inequality
-
74 శాతం తగ్గిన ఆదాయ అసమానతలు
న్యూఢిల్లీ: పదేళ్ల వ్యవధిలో దేశీయంగా ఆదాయ అసమానత గణనీయంగా దిగి వచ్చింది. రూ. 5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి సంబంధించి 2013–14, 2022–23 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో అసమానతలు ఏకంగా 74.2 శాతం మేర తగ్గాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోని ఎకనమిక్ డిపార్ట్మెంట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2014–2024 అసెస్మెంట్ ఇయర్స్ గణాంకాలను అధ్యయనం చేసిన మీదట ఎస్బీఐ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఆదాయాన్ని మెరుగుపర్చుకుంటూ పై స్థాయికి చేరుకుంటున్న అల్పాదాయ వర్గాల వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.5 లక్షల వరకు ఆదాయాలున్న వారిలో 31.8 శాతంగా ఉన్న అసమానత 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 12.8 శాతానికి తగ్గింది. రూ. 5.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వర్గాల సంపాదన గత దశాబ్దకాలంలో (కోవిడ్ ప్రభావిత 2020 అసెస్మెంట్ ఇయర్ తప్ప) ప్రతి సంవత్సరం సానుకూల రేటుతో వృద్ధి చెందింది. -
Nobel Prize in Economics 2024: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్‌హోమ్: దేశంలోని సంస్థలు, వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోనే మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఆయా సమాజాల్లో నిబంధనలను తుంగలో తొక్కడం, సంస్థలు, వ్యవస్థల్లో లోపాలు ఆ దేశాభివృద్ధికి ఎలా పెనుశాపాలుగా మారతాయనే అంశాలను డరేన్ ఎసిమోగ్లూ, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లు చక్కగా విడమర్చి చెప్పారని రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్స్ విభాగ నోబెల్ కమిటీ కొనియాడింది. ఈ మేరకు ముగ్గురికీ నోబెల్‌ను ప్రకటిస్తూ సోమవారం కమిటీ ఒక ప్రకటన విడుదలచేసింది. ఎసిమోగ్లూ, జాన్సన్‌లు అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సేవలందిస్తుండగా షికాగో విశ్వవిద్యాలయంలో రాబిన్సన్ పనిచేస్తున్నారు. ‘‘ దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడం అనేది శతాబ్దాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆదాయ, ఆర్థికాభివృద్ధి అసమానతలను రూపుమాపడంలో అక్కడి వ్యవస్థల కీలకపాత్రను ఆర్థికవేత్తలు స్పష్టంగా పేర్కొన్నారు’’ అని ఆర్థికశాస్త్ర కమిటీ చైర్మన్ జాకబ్ సెవెన్సన్ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ రావడంపై 57 ఏళ్ల ఎసిమోగ్లూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశాలు ఎందుకు సక్సెస్ కాలేవు? అవార్డ్ విషయం తెలిశాక తుర్కియే దేశస్థుడైన ఎసిమోగ్లూ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యయుత వ్యవస్థల గొప్పతనాన్ని ఈ అవార్డ్ గుర్తించింది. అభివృద్ధిలో దేశాలు ఎందుకు వెనుకబడతాయని రాబిన్సన్, నేను కలిసి పరిశోధించాం. ప్రజాస్వామ్యం అనేది సర్వరోగ నివారిణి కాదు. ఒక్కోసారి ఎన్నికలు వచి్చనప్పుడే సంక్షోభాలు ముంచుకొస్తాయి’’ అని అన్నారు. ఒకే పార్టీ ఏలుబడిలో ఉన్న చైనా ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోగల్గుతోందని విలేఖరులు ప్రశ్నించగా.. ‘‘ శక్తివంతమైన అధికారయంత్రాంగం ఉన్న చైనా లాంటి దేశాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వినూత్న ఆవిష్కరణల కోసం ఎన్నో అవరోధాలను దాటుతున్నారు’’ అని అన్నారు. 12 ఏళ్ల క్రితం ఎసిమోగ్లూ, రాబిన్సన్ రాసిన ‘ వై నేషన్స్ ఫెయిల్: ది ఆరిజన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పారిటీ, పూర్’ పుస్తకం అత్యధిక కాపీలు అమ్ముడుపోయింది. వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలను పేదదేశాలుగా మిగిలిపోవడానికి కారణమని రచయితలు ఆ పుస్తకంలో వివరించారు. సరిగ్గా అమెరికా–మెక్సికో సరిహద్దులో ఉన్న ఆరిజోనా రాష్ట్ర నోగేల్స్ సిటీ భిన్న పరిస్థితులను ఆర్థికవేత్తలు చక్కటి ఉదాహరణగా తీసుకున్నారు. అమెరికా వైపు ఉన్న నోగేల్స్ సిటీ ఉత్తరప్రాంత వాసులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆయుర్దాయం ఎక్కువ. ఎక్కువ మంది విద్యార్థులు హైసూ్కల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. అదే దక్షిణవైపు ప్రాంత ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్కడ వ్యవస్థీకృత నేరాలు ఎక్కువ. ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం కూడా రిస్క్‌తో కూడిన వ్యవహారం. అవినీతి రాజకీయనేతలను అధికారం నుంచి కిందకు దింపడం కూడా చాలా కష్టం. అమెరికాలో అయితే పౌరుల ఆస్తిహక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇలాంటి విధానాలే ఒకరకంగా దేశం బాగుపడటానికి బాటలువేస్తాయి ’’ అని ఎసిమోగ్లూ వివరించారు. వ్యవస్థలకు తగ్గుతున్న ఆదరణ దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో అమెరికా, యూరప్‌లలో ప్రజాస్వామ్యయుత వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోంది. తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించిన సందర్భాల్లో ప్రజాస్వామ్యదేశాలు ఓడిపోయినట్లే లెక్క. ఇలాంటి ఉదంతాలు ప్రజాస్వామ్యదేశాలు మేల్కొనాల్సిన తరుణం వచి్చందని గుర్తుచేస్తాయి. సుపరిపాలన అందించేందుకు దేశాలు మళ్లీ ప్రయత్నించాలి’’ అని ఎసిమోగ్లూ అన్నారు. -
పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది. యూఎస్, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఇండియా జీడీపీ దూసుకుపోతోంది. కానీ ప్రజల ఆదాయాలు, వారి సంపద మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఇటీవల హురున్ ఇండియా దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1,000 కోట్ల సంపద కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. దాని ప్రకారం ఈ ఏడాది దేశంలోని కుబేరుల సంఖ్య 220 పెరిగి 1,539కు చేరింది. వీరి వద్ద రూ.159 లక్షల కోట్ల సంపద మూలుగుతుంది. ఏడాది ప్రాతిపదికన వీరి ఆస్తులు 46 శాతం వృద్ధి చెందాయి. దేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉంది. కేవలం 1539 మంది వద్దే ఇన్ని కోట్ల రూపాయలు పోగవ్వడం సామాజిక అంశాతికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెరుగుతున్న ఆర్థిక అసమానతలు బ్రిటిష్ కాలంలో కంటే ఇప్పుడు ఎక్కువయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం దేశంలోని ఒక శాతం జనాభా చేతుల్లోకి 40.1 శాతం సంపద చేరుతుంది. వివిధ వర్గాల ఆదాయ సంపదల్లో అసమానతలు ఉన్నప్పటికీ, అందరి వాస్తవ ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ప్రజల ఆదాయాలతో పాటే వాటి మధ్య అంతరాలు అధికమవుతున్నాయి. అందుకు 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని అమలు చేయకముందు వరకు దేశ జీడీపీ మూడు శాతం వద్దే ఆగిపోయింది. ఈ సంస్కరణల తర్వాత జీడీపీ 6-8 శాతం పెరిగింది. అయినా గరిష్ఠ సంపద తక్కువ మంది చేతుల్లోకే వెళుతుంది.భారత్‌తోపాటు అనేక దేశాల్లో ఈ ఆర్థిక అసమానతలకు సంబంధించిన సమస్యలు ఎక్కవవుతున్నాయి. ఇవి మరింత పెరిగితే సామాజిక అశాంతి నెలకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ అంతరాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యంత ధనవంతులపై విధించే పన్నులు పెంచాలని చెబుతున్నారు. కుబేరులకు వారసత్వంగా వచ్చే సంపదపై పన్ను విధించాలంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు.. ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.ఇదీ చదవండి: అంబానీను దాటేసిన అదానీ..దురదృష్టవశాత్తు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలను పరోక్షంగా నడిపించేది ధనవంతులే. దాంతో చట్ట సభల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయడానికి ప్రజా ప్రతినిధులు సహకరించడం లేదు. కానీ ఆర్థిక అసమానతల వల్ల భవిష్యత్తులో రాబోయే సామాజిక అశాంతిని దృష్టిలో ఉంచుకుని ఈమేరకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
మహిళా సమానత్వం ఓ మిథ్య!
ఇది జాతికి మాటలకందని విషాదం. దేశం మరోమారు దారుణమైన హత్యాచారాన్ని చూడాల్సి వచ్చింది. పురుషాధిక్య వృత్తి అయిన మెడిసిన్‌లో రాణించాలని సాహసించిన ఒక యువతిని నిర్దాక్షిణ్యంగా చిదిమేశారు. ఎన్నో కలలు, ఎంతో పట్టుదల కలిగిన ఓ పోస్టు గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌ను అంతమొందించారు. మహిళ భద్రత తమ ప్రాధాన్యత అంటూ.. అధికారంలో ఉన్నవారు ఇచ్చే వాగ్దానాలు, వల్లెవేసే హామీలన్నీ ఒట్టి మాటలేనని మరోమారు రుజువైంది. ఇది ఒక మహిళ, ఒక ప్రొఫెషన్, ఒక దారుణ సంఘటన గురించి కాదు. ఇది మొత్తంగా వ్యవస్థ వైఫ్యలం. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ కీలకమైన స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉందనడానికి నిదర్శనమిది!! చట్టసభల్లో అంతంతమాత్రమే » మహిళల సమస్యలు, సాధకబాధకాలు అర్థం చేసుకొని సహానుభూతి చూపుతూ వారి సమస్యలను పరిష్కరించేందుకు విధాన నిర్ణయాల స్థాయిలో, చట్టసభల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండాలి. కాని మన దేశంలో అలా జరగడం లేదు. » కేంద్ర కేబినెట్లో మొత్తం 30 మంది మంత్రులుంటే..అందులో కేవలం ఇద్దరే మహిళలు. చట్టాలు చేసే పార్లమెంట్‌లోనూ అదే పరిస్థితి. లోక్‌సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా.. అందులో మహిళల సంఖ్య 78. అంటే.. కేవలం 14.40 శాతం. రాజ్యసభలో మరీ తక్కువ. ప్రస్తుతం 224 మంది సభ్యుల్లో మహిళలు కేవలం 24(10.70 శాతం). మహిళా ఐఏఎస్‌లు కేవలం 13 శాతం.. దేశ పరిపాలనలో అత్యున్నత సర్వీస్ అయిన ఐఏఎస్‌కు 1951 – 2020 మధ్యకాలంలో.. మొత్తం 11,569 మంది ఎంపికయ్యారు. వారిలో మహిళల సంఖ్య ఎంతో తెలుసా.. కేవలం 1,527 మంది. అంటే.. 13 శాతం మాత్రమే. అదృష్టవశాత్తు తాజాగా 2023 సివిల్స్ ఫలితాల్లో మాత్రం 1,016 మంది ఎంపికైతే అందులో 352 మంది (34 శాతం) మహిళలు ఉన్నారు. ఈ వివరాలను బట్టి మనకు తెలుస్తోంది ఏమిటంటే.. ప్రభుత్వ విధానాల రూపకల్పన, అమలులో కీలక స్థానమైన ఐఏఎస్‌లో మహిళల సంఖ్య గణనీయంగా పెరగాల్సి ఉంది. ఇక్కడ ఇంకో కోణం చూస్తే.. 6.1 శాతం మంది మహిళా ఐఏఎస్ అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే.. పురుష ఐఏఎస్‌ల శాతం 1.6 మాత్రమే. అంటే.. పురుషుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా మహిళా ఐఏఎస్‌లు రాజీనామా చేస్తున్నారు. 2020 గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం పోలీసు బలగాల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇందులోనూ నిర్ణయాలు తీసుకునే ఉన్నత స్థానాలైన ఐపీఎస్ వంటి పోస్టుల్లో మగువల ప్రాతినిధ్యం కేవలం 8.72 శాతమే. వైద్య విద్య, ఆరోగ్య రంగం » ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం.. మహిళలు వార్షికంగా సగటున 5.4 సార్లు వైద్యుల వద్దకు వెళ్తే.. పురుషులు మాత్రం 4.1 సార్లు మాత్రమే డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అంటే.. పురుషులతో పోలిస్తే మహిళలకు ఆరోగ్య సేవలు 31 శాతం అధికంగా అవసరమవుతున్నాయి. » ఓఈసీడీ సర్వే ప్రకారం.. 15–64 ఏళ్ల వయసు మహిళలకు పురుషులతో పోలిస్తే 1.3 రెట్లు ఎక్కువసార్లు వైద్యుల సేవలు అవసరమవుతున్నాయి. » మన దేశంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. ఆరోగ్య సేవలను ఉపయోగించుకునే వారిలో 46 శాతం మంది మహిళలు ఉంటే.. పురుషులు 39 శాతమే ఉన్నారు. అదేవిధంగా 88.6 శాతం ప్రసవాలు ఆరోగ్య కేంద్రాల్లోనే జరుగుతున్నాయి. ఈ స్థాయిలో మహిళలకు వైద్యసేవల అవసరం ఉన్న ఆరోగ్య రంగంలో మహిళల ప్రాతినిధ్యం మరీ దారుణంగా ఉంది. » దేశంలో మొత్తం వైద్యుల్లో 71 శాతం మంది పురుషులు ఉంటే.. మహిళలు కేవలం 29 శాతమే ఉన్నారు. మొత్తంగా డాక్టర్లు, నాయకత్వ స్థాయి, బోర్డు స్థాయిల్లో 17 శాతమే మహిళలు. » 1928లో ఏర్పాటైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు 2024 వరకూ మొత్తం 94 మంది అధ్యక్షులుగా పనిచేస్తే.. వీరిలో కేవలం ఒక్కరే మహిళ. అంతేకాదు.. 2024లో ఐఎంఏ బోర్డులో మొత్తం 17 మంది ఆఫీస్ బేరర్లు ఉంటే.. అందులో కేవలం ఒకరే మహిళా ప్రతినిధి. అంటే.. దేశ ఆరోగ్య రంగంలో విధాన రూపకల్పన స్థాయిలో, నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా చాలా తక్కువగా ఉంది. » వైద్య విద్య – 2021 గణాంకాల ప్రకారం.. ఎంబీబీఎస్ స్థాయిలో 51 శాతం మంది పురుషులు ఉంటే.. మహిళలు 49 శాతం మంది ఉన్నారు. అదేవిధంగా ఎండీ స్థాయిలో 47 శాతం మంది పురుషులు ఉంటే.. 53 శాతం మంది మహిళలు ఉన్నారు. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా మేఘాలయ, పశి్చమ బెంగాల్, అసోం, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఆరోగ్య రంగంలో మహిళల సంఖ్య మరీ తక్కువగా ఉంది. క్యాట్‌తో సహా అన్నిటికీ ఇంతే!ఇక దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, ఇతర ప్రముఖ బీసూ్కళ్లలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్యను చూస్తే పురుషులు 64 శాతంగా ఉన్నారు. మహిళలు కేవలం 36 శాతమే. ఇదే ధోరణి దేశంలోని దాదాపు అన్ని వృత్తివిద్యా కోర్సుల పరీక్షల్లోనూ కొనసాగుతోంది. మహిళా వీసీలు ఆరు శాతమేమహిళల సమస్యలను అవగాహన చేసుకునేలా పిల్లలకు అకడెమిక్ స్థాయిలోనే చిన్న వయసులోనే బోధన, శిక్షణ ఇవ్వడం ప్రారంభించాలి. ఇది విద్యాసంస్థలతోనే సాధ్యమవుతుంది. అలాంటి యూనివర్సిటీలు, కాలేజీల్లో మహిళల ప్రాతినిధ్యం మరీ దారుణంగా ఉంది. 2015లో దేశంలో మొత్తం యూనివర్సిటీల సంఖ్య 431గా ఉంటే.. అందులో మహిళా వీసీలు కేవలం 13 మంది. అంటే.. 3 శాతం మాత్రమే. అదేవిధంగా 2021లో మొత్తం యూనివర్సిటీల సంఖ్య 1,164గా ఉంటే.. అందులో మహిళా వీసీలు 70 మంది (6 శాతం) మాత్రమే. ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలను చూస్తే.. వీటిలో 50 వర్సిటీలకు మహిళలు వీసీలుగా ఉన్నారు. అంతర్జాతీయంగా 25 శాతం మంది మహిళలు వీసీలుగా ఉంటే.. భారత్‌లో అది కేవలం ఆరు శాతమే. చదువుల్లోనూ వెనుకబాటే.. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే డిప్లొమాలు, అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులు, ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్, పీజీ స్థాయిలో ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే నేటికీ తక్కువగానే ఉంది. యూజీ కోర్సుల్లో 52 శాతం మంది అబ్బాయిలు ఉంటే.. అమ్మాయిలు 48 శాతంగా ఉన్నారు. అలాగే డిప్లొమా స్థాయి కోర్సుల్లో బాలురు 64 శాతంగా ఉంటే.. బాలికలు 36 శాతమే ఉన్నారు. డిగ్రీ స్థాయి ఇంజనీరింగ్ టెక్నాలజీ కోర్సుల్లో పురుషులు 71 శాతం ఉంటే.. మహిళలు కేవలం 29 శాతం మందే ఉన్నారు. అదేవిధంగా పీజీ స్థాయి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో 68 శాతం మంది పురుషులు ఉంటే.. మహిళల ప్రాతినిధ్యం 32 శాతమే. మొత్తంగా చూస్తే స్టెమ్ కోర్సుల్లో చేరే వారిలో అబ్బాయిలు 70 శాతం, అమ్మాయిలు 30 శాతంగా ఉన్నారు. ఈ దేశం మహిళలది కాదా..!పై గణాంకాలను విశ్లేషిస్తే.. భారత్ మహిళలది కాదా.. అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ గణాంకాలు కేవలం అంకెలు, సంఖ్యలు కాదు. ఇది ఒక సమాజంగా మొత్తం మన వైఫల్యం. ఎందుకంటే.. దేశంలో మహిళలపై దారుణాలు చేస్తూ, వారిని అణగదొక్కుతూ, రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తున్నాం. తమను అణచివేస్తున్న వ్యవస్థను పెంచి పోషిస్తున్న పురుషులనే మళ్లీ మహిళలు తమకు రక్షణ కల్పించమని వేడుకోవాల్సి వస్తోంది. మహిళలపై దారుణం చేసి చంపిన ప్రతిసారీ మనం రోడ్డుమీదకు వచ్చి కన్నీరుకార్చి వారిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. కాని మనం కోరుతున్న మార్పు రావడం లేదు. ఇది ఇలాగే కొనసాగకూడదు. మహిళలు న్యాయమైన హక్కుల కోసం తమ గళం విప్పాలి. అన్ని రంగాల్లోనూ మహిళలకు భద్రత, ప్రాతినిధ్యం న్యాయమైన హక్కు. దేశంలో ప్రతి మహిళకు గౌరవం దక్కాలి. ఆమె డిమాండ్లను వినాలి. ప్రతి మహిళా ప్రభుత్వ కార్యాలయానికి, పోలీస్ స్టేషన్‌కు, పార్లమెంట్‌లోకి ధైర్యంగా వెళ్లగలిగి ఇది తనది, తనకు ఇక్కడ సమానమైన హక్కు, ప్రాతినిధ్యం ఉందని విశ్వసించగలగాలి. అప్పుడే ఈ దేశంలో మహిళలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం!! -
ధని‘కుల’ దేశం.. 85 శాతం బిలియనీర్లు వాళ్లే!!
భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదికలో పేర్కొంది. దేశంలోని బిలియనీర్ సంపదలో దాదాపు 90 శాతం అగ్రకులాల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు తేలింది.'ట్యాక్స్ జస్టిస్ అండ్ వెల్త్ రీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా' పేరుతో రూపొందించిన ఈ నివేదికలో సంపద పంపిణీకి సంబంధించిన అంశాలను వివరించారు. దేశంలోని బిలియనీర్ల సంపదలో 88.4 శాతం అగ్రకులాల మధ్య కేంద్రీకృతమై ఉందని నివేదిక డేటా వివరణాత్మక విశ్లేషణను అందిస్తోంది. అత్యంత అణగారిన వర్గాలలో షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీలు) సంపన్న భారతీయులలో ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం.ఈ అసమానత బిలియనీర్ సంపదను మించి విస్తరించింది. 2018-19 ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే (ఏఐడీఐఎస్) ప్రకారం జాతీయ సంపదలో అగ్రవర్ణాల వాటా దాదాపు 55 శాతం. సంపద యాజమాన్యంలోని ఈ స్పష్టమైన వ్యత్యాసం భారతదేశ కుల వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన ఆర్థిక అసమానతలను నొక్కిచెబుతోంది.స్వాతంత్య్రానంతరం క్షీణించిన దేశ ఆదాయం, సంపద అసమానతలు 1980వ దశకంలో పెరగడం ప్రారంభమయ్యాయి. 2000వ దశకం నుంచి మరింత ఉచ్ఛ స్థాయికి పెరిగాయి. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సంపద కేంద్రీకరణ పరంగా అసమానతలు శిఖరాగ్రానికి పెరగడం గమనార్హం. ముఖ్యంగా టాప్ 1 శాతం జనాభా దేశంలోని మొత్తం సంపదలో 40 శాతానికి పైగా నియంత్రిస్తున్నారు. ఇది 1980లో ఉన్న 12.5 శాతం కంటే పెరిగింది. మొత్తం ప్రీట్యాక్స్ ఆదాయంలో 22.6 శాతం వీరు సంపాదిస్తున్నారు. ఇది 1980లో ఇది 7.3 శాతంగా ఉండేది. -
సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్నాలజీ రంగంలో లింగ అసమానతలు గణనీయంగా ఉంటున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. మహిళలంటే ఉపాధ్యాయ వృత్తిలాంటివి మాత్రమే చేయగలరంటూ స్థిరపడిపోయిన అభిప్రాయాలే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా టెక్నాలజీ రంగంలో మహిళల వాటా 36 శాతమే ఉండగా, స్టెమ్ గ్రాడ్యుయేట్స్‌లో 43 శాతం, మొత్తం సైంటిస్టులు, ఇంజినీర్లు, టెక్నాలజిస్టుల్లో 14 శాతం మాత్రమే ఉందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని ’ గాల్స్ ఇన్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈషా తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో పరిస్థితిని సరిదిద్దుకునే అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. -
మహిళా దినోత్సవం: మహిళల ప్రాతినిథ్యం ఎలా ఉంది?
ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెరుగుపడిందని సంబరపడిపోతాం. అయినప్పటికీ ఇంకా చాల చోట్ల మహిళలు కొన్ని అంశాల్లో వెనుకంజలోనే ఉన్నారని వివక్షను ఎదుర్కొంటున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ మహిళల ప్రాతినిధ్యం ఎలా ఉంది?. వారి స్థితి మెరుగు పడిందా? అనే విషయాల గురించి ఈ దినోత్సవం సందర్భంగా కూలంకషంగా తెలుసుకుందామా!. ప్రపంచ ఆర్థిక వేదిక ( వరల్డ్ ఎకనామిక్ ఫోరం ) 2023 సంవత్సరానికి వెలువరించిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారతదేశం 0.643 స్కోర్‌తో 127వ స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరం కంటే ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. అన్ని రంగాల్లో లింగ భేదాన్ని తొలగించడంలో భారతదేశం 64.3% ముందంజ వేసినా, పురుషుల ఆర్థిక భాగస్వామ్యంలో, ఆర్థిక అవకాశాల్లో 36.7% సాఫల్యాన్ని మాత్రమే సాధించిందని వివరించింది. 146 దేశాల లింగ సమానత్వ సూచీలో ఐస్లాండ్ వరుసగా 14వ సారి అగ్రస్థానానంలో ఉంది. పొరుగు దేశం బంగ్లాదేశ్ 59వ స్థానంతో మెరుగైన ఫలితాన్ని సాధించింది. అయితే భారత్ లింగ సమానత్వంలో బెటర్‌గా ఉన్నా.. కొన్ని విషయాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఏయో వాటిలో మెరుగవ్వాల్సి ఉందంటే.. మహిళల విద్య!: భారతదేశంలో మహిళా విద్య అనేది దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే అంశంగా ఉంది. ఎందుకంటే ఈ విషయంలో భారత్ భాగా వెనుకబడి ఉండటమే. పురుషులతో సమానంగా చదువుకునేందుకు మహిళలకు హక్కులు ఉన్నా తరతరాలుగా వేన్నేళ్లుకు పోయిన భావనల కారణంగా పురుషులే అత్యధికంగా విద్యావంతులుగా ఉంటున్నారు. ఇప్పటకీ అక్షరాస్యతలో 2021 నాటి లెక్కల ప్రకారం.. స్త్రీల అక్షరాస్యత రేటు 70.3% కాగా, పురుషుల అక్షరాస్యత రేటు 84.7%గా ఉంది. సామాజిక ఒత్తిళ్లు, పేదరికం, బాల్య వివాహాలు తదితర కారణాల కారణంగా నిర్భంధ విద్యహక్కుకు దూరమవ్వుతున్నారని చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టి విద్యనందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పలు కార్యక్రమాలతో మహిళా సాధికారత కోసం ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్కాలర్షిప్లు వంటివి అందిస్తున్నాయి కూడా. అయినప్పటికి పలుచోట్ల బాలికలు విద్యకు దూరమవుతుండటం బాధకరం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా పురుషుల అక్షరాస్యత రేటు 90% ఉండగా, స్త్రీలు 82.7%తో కొంచెం వెనుకబడి ఉన్నారు. దేశాల పరంగా చూస్తే..అభివృద్ధి చెందిన దేశాలు సాధారణంగా వయోజన అక్షరాస్యత రేటు 96% లేదా అంతకంటే ఎక్కువ. దీనికి విరుద్ధంగా, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు అక్షరాస్యత రేటు 65% మాత్రమే ఉండటం గమనార్హం. ఏ దేశాలు మెరుగ్గా ఉన్నాయంటే.. రష్యా, పోలాండ్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, క్యూబా, అజర్బైజాన్, తజికిస్తాన్, బెలారస్ మరియు కిర్గిజ్‌స్థాన్‌లు స్త్రీ పురుషుల అక్షరాస్యత రేటు 100% కలిగి ఉన్నాయి. తక్కువగా ఉన్న దేశాలు: చాద్, మాలి, బుర్కినా ఫాసో, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజర్, సోమాలియా, గినియా, బెనిన్ వంటి దేశాలు ఈ విషయంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో అక్షరాస్యత రేటు 27% నుంచి 47% వరకు ఉంది. వ్యత్యాసం ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 781 మిలియన్ల పెద్దలలో మూడింట రెండు వంతుల మంది స్త్రీలు చదవడం లేదా వ్రాయడం రాని ఉన్నారు. తక్కువ-అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే పురుషులు ఉద్యోగాలు చేస్తుండగా, మహిళలు వంటింటికి పరిమితమవ్వుతున్నారు. మహిళా అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉన్న దేశాలు: తైవాన్ 99.99% మహిళా అక్షరాస్యత రేటుతో ముందంజలో ఉండగా, 99.98%తో ఎస్టోనియా తర్వాత స్థానంలో ఉంది. ఇక ఇటలీ మూడో స్థానంలో ఉంది. స్త్రీలు అక్షరాస్యతలో మెరుగుపడితే, ఆర్థికపరంగా, ఉద్యోగాల్లోనూ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడే లింగ సమానత్వానికి సరైన నిర్వచనం ఇవ్వగలం. ఈ మహిళల అక్షరాస్యతలో అసమానతను పరిష్కరించడం అనేది అత్యంత కీలకమైనది. ఇదే స్త్రీలను శక్తిమంతంగా మార్చి సాధికారతవైపుకి అడుగులు వేయించి దేశాన్ని ప్రగతి పథంలోకి దూసుకుపోయేలా చేస్తుంది. (చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) -
Oxfam Inequality Report 2024: డబ్బు ఉన్నవారు.. లేనివారికి మధ్య ఇంత తేడా..!
ప్రపంచంలో ఆదాయం, సంపదపరంగా తీవ్ర అసమానతలు రాజ్యమేలుతున్నాయని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దాంతో ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక విధానాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాజంలో ఉన్నత వర్గాల సంపద, ఆదాయాలు పెరుగుతుంటే, దిగువ శ్రేణివారి పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన తొలి అయిదుగురి నికర సంపద విలువ, కొవిడ్ మహమ్మారి వ్యాపించిన 2020 తర్వాత రెట్టింపునకు పైగా పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది. అదే సమయంలో 500 కోట్లమంది మాత్రం మరింత పేదరికంలోకి వెళ్లారని నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ఆక్స్‌ఫామ్ ‘ఇనీక్వాలిటీ ఇంక్.’ పేరుతో రిపోర్ట్ విడుదల చేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. కంపెనీ లాభాలు పెరిగినా.. ఉద్యోగాల్లో కోత అతిపెద్ద కంపెనీల్లో డెబ్భై శాతం సంస్థల్లో ఒక బిలియనీర్ సీఈఓ ఉన్నారు. ఈ కంపెనీలు 10.2 లక్షల కోట్ల డాలర్ల విలువైన సంపదను కలిగి ఉన్నాయి. అంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల జీడీపీల కంటే అధిక సంపద వీరి వద్దే ఉంది. గత మూడేళ్లలో 148 పెద్దకంపెనీలు 1.8 లక్షల కోట్ల డాలర్ల లాభాలను నమోదు చేశాయి. ఏటా సగటున 52 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు లక్షల మంది ఉద్యోగుల వేతనాలు తగ్గాయి. 500 కోట్ల మంది పేదలు.. ప్రపంచంలోని అగ్రగామి అయిదుగురు ధనవంతులు ఇలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్‌బర్గ్ సంపద 2020 నుంచి 405 బిలియన్ డాలర్ల (రూ.33.61 లక్షల కోట్ల) నుంచి 464 బిలియన్ డాలర్లు (రూ.38.51 లక్షల కోట్లు) పెరిగి 869 బిలియన్ డాలర్ల (రూ.72.12 లక్షల కోట్ల)కు చేరింది. అంటే గంటకు 14 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.116 కోట్ల) చొప్పున వీరు సంపదను పోగేసుకున్నారు. ప్రపంచంలోని బిలియనీర్లు 2020తో పోలిస్తే 3.3 లక్షల కోట్ల డాలర్ల అదనపు సంపదను పోగేసుకున్నారు. ఇదే సమయంలో 500 కోట్ల మంది సామాన్యులు మాత్రం మరింత పేదలయ్యారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రపంచం వీరిలో నుంచి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల సంపద)ను చూడడానికి ఒక దశాబ్దం పడుతుంది. పేదరికం మాత్రం మరో 229 ఏళ్లకు గానీ అంతం కాదు. భారీగా తగ్గిన కార్పొరేట్ పన్నులు.. ప్రపంచంలోని 96 ప్రధాన కంపెనీలు ఆర్జిస్తున్న ప్రతి 100 డాలర్ల లాభంలో 82 డాలర్లు సంపన్న వాటాదారులకే చెందుతున్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) సభ్యదేశాల్లో కార్పొరేట్ పన్ను 1980లో 48 శాతం ఉండగా.. తాజాగా అది 23.1 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేని వేతనాలు.. ప్రపంచ జనాభాలో ఆస్ట్రేలియాతో పాటు ఉత్తరాది దేశాల వాటా 21 శాతమే అయినప్పటికీ.. సంపద మాత్రం 69 శాతం వీటి దగ్గరే ఉంది. ప్రపంచ బిలియనీర్ల సంపదలో 74 శాతం ఈ దేశాలకు చెందినవారిదే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది శ్రామికులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే స్థాయి వేతనాన్ని పొందలేకపోతున్నారు. ఇదీ చదవండి: మురికివాడ రూపురేఖలు మార్చనున్న అదానీ..? మహిళల కంటే పురుషుల వద్దే అధికం.. ప్రపంచంలోని ఐదుగురు అత్యంత ధనవంతులు రోజుకు 1 మిలియన్ డాలర్లు(రూ.8.23 కోట్లు) ఖర్చు చేస్తే వారి సంపద పూర్తిగా కరిగిపోవడానికి 496 ఏళ్లు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషుల దగ్గర 105 ట్రిలియన్ డాలర్ల అధిక సంపద ఉంది. ఈ తేడా అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే నాలుగింతలు అధికం. -
జోడో యాత్రతో కొత్త జాతీయ ఒరవడి
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఒక బలమైన నూతన జాతీయ ఒరవడిని సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణం పెరుగుదలను యాత్ర సందర్భంగా రాహుల్ ప్రముఖంగా లేవనెత్తారని గుర్తుచేశారు. 2013తో పోలిస్తే 2023లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయానని వెల్లడించారు. గత పదేళ్లలో ఇంటి బడ్జెట్ తీవ్రంగా ప్రభావితమైందని తెలిపారు. ఈ మేరకు పట్టికను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ పట్టికను గమనించాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, నిర్వాకాలను రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అధికార బీజేపీ బెంబేలెత్తిపోతోందని వెల్లడించారు. అందుకే రాహుల్‌పై బురద చల్లుతోందని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. రాహుల్ సృష్టించిన నూతన ఒరవడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. -
Oxfam: 1 శాతం మంది గుప్పిట్లో... 40% దేశ సంపద!
దావోస్: ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది చేతిలో ఉన్న సంపద అంతా కలిపితే ఎంతో తెలుసా? మిగతా వారందరి దగ్గరున్న దానికంటే ఏకంగా రెట్టింపు! ఈ విషయంలో మన దేశమూ ఏమీ వెనకబడలేదు. దేశ మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కేవలం 1 శాతం సంపన్నుల చేతుల్లోనే పోగుపడిందట!! మరోవైపు, ఏకంగా సగం మంది జనాభా దగ్గరున్నదంతా కలిపినా మొత్తం సంపదలో 3 వంతు కూడా లేదు! ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్ అనే హక్కుల సంఘం వార్షిక అసమానతల నివేదికలో పేర్కొన్న చేదు నిజాలివి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఈ నివేదికను ఆక్స్‌ఫాం విడుదల చేసింది. 2020 మార్చిలో కరోనా వెలుగు చూసినప్పటి నుంచి 2022 నవంబర్ దాకా భారత్‌లో బిలియనీర్ల సంపద ఏకంగా 121 శాతంపెరిగిందని అందులో పేర్కొంది. అంటే రోజుకు ఏకంగా రూ.3,608 కోట్ల పెరుగుదల! భారత్‌లో ఉన్న వ్యవస్థ సంపన్నులను మరింతగా కుబేరులను చేసేది కావడమే ఇందుకు కారణమని ఓక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ అభిప్రాయపడ్డారు. ఫలితంగా దేశంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, అసంఘటిత కార్మికుల వంటి అణగారిన వర్గాల వారి వెతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయన్నారు. భారత్‌లో పేదలు హెచ్చు పన్నులు, సంపన్నులు తక్కువ పన్నులు చెల్లిస్తుండటం మరో చేదు నిజమని నివేదిక తేల్చింది. ‘‘2021–22లో వసూలైన మొత్తం రూ.14.83 లక్షల కోట్ల జీఎస్టీలో ఏకంగా 62 శాతం ఆదాయ సూచీలో దిగువన ఉన్న 50 శాతం మంది సామాన్య పౌరుల నుంచే వచ్చింది! టాప్ 10లో ఉన్న వారినుంచి వచ్చింది కేవలం 3 శాతమే’’ అని పేర్కొంది. ‘‘దీన్నిప్పటికైనా మార్చాలి. సంపద పన్ను, వారసత్వ పన్ను తదితరాల ద్వారా సంపన్నులు కూడా తమ ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించేలా కేంద్ర ఆర్థిక మంత్రి చూడాలి’’ అని బెహర్ సూచించారు. ఈ చర్యలు అసమానతలను తగ్గించగలవని ఎన్నోసార్లు రుజువైందన్నారు. ‘‘అపర కుబేరులపై మరింత పన్నులు వేయడం ద్వారానే అసమానతలను తగ్గించి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోగలం’’ అని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియేలా బుచ్ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌లో నెలకొన్న అసమానతలు, వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు సేకరించిన పరిమాణాత్మక, గుణాత్మక సమాచారాలను కలగలిపి ఈ నివేదికను రూపొందించాం. సంపద అనమానత, బిలియనీర్ల సంపద సంబంధిత గణాంకాలను ఫోర్బ్స్, క్రెడిట్సుసీ వంటి సంస్థల నుంచి సేకరించాం. నివేదికలో పేర్కొన్న వాదనలన్నింటికీ కేంద్ర బడ్జెట్, పార్లమెంటు ప్రశ్నోత్తరాలు తదితరాలు ఆధారం’’ అని ఆక్స్‌ఫాం తెలిపింది. కేంద్రానికి సూచనలు... ► అసమానతలను తగ్గించేందుకు ఏకమొత్త సంఘీభావ సంపద పన్ను వంటివి వసూలు చేయాలి. అత్యంత సంపన్నులైన 1 శాతం మందిపై పన్నులను పెంచాలి. పెట్టుబడి లా భాల వంటివాటిపై పన్ను పెంచాలి. ► వారసత్వ, ఆస్తి, భూమి పన్నులను పెంచాలి. నికర సంపద పన్ను వంటివాటిని ప్రవేశపెట్టాలి. ► ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను 2025 కల్లా జీడీపీలో 2.5 శాతానికి పెంచాలి. ► ప్రజారోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలి. ► విద్యా రంగానికి బక్జెట్ కేటాయింపులను ప్రపంచ సగటుకు తగ్గట్టుగా జీడీపీలో 6 శాతానికి పెంచాలి. ► సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీస మౌలిక వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఈ కనీస వేతనాలు గౌరవంగా బతికేందుకు చాలినంతగా ఉండేలా చూడాలి. నివేదిక విశేషాలు... ► భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 2020లో 102 ఉండగా 2022 నాటికి 166కు పెరిగింది. ► దేశంలో టాప్–100 సంపన్నుల మొత్తం సంపద ఏకంగా 660 బిలియన్ డాలర్లకు, అంటే రూ.54.12 లక్షల కోట్లకు చేరింది. ఇది మన దేశ వార్షిక బడ్జెట్‌కు ఒకటిన్నర రెట్లు! ► భారత్‌లోని టాప్ 10 ధనవంతుల సంపదలో 5 శాతం చొప్పున, లేదా టాప్ 100 ధనవంతుల సంపదలో 2.5 శాతం చొప్పున పన్నుగా వసూలు చేస్తే ఏకంగా రూ.1.37 లక్షల కోట్లు సమకూరుతుంది. ఇది కేంద్ర కుటుంబ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం నిధుల కంటే ఒకటిన్నర రెట్ల కంటే కూడా ఎక్కువ! ఈ మొత్తం దేశంలో ఇప్పటిదాకా స్కూలు ముఖం చూడని చిన్నారులందరి స్కూలు ఖర్చులకూ సరిపోతుంది. ► 2017–21 మధ్య భారత కుబేరుడు గౌతం అదానీ ఆర్జించిన (పుస్తక) లాభాలపై పన్ను విధిస్తే ఏకంగా రూ.1.79 లక్షల కోట్లు సమకూరుతుంది. దీనితో 50 లక్షల మంది టీచర్లను నియమించి వారికి ఏడాదంతా వేతనాలివ్వొచ్చు. ► వేతనం విషయంలో దిన కూలీల మధ్య లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. పురుషుల కంటే మహిళలకు 37 శాతం తక్కువ వేతనం అందుతోంది. ► ఇక ఉన్నత వర్గాల కూలీలతో పోలిస్తే ఎస్సీలకు, పట్టణ కూలీలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల వారికీ సగం మాత్రమే గిడుతోంది. ► సంపన్నులపై, కరోనా కాలంలో రికార్డు లాభాలు ఆర్జించిన సంస్థలపై మరింత పన్ను విధించాలని 2021లో జరిపిన ఫైట్ ఇనీక్వాలిటీ అలియన్స్ ఇండియా సర్వేలో 80 శాతం మందికి పైగా డిమాండ్ చేశారు. ► అసమానతలను రూపుమాపేందుకు సార్వ త్రిక సామాజిక భద్రత, ఆరోగ్య హక్కు తదితర చర్యలు చేపట్టాలని 90 శాతానికి పైగా కోరారు. 5 శాతం మందిపై పన్నుతో.. 200 కోట్ల మందికి పేదరికం నుంచి ముక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక్క శాతం సంపన్నుల వద్దనున్న మొత్తం, మిగిలిన ప్రపంచ జనాభా సంపద కంటే రెండున్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఆక్స్‌ఫాం నివేదిక తెలిపింది. వారి సంపద రోజుకు ఏకంగా 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పెరుగుతున్నట్టు పేర్కొంది. అది ఇంకేం చెప్పిందంటే... ► ప్రపంచంలోని మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే ఏటా 1.7 లక్షల కోట్ల డాలర్లు వసూలవుతుంది. ఈ మొత్తంతో 200 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేయొచ్చు. ► 2020 నుంచి ప్రపంచమంతటా కలిసి పోగుపడ్డ 42 లక్షల కోట్ల డాలర్ల సంపదలో మూడింత రెండొంతులు, అంటే 26 లక్షల కోట్ల డాలర్లు కేవలం ఒక్క శాతం సంపన్నుల దగ్గరే పోగుపడింది! ► అంతేకాదు, గత దశాబ్ద కాలంలో కొత్తగా పోగుపడ్డ మొత్తం ప్రపంచ సంపదలో సగం వారి జేబుల్లోకే వెళ్లింది!! ► మరోవైపు పేదలు, సామాన్యులేమో ఆహారం వంటి నిత్యావసరాలకు సైతం అంగలార్చాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ► వాల్‌మార్ట్ యజమానులైన వాల్టన్ కుటుంబం గతేడాది 850 కోట్ల డాలర్లు ఆర్జించింది. ► భారత కుబేరుడు గౌతం అదానీ సంపద ఒక్క 2022లోనే ఏకంగా 4,200 కోట్ల డాలర్ల మేరకు పెరిగింది! ► కుబేరులపై వీలైనంతగా పన్నులు విధించడమే ఈ అసమానతలను రూపుమాపేందుకు ఏకైక మార్గం. -
అసమాన ప్రశ్నలు
ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఈ అసమానతలకు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఒక శాస్త్రవేత్తకు వస్తే? ఆయన చరిత్రకారుడు కూడా అయితే! జియోగ్రాఫర్, ఆర్నిథాలజిస్ట్ లాంటి అదనపు అర్హతలు కూడా ఉంటే? ఇలాంటి ప్రశ్నలకు బహు వృత్తులు, ప్రవృత్తులు కలగలిసినవారే జవాబులు చెప్పగలరు. ఒకానొక సముద్రపు ఒడ్డు నడకలో అమెరికన్ రచయిత జేరెడ్ డైమండ్ (జ.1937)ను ఒక నల్లజాతి యువకుడు, పాపువా న్యూ గినియా దీవులకు చెందిన ‘యాలి’ ఇలా నిలదీశాడు: ‘మీ తెల్లవాళ్ల దగ్గర అంత ‘కార్గో’(వస్తు సామగ్రి) ఉన్నప్పుడు, మా దగ్గర అది ఎందుకు లేదు?’ ఈ అన్వేషణలో భాగంగా ఏళ్లపాటు చేసిన పరిశోధనతో జేరెడ్ డైమండ్ రాసిన పుస్తకం ‘గన్స్, జెర్మ్స్ అండ్ స్టీల్: ద ఫేట్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్’. శీర్షికలోనే సమాధానాలను నిలుపుకొన్న ఈ పుస్తకం సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం 1997లో వచ్చింది. ఆ తర్వాత దీని ఆధారంగానే ఇదే పేరుతో ‘ఎన్జీసీ’ ఛానల్ డైమండ్ హోస్ట్‌గా మూడు భాగాల డాక్యుమెంటరీ కూడా నిర్మించింది. సులభంగా కనబడే ఈ ప్రశ్నలకు జవాబులు అంత సులభంగా దొరకవు. వీటికి సమాధానాలు కూడా వర్తమానమో, సమీప గతమో చెప్పలేదు. అందుకే చరిత్ర, పూర్వ చరిత్ర యుగంలోకి డైమండ్ మనల్ని తీసుకెళ్తారు. మనుషులందరూ ఆహార సేకరణ దశలోనే ఉన్న తరుణంలో పదమూడు వేల ఏళ్ల క్రితం ‘మధ్య ప్రాచ్యం’లో మొదటిసారి వ్యవసాయం మొదలైంది. బార్లీ, గోదుమ పండించారు. ఎప్పుడైతే మిగులు పంట సాధ్యమైందో అక్కడ మనుషుల వ్యాపకాలు ఇతరాల వైపు మళ్లాయి. అలా మానవాళి మొదటి నాగరికత నిర్మాణం జరిగింది. చిత్రంగా పాపువా న్యూ గినియాలో ఇప్ప టికీ వ్యవసాయం మొదలుకాలేదు. అక్కడివాళ్లు తెలివైనవాళ్లు కాదనా? ఏ చెట్టు ఏమిటో, ఏ పుట్టలో ఏముందో చెప్పగలిగేవాళ్లు; ఎంతదూరమైనా బాణాన్ని గురిచూసి కొట్టేవాళ్లు తెలివైనవాళ్లు కాక పోవడం ఏమిటి? ఏ పంటలైతే మధ్యప్రాచ్యంలో నాగరికతకు కారణమయ్యాయో, అవి ఇక్కడ పెరగవు. ఆ భౌగోళిక పరిమితి వల్ల వాళ్లు ఇంకా ఆహార అన్వేషణ దశలోనే ఉన్నారు. అందుకే మనుషులను ‘అసమానంగా’ ఉంచుతున్న కీలక కారణం భౌగోళికత అంటారు డైమండ్. ‘ఫెర్టయిల్ క్రెసెంట్’(సారవంతమైన చంద్రవంక)గా పిలిచే ఈ యురేసియా ప్రాంతంలోనే జంతువులను మచ్చిక చేసుకోవడం కూడా జరిగింది. ఇవి గొప్ప అదనపు సంపదగా పనికొచ్చాయి. ఆవు, ఎద్దు, గొర్రె, మేక, గుర్రం, గాడిద, పంది లాంటి పద్నాలుగు పెంపుడు జంతువుల్లో ఒక్క లామా(పొట్టి ఒంటె; దక్షిణ అమెరికా) తప్ప పదమూడు ఈ ప్రాంతం నుంచే రావడం భౌగోళిక అనుకూలతకు నిదర్శనంగా చూపుతారు డైమండ్. మనుషుల విస్తరణ కూడా సరిగ్గా ఆ భౌగోళిక రేఖ వెంబడి, అంటే ఏ ప్రాంతాలు వీటికి అనుకూలంగా ఉన్నాయో వాటివెంటే జరిగింది. మరి ఒకప్పుడు మొదటి నాగరికత వర్ధిల్లిన మధ్య ప్రాచ్యం ఇప్పుడు ప్రపంచంలోనే సంపన్న ప్రాంతంగా ఎందుకు లేదు? భౌగోళికత ఒక కారణం అవుతూనే, దాన్ని మించినవి కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నాయన్నది డైమండ్ సిద్ధాంతం. అయితే భౌగోళికత ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చు. కరవు కాటకాలు ఓ దశలో మధ్యప్రాచ్యాన్ని తుడిచిపెట్టాయి కూడా! వారికి తెలియకుండానే ఐరోపావాసుల పక్షాన పనిచేసినవి సూక్ష్మ క్రిములని చెబుతారు డైమండ్. ఇతర ప్రాంతాలకు విస్తరించే క్రమంలో జరిగిన పోరాటాల్లో, ఆ పోరాటాల కంటే ఎక్కువగా వీరి నుంచి వ్యాపించిన సూక్ష్మక్రిముల వల్ల ‘మూలజాతులు’ నశించాయి. దానిక్కారణం – వేల సంవత్సరాల జంతువుల మచ్చిక వల్ల వాటి నుంచి వచ్చే సూక్ష్మక్రిముల నుంచి వీరికి నిరోధకత ఏర్పడింది. కానీ అలాంటి సంపర్కం లేని అమెరికన్ జాతులు దాదాపు తొంభై ఐదు శాతం నశించిపోయాయి. ముఖ్యంగా ‘స్మాల్‌పాక్స్’(మశూచి) కోట్లాది మంది ప్రాణాలు తీసింది. ఇంక ఎప్పుడైతే ఉక్కు వాడకంలోకి వచ్చిందో, ఆ ఉక్కుతో ముడిపడిన తుపాకులు రావడం ప్రపంచ గతినే మార్చేసింది. ఆ తుపాకుల వల్లే యూరప్ దేశాలు ప్రపంచాన్ని తమ కాలనీలుగా మార్చుకోగలిగాయి. ముఖ్యంగా ఆఫ్రికాలోని ప్రాచీన నాగరిక సమాజాలు, అవెంతటి ఘన సంస్కృతి కలిగినవి అయినప్పటికీ తుపాకుల ముందు నిలవలేకపోయాయి. అక్కడి నుంచి ఎంతో అమూల్యమైన సంపద తరలిపోయింది. మరి ఐరోపావాసులకు ప్రతికూలతలుగా పరిణమించినవి ఏవీ లేవా? ఏ భౌగోళిక రేఖ వెంబడి ప్రయాణిస్తూ వారికి అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండే ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’(దక్షిణాఫ్రికా)లో మనగలిగారో, దాన్ని దాటి ఆఫ్రికాలోని ఉష్ణ మండలం వైపు విస్తరించినప్పుడు కేవలం మలేరియాతో కోట్లాదిమంది చచ్చిపోయారు. ప్రపంచం స్థిరంగా ఆగిపోయేది కాదు. భౌతిక ప్రమాణాల రీత్యా ప్రపంచంలో అసమానతలు స్పష్టంగా కనబడుతుండవచ్చు. కానీ మొన్న కోవిడ్ మహమ్మారి సమయంలో ఐరోపా, అమెరికా అల్లాడిపోయాయి. అదే పేద దేశాలు అంత ప్రభావితం కాలేదు. కాబట్టి అసమానత అనేది కూడా ఒక చరాంకం కావొచ్చు. ఒకే సమాజంలోనే కొందరు ధనికులుగా, ఇంకొందరు పేదవాళ్లుగా ఎందుకు ఉండిపోతున్నారు? ఒకే ఇంటిలోనే ఇద్దరన్నదమ్ములు భిన్న స్థాయుల్లోకి ఎందుకు చేరుతున్నారు? ఈ మొత్తంలో మానవ ప్రయత్నానికి ఏ విలువా లేదా? అందుకే డైమండ్ జవాబులు మరీ సరళంగా ఉన్నాయేమో అనిపించక మానదు. కానీ మార్గదర్శులు వాళ్ల జీవితాలను రంగరించి కొన్ని సమాధానాలు చెబుతారు. వాటి వెలుగులో సమాజం మరిన్ని జవాబులు వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే మానవ సమాజం అనేది మానవ స్వభావం అంత సంక్లిష్టమైనది. -
రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు
దేశంలో పేదల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరైన పోషకాహారం లభించక కోట్లమంది రక్త హీనతతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. మరొక వైపున కొద్ది మంది సర్వభోగాలూ అనుభవిస్తు న్నారు. దేశంలో ఈ దారుణ పరిస్థితులకు కారకులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక సంస్కరణల కారణంగా సంపద కొందరి దగ్గరే పోగుపడటం ప్రారంభమైంది. భారతదేశంలో ఆదాయం, సంపద పరంగా తీవ్ర అసమానతలు ఉన్నాయని ప్యారిస్ లోని అధ్యయన సంస్థ (వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్) 2022 నివేదిక వెల్లడించింది. 2021లో భారత సమాజంలోని 10శాతం అగ్రశ్రేణి సంపన్న వర్గం జాతీయ ఆదాయంలో 57 శాతం కలిగి ఉంది. అందులోని ఒక శాతం అగ్ర ధనిక వర్గం 22 శాతం వాటాను సొంతం చేసుకుంది. 50 శాతం ప్రజల వాటా 13 శాతం మాత్రమే. 1980 నుంచి భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ఈ పరిస్థితికి కారణమని నివేదిక వెల్లడించింది. ఇండియాలో ప్రైవేట్ వ్యక్తుల సంపద 1980లో 290 శాతం ఉంటే 2020 నాటికి 560 శాతానికి పెరిగింది. మరొక వైపున ప్రపంచంలో అత్యంత పేదరికం ఉన్న దేశాల్లో భారత్ మొదటి వరుసలో ఉంది. ప్రపంచం మొత్తం మీద అత్యంత పేదరికం అనుభవిస్తున్నవారు 68.9 కోట్లు ఉండగా... అందులో భారతదేశం వాటా 20.17 శాతంగా ఉంది. ఆర్థిక అసమానతల ఫలితంగా పేదలు పస్తులతో అర్ధాకలితో కాలం గడుపుతున్నారు. ప్రపంచ ఆహార సంస్థ ‘పోషక, ఆహార భద్రత– 2018’ నివేదిక ప్రకారం 19.59 కోట్ల మంది భారత ప్రజలు పస్తులతో పడుకుంటున్నారు. 2018 ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్ఐ) మేరకు 119 దేశాల్లో భారత్ 103వ స్థానంలో ఉంది. ఆహార భద్రత సూచీ ప్రకారం 113 దేశాల్లో భారత్ 76వ స్థానంలో ఉంది. ఈ విషయంలో శ్రీలంక, ఘనా, బొలీవియా కన్నా వెనకబడి ఉంది. పోషకాహారం లోపం వలన 17.3 శాతం చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు లేరు. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశంలో మరింత ఎక్కువ మందిలో రక్త హీనత ఏర్పడింది. చిన్నపిల్లల్లో, గర్భిణుల్లో అధికంగా రక్త హీనత ఉంది. ‘జాతీయ ఆహార భద్రత చట్టం’ అమలులోకి వచ్చి 54 ఏళ్లయినా ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటిని ప్రభుత్వాలు గుర్తించ నిరాకరిస్తున్నాయి. 2015–18లో దేశవ్యాప్తంగా ఆకలి చావులు సంభవించాయి. 2018లో 46 మంది ఆకలితో మరణించారు. స్వరాజ్ అభియాన్ సంస్థ 2015 చేసిన సర్వే వివరాల ప్రకారం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోకి వచ్చే బుందేల్ ఖండ్ ప్రాంతం లోని 13 జిల్లాల్లోని 38 శాతం గ్రామాల్లో 8 నెలల వ్యవధిలో పల్లెకొకరు చొప్పున పస్తులతో మరణిం చారు. మోదీ ప్రభుత్వం మాత్రం అవి ఆకలి చావులు కావనీ, అనారోగ్య కారణాలతో చనిపోయారనీ చెప్పి బాధ్యత నుంచి తప్పించుకుంది. పేదరికానికి, అనారోగ్య సమస్యలకు, ఆకలి చావులకు దుర్భరమైన ఆర్థిక పరిస్థితులే కారణం. ప్రభుత్వ పథకాలు వలన పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదని ప్రస్తుత పరిస్థితులే నిరూపిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ పేదల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే తక్షణం తీసుకోవాల్సిన చర్యలున్నాయి. గ్రామీణ పేదలకు సేద్యపు భూమి పంపిణీ చేసి, హక్కు కల్పించాలి. పట్టణ పేదలకు, శ్రామికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి. వారికి వాటిల్లో భాగస్వామ్యం కల్పించాలి. ఇందు కోసం గ్రామీణ, పట్టణ పేదలు సమష్టిగా ఉద్యమించాలి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) - బొల్లిముంత సాంబశివరావు రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!
జెండా పండుగ అయిపోయింది.. ఇక ఆ రంగు లైట్లు ఆర్పేసి ఇటు రండి.. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి ఇంద్రా మేఘ్వాల్ చిత్రపటం వద్ద పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో... చీకట్లు చూద్దాం. ఒక గ్లాసుడు నీళ్లు.. పోయిన చిన్న ప్రాణం. అగ్రవర్ణం దాహార్తికి చిన్నబోయిన త్రివర్ణాలు కనిపిస్తాయి. ఇది ‘..అనుకోని సంఘ టన’ అని సర్దిచెప్పుకునే లోపే.. ‘కాదు.. అనునిత్యమే’ అన్నమాట రీసౌండ్‌లా ‘జనగణమన’కన్నా ఎక్కువ శబ్దంతో మన చెవుల్లో మారుమోగుతుంది. – ఇదీ సామాజిక భారతం రోడ్లపై వేలాది జెండాల ప్రదర్శనలు, వాట్సాప్ డీపీలు, ధగధగా మెరిసే కాంతుల అలంకరణలు, గొప్పగా సంబురాలు.. వీటన్నిటి మధ్య బిల్కిస్ బానో సామూహిక అత్యాచార దోషులకు స్వాతంత్య్ర దినోత్సవం ఇచ్చిన స్వేచ్ఛా వాయువులు. వారి మెడలో పూలదండలు, పంచుకున్న మిఠాయిలు.. అమృతోత్సవాలను చేదెక్కించ లేదూ! – ఇదీ రాజకీయ భారతం ‘కలకత్తా ఫుట్‌పాత్‌లపై ఎందరో గాలివానల్లో తడుస్తున్నారు వాళ్లను అడగండి పదిహేను ఆగస్టు గురించి ఏమంటారో..’ .. 1947లో స్వాతంత్య్రం వచ్చిన రోజున మాజీ ప్రధాని వాజ్‌పేయి రాసుకున్న కవిత ఇది.. ఉత్సవాలు జరిగిన మరునాడే (ఆగస్టు 16న) వాజ్‌పేయి వర్ధంతి జరిపినవారిలో ఎవరైనా.. ఆయన గుర్తుగానైనా.. ఫుట్‌పాత్‌లపై ఉన్న వారిని అడిగి ఉంటారా ‘..ఆగస్టు 15 గురించి ఏమంటారూ’ అని.. – వృద్ధిరేటు 75 ఏళ్లుగా పెరిగీ పెరిగీ హైరైజ్ భవనాల్లో చిక్కుకునిపోయిందని, అక్కడి నుంచి ఫుట్‌పాత్ దాకా రాలేదని తెలిసేది కదా! – ఇదీ ఆర్థిక భారతం ‘..దేశభక్తి, అఖండత అని ఒకటే అంటున్నారు.. మేం దేశభక్తి ఎలా చాటుకోవాలి? మా ఇంటిపై జెండా ఎగురవేసే కదా..? మరి జెండా ఎగురవేయడానికి మాకు ఇల్లు ఏది?..’ ..ఇది ఏ సామాన్యుడో అన్నది కాదు.. గరీబోళ్ల సీఎం టంగుటూరి అంజయ్య 1970లో అన్నమాట! మరి ‘ఇంటింటికీ జెండా పండుగ’.. అంటూ జెండాలు పంచిన నాయకులకు ఈ ప్రశ్న ఏమైనా ఎదురై ఉంటుందా.. బధిర శంఖారావంలా! – ఇదీ నేటి జన భారతం హుందాతనం, ఆత్మగౌరవం, సమన్యాయం.. చైతన్యం, సమున్నత మానవ విలువలు, సామాజిక న్యాయం, లౌకిక భావన, సౌభ్రాతృత్వం.. ఆదా యాల్లో, అంతస్థుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో.. సమానత్వం తెచ్చుకుందాం అని 75 ఏళ్ల క్రితం రాసుకున్న రాతలు రాజ్యాంగం పుస్తకాన్ని దాటి బయటికి రానట్టున్నాయ్.. – ఇదీ గణతంత్ర భారతం ... వీటన్నింటినీ అంబేద్కర్‌కు వదిలేసి మన నేతలు ఏం చేస్తున్నారో చూడండి. ► గాంధీ, గాడ్సేల ఎత్తును భారతీయత స్కేలుతో కొలిచి.. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువని తేల్చు కునే పనిలో తీరిక లేకుండా మునిగిపోయారు. ► ఇన్నేళ్లూ నెహ్రూ, గాంధీల పాలనలోనే భారతావని నడిచినా.. ఇప్పుడు క్విట్ ఇండియా స్ఫూర్తిగా దేశాన్ని ఏకం చేస్తామంటూ అదే గాంధీలు కొత్తగా ‘జోడో యాత్రలు’ చేస్తున్నారు. ► గాంధీ, నెహ్రూలపై విద్వేషం చిమ్ముతూ కొందరు.. నెహ్రూ కూడళ్లలో జనగణమన పాడుతూ గాంధీకి వెకిలి మకిలి పూస్తే జాగ్రత అని హెచ్చరిస్తూ మరికొందరు.. 75 ఏళ్ల తర్వాత కూడా అవే పేర్లు, అదే స్మరణ, అదే రాజకీయం.. ► 75 ఏళ్ల క్రితం గీసిన విభజన రేఖలు.. ఇప్పుడా దూరాన్ని మరింత పెంచాయి. రెండు వర్గాల మధ్య అపనమ్మకాన్ని, అగాధాన్ని ఎగదోస్తూ.. ‘లౌకికం’ అన్న మాటను ఫక్తు రాజకీయం చేశాయి. మన మట్టి మీదే పుట్టి పెరిగినా.. త్రివర్ణ పతాకం చేతపట్టి మేమూ భారతీయులమే అని చెప్పుకోవాల్సిన దుఃస్థితికి తెచ్చాయి. ► దేశ విభజన నాటి హింసాకాండ, విధ్వంసాలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మానిపోతున్న గాయాలను కెలుకుతూ విభే దాలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. నాటి దాష్టీకాన్ని నేటికీ అంటగడుతూ.. విచ్ఛిన్నకర శక్తులంటూ పాత కాలపు చర్చను లేవదీస్తూనే ఉన్నాయి. .. ఇదీ 75 ఏళ్ల భారతం.. స్వేచ్ఛ వచ్చిందనుకున్న తొలిరోజున ఉన్నకాడే.. ఇప్పటికీ ఉన్నామని చెప్పకనే చెబుతున్న తీరు.. ఇది స్వప్నం.. స్వాతంత్య్రోత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో యువతతో నడిచిన ఓ చిట్‌ఛాట్ ఇది. ‘..నేను పుణెలో చదివా, నాలుగేళ్లు బెంగళూరులో, ఇప్పుడు తిరువనంతపురంలో ఉద్యోగం. రేపు ఎక్కడికి వెళ్తానో తెలియదు. నన్ను ఏ ప్రాంతం వాడని అడక్కండి..’ ‘..ఇదిగో వీడు అబ్దుల్లా.. అమెరికా నుంచి ఈమధ్యే దిగుమతి అయ్యాడు, ఢిల్లీ వాడే అనుకోండి. ఈ అమ్మాయి సారిక, వీడి ఫియాన్సీ. వాళ్లు రాజు, అభిషేక్, శ్రవణ్.. మేమంతా హాస్టల్ మేట్స్.. మమ్మల్ని ఏ కులం, ఏ మతం అని ప్రశ్నించకండి. అవన్నీ పాలిటిక్స్ కోసమే.. మేం భారతీయులం..’ ... కెరీర్ గోలలో కొట్టుకుపోతూ దేశం గురించి పట్టించుకోవడం లేదని యువతపై వేస్తున్న అపవాదు నిజం కాదనిపిస్తోంది. వీరిని చూస్తుంటే.. కులం, ప్రాంతం, మతం హద్దులు చెరిపేసుకుని.. అన్ని వర్ణాలనూ త్రివర్ణంలో కలుపుకొని పోతారనే ఆశలు ఇంకా మిణుకుమిణుకుమంటున్నాయి. ఇది నిజం... అట్టడుగు వర్గాలను అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టి ఆనందపడ్డా, వారి పరిస్థితి ఉన్నకాడే ఉన్నదనడానికి ఇదొక్క ‘చిత్రం’ చాలదా! -
కరోనా కాదు.. అసమానతే అసలు వైరస్! వెలుగులోకి విస్తుపోయే విషయాలు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. లక్షల మందిని బలితీసుకుంది. ఆ వైరస్ పేరెత్తితేనే వణుకుపుట్టేలా చేసింది. మరోవైపు ఇదే సమయంలో కరోనా కన్నా మరో మరో పెద్ద ‘వైరస్’ మానవాళిని కబళించింది. ఇప్పటికీ ప్రతాపం చూపుతూనే ఉంది. అదే ‘అసమానతల’ వైరస్!.. ఇక్కడా అక్కడా అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కోట్లాది మంది జీవితాలు దీనితో చిన్నాభిన్నమైపోయినట్టు ప్రఖ్యాత ‘ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్’ తమ అధ్యయనంలో తేల్చింది. ఆ వివరాలేమిటో చూద్దామా.. కరోనా కారణంగా పెట్టిన లాక్డౌన్లు, నిబంధనలు ఓవైపు.. వైరస్ సోకి ఆస్పత్రుల్లో బిల్లుల కోసం చేసిన అప్పులు మరోవైపు.. ఉద్యోగాలు, ఉపాధి పోయి.. ఇంటిని పోషించేవారిని కోల్పోయి.. మధ్యతరగతి, పేద కుటుంబాల పరిస్ధితి దారుణంగా దిగజారింది. ఇదే సమయంలో ధనవంతుల ఆస్తులు మరింతగా పెరిగాయి. పెద్ద సంఖ్యలో కొత్త కోటీశ్వరులూ పుట్టుకొచ్చారు. ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో దీనికి సంబంధించి ఎన్నో ఆందోళనకర అంశాలను వెల్లడించింది. అందరి నష్టం.. కొందరికి లాభం కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా 2,755 మంది బిలియనీర్ల ఆస్తులు అత్యంత భారీగా పెరిగాయి. ఎంతగా అంటే.. సాధారణంగా 23 ఏళ్లలో పెరిగేంత సంపద కేవలం కరోనా టైంలో 24 నెలల్లోనే పెరిగింది. ► కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకువచ్చారు. మొత్తంగా 573 మంది బిలియనీర్లు కొత్తగా వచ్చారు. ఇందులో ఒక్క ఫార్మా రంగానికి చెందినవారే 40 మంది ఉన్నారు. ► ఇక ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారు. మొత్తంగా 26.3 కోట్ల మంది అత్యంత పేదరికంలోకి జారిపోయారు. ► ఆహారం, అత్యవసర సరుకుల ధరలు రెండింతలు పెరిగి పేదలపై తీవ్ర భారం పడింది. ఇదే సమయంలో ఆయా రంగాల కంపెనీల యజమానుల సంపద ప్రతి రెండు రోజులకు రూ.15వేల కోట్ల మేర పెరుగుతూ వచ్చింది. చదవండి: ముంచుకొస్తున్న మహమ్మారి.. పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే! ‘అసమానత’ మరింతగా.. ► ప్రపంచంలో అత్యంత పేదరికంలో ఉన్న 40శాతం జనాభా (సుమారు 310 కోట్ల మంది) మొత్తం ఆస్తి కంటే.. కేవలం 10 మంది అత్యంత ధనవంతుల సంపదే ఎక్కువ. ►ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద 2019 నుంచి ఇప్పటివరకు 699శాతం పెరిగింది. ఇప్పటికిప్పుడు ఆయన సంపదలో 99శాతం పోయినా.. అత్యంత ధనవంతుల జాబితాలోనే ఉంటారు. ►ప్రపంచంలోని పైస్థాయి ధనవంతుల్లో ఒకరు ఒక్క ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని.. ఒక సగటు మధ్యతరగతి సంపాదించాలంటే ఏకంగా 112 ఏళ్లు పడుతుందని అంచనా. ►కరోనా ప్రభావం కారణంగా.. పురుషులు, మహిళల మధ్య వేతనాల తేడా మరింతగా పెరిగింది. మహిళలు ఉద్యోగాలు మానేసే శాతం ఎక్కువైంది. కరోనా వ్యాక్సిన్లలోనూ.. పెద్ద ఫార్మా కంపెనీలు తమ వ్యాక్సిన్ సాంకేతికతను ఇతర కంపెనీలతో పంచుకోకపోవడంతో.. మొదట్లో సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. వ్యాక్సిన్లు అంది ఉంటే లక్షలాది మంది ప్రాణాలు నిలిచి ఉండేవని తెలిపింది. ►ఇప్పటివరకు ఉత్పత్తి అయిన మొత్తం వ్యాక్సిన్లలో 80 శాతానికిపైగా కేవలం 20 దేశాలకే (జీ20) అందాయి. ► పేద దేశాలకు అందిన వ్యాక్సిన్లు ఒక శాతం లోపే. ► ధనిక దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో కోవిడ్‌తో మరణించే ప్రమాదం 4 రెట్లు ఎక్కువ. ప్రాణాలెన్నో తీసింది ►కరోనా ప్రభావం, ఆర్థిక సమస్యల కారణంగా..ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు సెకన్లకు ఒకరు, రోజుకు సుమారు 21,300 మంది మృతి చెందారు. ►సరైన వైద్యం అందక రెండేళ్లలో ఏటా 56 లక్షల మరణాలు నమోదయ్యాయి. ►తగిన ఆహారం అందక ఏటా 21 లక్షల మంది ఆకలి చావుల పాలవుతున్నారు. ►కరోనా కారణంగా ఇండియాలో 20 లక్షల మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయారు. -
అసమానత వైరస్..సమతే వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: సమాజాన్ని పట్టి పీడిస్తున్న అసమానత ప్రస్తుతం ఎదుర్కొంటున్న కోవిడ్‌ను మించిన పెద్ద వైరస్ అని, దాన్ని అంతం చేసే వ్యాక్సిన్ రావాల్సి ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి చెప్పారు. సరిగ్గా వెయ్యేళ్ల క్రితం ఇంతకంటే భయంకరంగా ఉన్న అసమానతలు, అస్పృశ్యతలను రూపుమాపేందుకు సమానత్వ తత్వమనే వ్యాక్సిన్‌ను రామానుజులవారు ప్రయోగించారని, ప్రస్తుత జాఢ్యాన్ని నివారించేందుకు ఇప్పుడు మళ్లీ దాన్ని మనలో పాదుకొల్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాహ్య సమస్యలకు పరిష్కారం కనుగొంటున్న మనం అంతర్గతంగా మనసులను కలుషితం చేస్తున్న అంతరాలను తక్షణం దూరం చేసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందుకోసమే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మనమందరం రామానుజుల తరహా ప్రేరణ పొందేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామన్నారు. సోమవారం సాయంత్రం శంషాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చినజీయర్ స్వామి మాట్లాడారు. సర్వప్రాణులు ఒకటేనని, అంతరాలు లేకుండా మనుషులంతా ఒకటేనని, స్త్రీ పురుష, వర్గ కుల మత ప్రాంత రంగు భేదం లేని సమాజం కోసం రామానుజులు పరితపించి అందించిన సమతా స్ఫూర్తిని చాటేందుకు ఏర్పాటు చేసిన రామానుజుల సహస్రాబ్ది సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. బంగారు శకం ఆరంభం తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలోనే అంటరానివారిని చేరదీసిన రామానుజుల స్ఫూర్తి చాలా కాలం కొనసాగిందని, బ్రిటిష్ వారు వచ్చాక అది విచ్ఛిన్నమైందని, ఇప్పుడు మళ్లీ రావాల్సిన అవసరం ఉందని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో వీరోచితంగా వ్యవహరించిన ఎంతోమందిని స్మరించుకునే అవకాశం ప్రస్తుత ప్రభుత్వం ఆజాదీకా అమృతోత్సవంలో కల్పించిందని, సరిగ్గా ఇదే సమయంలో రామానుజుల సహస్రాబ్ది వేడుకలు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం కొత్త విద్యావిధానాన్ని తేబోతోందని, పరిస్థితి చూస్తుంటే మళ్లీ బంగారు శకం ఆరంభమైనట్టుగా తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మైహోం అధినేత రామేశ్వరరావు తదితరులు స్వామి వెంట ఉన్నారు. రేపట్నుంచీ కార్యక్రమాలు ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సశాస్త్రీయంగా, వైదికంగా దీనికి సంబంధించిన కార్యక్రమాలుంటాయని చెప్పారు. 5 వేల మంది రుత్వికులు 1,035 హోమకుండాలతో లక్ష్మీ నారాయణ యాగాన్ని నిర్వహించబోతున్నారన్నారు. లక్షన్నర కిలోల దేశవాళీ ఆవుపాలతో రూపొందించిన నెయ్యిని హోమద్రవ్యంగా వినియోగిస్తున్నామని, ఇది ఆవు పాలతో నేరుగా చేసిన నెయ్యి కాదని, పాలను పెరుగుగా మార్చిన తర్వాత తీసిన వెన్నతో చేసిన శ్రేష్టమైన నెయ్యిగా పేర్కొన్నారు. ఐదో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ 216 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన రామానుజుల మహామూర్తిని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శైవ, వైష్ణ, శాక్తేయ సంప్రదాయాల్లోని పండితులు పాల్గొంటున్నారన్నారు. అంటరానివారిగా ముద్రపడ్డ వారిని వెయ్యేళ్లనాటి కఠిన పరిస్థితుల్లోనే చేరదీసి సమానత స్ఫూర్తి నింపిన రామానుజుల వారి బాటలోనే తాము నడుస్తున్నామని, ఈ హోమం వద్ద కూడా కుల, వర్గ భేదాలు చూపటం లేదని స్పష్టం చేశారు. రామానుజులకు సమానత్వ నినాదంలో ప్రేరణ కలిగించిన 108 దివ్వ దేశాలుగా పేర్కొనే వైష్ణవ క్షేత్రాల నమూనాలను ఇక్కడ నిర్మించామని, ఆయా క్షేత్రాల్లో నిర్వహించే కైంకర్యాలు ఇక్కడా కొనసాగుతాయని, ఆ క్షేత్రాల్లో పూజలందుకున్న ఏదో ఒక విగ్రహం ఇక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. -
కరోనాతో కొత్తగా 16 కోట్ల మంది నిరుపేదలు
న్యూఢిల్లీ/దావోస్: కరోనా సంక్షోభంతో ప్రపంచదేశాలు ఆర్థికంగా కునారిల్లినప్పటికీ అపరకుబేరుల సంపద పెరిగిపోతూనే ఉంది. పేదలు నిరుపేదలుగా మారుతూ ఉండటంతో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ రెండేళ్ల కాలంలో మరో 16 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోయారని పేదరిక నిర్మూలనకు పాటుపడే స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో వెల్లడైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్‌ఫామ్ సంస్థ ఆర్థిక అసమానతలపై వార్షిక నివేదిను ‘‘ఇన్‌ఈక్వాలిటీ కిల్స్’’పేరుతో విడుదల చేసింది. కరోనా మహమ్మారి బిలియనీర్ల పాలిట బొనాంజాగా మారిందని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక హింస నెలకొంది. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తున్నాయి. దీని కారణంగా నిరుపేదలు చితికిపోతున్నారు. ఇప్పటికైనా ధనవంతులపై మరిన్ని పన్నులు వేసి వారి సంపదను వెనక్కి తీసుకువస్తే ఎందరి ప్రాణాలనో కాపాడిన వారు అవుతారు’’అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియెలా బచర్ వ్యాఖ్యానించారు. బిలియనీర్లు జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, బిల్ గేట్స్ సహా ప్రపంచంలోని టాప్–10 జాబితాలో ఉన్న వారి ఒక్క రోజు సంపాదన దాదాపుగా 130 కోట్ల డాలర్లు (రూ 9,658 కోట్లు) ఉంది. ► ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 10 మంది సంపాదన 70 వేల కోట్ల డాలర్లు (రూ. 52 లక్షల కోట్లు) నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లుకు (రూ. 111 లక్షల కోట్లకు పై మాటే) చేరుకుంది. ► ప్రపంచంలోని నిరుపేదలైన 310 కోట్ల మంది కంటే ఈ పది మంది ఆరు రెట్లు అధిక సంపన్నులు ► ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా రోజుకి సగటున 21 వేల మంది ప్రాణాలను తీస్తున్నాయి. 310 కోట్ల మంది నిరుపేదల కంటే 10 మంది కుబేరుల సంపాదనే ఎక్కువ భారత్‌లో 84% కుటుంబాల ఆదాయం తగ్గింది భారత్‌లో కరోనా మహమ్మారి కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేసింది. 2021లో దేశంలోని 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయి ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. అదే సమయంలో కోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రికార్డు స్థాయిలో ఏడాదిలోనే రూ.57.3 లక్షల కోట్లకు (77,500 కోట్ల అమెరికా డాలర్లు) చేరుకుంది. జనాభాలో ఆర్థికంగా దిగువన ఉన్న 50 శాతం జనాభా జాతి సంపదలో 6 శాతం మాత్రమే కలిగి ఉన్నారు. ► భారత్‌లో కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య ఏడాదిలో 39% పెరిగింది. వందకోట్లకు పైగా ఆస్తి ఉన్న కోటీశ్వరులు 102 నుంచి 142కి పెరిగారు ► భారత్‌లో టాప్–10 కోటీశ్వరుల దగ్గరున్న సంపదతో దేశంలో ఉన్న పిల్లలు ప్రాథమిక, ఉన్నత విద్యకూ కావల్సిన నిధులను 25 ఏళ్ల పాటు సమకూర్చవచ్చును. ► టాప్– 10 కోటీశ్వరులు రోజుకు రూ. 7.42 కోట్లు ఖర్చు పెట్టినా... వారివద్ద ప్రస్తుతమున్న ఆస్తి మొత్తం హరించుకుపోవడానికి 84 ఏళ్లు పడుతుంది. ► కోటీశ్వరుల్లో 10 శాతం మందిపై అదనంగా ఒక్క శాతం పన్ను వసూలు చేస్తే 17.7 లక్షలు అదనంగా ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు. ► 98 మంది బిలియనీర్లపై ఒక్క శాతం అదనంగా పన్ను వసూలు చేస్తే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఏడేళ్లకు పైగా నడపడానికి నిధులు సమకూరుతాయి. ► కరోనా సంక్షోభ సమయంలో భారత్‌లో మహిళల్లో 28 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. మూడింట రెండొతుల ఆదాయాన్ని కోల్పోయారు. -
Oxfam Report: డబ్బు వెల్లువలా వస్తూనే ఉంది, కానీ..
కరోనా మహమ్మారి కోరలు చాచిన రెండేళ్లలో (2020, 2021) సంవత్సరాల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల సంపద రెట్టింపైనట్టు ఆక్స్‌ఫామ్ సంస్థ ప్రకటించింది. Oxfam Davos 2022 నివేదిక ప్రకారం.. అంతకుముందు 14 ఏళ్లలో పెరిగిన దానితో పోలిస్తే కరోనా టైంలోనే ఇది మరింతగా వృద్ధి చెందినట్టు గణాంకాలను విడుదల చేసింది. అదే సమయంలో పేదరికం, అసమానతలు తారాస్థాయికి పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తం చేసింది. బిలియనీర్.. బిలియన్ డాలర్, అంతకు మంచి సంపద ఉన్నవాళ్లు. 2021లో భారత్ విషయానికొస్తే బిలియనీర్ల సంపద రెట్టింపునకు పైగా పెరిగింది. అంతేకాదు బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి.. 142 మందికి చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే అదనంగా 40 మంది బిలియనీర్లు చేరారు!. ఈ వివరాలను ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021లో 142 మంది భారత బిలియనీర్ల వద్ద ఉమ్మడిగా ఉన్న సంపద విలువ 719 బిలియన్ డాలర్లు. అంటే.. దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలకుపైనే. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద అయితే ఉందో.. 98 మంది సంపన్నుల దగ్గరా అంతే మేర (రూ.49 లక్షల కోట్లు) ఉంది. ►భారత్ లోని టాప్ 10 (విలువ పరంగా) ధనవంతుల వద్దనున్న సంపదతో దేశంలోని పిల్లలు అందరికీ పాఠశాల, ఉన్నత విద్యను 25 ఏళ్లపాటు ఉచితంగా అందించొచ్చు. ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు మొదటి రోజు ఆక్స్ ఫామ్ ‘అసమానతల‘పై సర్వే వివరాలను వెల్లడిస్తుంటుంది. ►భారత్ లోని టాప్ 98 ధనవంతులపై ఒక్క శాతం సంపద పన్నును వసూలు చేసినా ఆయుష్మాన్ భారత్ పథకానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవచ్చు. ► రెండో వేవ్ ఇన్ఫెక్షన్ టైంలో ఆరోగ్య మౌలిక వసతులు, అంత్యక్రియలు, శ్మశానాలే ప్రధానంగా నడిచాయి. ► భారత్‌లో అర్బన్ అన్ఎంప్లాయిమెంట్ విపరీతంగా పెరిగిందని(కిందటి మేలో 15 శాతం), ఆహార అభద్రత మరింత క్షీణించింది. ► సంపద పునఃపంపిణీ పాలసీలను సమీక్షించాలని గ్లోబల్ ఆక్స్‌ఫామ్ దావోస్ నివేదిక భారత ప్రభుత్వానికి సూచిస్తోంది. ►గౌతమ్ అదానీ.. భారత్‌లో అత్యధికంగా అర్జించిన వ్యక్తిగా ఉన్నారని, ప్రపంచంలోనే ఈయన స్థానం ఐదుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది. అదానీ 2021 ఏడాదిలో 42.7 బిలియన్ డాలర్ల సంపదను జత చేసుకున్నట్లు.. మొత్తం 90 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముకేష్ అంబానీ 2021లో 13.3 బిలియన్ డాలర్లు వెనకేసుకోగా.. ఈయన మొత్తం సంపద విలువ 97 బిలియన్డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే.. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ పేజ్, సెర్జీ బ్రిన్, మార్క్ జుకర్ బర్గ్, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్, లారీ ఎల్లిసన్, వారెన్ బఫెట్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ టాప్ 10 ప్రపంచ సంపన్నులుగా ఆక్స్ ఫామ్ నివేదిక పేర్కొంది. ►ఈ పది మంది అత్యంత సంపన్నులు రోజూ మిలియన్ డాలర్ల చొప్పున (రూ.7.4కోట్లు) ఖర్చు పెట్టుకుంటూ వెళ్లినా, సంపద కరిగిపోయేందుకు 84 ఏళ్లు పడుతుందని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది. ► అసమానతలు కరోనా సమయంలో ఎంతలా విస్తరించాయంటే.. ఆరోగ్య సదుపాయాల్లేక, ఒకవేళ ఉన్నా అవి అందుబాటులోకి రాక రోజూ 21,000 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు విడుస్తున్నారు. ►కరోనా దెబ్బకు 16 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ►స్టాక్ ధరల నుంచి.. క్రిప్టో, కమోడిటీస్ అన్నింటి విలువా పెరుగుతూ వస్తోంది. ►ప్రపంచంలోని 500 మంది ధనికులు 1 ట్రిలియన్ డాలర్ల సంపదను వెనకేసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది. -
ఇప్పటికీ ఇంత తేడానా?
చెంప ఛెళ్ళుమనిపించే వాస్తవం అది. పాలకులు మేల్కోవాల్సిన అగత్యాన్ని గణాంకాల్లో చాటి చెప్పిన నివేదిక అది. ప్రపంచంలో ధనిక, పేద తేడా అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటంటూ ‘ప్రపంచ అసమానతల నివేదిక’ చేదు నిజాన్ని చెప్పింది. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు మహా రాజుల – ముష్టివాళ్ళ గడ్డగా ప్రపంచం పిలుచుకొన్న భారత్, స్వాతంత్య్రం వచ్చి 75వ ఏట అడు గిడినా ఇప్పటికీ అటు అతి సంపన్నులు, ఇటు నిరుపేదలున్న దేశంగానే మిగిలిందని వెల్లడైంది. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలోనే కాదు, స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న అసమానతలను తొలగించడంలోనూ మనం విఫలమవడం విషాదం. అసమానతలను కొలవడానికి అంతటా అంగీకరించే ‘జీనీ కో–ఎఫిషియంట్’ లెక్క సైతం మనదేశంలో 2000లో 74.7 ఉండేది. ఇరవై ఏళ్ళలో అది 82.3కి పెరగడం గమనార్హం. ఒక్క ముక్కలో, మునుపెన్నడూ లేని ప్రమాదకర స్థాయిలో దేశంలో ఇప్పుడు పేద, గొప్ప తేడాలున్నాయి. ‘ప్రపంచ అసమానతల సమాచార నిధి’ లెక్కల ప్రకారం 1951 నాటికి మన దేశం జాతీయ ఆదాయంలో అగ్రశ్రేణి 1 శాతం మంది వాటా, దిగువ శ్రేణి 40 శాతం మంది వాటాతో సమానం. అదే ఇవాళ చూస్తే – దిగువన ఏకంగా 67 శాతం మంది వాటా అంతా కలిస్తే కానీ, అగ్రశ్రేణి 1 శాతం మంది వాటాకు సరిపోదు. పోనీ, 1961 నుంచి అందుబాటులో ఉన్న జాతీయ సంపద లెక్కల్ని బట్టి చూసినా, ఎంతో అసమానత స్పష్టమవుతుంది. అప్పట్లో దేశ జాతీయ సంపదలో 1 శాతం సంపన్నులదీ, 50 శాతం నిరుపేదలదీ సమాన వాటా. అరవై ఏళ్ళ దేశపురోగతి తర్వాత ఇప్పుడు– దిగువన ఉన్న 90 శాతం మంది భాగం కలిస్తే కానీ, పైనున్న ఒక్క శాతం సంపన్నుల వాటాకు సరితూగడం లేదు. స్వతంత్ర భారతంలో ఆర్థిక అసమానతకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టీతో పాటు పలువురు సమన్వయం చేయగా, ‘వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్’ కో–డైరెక్టర్ లూకాస్ ఛాన్సెల్ ఈ ‘ప్రపంచ అసమానతల నివేదిక’కు అక్షరరూపం ఇచ్చారు. 2021కి గాను నవీకరించిన డేటా ప్రకారం ప్రపంచంలో 76 శాతం సంపద, సంపన్నులైన 10 శాతం మంది చేతిలోనే ఉంది. ప్రపంచ ధోరణికి తగ్గట్లే మన దేశమూ ఉంది. మన జాతీయ ఆదాయంలో 57 శాతం అగ్రశ్రేణిలో ఉన్న 10 శాతం మంది అతి సంపన్నులదే. అందులోనూ అందరి కన్నా పైయెత్తున ఉన్న ఒకే ఒక్క శాతం మందికి 22 శాతం ఆదాయం సొంతం. సంపద నిచ్చెనలో దిగువన ఉన్న 50 శాతం మంది వాటా కేవలం 13 శాతమే. ఇంకా చెప్పాలంటే, పైనెక్కడో ఉన్న 10 శాతం మందికీ, దిగువనెక్కడో ఉన్న 50 శాతం మందికీ మధ్య మన దేశంలో ఆదాయ వ్యత్యాసం 1 నుంచి 22 ఉందని లెక్క. ఇది చాలా పెద్ద తేడా అని నిపుణుల మాట. సమాచార నిధిలో లెక్కల ప్రకారం ఇతర దేశాలతో పోలిస్తే, మనమింకా ఎక్కడున్నామో తెలుస్తోంది. ఇవాళ 50 శాతం మంది అతి నిరుపేద భారతీయుల సగటు ఆదాయం, 1932లో 50 శాతం మంది అతి పేద అమెరికన్ల సంపాదనతో సమానమట. అంటే, 1930ల నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసిన తర్వాత అమెరికన్ నిరుపేదలు ఎక్కడున్నారో, 90 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అక్కడే ఉన్నామన్న మాట. నెహ్రూవాద సామ్యవాదం మొదలు ఇందిరా గాంధీ మార్కెట్ సంస్కరణల ‘ప్రగతి పథం’, రాజీవ్ గాంధీ ప్రైవేటీకరణ జోరు, పీవీ నరసింహారావు – మన్మోహన్‌ల ఆర్థిక సంస్కరణల మీదుగా చాలా దూరం వచ్చాం. కానీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో గణనీయ వృద్ధి వచ్చినా, దిగువనున్న 50 శాతం బీదవర్గాల భారతీయులకు ఒరిగిందేమీ లేదు. భారత ప్రస్థానంలో అత్యంత కీలకమైన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ – ఈ 3 ఆర్థిక విధానాల వల్ల అగ్రశ్రేణిలోని 10 శాతం సంపన్నులే అనూహ్య లబ్ధి పొందారు. మిగిలిన 90 శాతానికి దక్కింది లేదు. దేశంలో అసమానతలు, అంతరాలు ఇంతగా పెరగడానికి అదే మూలకారణమని నిపుణుల విశ్లేషణ. ఇప్పుడు కరోనాతో అసమానతలు మరింత పెరిగాయి. అసమానత ఒక ముప్పు అయితే, అభివృద్ధి రేటు కుంటుపడడం మరిన్ని కష్టాలు తెచ్చింది. మధ్యతరగతిలో 3.2 కోట్ల మంది కొత్తగా దారిద్య్రంలోకి జారిపోయినట్టు ‘ప్యూ రిసెర్చ్’ మాట. కానీ, కోటీశ్వరుల సంపద మాత్రం నిరుడు లాక్డౌన్లో 35 శాతం పెరిగిందట. అలాగని స్వాతంత్య్రపు తొలి రోజులతో పోలిస్తే, బీదాబిక్కీ జీవన ప్రమాణాలు అసలేమీ మెరుగు కాలేదని అనలేం. అయితే అది సరిపోతుందా? అసమానతలు సామాజికంగానూ ప్రభావం చూపుతున్నాయి. అతి సంపన్నులు 1 శాతం, వారికి తోడుబోయిన తరువాతి 9 శాతం మంది చెప్పినట్టే సంస్థలు, ప్రజా విధానాలు సాగుతాయి. జనానికి తెలియజెప్పాల్సిన మాధ్యమాలూ వారి చేతి కిందే. ఓటింగ్‌ను ప్రభావితం చేసే ప్రజాభిప్రాయ పరికల్పనా వారి చేతుల్లోనే. అదే పెద్ద చిక్కు. అయితే, దేశంలోని దారిద్య్ర వర్గాన్ని పైకి తీసుకురావడం అసాధ్యమేమీ కాదు. లేమిపై పోరుకు కావాల్సిన భౌతిక, సామాజిక వసతి సౌకర్యాల కల్పన ఓ సవాలు. నిజానికి, లేనివాళ్ళు పాతాళం నుంచి పైకి లేవాలన్నా, పైపైకి రావాలన్నా అందుకు రాజకీయ సాధికారికత కీలకం. అది చేతికి అందితే, విద్య, వైద్యం లాంటివి డిమాండ్ చేసి మరీ సాధించుకుంటారు. ఫలితంగా సమాజంలో వ్యవస్థాగత అసమానతలు, వర్గ విభేదాలు రూపుమాసిపోగలుగుతాయి. అందుకు తక్షణమే నడుం కట్టాల్సింది రాజకీయ నేతలు, విధాన నిర్ణేతలే. అత్యవసరంగా చర్యలు చేపట్టడమే శరణ్యం. -
దేశంలో భారీగా పెరిగిన ఆదాయ అసమానతలు
India Is Poor and Very Unequal With Affluent Elite: దేశంలో రోజురోజుకీ ఆదాయ అసమానతలు భారీగా పెరిగిపోతున్నాయి. ధనిక ప్రజలు మరింత ధనవంతులు అవుతుంటే.. పేద ప్రజలు ఇంకా పేదరికంలో జారుకుంటున్నారు. 2021 జాతీయ ఆదాయంలో ఐదో వంతు కేవలం ఒక శాతం మంది దగ్గరే ఉన్నట్లు ప్రపంచ అసమానత నివేదిక తెలిపింది. భారత్‌లో ఆదాయపరమైన అసమానతలు భారీగా పెరిగిపోతున్నట్లు వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. 2021లో మొత్తం జాతీయ ఆదాయంలో ఒక శాతం ధనవంతులైన భారతీయుల వద్ద 22 శాతం సంపద కలిగి ఉన్నారని ఈ నివేదిక తెలిపింది. ఇక ధనవంతుల జాబితాలో ఉన్న తొలి 10 శాతం మంది చేతిలో 57 శాతం ఆదాయం ఉన్నట్లు పేర్కొంది. సంపదలోనూ అసమానతలు భారత దేశంలో వయోజనుల సగటు ఆదాయం ఏడాదికి రూ.2,04,200 అని నివేదిక తెలిపింది. సంపదలోనూ అసమానతలు తీవ్రంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. సంపద విషయంలో కిందనున్న 50 శాతం కుటుంబాల వద్ద అసలేమీ సంపద లేదని పేర్కొంది. మధ్య తరగతి వారి వద్ద 29.5 శాతం సంపద ఉందని వెల్లడించింది. అదే పైన ఉన్న 10 శాతం మంది వద్ద 65 శాతం, 1 శాతం మంది దగ్గర 33 శాతం సంపద ఉన్నట్లు తెలిపింది. మధ్యతరగతి వారి వద్ద సగటున రూ.7,23,930ల సంపద ఉన్నట్లు నివేదించింది. అదే పైన ఉన్న 10 శాతం మంది దగ్గర సగటున రూ.63,54,070, ఒక శాతం మంది వద్ద రూ.3,24,49,360 సంపద ఉన్నట్లు తెలిపింది. (చదవండి: ఫేస్‌బుక్‌కు భారీ షాక్.. 10 లక్షల కోట్లకు దావా!) లింగ అసమానతలు 1985 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ఆదాయ, సంపద విషయంలో అసమానతల్ని పెంచాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పైన ఉన్న ఒక శాతం మంది ఆర్థిక సంస్కరణల వల్ల భారీ లబ్ధి పొందారని తెలిపింది. తక్కువ, మధ్య ఆదాయ సమూహాల మధ్య వృద్ధి సాపేక్షంగా ఉన్నట్లు పేర్కొంది. 1985 తర్వాత నుంచి నేటికి పేదరికం పెరుగుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. అలాగే, దేశంలో లింగ అసమానతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మహిళా కార్మిక ఆదాయ వాటా కేవలం 18 శాతం అని తెలిపింది. ఆసియాలో చైనా మినహా మహిళా కార్మిక ఆదాయ వాటా 21 శాతం కంటే తక్కువ ఉన్నట్లు తెలిపింది. (చదవండి: మీ ఫేస్బుక్ ప్రొఫైల్‌ని ఎవరు చూశారో తెలుసుకోండి ఇలా..?) -
కడకు కరోనా కూడా...!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకి... ఉన్నవాళ్లు, లేనివాళ్లనే వ్యత్యాసం లేదు. అందరిపైనా అది ఒకేలా ప్రభావం చూపుతోంది, అన్నది సాధారణ భావన! ఉపరితలం నుంచి చూస్తే అలానే కనిపించినా.. లోతుల్లోకి వెళితే అది తప్పని తేలుతోంది. విరుద్ధ పరిస్థితి క్షేత్రంలో నెలకొంది. ఈ కోవిడ్–19 కాలంలో పేదలు మరింత పేదలవుతుంటే, సంపన్నులు ఇంకా సంపన్నులౌతున్నారు. దేశంలోని కోట్లాది మంది వ్యయస్తోమత దారుణంగా పడిపోయింది. రానురాను కొన్ని కుటుంబాల్లో జరుగుబాటు దుర్భరమయ్యే పరిస్థితి! ప్రయివేటు వినియోగం నలభయ్యేళ్ల కనిష్టానికి (9 శాతం) అడుగంటింది. గత పదహారు నెలల్లో దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల్ని గమనిస్తే, ఇదే ధ్రువపడుతోంది. పేద, అల్ప, మధ్యాదాయ వర్గాలకు చెందిన మెజారిటీ కుటుంబాల పరిస్థితి నేడెంతో దయనీయంగా ఉంది. మధ్యతరగతిపైనా కోవిడ్ పెద్ద దెబ్బే కొట్టింది. కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి, సంపాదించే వ్యక్తిని పోగొట్టుకున్న వారు, ఆస్పత్రిపాలై పెద్ద మొత్తాల్లో ఫీజులు కట్టాల్సి వచ్చిన వారి దుస్థితి వేరే చెప్పనక్కర్లేదు. ధనిక–పేద మధ్య అంతరం సహజంగానే ఏటా పెరుగుతున్నట్టు ప్రపంచ ఆర్థిక నివేదికలు చెబుతూనే ఉన్నాయి. దురదృష్టమేమంటే, కోవిడ్ పాడుకాలంలోనూ అదే దుస్థితి పునరావృతమౌతోంది! అది కూడా రెట్టించిన ప్రభావంతో, తీవ్ర రూపంలో ఉండటమే ఆందోళనకరం. ఏడాదిన్నర కాలంగా కొత్త ఉద్యోగాలు పెద్దగా రాలేదు. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. ముఖ్యంగా అసంఘటిత రంగంలో! చాలా చోట్ల జీతాలు, వేతనాల్లో కోతలు అమలవుతున్నాయి. వ్యాపార–సేవా రంగాల్లో వస్తున్న రాబడులు రమారమి తగ్గాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సంస్థలే కాకుండా ఓ మోస్తరు కంపెనీలు కూడా మూతపడు తున్నాయి. పర్యాటక, ప్రయాణ, హోటల్, వినోద, విహార, విలాస... ఇలా పలు రంగాలు స్తంభిం చాయి. ఉపాధిపోయి ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడుతున్నారు. కోవిడ్ తొలి, రెండో అల ఉధృతిలోనూ తిరోగమన వలసలు పెరిగి, దిన కూలీల కళ్లల్లో నీళ్లు, జీవితాల్లో దిగుళ్లే మిగిలాయి. సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారనడానికి ఎక్కువ ఉదాహరణలు అవసరం లేదు. షేర్ మార్కెట్లో... సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు పైపైకి వెళుతూ ఏ రోజుకారోజు కొత్త రికార్డులు బద్దలు కొట్టడం దేనికి సంకేతం? కొందరు పెట్టుబడిదారులు, ప్రమోటర్లు, దళారీ వ్యవహారకర్తలు... ఇబ్బడిముబ్బడిగా సంపదను పెంచుకోవడం మన కళ్లముందరి వాస్తవం! కోవిడ్ దుర్భర కాలం లోనూ పెద్ద మొత్తాల్లో వార్షికాదాయాలు పెంచుకొని ప్రపంచ కుబేరుల జాబితా (బ్లూమ్‌బర్గ్)లో పైపైకెగబాకిన మన అంబానీ, అదానీలు తాజా స్థితికి మరో సాక్ష్యం! అంబానీ ఈ ఏడాదిలోనే 7.62 బిలియన్ డాలర్ల (రూ.55,802 కోట్లు) ఆదాయం పెంచుకొని 84 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.6.15 లక్షల కోట్లు) సంపన్నుడయారు. ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో 12 స్థానం దక్కించుకున్నారు. ఇక అదానీది శీఘ్ర ప్రగతి! కోట్లాది కుటుంబాలు కోవిడ్ కోరల్లో విలవిల్లాడిన ఈ సంవ త్సరమే... 43.2 బిలియన్ డాలర్ల ఆదాయం కొత్తగా గడించి, మొత్తమ్మీద 77 బిలయన్ డాలర్ల (దాదాపు రూ.5.64 లక్షల కోట్లు) సంపద గడించి 14 వ స్థానానికి ఎదిగారు. ప్రపంచ సంపన్నుల జాబితాల్లో, ఆర్థిక నివేదికల్లో, కార్పొరేట్ సంపద వృద్ధి రేఖల్లో ఇది కొట్టొచ్చినట్టు కనిపించే.... ‘దాచేస్తే దాగని సత్యం!’ దురదృష్టకరంగా అదే సమయంలో... మరో 23 శాతం మంది భారతీ యులు దారిద్య్ర రేఖ (బీపీఎల్) కిందికి నిర్దాక్షిణ్యంగా జారిపోయారు. అంటే, పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడటం! ఇది, అజీమ్ప్రేమ్జీ (విప్రో) వర్సిటీ అధ్యయన నివేదిక! ఇంకో లెక్క ప్రకారం ఈ శాతం ఇంకా ఎక్కువే అంటారు. దేశంలోని కోట్ల కుటుంబాలకు ఆరోగ్యభద్రత కరువై మూమూలుగానే ఏటా 6.3 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకి వెళుతున్నట్టు నీతి ఆయోగ్ వెల్లడిం చింది. మే మొదటి వారంలో 7.29 శాతంగా ఉన్న నిరుద్యోగిత, పది రోజుల తర్వాత 14.34 శాతా నికి (దాదాపు రెట్టింపు) పెరిగింది. ఈ ఏడాది తొలి అయిదు మాసాల్లోనే 2.5 కోట్ల ఉద్యోగాలు ఊడి పోయాయి. స్థూలంగా శ్రమజీవుల ఆదాయం 17 శాతం తగ్గినట్టు ఒక అధ్యయనం చెప్పింది. దేశంలో నెలకొన్న ఆర్థిక స్థితిని లోతుగా మదింపు చేసిన ఇద్దరు ఆర్థిక నిపుణులు, సమాజంలో పెరుగుతున్న ఆర్థిక అంతరాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారత రిజర్వ్‌బ్యాంకు మాజీ గవర్నర్లు వేర్వేరుగా మాట్లాడుతూ, అంతరాలు తగ్గించాలని నొక్కి చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో... అసమ తుల్య ఆర్థిక పునరుజ్జీవనం సిద్ధాంతపరంగా తప్పు, రాజకీయంగా నష్టదాయకమన్నది దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్య! దేశీయ మార్కెట్లలో ద్రవ్య లభ్యత, విదేశీ నిధుల ప్రవాహం వల్ల షేర్లు, ఇతర ఆస్తుల విలువ పెరగటాన్ని ఆయన ప్రస్తావించారు. మరోవైపు అసంఘటిత రంగంలో లక్షలాది కుటుంబాల ఇబ్బందుల్ని గుర్తు చేశారు. ‘జీడీపీ గణాంకాలు కొంత ఆశాజనకంగా ఉన్నా, వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేద’ని రఘురామరాజన్ వ్యాఖ్యానించారు. పబ్లిక్ వ్యయం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ఉపాధి హామీని మరింత విస్తరించడం, తిండి గింజలు, నిత్యా వసరాల్ని ఉచితంగా పంపిణీ చేయడం, అవసరమైతే నగదు పంపిణీ చేసి పౌరుల కొనుగోలు శక్తిని, సామర్థ్యాన్ని, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్నీ పెంచాలని ఇద్దరూ సూచించారు. ప్రజాస్వామ్య హితైషులు ఎవరు కోరేదైనా ఒకటే, అశాంతికి, అలజడికి దారితీసే ఆర్థిక అంతరాలు తగ్గాలి! ఫలితంగా శాంతి వెల్లివిరియాలి. -
ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ కాలేజీలో ఏర్పాటుచేసిన గ్రాడ్యుయేషన్ సెరిమనీలో పాల్గొన్న ఒబామా నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్ష, దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితులు వంటి అంశాలను ప్రస్తావించారు. కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. 75,000 మందికి పైగా అమెరికన్ల ప్రాణాలను తీసిన మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన వైద్య పరికరాలు లేవు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో డొనాల్డ్ ట్రంప్ దారుణంగా విఫలమయ్యారంటూ ఒబామా మండిపడ్డారు. చదవండి: భారతీయులు భళా: ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది తమను తాము ఇన్‌చార్జ్‌లుగా చెప్పుకుంటున్నా వారు చేస్తున్న పనులు వారికే అర్థం కావడంలేదు. అనేక సంవత్సరాలుగా నల్లజాతీయులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ సందర్బంగా ఫిబ్రవరి 23న జార్జియాలో 25ఏళ్ల అహ్మద్ ఆర్బెరిని కాల్చి చంపిన ఘటనని గుర్తు చేశారు. కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న సమయంలోనూ.. బయటికి వచ్చిన నల్లజాతీయులను చంపేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు కనీసం నటించడం లేదంటూ' ఒబామా విమర్శలు గుప్పించారు. కాగా.. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్–19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని, ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ వ్యవహరించిన తీరు.. విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించిన విషయం తెలిసిందే. చదవండి: వాటి వల్ల కరోనా చావదు: డబ్ల్యూహెచ్‌వో -
రోజుకు రూ. 2,200 కోట్లు పెరిగింది!
సమాజంలో పేద-ధనిక మధ్య వ్యత్యాసం పెరుగుతూ పోతోందని అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ నివేదించింది. భారతీయ కోటీశ్వరుల సంపద గత ఏడాది భారీగా పెరిగిందని ఆక్స్‌ఫామ్ స్టడీ తేల్చింది. సోమవారం విడుదల చేసిన ఈ అధ్యయనం ప్రకారం 2018లో భారతీయ కుబేరుల సంపద రోజుకు 2వేల,200 కోట్ల రూపాయల మేర పుంజుకుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద12శాతం పుంజుకుని రోజుకు దాదాపు 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో అత్యంత ధనవంతుల్లో 1 శాతం మంది ఆదాయం 39 శాతం పెరగ్గా, పేదవారి ఆదాయం మాత్రం 3 శాతం మాత్రమే పెరిగిందని ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో తేలింది. భారత్ జనాభాలో 50 శాతం మంది సంపద కేవలం 9 మంది బిలియనీర్ల వద్ద కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గత ఏడాది 26 మంది బిలియనీర్లు మరింత ధనికులై కోట్లకు పడగలెత్తితే.. సుమారు 3.8 బిలియన్ల మంది పేదలు ఇంకా దారిద్యంలోనే మగ్గుతున్నారని రిపోర్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం భారత్‌లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 119కి చేరింది. వీరి మొత్తం ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్లు(రూ.28 లక్షల కోట్లు)కు చేరిందని ఆక్స్ ఫామ్ తెలిపింది. 2008 తర్వాత ఇదే భారీ పెరుగుదల. 2018-2022 మధ్య భారత్ నుంచి కొత్తగా రోజుకు 70 మంది మిలియనీర్లుగా కొత్తగా ఈ జాబితాలో చేరతారని ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది. ప్రపంచ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సమావేశం మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సంస్థ తన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో సగం పేద జనాభా వద్ద సొమ్ము 11 శాతం తగ్గిపోయింది అని ఆక్స్‌ఫామ్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో మొత్తం సంపదలో 77.4శాతం కేవలం జనాభాలోని కేవలం 10శాతం మంది చేతుల్లో వుంది. అంతేకాదు 51.53శాతం సంపద 1 శాతం ధనవంతుల వద్ద ఉంది. 60 శాతం మంది జాతీయాదాయంలో 4.8 శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. భారత్‌లో 10 శాతం జనాభా 13.6 కోట్ల మంది ప్రజలు కడుపేదవారుగా మారిపోతున్నారనీ, 2004 నుంచి అప్పుల్లోనే మగ్గిపోతున్నారు. వైద్య, ప్రజా ఆరోగ్య, పారిశుద్ధ్యం, నీటి సరఫరా కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న మొత్తం రెవెన్యూ, ఖర్చులు రూ. 2,08,166 కోట్లుగా ఉన్నాయనీ, ఇది భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ రూ. 2.8 లక్షల కోట్ల సంపద కంటే తక్కువని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 112 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 115 మిలియన్ జనాభా ఉన్న ఇథోపియా దేశ ఆరోగ్య బడ్జెట్ బెజోస్ ఆదాయంలో 1 శాతం ఆదాయం సమానమని ఆక్స్‌ఫామ్ స్టడీ వ్యాఖ్యానించింది. 2008లో పలు ప్రపంచదేశాల్లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడినా బిలియనీర్ల సంఖ్య రెట్టింపయిందని ఆక్స్‌ఫామ్ స్టడీలో తేలింది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఆరోగ్య, విద్య వంటి ప్రజా సేవలపై అతి తక్కువ నిధులతో అసమానతలను పెంచుతోంటే...మరోవైపు సూపర్ సంపన్నులు, కార్పొరేట్స్ దశాబ్దాల కాలంగా తక్కువ పన్నులు చెల్లిస్తున్నారని ఆక్స్‌ఫామ్ అమెరికా శాఖ వైస్ ప్రెసిడెంట్ పాల్ ఓబ్సీన్ తెలిపారు. కోట్లాది పేదలు, బడుగువర్గాలు రోజుకు అయిదున్నర డాలర్లకన్నా తక్కువ సంపాదిస్తూ దుర్భరంగా బతుకులీడుస్తున్నారన్నారు. ఇది పేద మహిళల, బాలికల విషయంలో మరీ అధ్వాన్నంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన కళ్ళ ముందున్న ఆర్ధిక వ్యవస్థ చాలా ‘అమానుషం‘ గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ధనికులు మరింత ధనికులు కావడాన్ని తాము వ్యతిరేకించకపోయినప్పటికీ..అదే సమయంలో పేదల సంపద కూడా పెరగాలి.. ఇందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అని పాల్ వ్యాఖ్యానించారు. తమ తాజా నివేదికను అన్ని దేశాలకూ పంపుతామని చెప్పారు. BREAKING: Billionaire fortunes grew by $2.5 billion a day last year as the poorest people saw their wealth fall – our latest inequality report is out today: https://t.co/aVgdwB6i07 #wef19 #FightInequality #BeatPoverty pic.twitter.com/mc2HW1dDSp — Oxfam International (@Oxfam) January 21, 2019 -
అందరికీ అభివృద్ధి ఫలాలు..
♦ అందుకు అంతర్జాతీయ సహకారం అవసరం ♦ ఐఎంఎఫ్ వేదికగా ప్రపంచ నేతల పిలుపు ♦ అసమానతలు తొలగించే దిశగా పనిచేయాలి: ఒబామా వాషింగ్టన్: ప్రపంచ దేశాలు ప్రస్తుతం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా సంపన్నులు, పేద వారి మధ్య అసమానతలు పెరగడానికి దారి తీసిన పరిస్థితుల్లో అభివృద్ధి ఫలాలు అందరినీ చేరుకునేలా విధానాల అమలు విషయంలో అంతర్జాతీయ సహకారానికి నేతలు పిలుపునిచ్చారు. వాషింగ్టన్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం శనివారం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఒబామాతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక మంత్రులు ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు మరింత సహకారాత్మకంగా, కలసికట్టుగా నడవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ ఆర్థిక నమూనా కావాలి అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రసంగిస్తూ... అంతర్జాతీయ సహకారానికి ఉన్న అడ్డంకులను తొలగించుకుని, అందరి కోసం పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక నమూనాను రూపొందించుకోవాలన్నారు. బలమైన, సమగ్ర, సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఐఎంఎఫ్ తన కృషిని కొనసాగించాలని కోరారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు డిమాండ్‌ను పెంచే ద్రవ్య విధానాలు, నిర్మాణాత్మక సంస్కరణల దిశగా పనిచేయాలని సూచిం చారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాతావరణ మార్పులు, శరణార్థి సమస్యలు, దారిద్య్రాన్ని ఎదుర్కొం టున్న దేశాల్లో పెట్టుబడులు వంటి అంశాల పరిష్కారంలో ముందుండాలని ప్రపంచ బ్యాంకును ఒబామా కోరారు. కొద్ది మందికే లబ్ధి: లగార్డ్ ప్రపంచ వృద్ధి దీర్ఘకాలంలో కొద్ది మందికే లబ్ధి చేకూర్చిందని, అసమానతలు ఇప్పటికీ చాలా దేశాల్లో అధిక స్థాయిలో ఉన్నాయని ఐఎంఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టీన్ లగార్డ్ అన్నారు. ఆయా దేశాల్లో వాణిజ్యం అనేది రాజకీయ బంతాటగా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సమగ్ర అభివృద్ధి విధానాల ఆచరణపై దృష్టి పెట్టాలని ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. తక్కువ వృద్ధి, తక్కువ ఉపాధి అవకాశాలు, తక్కువ వేతనాలను తొలగించేలా అవి ఉండాలన్నారు. ‘సమగ్ర అభివృద్ధి కోసం డిజిటల్ యుగానికి మారిపోవాలి. ఆ మార్పుతోనే అందరికీ లబ్ధి కలుగుతుంది. దీన్ని వేగవంతం చేయాలి’ అని లగార్డే పేర్కొన్నారు. వడ్డీ రేట్లు చారిత్రకంగా తక్కువ స్థాయిలో ఉన్నందున హై స్పీడ్ ఇంటర్నెట్, ఇంధన సామర్థ్య రవాణా విధానం, పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు సరైన తరుణమిదేనన్నారు. తక్కువ వడ్డీ రేట్లతో సమస్యలు: జైట్లీ తక్కువ, ప్రతికూల వడ్డీ రేట్లు, బ్యాంకింగ్ రంగంలో రుణాల బలహీనత వల్ల ఎదురయ్యే సమస్యలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. వృద్ధిని వేగవంతం చేసేందుకు రుణ భారం తగ్గించుకుని బ్యాలన్స్ షీట్లు మెరుగుపరుచుకోవాలని కోరింది. ఇష్టారీతన ప్రైవేటు రుణాల జారీ సైతం వృద్ధిపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే విధానపరమైన కార్యాచరణ పటిష్టమవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఐఎంఎఫ్ వేదికగా ప్రపంచ దేశాలకు సూచించారు. ఉత్పత్తి, కార్మిక మార్కెట్ సంస్కరణల ద్వారా లబ్ధి పొందడంతోపాటు రిస్క్ మేనేజ్మెంట్ విధానాలను పటిష్టం చేసుకోవడం, బ్యాలన్స్ షీట్ల ఒత్తిడిని పరిష్కరించుకోవడం వంటివి స్తబ్దుగా ఉన్న వృద్ధిని వేగవంతం చేయడానికి తోడ్పడతాయన్నారు. ‘విదేశీ రుణ నిబంధనలు సులభతరం కావడం, కమోడిటీల ధరలు కోలుకోవడం వంటి వాటి ద్వారా అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ తక్కువ, ప్రతికూల వడ్డీ రేట్ల వంటి విధానాలు, ప్రైవేటు రుణాలు అధిక స్థాయిలో ఉండడం, బ్యాంకింగ్ రంగంలో రుణాల పరంగా బలహీనతలతో ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి సమస్యలు అలానే ఉన్నాయి’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన పనితీరును కనబరుస్తున్నామని, అయినా.. ప్రస్తుతం తాము సాధిస్తున్న వృద్ధి రేటు సరిపోదని చెప్పారు.