్రజలు ఎంతో వినయంగా, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని, అంకితభావంతో నేర్చుకుంటున్నారని తన రచనల్లో వర్ణించారు. అందుకే ప్రయాగరాజ్‌కు ‘తీర్థరాజ్’ (అన్ని పుణ్యక్షేత్రాల రాజు) బిరుదును వచ్చిందని వాస్తవాన్ని పురావస్తు సర్వేలు, అధ్యయనాలు మరింత బలపరుస్తున్నాయి.
ఆసక్తికర వర్ణణలు..
ప్రయాగరాజ్ సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి జువాన్జాంగ్ ‘సి–యు–కి’పుస్తకంలో రాశారని పురావస్తుశాఖ పేర్కొంది. జువాన్జాంగ్ రచనలు పురాతన కాలంలో ప్రయాగరాజ్ గురించి ఆసక్తికరంగా వర్ణించాయి. ‘ప్రయాగ్‌రాజ్‌లో పెద్ద ఎత్తున మతపరమైన ఉత్సవాలు జరిగాయని, 5లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో ఎందరో మహారాజులు, పాలకులు పాల్గొన్నారు. ఈ గొప్ప రాజ్యం యొక్క భూభాగం సుమారు 1,000 మైళ్ళ వరకు విస్తరించి ఉంది.
ప్రయాగ రాజ్ రెండు పవిత్ర నదులైన గంగా, యమునా మధ్య ఉంది.’అని జువాన్జాంగ్ పేర్కొన్నారు. నగరంలోని ప్రస్తుతం కోట లోపల పాతాళపురి ఆలయం గురించి కూడా రాశారు. ఇక్కడ ఒకే నాణే న్ని సమర్పించడం, వెయ్యి నాణేలను దానం చేయడంతో సమానమని ప్రజలు నమ్ముతున్నారని లిఖించారు. ప్రయాగరాజ్‌లో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసించే విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా– 2025 (Maha Kumbh Mela 2025) జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాలను పంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment