సాక్షి, యాదాద్రి: ‘‘మీకు చేత కాకపోతే చేసిన పనికి డబ్బులు తీసుకుని పక్కకు తప్పుకోండి. వారంలో మరొకరికి టెండర్ ఇస్తాం. చేతులతో పనులు చేస్తున్నారా లేక మిషన్లతో చేస్తున్నారా?... గోదావరి నదిపై వంతెనలు కడుతున్నారు. ఇలా అయితే 20 ఏళ్లయినా ఈ (యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ నిర్మాణం) పనులు పూర్తికావు’’ అంటూ కాంట్రాక్టర్లు, వైటీడీఏ అధికారులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యమవుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ సతీసమేతంగా దర్శించుకున్నారు. అలాగే ప్రధానాలయ నిర్మాణ పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు.
ఇలా అయితే బ్రహ్మోత్సవాల నాటికి ఎలా పూర్తి చేస్తారు?
ముందుగా యాదాద్రికొండపై పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ అక్కడ జరుగుతు న్న పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సివిల్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, వైటీడీఏ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. సివిల్ కాంట్రాక్టర్‌ను పిలిపించి రిటైనింగ్ వాల్ పనుల జాప్యంపై నిలదీశారు. పనులు ఆల స్యంగా జరిగితే ముందుగా అనుకున్నట్లుగా మార్చిలో జరిగే బ్రహ్మోత్సవాల నాటికి ఎలా పూర్తి చేస్తారని, అనుకున్న సమయానికి భక్తులకు ప్రధాన ఆలయంలోని స్వయంభూ దర్శనం ఎలా కల్పిస్తామని ప్రశ్నించారు. విస్తరణ పనులు ఇంత ఆలస్యంగా జరిగితే భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని, అనుకున్న సమయానికి ప్రధానాలయం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శిల్పి పనులు మరింత వేగంగా చేయాలన్నారు. పనులు జరుగుతున్న తీరు సరిగా లేదని ఇంకెంత కాలం పొడిగిస్తారని ఆర్కిటెక్ట్, స్థపతులను సీఎం ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం వద్ద నిర్మితమవుతున్న ఆళ్వార్ విగ్రహాలను, ప్రాకారం, తూర్పు, పడమటి రాజగోపురాలు, ప్రసాద విక్రయశాల, శివాలయం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణం, రథ మండపం, మెట్లదారి, పుష్కరిణిలను సీఎం పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రసాద విక్రయశాల నిర్మాణంలో కొన్ని మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధి విషయంలో ఇబ్బందుల్లేకుండా పనులు చేయాలని, ప్రతి పనికి డబ్బు చెల్లింపుల్లో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
టెంపుల్ సిటీ పనుల్లో వేగం పెంచాలి...
పెద్దగుట్టపై టెంపుల్ సిటీ పనులు పరిశీలించారు. టెంపుల్ సిటిపై భక్తులకు ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని పెంపొందించేలా గార్డెనింగ్ ఉండాలని, చిన్నారులు ఆడుకోవడానికి గార్డెనింగ్‌లో ఆట వస్తువులను ఏర్పాటు చేయాలన్నారు. టెంపుల్ సిటీ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తయితే దాతలు గదులు నిర్మించడానికి వచ్చే వారన్నారు. ఈ సందర్భంగా పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు గొంగిడి సునీత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్‌సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, స్థపతి సుందర్‌రాజన్, ఆలయ శిల్పి ఆనందసాయి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు.
యాదాద్రి చుట్టూ ఓఆర్‌ఆర్...
యాదాద్రి చుట్టూ ఏడు రోడ్లను కలుపుతూ ఏడు జంక్షన్‌లతో ఏడు కిలోమీ టర్ల మేర ఆరు లేన్ల ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ ఆర్) నిర్మించాలని సీఎం కేసీఆర్ అధికా రులను ఆదేశించారు. ఇందుకు అవసరమయ్యే రూ. 143 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే యాదగిరిగుట్టలో 100 నుంచి 150 మంది సాయుధ పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ హెడ్‌క్వార్ట ర్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యాదగిరిగుట్ట గ్రామాన్ని మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment