chinna jiyar swami
-
రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం
-
రామానుజ విలువలు ఆదర్శనీయం
సాక్షి, హైదరాబాద్: గొప్ప విలువలతో కూడిన జీవనం సాగించిన రామానుజాచార్యుల విగ్రహాన్ని స్థాపించి, చినజీయర్ స్వామి భావితరాలకు గొప్ప సందేశాన్నిచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. చినజీయర్ నేతృత్వంలో రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనందంగా ఉందన్నారు. ముచ్చింతల్‌లోని రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆయన సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సమాజంలో మంచి విలువలు నెలకొల్పేందుకు వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు పరితపించారని పేర్కొన్నారు. ఆయనకు తన స్వామి ఉపదేశించిన మంత్రాన్ని అందరికీ తెలియజేస్తే పాపం తగులుతుందని అంతా భావించే రోజుల్లోనే, ఆయన ఆ పాపం తనకు తగిలినా ఫర్వాలేదని గొప్ప మనసుతో సమాజానికి మంచి సందేశాలు ఇచ్చారని కొనియాడారు. ఇలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా రామానుజాచార్యులు విలువల కోసం ఎంత గొప్పగా కట్టుబడి ఉన్నారనేది భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు చినజీయర్ స్వామి కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. సమాజాన్ని మార్చాలన్న గొప్ప సందేశాన్ని ఆయన ఇచ్చారన్నారు. విలువలు మిగిలి ఉన్నాయని చెప్పేందుకు ఇదో మంచి ఉదాహరణ అని జగన్ పేర్కొన్నారు. ముచ్చింతల్ క్షేత్రంలో తీర్థప్రసాదాలను స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇంత మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చిన మైహోం అధినేత రామేశ్వరరావును జగన్ అభినందించారు. అమెరికా నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ చక్కగా శ్లోకాలు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ప్రవచన మండపానికి వచ్చిన జగన్.. చినజీయర్ సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధాన కార్యక్రమాన్ని వీక్షించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీకి చిన్న జీయర్ స్వామి ప్రత్యేక బహుమతి
-
అసమానత వైరస్..సమతే వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న అసమానత ప్రస్తుతం ఎదుర్కొంటున్న కోవిడ్‌ను మించిన పెద్ద వైరస్ అని, దాన్ని అంతం చేసే వ్యాక్సిన్ రావాల్సి ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి చెప్పారు. సరిగ్గా వెయ్యేళ్ల క్రితం ఇంతకంటే భయంకరంగా ఉన్న అసమానతలు, అస్పృశ్యతలను రూపుమాపేందుకు సమానత్వ తత్వమనే వ్యాక్సిన్‌ను రామానుజులవారు ప్రయోగించారని, ప్రస్తుత జాఢ్యాన్ని నివారించేందుకు ఇప్పుడు మళ్లీ దాన్ని మనలో పాదుకొల్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాహ్య సమస్యలకు పరిష్కారం కనుగొంటున్న మనం అంతర్గతంగా మనసులను కలుషితం చేస్తున్న అంతరాలను తక్షణం దూరం చేసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందుకోసమే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మనమందరం రామానుజుల తరహా ప్రేరణ పొందేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామన్నారు. సోమవారం సాయంత్రం శంషాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చినజీయర్ స్వామి మాట్లాడారు. సర్వప్రాణులు ఒకటేనని, అంతరాలు లేకుండా మనుషులంతా ఒకటేనని, స్త్రీ పురుష, వర్గ కుల మత ప్రాంత రంగు భేదం లేని సమాజం కోసం రామానుజులు పరితపించి అందించిన సమతా స్ఫూర్తిని చాటేందుకు ఏర్పాటు చేసిన రామానుజుల సహస్రాబ్ది సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. బంగారు శకం ఆరంభం తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలోనే అంటరానివారిని చేరదీసిన రామానుజుల స్ఫూర్తి చాలా కాలం కొనసాగిందని, బ్రిటిష్ వారు వచ్చాక అది విచ్ఛిన్నమైందని, ఇప్పుడు మళ్లీ రావాల్సిన అవసరం ఉందని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో వీరోచితంగా వ్యవహరించిన ఎంతోమందిని స్మరించుకునే అవకాశం ప్రస్తుత ప్రభుత్వం ఆజాదీకా అమృతోత్సవంలో కల్పించిందని, సరిగ్గా ఇదే సమయంలో రామానుజుల సహస్రాబ్ది వేడుకలు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం కొత్త విద్యావిధానాన్ని తేబోతోందని, పరిస్థితి చూస్తుంటే మళ్లీ బంగారు శకం ఆరంభమైనట్టుగా తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మైహోం అధినేత రామేశ్వరరావు తదితరులు స్వామి వెంట ఉన్నారు. రేపట్నుంచీ కార్యక్రమాలు ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సశాస్త్రీయంగా, వైదికంగా దీనికి సంబంధించిన కార్యక్రమాలుంటాయని చెప్పారు. 5 వేల మంది రుత్వికులు 1,035 హోమకుండాలతో లక్ష్మీ నారాయణ యాగాన్ని నిర్వహించబోతున్నారన్నారు. లక్షన్నర కిలోల దేశవాళీ ఆవుపాలతో రూపొందించిన నెయ్యిని హోమద్రవ్యంగా వినియోగిస్తున్నామని, ఇది ఆవు పాలతో నేరుగా చేసిన నెయ్యి కాదని, పాలను పెరుగుగా మార్చిన తర్వాత తీసిన వెన్నతో చేసిన శ్రేష్టమైన నెయ్యిగా పేర్కొన్నారు. ఐదో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ 216 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన రామానుజుల మహామూర్తిని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శైవ, వైష్ణ, శాక్తేయ సంప్రదాయాల్లోని పండితులు పాల్గొంటున్నారన్నారు. అంటరానివారిగా ముద్రపడ్డ వారిని వెయ్యేళ్లనాటి కఠిన పరిస్థితుల్లోనే చేరదీసి సమానత స్ఫూర్తి నింపిన రామానుజుల వారి బాటలోనే తాము నడుస్తున్నామని, ఈ హోమం వద్ద కూడా కుల, వర్గ భేదాలు చూపటం లేదని స్పష్టం చేశారు. రామానుజులకు సమానత్వ నినాదంలో ప్రేరణ కలిగించిన 108 దివ్వ దేశాలుగా పేర్కొనే వైష్ణవ క్షేత్రాల నమూనాలను ఇక్కడ నిర్మించామని, ఆయా క్షేత్రాల్లో నిర్వహించే కైంకర్యాలు ఇక్కడా కొనసాగుతాయని, ఆ క్షేత్రాల్లో పూజలందుకున్న ఏదో ఒక విగ్రహం ఇక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. -
అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయండి
శంషాబాద్ రూరల్: మండలంలోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై మంత్రులు టి.హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి ఆదివారం చినజీయర్ స్వామితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శ్రీరామనగరంలోని నేత్ర విద్యాలయం సమావేశం మందిరంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఉత్సవాలకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెంది న ప్రముఖులు రానుండటంతో ఆ మేరకు అన్ని సౌకర్యాలు ఏర్పా టు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా వైద్య, వాటర్ గ్రిడ్, ఇంట్రా, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, ఏపీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేతాజీ జయంతి సందర్భంగా ‘ఉద్ఘోష్’ సాక్షి, హైదరాబాద్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో జన్ ఉర్జా మంచ్ ఆధ్వర్యంలో ‘ఉద్ఘోష్‘కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆబ్కారీ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు ఉద్ఘోష్ అవార్డులను పంపిణీ చేశారు. -
యాదాద్రి ఏర్పాట్లు ఎలా చేద్దాం?
శంషాబాద్ రూరల్: యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునఃప్రారంభం ఏర్పాట్లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చారు. యాదాద్రిలో మార్చి 21 నుంచి మహా సుదర్శనయాగం, 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టడానికి ఇదివరకే ముహూర్తం ఖరారుకాగా.. వాటి ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్‌స్వామితో కేసీఆర్ చర్చించారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలోని జీయర్‌స్వామి ఆశ్రమంలో సీఎంకు రుత్వికులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌కు స్వామి మంగళ శాసనాలు అందజేశారు. సీఎం అక్కడి నుంచి జీయర్ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న యాగశాలకు వెళ్లి పనులను పరిశీలించారు. 1,035 కుండాలతో హోమాలు నిర్వహించనున్నట్లు స్వామి వివరించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగనున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ జీయర్‌స్వామి భారీ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ పనులను కూడా సీఎం పరిశీలించారు. అనంతరం యాగశాల, సమతాస్ఫూర్తి కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు ఇచ్చారు. మిషన్ భగీరథ నీటి సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఉత్సవాలకు పెద్దసంఖ్యలో వీవీఐపీలు, వీఐపీలు వస్తున్నందున యాగశాల వద్ద ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి ఫోన్‌చేసి హోమాలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోమం కోసం వినియోగించే నెయ్యిని స్థానిక గోశాలలో సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్న విధానాన్ని అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం ఇక్కడకు వచ్చిన సీఎం మూడు గంటలకు పైగా ఇక్కడ గడిపారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు ఉన్నారు. -
యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి భువనగిరి(నల్లగొండ): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పర్యటనలో భాగంగా మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. ఆలయ పున: నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పెద్ద గుట్ట టెంపుల్ సిటీ హెలిప్యాడ్‌పై సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు ఉన్నారు. ఆలయం పునఃప్రారంభం ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారని, యాదాద్రిలోనే సీఎం స్వయంగా ప్రకటిస్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: కేసీఆర్ బాటలోనే పార్టీ యంత్రాంగం -
వచ్చే ఫిబ్రవరిలో భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు
-
ఆలయాల్లోని విగ్రహాలపై దాడులు దురదృష్టకరం
తిరుమల: ఆలయాల్లోని విగ్రహాలపై ఇటీవల దుండగులు దాడులు చేయడం దురదృష్టకరమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల చిన్నజీయర్ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని ప్రపంచం నుంచి దూరం చేసే శక్తి కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఉందన్నారు. ఈ వ్యాధిని తట్టుకోగలిగే శక్తిని ప్రజలకు ఇవ్వాలని, దీన్ని రూపుమాపే శక్తి వైద్యులకు ఇవ్వాలని స్వామిని ప్రారి్థంచినట్టు తెలిపారు. ఆలయాలు బాగుంటే ప్రజల్లో నైతిక ప్రవృత్తి బాగుంటుందన్నారు. కొందరు దుండగులు ఆలయాలపై దాడులు చేసి హిందూ ధర్మాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రాముడి విగ్రహంపై దాడి జరగడం బాధాకరమన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు కొన్ని సూచనలు ఇచ్చామన్నారు. ధ్వంసమైన 26 ఆలయాలను పరిశీలించామని, ఇందులో 17 ఆలయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించాలని చెప్పారు. ప్రభుత్వ పాలనను ప్రజలు ధర్మబద్ధంగా అందుకోవడానికి ఆలయ పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. రాయలసీమ పర్యటనలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉన్నట్లుగా గుర్తించామన్నారు. వీరి మధ్య అగ్ని రగిలించడం కోసం ఆలయాలను కూలగొడుతున్నారని, ఇలాంటి దృశ్యాలు బాధాకరమన్నారు. -
అన్ని వరాలిచ్చేది కేశవస్వామియే..
బెజ్జంకి (సిద్దిపేట): ఒక్కో దేవుడు ఒక్కో వరమిస్తే అన్ని వరాలిచ్చే దేవుడు శ్రీచిన్నకేశవస్వామి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండలంలోని ఆయన స్వగ్రామమైన తోటపెల్లిలో కొత్తగా నిర్మించిన శ్రీచెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేశవుడు అంటే నారాయణుడు అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొలువైన తోటపెల్లి ప్రాంతం ఎంతో మహిమాన్వితమైనదన్నారు. స్వామి మన గ్రామంలో కొలువుదీ రడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ ఆలయాన్ని చిన్నజీయర్ స్వామి కరకమలములతో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ‘తోటపెల్లిలో బొ డ్రాయిని ప్రతిష్టించుకున్నాం. రామాలయం నిర్మిం చుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాలను పునరుద్ధరించడం, నాటి సంప్రదాయ పరంపర కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది. ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ చేయడం ఎంతో పుణ్యం’ అని అన్నారు. చెన్నకేశవస్వామి ఆలయాలు రెండున్నాయని.. ఒకటి మిట్టపల్లిలో మరోటి తోటపెల్లిలో ఉన్నాయన్నారు. సిద్దిపేట జిల్లా ప్రాచీన ఆల యాలకు ప్రసిద్ధి అని వాటి పూర్వ వైభవానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా లోని సీఎం సెంటిమెంట్ ఆలయం కోనాయపల్లె వేంకటేశ్వరస్వామి, కొమురవెల్లి మల్లన్న, నాచారం, బెజ్జంకిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను ఆయన అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. -
జీయర్ స్వామివారి తిరుప్పావై యజ్ఞం సన్నిధి
రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా భాగ్యనగరంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి అధ్వర్యాన తిరుప్పావై యజ్ఞం ప్రతి ధనుర్మాసంలోనూ అద్భుతంగా సాగుతూ ఉంటుంది. తిరుప్పావై అంటే శ్రీ నోము అని సిరినోము అని అర్థం. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని నమ్మే శ్రీవైష్ణవ మతానువర్తులు ఏటేటా అనుసరించే ఈ వ్రతాన్ని కాత్యాయనీ వ్రతం అని కూడా అంటారు. పన్నెండుగురు వైష్ణవ ఆళ్వార్ (భగవత్ దార్శనికులు, దారి చూపిన వారు) లలో ఏకైక స్త్రీమూర్తి గోదాదేవి. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ వటపత్రశాయి ఆలయంలో పెరియాళ్వార్ పెంచిన తులసితోటలో దొరికిన పాప గోదాదేవి. ఆయన మనసులో ఎప్పడికీ విష్ణువే కనుక విష్ణుచిత్తుడనే పేరు వచ్చింది. గోదాదేవి తండ్రి పెంపకంలో పరమభక్తురాలిగా ఎదిగింది. ఆమె రచించిన ముఫ్ఫయ్ తమిళ పాశురాలు (ఎనిమిది పాదాల పద్యాలు)– నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవత గ్రంథాల సారాంశాన్ని రంగరించినవి. నిష్కల్మషమైన భక్తిని అక్షరక్షరంలో ప్రత్యక్షం చేసే గోవింద గీతా ప్రబంధం తిరుప్పావై అని త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వివరిస్తున్నారు. ఈసారి ధనుర్మాసోత్సవాన్ని ఆధ్యాత్మికులు శ్రీ రామేశ్వరరావు నివాస గృహంలో ఉదయం, సాయంత్రం జీయర్ స్వామి స్వయంగా తిరుప్పావై పాశురాన్ని అందరిచేత చదివించి ఆ పాశుర ప్రతిపదార్థాన్ని, సారాంశాన్ని విశేష అర్థాన్ని వివరిస్తూ నెలరోజులుగా నిర్వహిస్తున్నారు. అలతి పదాలలో అపురూపమైన అర్థాన్ని సామాన్యులకు సైతం అవగాహన అయ్యే విధంగా సంస్కృత, తమిళ, తెలుగు, ఆంగ్ల భాషలలో జీయర్ స్వామి ప్రబోధిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లక్షలాది మంది వింటున్నారు, చూస్తున్నారు.గోదాదేవికి విల్లిపుత్తూరే రేపల్లె. చెలులే గోపికలు. కావేరీ నది యమున. వటపత్రశాయే క్రిష్ణయ్య. గోపికలను తెల్లవారుజామునే నిద్రలేపి, నందగోప రాజు ఇంట నందకిశోరుడైన శ్రీ కృష్ణుని లేచి రమ్మని, నడిచి వస్తే ఆ నడకను వర్ణించి, సింహాసనంపై ఆసీనుడు కాగానే మంగళహారతులు పాడి, తమ వ్రత విధానం, సాధనం, గమ్యం లక్ష్యం అన్నీ నారాయణుడే అని విన్నవించి, తమకు ఏమీ తెలియదని, భక్తి అంటే ఏమిటో కూడా అర్థం కాదని, అయినా అందరితో కలిసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నామని, మాకేం కావాలో మీరే నిర్ణయించి మీ బంధువులుగా మమ్ము భావించి ఆ సంబంధంతో మాకు ఆనందాన్నివ్వాలని, కనుక మిమ్మల్నే మేము కోరుకుంటున్నామని గోపికలద్వారా గోవిందునికి విన్నవించడమే తిరుప్పావై అని జీయర్ స్వామి అరటి పండు ఒలిచి పెట్టినంత సులభంగా విప్పి చెప్పారు. తిరుమల, శ్రీరంగం నుంచి మన ఊళ్లో చిన్న గుడి దాకా దేశం మొత్తంమీద విష్ణ్వాలయాలలో నెలరోజుల పాటు ఉదయం వేళ పాశురగానం, సాయంత్రం పాశుర సారాంశ వివరణా ప్రసంగాలు కొన్ని వందల సంవత్సరాలుగా సాగున్నాయి. జీయర్ స్వామి మార్గదర్శకత్వంలో అనేకమంది రచయితలు తిరుప్పావైని వివరించే పుస్తకాలు రచించారు. వేలాది ప్రవచన కర్తలు రూపొందారు. జీయర్ తిరుప్పావై భక్తి సాగర తరంగాలతో భక్తుల అంతరంగాలను ముంచెత్తుతున్నారు. అర్థం చేసుకున్నవారిని పరమాత్మ వైపు నడిపించే పరమార్థమే జీయర్ సాగించే ఈ యజ్ఞ లక్ష్యం. –డాక్టర్ మాడభూషి శ్రీధర్ ఆచార్య -
నరేంద్ర చౌదరి కూతురి నిశ్చితార్థానికి హాజరైన వైఎస్ జగన్
హైదరాబాద్: ఎన్ టీవీ అధినేత నరేంద్ర చౌదరి కూతురి నిశ్చితార్థానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఆదివారం బంజారాహిల్స్‌లో జరిగిన ఈ వేడుకలో త్రిదండి చిన్న జీయర్ స్వామి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామిని మర్యాదపూర్వకంగా పలుకరించిన వైఎస్ జగన్ ఆయన నుంచి ఆశీస్సులు పొందారు. -
నూతన కాంచీపురం బ్రాంచ్..
రాంగోపాల్‌పేట్: దుస్తులు శరీరానికి రక్షణతోపాటు అందాన్ని రెట్టింపు చేస్తాయని త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి అన్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్్స షోరూంను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్షణ, అందాన్ని పెంచే సాంప్రదాయ కాంచీపురం సిల్క్ దుస్తుల షోరూంను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. సంస్థ అధినేతలు ప్రసాద్, కల్యాణ్‌లు మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరల్ని అందుబాటులో ఉంచామన్నారు. తమవద్ద కాంచీపురం, ఆరాణి, బనారస్, ధర్మవరం, ఉప్పాడ, హ్యాండ్లూమ్ చీరలు లభ్యమవుతాయని తెలిపారు. డిజైనర్ ఫ్యాన్సీ, హ్యాండ్లూమ్, కుర్తీలు, వెస్ట్రన్ వేర్, రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్ దుస్తులు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంచినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ పాల్గొన్నారు.