విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి. చిత్రంలో మైహోం అధినేత రామేశ్వర రావు తదితరులు
సాక్షి, హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న అసమానత ప్రస్తుతం ఎదుర్కొంటున్న కోవిడ్‌ను మించిన పెద్ద వైరస్ అని, దాన్ని అంతం చేసే వ్యాక్సిన్ రావాల్సి ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి చెప్పారు. సరిగ్గా వెయ్యేళ్ల క్రితం ఇంతకంటే భయంకరంగా ఉన్న అసమానతలు, అస్పృశ్యతలను రూపుమాపేందుకు సమానత్వ తత్వమనే వ్యాక్సిన్‌ను రామానుజులవారు ప్రయోగించారని, ప్రస్తుత జాఢ్యాన్ని నివారించేందుకు ఇప్పుడు మళ్లీ దాన్ని మనలో పాదుకొల్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బాహ్య సమస్యలకు పరిష్కారం కనుగొంటున్న మనం అంతర్గతంగా మనసులను కలుషితం చేస్తున్న అంతరాలను తక్షణం దూరం చేసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందుకోసమే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మనమందరం రామానుజుల తరహా ప్రేరణ పొందేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామన్నారు. సోమవారం సాయంత్రం శంషాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చినజీయర్ స్వామి మాట్లాడారు. సర్వప్రాణులు ఒకటేనని, అంతరాలు లేకుండా మనుషులంతా ఒకటేనని, స్త్రీ పురుష, వర్గ కుల మత ప్రాంత రంగు భేదం లేని సమాజం కోసం రామానుజులు పరితపించి అందించిన సమతా స్ఫూర్తిని చాటేందుకు ఏర్పాటు చేసిన రామానుజుల సహస్రాబ్ది సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.
బంగారు శకం ఆరంభం
తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలోనే అంటరానివారిని చేరదీసిన రామానుజుల స్ఫూర్తి చాలా కాలం కొనసాగిందని, బ్రిటిష్ వారు వచ్చాక అది విచ్ఛిన్నమైందని, ఇప్పుడు మళ్లీ రావాల్సిన అవసరం ఉందని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో వీరోచితంగా వ్యవహరించిన ఎంతోమందిని స్మరించుకునే అవకాశం ప్రస్తుత ప్రభుత్వం ఆజాదీకా అమృతోత్సవంలో కల్పించిందని, సరిగ్గా ఇదే సమయంలో రామానుజుల సహస్రాబ్ది వేడుకలు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం కొత్త విద్యావిధానాన్ని తేబోతోందని, పరిస్థితి చూస్తుంటే మళ్లీ బంగారు శకం ఆరంభమైనట్టుగా తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మైహోం అధినేత రామేశ్వరరావు తదితరులు స్వామి వెంట ఉన్నారు.
రేపట్నుంచీ కార్యక్రమాలు
ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సశాస్త్రీయంగా, వైదికంగా దీనికి సంబంధించిన కార్యక్రమాలుంటాయని చెప్పారు. 5 వేల మంది రుత్వికులు 1,035 హోమకుండాలతో లక్ష్మీ నారాయణ యాగాన్ని నిర్వహించబోతున్నారన్నారు. లక్షన్నర కిలోల దేశవాళీ ఆవుపాలతో రూపొందించిన నెయ్యిని హోమద్రవ్యంగా వినియోగిస్తున్నామని, ఇది ఆవు పాలతో నేరుగా చేసిన నెయ్యి కాదని, పాలను పెరుగుగా మార్చిన తర్వాత తీసిన వెన్నతో చేసిన శ్రేష్టమైన నెయ్యిగా పేర్కొన్నారు. ఐదో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ 216 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన రామానుజుల మహామూర్తిని ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో శైవ, వైష్ణ, శాక్తేయ సంప్రదాయాల్లోని పండితులు పాల్గొంటున్నారన్నారు. అంటరానివారిగా ముద్రపడ్డ వారిని వెయ్యేళ్లనాటి కఠిన పరిస్థితుల్లోనే చేరదీసి సమానత స్ఫూర్తి నింపిన రామానుజుల వారి బాటలోనే తాము నడుస్తున్నామని, ఈ హోమం వద్ద కూడా కుల, వర్గ భేదాలు చూపటం లేదని స్పష్టం చేశారు. రామానుజులకు సమానత్వ నినాదంలో ప్రేరణ కలిగించిన 108 దివ్వ దేశాలుగా పేర్కొనే వైష్ణవ క్షేత్రాల నమూనాలను ఇక్కడ నిర్మించామని, ఆయా క్షేత్రాల్లో నిర్వహించే కైంకర్యాలు ఇక్కడా కొనసాగుతాయని, ఆ క్షేత్రాల్లో పూజలందుకున్న ఏదో ఒక విగ్రహం ఇక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment