Temple City
-
విమానాల రిపేర్లకు అనువుగా తిరుపతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెంపుల్ సిటీగా పేరొందిన తిరుపతిలో విమానాల ఇంజిన్ల నిర్వహణ, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) ఫెసిలిటీ ఏర్పాటు పనులను వేగిరం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి మద్దిల శుక్రవారం విన్నవించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, వ్యాపార ఆవకాశాలను వివరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా నివేదిక రూపొందించింది. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 వేదికపై కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించారు. తిరుపతిసహా 8 ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్వో కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే నుంచి 440 మీటర్ల దూరంలోనే ప్రతిపాదిత ఎంఆర్వో కేంద్రం కోసం స్థలం ఉంది. ఇటువంటి సౌకర్యం దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో కూడా లేదు. ఎంఆర్వో సేవలకు అనువుగా ఉంటుంది’ అని గురుమూర్తి తెలిపారు. రెండు హెలిప్యాడ్స్ సైతం.. తిరుమలకు ఏటా 5.8 కోట్ల మంది భక్తులు, సందర్శకులు వస్తున్నారని గురుమూర్తి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘వీరిలో 40 శాతం మంది ఖర్చుకు వెనుకాడరు. నాలుగైదు రోజులు గడిపేందుకు సిద్ధంగా ఉంటున్నారు. తిరుపతితోపాటు కోస్తా ప్రాంతంలో హెలిప్యాడ్స్ స్థాపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ఇవి కార్యరూపంలోకి వస్తే తిరుమల వచ్చిన వారు కోస్తా ప్రాంతంలో ఉన్న సందర్శనీయ స్థలాలకు హెలికాప్టర్లో సులువుగా వెళ్లవచ్చు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ పనులు వేగిరం అయ్యాయి. స్థల సేకరణలో తలెత్తిన సమస్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో సమసిపోయాయి. కడపలో పైలట్ శిక్షణ కేంద్రం రానుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే దక్షిణాదివారు శిక్షణ తీసుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరాం’ అని వివరించారు. విదేశీ సంస్థలకు సైతం.. ఇన్వెస్ట్ ఇండియా నివేదిక ప్రకారం.. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2017–18లో విమాన రాకపోకలు 7,094 నమోదయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరం ఇది ఏకంగా 10,738కు ఎగసింది. మహమ్మారి కారణంగా 2021–22లో ఈ సంఖ్య 6,613కు వచ్చి చేరింది. 2020–21తో పోలిస్తే ఇది 49% అధికం. 2017–18లో 6.57 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. ఈ సంఖ్య 2018–19లో 8.48 లక్షలకు ఎగసింది. 2021–22లో 47% అధికమై 5.02 లక్షలకు వచ్చి చేరింది. ఇండిగో, స్పైస్ జెట్, ట్రూజెట్, అలయన్స్ ఎయిర్, ఎయిరిండియా, స్టార్ ఎయిర్ సంస్థలు అన్నీ కలిపి వారం లో 131 సర్వీసులు నడిపిస్తున్నాయి. తిరుపతి నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో 10 విమానాశ్రయాలు ఉన్నాయి. ఎంఆర్వో సేవలు అందించేందుకు ఈ నెట్వర్క్ దోహదం చేస్తుంది. ఆసియా పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సంస్థలకూ ఈ సేవలు విస్తరించేందుకు వ్యూహాత్మక కేంద్రంగా తిరుపతి ఉంది. ఏటా భారత్‌కు 120 కొత్త విమానాలు: సింధియా దేశంలో విమానయాన సంస్థల వద్ద ప్రస్తుతం 710 విమానాలు ఉన్నాయి. 2013–14లో ఈ సంఖ్య 400 మాత్రమే. రానున్న రోజుల్లో ఏటా కొత్తగా కనీసం 110–120 విమానాలు జతకూడనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా శుక్రవారం తెలిపారు. ఇక్కడి బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏడేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 74 నుంచి 140కి ఎగసింది. మూడేళ్లలో ఇది 220లకు చేరుతుంది. దేశీయంగా 2013–14లో 6.7 కోట్ల మంది ప్రయాణించారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 14 కోట్లకు చేరింది. ప్రస్తుతం రోజుకు 3.83 లక్షల మంది విహంగ విహారం చేస్తున్నారు. మహమ్మారి నుంచి ఈ పరిశ్రమ వేగంగా కోలుకుంది. వచ్చే ఏడాది కోవిడ్–19 ముందస్తు స్థాయిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య రోజుకు 4.1 లక్షలు దాటనుంది. 2018–19లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 34.4 కోట్లు. 2024–25 నాటికి ఇది 40 కోట్లు దాటుతుంది’ అని సింధియా తెలిపారు. ఇన్వెస్ట్ ఇండియా నివేదికను జ్యోతిరాదిత్యతో కలిసి ఆవిష్కరిస్తున్న -
భద్రాద్రిని టెంపుల్ సిటీగా మారుస్తాం
భద్రాచలంటౌన్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భద్రాచలం పట్టణాన్ని టెంపుల్ సిటీగా మారుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాచైతన్య బస్సుయాత్రలో భాగంగా బుధవారం భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజలను, నిరుద్యోగులను, రైతులతో పాటు భారతావనికి ఆరాధ్యుడైన శ్రీసీతారామచంద్రస్వామి వారిని కూడా మోసం చేశారని విమర్శించారు. రామాలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చి మూడేళ్లు గడిచిన ఒక్క పైసా విడుదల చేయలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి, తమ ఘనతగా టీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. శబరినదిపై హైడల్ పవర్ ప్రాజెక్టును, దానికి కింద శబరి, గోదావరి కలిసే ప్రాంతంలో దుమ్ముగూడెం వద్ద అద్భుతమైన ఇందిరాసాగర్ ప్రాజెక్టును రూపకల్పన చేసి 80 శాతం పనులను పూర్తి చేస్తే, ఆ ప్రాజెక్టును తీసేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు అడ్డాగా భద్రాచలం మారిందని, ఇసుక ర్యాంప్‌లన్నీ టీఆర్ఎస్ నాయకులవేనని అన్నారు. కేసీఆర్‌కు ప్రజలన్నా, రాముడన్నా, దేవుడన్నా, ఆచారాలు, సాంప్రదాయాలన్నా గౌరవం లేదన్నారు. సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వనమా వెంకటేశ్వరరావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాంబాబు, నాయకులు తోటకూర రవిశంకర్, బుడగం శ్రీనివాస్, బొలిశెట్టి రంగారావు పాల్గొన్నారు. -
చేతకాకుంటే వైదొలగండి
సాక్షి, యాదాద్రి: ‘‘మీకు చేత కాకపోతే చేసిన పనికి డబ్బులు తీసుకుని పక్కకు తప్పుకోండి. వారంలో మరొకరికి టెండర్ ఇస్తాం. చేతులతో పనులు చేస్తున్నారా లేక మిషన్లతో చేస్తున్నారా?... గోదావరి నదిపై వంతెనలు కడుతున్నారు. ఇలా అయితే 20 ఏళ్లయినా ఈ (యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ నిర్మాణం) పనులు పూర్తికావు’’ అంటూ కాంట్రాక్టర్లు, వైటీడీఏ అధికారులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యమవుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ సతీసమేతంగా దర్శించుకున్నారు. అలాగే ప్రధానాలయ నిర్మాణ పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఇలా అయితే బ్రహ్మోత్సవాల నాటికి ఎలా పూర్తి చేస్తారు? ముందుగా యాదాద్రికొండపై పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ అక్కడ జరుగుతు న్న పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సివిల్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, వైటీడీఏ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. సివిల్ కాంట్రాక్టర్‌ను పిలిపించి రిటైనింగ్ వాల్ పనుల జాప్యంపై నిలదీశారు. పనులు ఆల స్యంగా జరిగితే ముందుగా అనుకున్నట్లుగా మార్చిలో జరిగే బ్రహ్మోత్సవాల నాటికి ఎలా పూర్తి చేస్తారని, అనుకున్న సమయానికి భక్తులకు ప్రధాన ఆలయంలోని స్వయంభూ దర్శనం ఎలా కల్పిస్తామని ప్రశ్నించారు. విస్తరణ పనులు ఇంత ఆలస్యంగా జరిగితే భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని, అనుకున్న సమయానికి ప్రధానాలయం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శిల్పి పనులు మరింత వేగంగా చేయాలన్నారు. పనులు జరుగుతున్న తీరు సరిగా లేదని ఇంకెంత కాలం పొడిగిస్తారని ఆర్కిటెక్ట్, స్థపతులను సీఎం ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం వద్ద నిర్మితమవుతున్న ఆళ్వార్ విగ్రహాలను, ప్రాకారం, తూర్పు, పడమటి రాజగోపురాలు, ప్రసాద విక్రయశాల, శివాలయం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణం, రథ మండపం, మెట్లదారి, పుష్కరిణిలను సీఎం పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రసాద విక్రయశాల నిర్మాణంలో కొన్ని మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధి విషయంలో ఇబ్బందుల్లేకుండా పనులు చేయాలని, ప్రతి పనికి డబ్బు చెల్లింపుల్లో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. టెంపుల్ సిటీ పనుల్లో వేగం పెంచాలి... పెద్దగుట్టపై టెంపుల్ సిటీ పనులు పరిశీలించారు. టెంపుల్ సిటిపై భక్తులకు ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని పెంపొందించేలా గార్డెనింగ్ ఉండాలని, చిన్నారులు ఆడుకోవడానికి గార్డెనింగ్‌లో ఆట వస్తువులను ఏర్పాటు చేయాలన్నారు. టెంపుల్ సిటీ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తయితే దాతలు గదులు నిర్మించడానికి వచ్చే వారన్నారు. ఈ సందర్భంగా పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు గొంగిడి సునీత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, స్థపతి సుందర్రాజన్, ఆలయ శిల్పి ఆనందసాయి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. యాదాద్రి చుట్టూ ఓఆర్ఆర్... యాదాద్రి చుట్టూ ఏడు రోడ్లను కలుపుతూ ఏడు జంక్షన్లతో ఏడు కిలోమీ టర్ల మేర ఆరు లేన్ల ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ ఆర్) నిర్మించాలని సీఎం కేసీఆర్ అధికా రులను ఆదేశించారు. ఇందుకు అవసరమయ్యే రూ. 143 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే యాదగిరిగుట్టలో 100 నుంచి 150 మంది సాయుధ పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ హెడ్‌క్వార్ట ర్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యాదగిరిగుట్ట గ్రామాన్ని మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
టెంపుల్ సిటీగా భద్రాద్రి
యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతాం ► ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి ► ఆగస్టు నాటికి పనులు ప్రారంభించాలి ► అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల సాక్షి, కొత్తగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు. యాదాద్రి తరహాలో భద్రాద్రిని కూడా టెంపుల్ సిటీగా ఏర్పాటు చేసేందుకు టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని తన చాంబర్లో గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాద్రి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నారని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి నమూనా రూపకల్పనకు దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, ఆర్కిటెక్ ఆనందసాయితో చర్చలు జరిపారు. ఆలయ అభివృద్ధి డీపీఆర్‌లను ఆగస్టు వరకు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన అనుమతులను మంజూరు చేయించుకొని, ఆగస్టులోగా టెండర్లు పిలవాలని, వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధి నమూనా విషయంలో చిన్నజీయర్ స్వామి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆర్కిటెక్ ఆనందసాయికి సూచించారు. నూతన నమూనాను రూపొందించి ఇప్పటికే చిన్నజీయర్ స్వామికి చూపించామని, ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశారని, ఆ తర్వాతే డిజైన్ ఫైనల్ చేశామని ఆనందసాయి మంత్రికి వివరించారు. అలయ అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను తుమ్మలకు వివరించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ గోపుర నమూనాలో ఎంటువంటి మార్పులు లేకుండా ఆలయ ప్రాకారం, మాడ వీధులలో మాత్రమే మార్పులు చేర్పులు చేపట్టామని వివరించారు. అలాగే స్వామి వారి కల్యాణ మండపం, బ్రహ్మత్సోవ మండపం, అన్నదాన సత్రాలను మాత్రమే పునఃనిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భక్త రామదాసు మెమోరియల్ ట్రస్ట్ డిజైన్ రూపొందించాలని ఆనందసాయికి సూచించగా, వారం రోజుల్లో డిజైన్ రూపొందిస్తామని ఆర్కిటెక్ చెప్పారు. భక్త రామదాసు మెమోరియల్ ట్రస్ట్‌కు సంబంధించి సీఎం కెసీఆర్ త్వరలోనే ఒక ప్రకటన చేస్తారని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని. ప్రధానమైన యాదాద్రి, వేములవాడ ఆలయాలకు ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సైతం గతంలోనే పలు సూచనలు చేశారని తెలిపారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భద్రాద్రి దేవాలయాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని అదికారులను కోరారు. -
తెలంగాణ తిరుపతిగా ‘యాదాద్రి'
♦ అద్భుత టెంపుల్ సిటీగా ప్రసిద్ధి చెందుతోంది: గవర్నర్ ♦ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నరసింహన్ దంపతులు సాక్షి, యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందుతోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానా లయ విస్తరణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై వైటీడీఏ అధికారులు, ఆర్కిటెక్ట్‌లను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గర్భాల యానికి మార్పులు చేర్పులు లేకుండా మిగతా విస్తరణ పనులు జరుగుతు న్నాయని పేర్కొన్నారు. అద్భుతమైన రీతిలో చేపట్టిన ఆలయ విస్తరణ పనులు పూర్తయితే యాదాద్రి పుణ్య క్షేత్రం టెంపుల్ సిటీగా, దేశంలోనే ప్రముఖ ఆలయంగా ప్రసిద్ధి చెందుతోందని గవర్నర్ తెలిపారు. యాదాద్రి క్షేత్రంలో నగదురహిత లావాదేవీలు నిర్వహించడం అభినందనీయ మని చెప్పారు. కాగా, గవర్నర్ రెండు దుకాణాల వద్ద ఆగి డిజిటల్ లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయ పనులపై ‘పవర్ పాయింట్’ ప్రధానాలయ విస్తరణ, వివిధ అభివృద్ధి పనులను దేవస్థానం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు. ఎక్కడెక్కడ రాజ గోపురాలు వస్తున్నాయి, మాడ వీధులు ఏ విధంగా వస్తున్నాయి, దివ్యవిమాన గోపురం ఎలా ఉంటుంది, శివాలయం ఏ విధంగా రూపుదిద్దుకోబోతుంది అనే విషయాలను వారు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. స్వామి వారి అభిషేకానికి తిరుపతి తరహాలో బావి నుంచి నీటిని తెచ్చి అభిషేకం చేయాలన్నారు. రోడ్ల విస్తరణను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆలయ గోపురాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు.. ధ్వజస్తంభం ఎక్కడ, భక్తులు ఎటు వైపు నుంచి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారని, ఆంజనేయస్వామి 108 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. భక్తులు క్షేత్ర పాలకుడిని దర్శించుకున్న తర్వాతే ఆలయంలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని గవర్నర్ సూచించారు. అలాగే శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి, శివాలయం ప్లానింగ్‌ను గవర్నర్‌కు చూపించారు. శివాలయ నిర్మాణానికి సంబంధించిన ప్లానిం గ్ పూర్తి అయిందని, త్వరలోనే టెండర్లు పిలు స్తామని అధికారులు గవర్నర్‌కు వివరించారు. -
వాస్తు దోషాలను సరిదిద్దండి
-
కొత్త జిల్లాలకు తీరొక్క పేరు..!
సీఎం చెప్పేదొకటి.. జీవోల్లో మరొకటి సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల పేర్లపై గందరగోళం నెలకొంది. ఫైనల్ గెజిట్‌లో ఒక పేరుండటం, వాడుకలో మరో పేరు ఉండటం, ముఖ్యమంత్రి చేసిన సూచనలు మరో తీరుగా ఉండటంతో విపత్కర పరిస్థితి నెలకొంది. ఏ పేరును ప్రామాణికంగా స్వీకరించాలి.. పరిపాలన వ్యవహారాల్లో ఏ పేరు వాడాలనే అయోమయం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాత పేర్లకు అనుబంధంగానే కొత్తగా ప్రతిపాదించిన పేర్లను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమీక్షలన్నింటా అధికారులకు ఆదేశాలిచ్చారు. దీని ప్రకారం గద్వాల జిల్లాకు జోగుళాంబ అని పేరు పెట్టినప్పటికీ ‘జోగుళాంబ గద్వాల’ జిల్లాగా కొనసాగించాలి. కానీ కొత్త జిల్లాల ఆవిర్భావం రోజున జారీ చేసిన గెజిట్‌లో ‘జోగుళాంబ జిల్లా’ అని పేర్కొన్నారు. అదేవిధంగా సిరిసిల్ల కేంద్రంగా ‘రాజన్న జిల్లా’ అని జీవో ఇచ్చారు. కానీ అక్కడున్న ప్రభుత్వ కార్యాలయాలు, స్టాంపులన్నీ ‘రాజన్న సిరిసిల్ల’ పేరుతో చెలామణిలోకి వచ్చాయి. కుమ్రం భీం, జయశంకర్ జిల్లాలన్నింటా ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం యాదాద్రి పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని గుర్తించారు. యాదాద్రి జిల్లా పేరును ‘యాదాద్రి భువనగిరి’ జిల్లాగా పిలవాలని ప్రకటించారు. ఇప్పటికైనా అధికారులు కొత్త జిల్లాలకు పెట్టిన పేర్లపై మరింత స్పష్టత ఇచ్చేలా.. జీవోల్లో ఉన్న తీరొక్క పేర్లను సవరించాల్సిన అవసరముంది. యాదాద్రి పేరు యాదాద్రి భువనగిరి: సీఎం కేసీఆర్ యాదాద్రి జిల్లాను ‘యాదాద్రి భువనగిరి’ జిల్లాగా పిలవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట, జిల్లా కేంద్రంగా భువనగిరి జంటగా అభివృద్ధి చెందుతాయని సీఎం అన్నారు. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంచాలని సూచించారు. బుధవారం సాయంత్రం యాదాద్రి నుంచి తిరిగి వస్తుండగా కేసీఆర్ భువనగిరిలో కాసేపు ఆగారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన భువనగిరిలోని ఎలిమినేటి కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. కుటుంబ యోగక్షేమాలు, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ సమయంలో గడిపిన సందర్భాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లా కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో భువనగిరి పట్టణం చాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంఎంటీఎస్, రీజనల్ రింగ్ రోడ్ భువనగిరి నుంచే వెళ్లనున్నందున రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని అన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. -
వాస్తు దోషాలను సరిదిద్దండి
- యాదాద్రి అభివృద్ధి పనుల పరిశీలన సందర్భంగా సీఎం ఆదేశం - ఆగ్నేయంలో సంపుల నిర్మాణం వద్దు - టెంపుల్ సిటీలో ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్ - హైదరాబాద్ హౌస్ తరహాలో ప్రెసిడెన్షియల్ సూట్లు సాక్షి, యాదాద్రి: ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తున్న యాదాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధి పనుల్లో వాస్తుదోషాలను సరిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పరిశీలించారు. ముందుగా ప్రధాన ఆలయానికి చేరుకున్న సీఎంకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎం కొండపైన జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీ లించారు. గర్భగుడి, ఆంజనేయస్వామి ఆలయాలను కదిలించకుండా అభివృద్ధి పనులను చేయాలని సూచించారు. రిటైనింగ్ వాల్, రాజగోపురాలు ఆలయ విస్తరణ పనులను తిలకించారు. ఈ సందర్భంగా శివాలయం, పుష్కరిణి మధ్యన నిర్మిస్తున్న మంచినీటి సంపు వివరాలను అడిగి తెలుసుకొని అవి వాస్తుకు విరుద్ధంగా ఉండడంతో సవరింపజేశారు. మంచినీటి ట్యాంకును ఎత్తయిన అన్నదాన సత్రంపై నిర్మించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూనే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అలాగే మూడంతస్తుల క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి 108 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలాన్ని, వంటశాల, ప్రసాదాల తయా రీ ప్రాంతాలను సీఎం పరిశీలించారు. పుష్కరిణి, మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సరఫరా కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని... దానికి అనుగుణంగా వసతులు ఉండాలని సూచించారు. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా పూజలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు జరగాలని సీఎం పేర్కొన్నారు. అనంతరం సమీపంలోని పెద్దగుట్టపై చేపడుతున్న టెంపుల్ సిటీ పనులను సీఎం సందర్శించారు. 250 ఎకరాల్లో 250 కాటేజీలు, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, క్యాంటీన్లతో కూడిన లే అవుట్‌ను సుమారు గంటసేపు పరిశీలించారు. గుట్ట పైభాగంలో నిర్మించే ప్రతి కాటేజీ వరకు రోడ్డు నిర్మాణం ఉండాలని... టెంపుల్ సిటీని విస్తరించేందుకు మరో 150 ఎకరాల భూసేకరణ చేయాలని ఆదేశించారు. ఇందులో కల్యాణ మండపాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు నిర్మించాలన్నారు. ప్రధాన ఆలయానికి ఈశాన్యం దిశలో సైదాపురం రోడ్డులో ఉన్న 13 ఎకరాల గుట్టపై ప్రెసిడెన్షియల్ సూట్లు నిర్మించాలని ఆదేశించారు. ఢిల్లీలోని హైద రాబాద్ హౌస్ తరహాలో సూట్లు ఉంటాయన్నారు. ఒక్కో సూట్ రూ. 8 నుంచి రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు వివరించారు. ప్రెసిడెన్షియల్ సూట్‌ను రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, గవర్నర్లకు మాత్రమే కేటాయిస్తామని చెప్పారు. వీటి నిర్మాణానికి పెద్ద ఎత్తున దాతలు విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే గుట్టకు దిగువ భాగంలో ఉన్న గోశాల, బస్టాండ్ స్థలాలను సీఎం పరిశీలించారు. తూర్పు, పడమర మార్గంలో నాలుగు లేన్ల రోడ్డును అభివృద్ధి చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి సమీపంలోని గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్లు వస్తున్నాయని... వీటితోపాటు గుట్టలోని చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సీఎం వెంట విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగి డి సునీత, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఈవో గీతారెడ్డి, ఆలయ శిల్పి ఆనంద్ సాయి, టెంపుల్ సిటీ రూపశిల్పి జగన్మోహన్రావు, కలెక్టర్ అనితా రామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రవి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, స్తపతి సుందరరాజన్, బడే రవి, ఏజేసీపీ శశిధర్‌రెడ్డి, జేసీపీ పి.యాదగిరి, ఏసీపీ మోహన్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ స్వామి, ఎంపీపీ జి.స్వప్న ఉన్నారు. ఉన్నతాధికారులతో సమీక్ష అభివృద్ధి పనులను పరిశీలించాక సీఎం అధికారులతో సమీక్షించారు. రానున్న రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగనున్నందున ఆ దిశగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయనున్న పెద్దగుట్ట ప్రాం తంలో అవసరమైన స్థలాన్ని సేకరించాలన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేం దుకు 4 దిక్కులా నాలుగు వరుసల రోడ్లు నిర్మించాలని, వంగపల్లి నుంచి యాదగిరిగుట్టకు రావడానికి 4 లేన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. స్వామి పూజకవసరమయ్యే పూలకోసం మొక్కలను స్థానికంగా పెంచేందుకు ఉద్యాన వనాలను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం యాదగిరిగుట్టలోనే నర్సరీ ఏర్పా టు చేయాలని అటవీ అధికారులకు సూచించారు. కాటేజీల నిర్మాణానికి జాతీ య స్థాయిలో దాతలు ముందుకు వస్తున్నందున త్వరగా లేఅవుట్లు రూపొం దించి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. -
టెంపుల్ సిటీ అద్భుతంగా ఉండాలి
- యాదాద్రి నిర్మాణ పనులు, డిజైన్లపై అధికారులతో సీఎం సమీక్ష - కాటేజీల నిర్మాణానికి ముందుకొచ్చిన సింగరేణి, జెన్కో - ఆ సంస్థలకు సరిపడా స్థలం కేటాయించాలని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, రాబోయే కాలంలో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రధానాలయానికి అభిముఖంగా గుట్టలతో కూడుకున్న ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన లే అవుట్లు, డిజైన్లను సీఎం పరిశీలించారు. టెంపుల్ సిటీని 850 ఎకరాల విశాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇందులో కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కింగ్, ఉద్యానవనాలు, ఫుట్‌పాత్‌లు, ఫుడ్ కోర్టులు, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాల్సిన పనుల డిజైన్లను ఖరారు చేశారు. 86 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టు, ఏడెకరాల విస్తీర్ణంలో మంచినీరు. మురుగునీరు నిర్వహణ వ్యవస్థ, పన్నెండున్నర ఎకరాల్లో గ్రీనరీ, 68 ఎకరాల్లో రహదారులు, 26 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, మరో 42 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయించారు. యాదాద్రి అభివృద్ధి పనులపై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, ఆలయ శిల్పులు ఆనందసాయి, ప్రవీణ్, ఇంజనీరింగ్ అధికారులు వెంకటేశ్వర్‌రెడ్డి, రమేశ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రిలో కాటేజీలు నిర్మించడానికి ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, జెన్‌కోలతోపాటు దేశవ్యాప్తంగా పలు కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయని, వారికి కేటాయించేందుకు వీలుగా 1,000 చదరపు గజాల నుంచి 1,500 గజాల ఓపెన్ ప్లాట్లను సిద్ధం చేయాలని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. కాటేజీలు నిర్మించే ప్రాంతంలో రహదారులు, మురుగునీరు, విద్యుత్, మంచినీరు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రధాన ఆలయానికి వెళ్లడానికి, తిరిగి రావడానికి రెండు వేర్వేరు రహదారులు నిర్మించాలని ఆదేశించారు. భక్తులను గుట్టపైకి తీసుకెళ్లడానికి ఆలయం తరఫునే ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించే యోచన ఉందని సీఎం వెల్లడించారు. గుట్టపైన నిర్మాణాలు పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యతలు చూసేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని సూచించారు. -
టెంపుల్ సిటీగా భద్రాచలం
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం: సీఎం కేసీఆర్ గోదావరి ఒడ్డున ప్రధాన ఆలయాలన్నీ అభివృద్ధి చేస్తాం ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: భద్రాచలం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని, విశాలమైన ఉద్యానవనాలు, అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలు నిర్మించాలని చెప్పారు. ఆలయ గర్భగుడిని యథాతథంగా ఉంచుతూనే భక్తుల సౌకర్యం కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రాచలం రాములవారి ఆలయ అభివృద్ధిపై బుధవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థపతి వల్లి నాయగం, దేవాదాయ శాఖ సీఈ కె.వెంకటేశ్వర్లు, ఆలయ నిర్మాణ రూపకర్తలు ఆనంద్‌సాయి, రవి, మధుసూదన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలయం ప్రస్తుత స్థితి, కల్యాణ మండపం, మాడ వీధులు, ప్రాకారం, పరిసర ప్రాంతాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీఎం వారికి పలు సూచనలు చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి ఒడ్డున ఉన్న ప్రముఖ ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రముఖ యాత్రా స్థలాలుగా పేరున్న ఈ దేవాలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ముఖ్యమైన ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువుగా కల్యాణ మంటపం, ఇతర ప్రాంగణాలను సిద్ధం చేయాలని సూచించారు. గోదావరి ఒడ్డున నిర్మించిన కరకట్ట, దేవాలయం మధ్య ఉన్న ప్రాంతాన్నంతటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న ప్రాకారం సరిపోతుందా, లేక మరోటి నిర్మించాలా అన్న అంశంపైనా అధ్యయనం చేయాలని ఆదేశించారు. దేవాలయం చుట్టూ ఉన్న రహదారులను మాడ వీధులుగా తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించాలన్నారు. మహాలక్ష్మి, ఆండాళ్ అమ్మవార్ల దేవాలయాన్ని, పర్ణశాల, చిత్రకూట మంటపం, జటాయువు మంటపం తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. స్థపతి, ఆలయ నిర్మాణ రూపకర్తలు, ఆగమ శాస్త్ర పండితులు కలసి పనిచేసి చినజీయర్ స్వామి సూచనలతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. శ్రీరామనవమి ఉత్సవాల తరువాత తాను భద్రాచలం వెళ్లి అక్కడ చేయాల్సిన మార్పులు, చేర్పులపై క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నట్లు చెప్పారు. -
యాదాద్రిలో అసలేముంది!?
‘యాదాద్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తాం. 2,000 ఎకరాల్లో యాదాద్రిని విస్తరించి.. ఏటా రూ.100 కోట్ల పెట్టుబడులతో దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం’ - ఇదీ ప్రభుత్వ ప్రణాళిక ‘అనుమతి కోసం డీటీసీపీ/హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంటే.. రెండేళ్లయినా ఫైల్ ముందుకు కదలట్లేదు. ఈలోపు బూమ్ తగ్గి ధరలెలా ఉంటాయో చెప్పలేం. అందుకే అనుమతులు రాకపోయినా లే-అవుట్లను వేసేశాం - ఇదీ రియల్టర్ల మాట ‘కూతురి పెళ్లి కోసమో.. కొడుకు పైచదువుల కోసమో దాచిన సొమ్ముతో స్థిరాస్తిని కొంటే.. అది కాస్త అక్రమ లే-అవుట్ అని తెలిసింది. ఇప్పుడేం చేయాలో తెలియని పరిస్థితి’ - ఇదీ సామాన్యుడి ఆవేదన ..ఇదీ క్లుప్తంగా యాదాద్రిలో జరుగుతున్న స్థిరాస్తి వ్యాపారం!! యాదాద్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తే.. దాని పేరు చెప్పి 30 కి.మీ వరకూ లే-అవుట్లు, వెంచర్లు వేసి రాత్రికి రాత్రే ధరలు పెంచేశారు రియల్టర్లు. అసలు యాదాద్రి గోపురానికి, రియల్ వ్యాపారానికి మధ్య ఉన్న పీటముడిని విప్పేందుకు ‘సాక్షి రియల్టీ’ స్థిరాస్తి నిపుణులతో చర్చించింది. వారేమన్నారంటే.. సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంకల్పించారు. 2,000 ఎకరాల్లో విస్తరించనున్న యాదాద్రి అభివృద్ధికి మూడేళ్ల పాటు ఏటా రూ.100 కోట్లు కేటాయించారు కూడా. ఫిబ్రవరిలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ)ను ఏర్పాటు చేసి పనులను ప్రారంభించారు. చీకట్లోని యాదాద్రి వెలుగులోకి.. యాదాద్రిలో రియల్ వృద్ధికి అవకాశమే లేదని కొట్టిపారేయలేమని కొందరు నిపుణులంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ప్రభుత్వం అభివృద్ధి పనులను ప్రారంభిస్తే ముందుగా పెరిగేది స్థిరాస్తి ధరలే. పెపైచ్చు యాదాద్రి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికనూ రూపొందించింది. అంటే టెంపుల్ సిటీ ప్లాన్ అనేది గుడి, గర్భగుడికే పరిమితం కాదు.. అక్కడి ప్రాంతం భవిష్యత్తు అభివృద్ధి, ప్రజల మౌలిక వసతులకు అనుగుణంగా ఉంటుంది. అంటే రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, మంచినీరు, విద్యుత్, పరిశ్రమలు, పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు ఇలా ప్రతి ఒక్కదానికీ అవకాశముంటుందన్నమాట. * యాదాద్రి- వరంగల్ మార్గం 163వ నంబరు జాతీయ రహదారిలో ఉంది. ఇది సుమారు 99 కి.మీ. వరకుంటుంది. వాస్తవానికి 163వ జాతీయ రహదారి పరిధి హైదరాబాద్ నుంచి భూపాలపట్నం దాకా 306 కి.మీ. వరకు ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు.. నాలుగు వరుసల రహదారి కొంత దూరం మాత్రమే ఉంది. దీన్ని సుమారు రూ.2,000 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి స్థాయిలో చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు యాదాద్రి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడంతో ఈ జాతీయ రహదారికి ఇరువైపులున్న గ్రామాలకు మహర్దశ పట్టింది. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులనూ తగ్గించేందుకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఇంటర్ చేంజ్ ఫ్లై ఓవర్లనూ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ట్రాఫిక్ చిక్కులుండవు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో మార్కెట్లకు చేరవేయవచ్చు. ఇక్కడ హోటళ్లు, రిసార్టులు, వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు వంటివి ఏర్పాటయ్యే అవకాశముంది. * పోచారంలో ఐటీఐఆర్ రీజియన్ అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం కానుండటం, బీబీనగర్‌లో గల నిమ్స్‌కు ఎయిమ్స్ హోదా దక్కనుండటం, ఇన్ఫోసిస్, రహేజాలు ఆరంభం కావటం, ఉప్పల్ ప్రాంతంలో మెట్రో ప్రారంభం కానుండటం.. మెట్రోను యాదాద్రి వరకూ విస్తరించటం వంటి అనేక సానుకూల అంశాలు యాదాద్రిలో స్థిరాస్తికి మరింత జోష్‌ను తీసుకొస్తుందనేది నిపుణుల అభిప్రాయం యాదాద్రిలో అన్నీ ఓపెన్ ప్లాట్లే.. హైదరాబాద్ నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న యాదాద్రి చుట్టూ 30 కి.మీ. పరిధిలో ఓపెన్ ప్లాట్లే ఉంటాయి. ఒక్క నిర్మాణమూ కనిపించదు. పోనీ ప్లాట్లలోనే ఇళ్లు కట్టుకుందామంటే నీళ్లు, కరెంట్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలూ లేవు. ఈమధ్య కాలంలో కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే.. ఖాళీ స్థలాల్లో టేకు, గంధం, మలబారు, పండ్ల మొక్కలను పెంచి 15 ఏళ్ల తర్వాత వాటిని అమ్మి పదింతల లాభాన్ని పొందవచ్చని కళ్లబొల్లి మాటలు చెబుతూ సామాన్యులను మోసం చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాస్తవానికి ఇలాంటి ఫాం ప్రాజెక్టులు గతంలో చాలానే వచ్చాయి. ఒక్కటీ సక్సెస్ అయిన దాఖలాల్లేవు. ప్రభుత్వానిదీ తప్పే.. యాదాద్రిలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గమనిస్తే అక్కడ రియల్ అవకాశాలు, వృద్ధి 5 కి.మీ. పరిధి వరకే విస్తరిస్తుందే తప్ప రియల్టర్లు చెబుతున్నట్టు యాదాద్రి నుంచి 30-40 కి.మీ. వర కూ ఉండదు. ఎందుకంటే యాదాద్రి అనేది తెలంగాణలోని అన్ని జిల్లాలకూ దూరమేమీ కాదు. దీంతో ఇతర జిల్లాల నుంచి భకు ్తలు ఒక్కరోజులో వచ్చివెళతారే తప్ప.. అక్కడే ఉండేంత అవసరం లేదు. * స్థిరాస్తుల్లో జరుగుతున్న మోసాల్లో కేవలం బిల్డర్లనే తప్పుపట్టలేం. ఎందుకంటే అనుమతుల జారీలో తీవ్రమైన జాప్యం చేస్తు న్న ప్రభుత్వానిదీ తప్పే. అందుకే త్వరితగతిన అనుమతుల జారీతో పాటు అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. * భవిష్యత్తు అభివృద్ధిని ఇప్పుడే ఊహించుకొని స్థిరాస్తులను కొనుగోలు చేయొద్దు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేముందు అది దీర్ఘకాలికమా.. తక్షణ అవసరమా అనేది నిర్ణయించుకోవాలి. బడ్జెట్, లొకేషన్, ప్రస్తుతం అక్కడున్న సౌకర్యాలు, మౌలిక వసతులను క్షుణ్నంగా ఆరా తీయాలి. ఆధ్యాత్మిక రాజధాని.. ‘తిరుపతి’ యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు స్థిరాస్తి రంగంలో తిరుపతి అభివృద్ధి అవకాశాలను గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ తర్వాత చెప్పుకోవాల్సిన నగరం చిత్తూరు నుంచి 65 కి.మీ. దూరంలో ఉన్న తిరుపతి. 20 కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న తిరుపతిలో రియల్ వృద్ధికి ప్రధాన కారణం ఇక్కడి మౌలిక, రవాణా సదుపాయలే. నగరం నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న రేణుగుంట విమానాశ్రయంతో ఇక్కడ రియల్ వ్యాపారం జోరుగానే సాగుతోంది. త్వరలోనే ఇది అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనుంది. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి కూడా. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు తిరుపతి. నిత్యం ఆయా రాష్ట్రాలకు రాకపోకలు సాగించే బెంగళూరు, చెన్నై వాహనాలు తిరుపతి మార్గంగానే వెళ్లాలి. దీంతో రోడ్డుకిరువైపులా స్థిరాస్తి వ్యాపారం జోరుగా ఉంటుంది. దీనికి తోడు దక్షిణాదిలోనే ఒకే ప్రాంతంలో ఆరు విశ్వ విద్యాలయాలున్నాయిక్కడే. ఎస్వీ యూనివర్శిటీ, ఎస్వీ వ్యవసాయ, ఎస్వీ వెటర్నరీ, ఎస్వీ మహిళా, ఎస్వీ వేద, ఎస్వీ మెడికల్ సైన్ వర్శిటీలతో పాటుగా పాతికకు పైగానే ఇంజినీరింగ్ కళాశాలతో తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్‌గా ప్రసిద్ధికెక్కింది. తిరుపతి దేవస్థానానికి ప్రతి రోజు వచ్చి పోయే భక్తుల జనాభా 60 వేలకు పైమాటే. హుండీ ఆదాయం ఏటా రూ.2,000 కోట్లు. సంయుక్త రాష్ట్రంతో పోల్చుకుంటే తిరుపతిలో స్థిరాస్తి ధరలు 20 శాతం పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. మంగళ్‌రోడ్, తిరుచానూర్ వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2-3 వేలు, సిటీలో అయితే రూ.4-9లుగా ఉన్నాయి. * ఇంటి గోడలకు వేసే రంగుల్లో ప్రధానంగా కూల్, వామ్ కలర్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. వామ్ కలర్స్‌లోని ఎరుపు, ఆరెంజ్, పసు పు, ఆకుపచ్చలోని పలు రకాలు ప్ర దానంగా నాడీ వ్యవస్థ, బీపీ, హార్ట్బీట్పై ప్రభావాన్ని చూపిస్తాయి. * ఎరుపు రంగు మనిషిని ఉత్తేజితుల్ని చేస్తుంది. ఈ రంగును చిన్న పిల్లల గదుల్లో ఉపయోగించడం మంచిది కాదు. నీలం రంగు శరీరంలో కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనిషి మెదడు స్థిమితంగా ఉంటుంది. అయితే కొన్ని ముదురునీలం రంగులు జాగ్రత్తను సూచిస్తాయి. కళ్లముందే కాదనలేని నిజాలు.. విమానాశ్రయం వస్తుందనో.. మెట్రో రైలు రానుందనో.. సాఫ్ట్వేర్ సంస్థలొస్తున్నాయనో రాత్రికి రాత్రే ధరలను పెంచేసి సామాన్యుని సొంతింటి కలను దూరం చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. కొనుగోలుదారులిక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే.. ‘‘మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెంది.. నివాసయోగ్యమైన ప్రాంతాల్లోనే స్థలాల ధరలు పెరుగుతాయి. అది కూడా ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలు పుట్టుకొస్తేనే!! అంతే తప్ప భవిష్యత్తులో చోటు చేసుకునే అభివృద్ధిని ఇప్పుడే ఊహించి ఐదేళ్ల తర్వాత పెరగాల్సిన స్థలాల ధరలు అలా అమాంతం పెరగకూడదు. నగరం అభివృద్ధి దిశలో స్థిరంగా పయనించడానికిది సరైన సంకేతం కాదని రామ్ డెవలపర్స్ ఎండీ రామ్ చెప్పారు. నగరంలో కొనుగోలుదారులకు ఎదురైన చేదు అనుభవాల్లో కొన్ని.. * ఏడాదిన్నర క్రితం మియాపూర్‌లో ప్రతిపాదిత మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలం ధర గజానికి రూ.13,000 అటుఇటుగా ఉండేది. ఈరేటును మధ్యవర్తులు రూ.30 వేలు దాటించేశారు. పోనీ ఇక్కడ అనూహ్య రీతిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయా అంటే అదీ లేదు. ప్రధాన రహదారిలో రోడ్డు వెడల్పు చేశారే తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మంచినీటి సరఫరా పెరగలేదు. కాలనీల్లో అంతర్గత రోడ్లూ వేయలేదు. మరీ ఎందుకు హఠాత్తుగా రేటు పెరిగిందంటే.. ‘మెట్రో స్టేషన్ వస్తోంది సార్.. అందుకే రేట్లు పెరిగాయి’ అని రియల్టర్లు జవాబిస్తున్నారు. మెట్రో పనులు జరిగినంత మాత్రానా ఇక్కడ నివసించే ప్రజల జీవితాల్లో సమూల మార్పులేమైనా జరిగాయా? ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలేమైనా పుట్టుకొచ్చాయా అంటే అదీ లేదు. * బూమ్ సమయంలో మహేశ్వరంలో ఫ్యాబ్ సిటీ వస్తోందంటూ.. విమానాశ్రయానికి దగ్గరంటూ అరచేతిలో అద్భుతాలను చూపించారు రియల్టర్లు. దీంతో గజం ధర రూ.10 వేలు పెట్టి కొన్నవారూ ఉన్నారు. కానీ, నే డక్కడ ఇంత ధర పెట్టేందుకు ఎవరూ ముందుకురావట్లేదు. దీంతో స్థలాలు కొన్నవారి పరిస్థితి అటు అమ్ముకోలేక.. ఇటు స్థలాన్ని అట్టిపెట్టుకోనూ లేక తెగ ఇబ్బంది పడుతున్నారు. * భాగ్యనగరం సిటీ నుంచి ఔటర్ వైపు అభివృద్ధి చెందుతుందంటూ ఓఆర్ఆర్ చుట్టూ లే-అవుట్లు వేసి సామాన్యులకు అంటగట్టారు బిల్డర్లు. అయితే ప్రస్తుతం ఓఆర్ఆర్ 90 శాతం పూర్తయింది. కానీ, అక్కడ ఒక్క నివాస సముదాయం గానీ, పరిశ్రమలు గానీ వచ్చిన దాఖలాల్లేవు. * మాదాపూర్‌లో ఐటీ పరిశ్రమ ఏర్పాటైన నాలుగైదేళ్ల తర్వాత కానీ అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాల ధరలు పెరగలేదు. 2003 వరకూ మాదాపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం ధర రూ.5,000 లోపు ఉండేదన్న విషయాన్ని మర్చిపోవద్దు. -
గుట్ట అభివృద్ధికి 100 కోట్లు: ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్: యాదగిరిగుట్టను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు అధికారులు త్వరితగతిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 800 ఎకరాల అటవీ భూములను సేకరించారు. మరో 1200 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించేందుకు వాటి ధరలను ఖరారు చేసే పనిలో ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం పనుల పురోగతిపై సమీక్షించారు. భూసేకరణ, గుట్టపైన, కింద అభివృద్ధి పనులు, వేద పాఠశాలలు, భక్తుల వసతి గృహాల నిర్మాణం, ఇతర పనుల కోసం రూ.100 కోట్లు అవసరమని ఇప్పటికే గుర్తించారు. వీటిని వచ్చే బడ్జెట్లో కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు.