శంషాబాద్ రూరల్: యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునఃప్రారంభం ఏర్పాట్లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చారు. యాదాద్రిలో మార్చి 21 నుంచి మహా సుదర్శనయాగం, 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టడానికి ఇదివరకే ముహూర్తం ఖరారుకాగా.. వాటి ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్‌స్వామితో కేసీఆర్ చర్చించారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలోని జీయర్‌స్వామి ఆశ్రమంలో సీఎంకు రుత్వికులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌కు స్వామి మంగళ శాసనాలు అందజేశారు.
సీఎం అక్కడి నుంచి జీయర్ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న యాగశాలకు వెళ్లి పనులను పరిశీలించారు. 1,035 కుండాలతో హోమాలు నిర్వహించనున్నట్లు స్వామి వివరించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగనున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ జీయర్‌స్వామి భారీ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ పనులను కూడా సీఎం పరిశీలించారు. అనంతరం యాగశాల, సమతాస్ఫూర్తి కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు ఇచ్చారు. మిషన్ భగీరథ నీటి సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఉత్సవాలకు పెద్దసంఖ్యలో వీవీఐపీలు, వీఐపీలు వస్తున్నందున యాగశాల వద్ద ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి ఫోన్‌చేసి హోమాలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోమం కోసం వినియోగించే నెయ్యిని స్థానిక గోశాలలో సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్న విధానాన్ని అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం ఇక్కడకు వచ్చిన సీఎం మూడు గంటలకు పైగా ఇక్కడ గడిపారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ
సంతోష్‌కుమార్, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment