మహిళా సమానత్వం ఓ మిథ్య! | Gender inequality persists in all sectors | Sakshi
Sakshi News home page

మహిళా సమానత్వం ఓ మిథ్య!

Published Mon, Aug 26 2024 5:37 AM | Last Updated on Mon, Aug 26 2024 5:37 AM

Gender inequality persists in all sectors

అన్ని రంగాల్లో కొనసాగుతున్న స్త్రీ, పురుష అసమానతలు

నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రమే 

విద్య, వైద్య, చట్ట సభలు.. అన్నింటా వెనుకబాటే! 

ఇది సామాజిక వైఫ్యలం.. కెరీర్స్‌360 వ్యవస్థాపక చైర్మన్‌ మహేశ్వర్‌ పెరి 

ఇది జాతికి మాటలకందని విషాదం. దేశం మరోమారు దారుణమైన హత్యాచారాన్ని చూడాల్సి వచ్చింది. పురుషాధిక్య వృత్తి అయిన  మెడిసిన్‌లో రాణించాలని సాహసించిన ఒక యువతిని నిర్దాక్షిణ్యంగా  చిదిమేశారు. ఎన్నో కలలు, ఎంతో పట్టుదల కలిగిన ఓ పోస్టు గ్రాడ్యుయేట్‌ ట్రైనీ డాక్టర్‌ను అంతమొందించారు. 

మహిళ భద్రత తమ ప్రాధాన్యత  అంటూ.. అధికారంలో ఉన్నవారు ఇచ్చే వాగ్దానాలు, వల్లెవేసే హామీలన్నీ ఒట్టి మాటలేనని మరోమారు రుజువైంది. ఇది ఒక మహిళ, ఒక ప్రొఫెషన్, ఒక దారుణ సంఘటన గురించి కాదు. ఇది మొత్తంగా వ్యవస్థ వైఫ్యలం. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ కీలకమైన స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉందనడానికి నిదర్శనమిది!!  

చట్టసభల్లో అంతంతమాత్రమే 
» మహిళల సమస్యలు, సాధకబాధకాలు అర్థం చేసుకొని సహానుభూతి చూపుతూ వారి సమస్యలను పరిష్కరించేందుకు విధాన నిర్ణయాల స్థాయిలో, చట్టసభల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండాలి. కాని మన దేశంలో అలా జరగడం లేదు.  

» కేంద్ర కేబినెట్‌లో మొత్తం 30 మంది మంత్రులుంటే..అందులో కేవలం ఇద్దరే మహిళలు. చట్టాలు చేసే పార్లమెంట్‌లోనూ అదే పరిస్థితి. లోక్‌సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా.. అందులో మహిళల సంఖ్య 78. అంటే.. కేవలం 14.40 శాతం. రాజ్యసభలో మరీ తక్కువ. ప్రస్తుతం 224 మంది సభ్యుల్లో మహిళలు కేవలం 24(10.70 శాతం).   

మహిళా ఐఏఎస్‌లు కేవలం 13 శాతం.. 
దేశ పరిపాలనలో అత్యున్నత సర్వీస్‌ అయిన ఐఏఎస్‌కు 1951 – 2020 మధ్యకాలంలో.. మొత్తం 11,569 మంది ఎంపికయ్యారు. వారిలో మహిళల సంఖ్య ఎంతో తెలుసా.. కేవలం 1,527 మంది. అంటే.. 13 శాతం మాత్రమే. అదృష్టవశాత్తు తాజాగా 2023 సివిల్స్‌ ఫలితాల్లో మాత్రం 1,016 మంది ఎంపికైతే అందులో 352 మంది (34 శాతం) మహిళలు ఉన్నారు. 

ఈ వివరాలను బట్టి మనకు తెలుస్తోంది ఏమిటంటే.. ప్రభుత్వ విధానాల రూపకల్పన, అమలులో కీలక స్థానమైన ఐఏఎస్‌లో మహిళల సంఖ్య గణనీయంగా పెరగాల్సి ఉంది. ఇక్కడ ఇంకో కోణం చూస్తే.. 6.1 శాతం మంది మహిళా ఐఏఎస్‌ అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే.. పురుష ఐఏఎస్‌ల శాతం 1.6 మాత్రమే. అంటే.. పురుషుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా మహిళా ఐఏఎస్‌లు రాజీనామా చేస్తున్నారు.  
  
2020 గణాంకాల  ప్రకారం.. దేశంలో మొత్తం పోలీసు బలగాల్లో  కేవలం 12 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఇందులోనూ  నిర్ణయాలు తీసుకునే ఉన్నత స్థానాలైన  ఐపీఎస్‌ వంటి పోస్టుల్లో మగువల ప్రాతినిధ్యం కేవలం 8.72 శాతమే.  

వైద్య విద్య, ఆరోగ్య రంగం 
» ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం.. మహిళలు వార్షికంగా సగటున 5.4 సార్లు వైద్యుల వద్దకు వెళ్తే.. పురుషులు మాత్రం 4.1 సార్లు మాత్రమే డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అంటే.. పురుషులతో పోలిస్తే మహిళలకు ఆరోగ్య సేవలు 31 శాతం అధికంగా అవసరమవుతున్నాయి.  

»   ఓఈసీడీ సర్వే ప్రకారం.. 15–64 ఏళ్ల వయసు మహిళలకు పురుషులతో పోలిస్తే 1.3 రెట్లు ఎక్కువసార్లు వైద్యుల సేవలు అవసరమవుతున్నాయి.  

»   మన దేశంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. ఆరోగ్య సేవలను ఉపయోగించుకునే వారిలో 46 శాతం మంది మహిళలు ఉంటే.. పురుషులు 39 శాతమే ఉన్నారు. అదేవిధంగా 88.6 శాతం ప్రసవాలు ఆరోగ్య కేంద్రాల్లోనే జరుగుతున్నాయి. ఈ స్థాయిలో మహిళలకు వైద్యసేవల అవసరం ఉన్న ఆరోగ్య రంగంలో మహిళల ప్రాతినిధ్యం మరీ దారుణంగా ఉంది.  

» దేశంలో మొత్తం వైద్యుల్లో 71 శాతం మంది పురుషులు  ఉంటే.. మహిళలు కేవలం 29 శాతమే ఉన్నారు.  మొత్తంగా డాక్టర్లు, నాయకత్వ స్థాయి, బోర్డు స్థాయిల్లో  17 శాతమే మహిళలు.  

» 1928లో ఏర్పాటైన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ)కు 2024 వరకూ మొత్తం 94 మంది అధ్యక్షులుగా పనిచేస్తే.. వీరిలో కేవలం ఒక్కరే మహిళ. అంతేకాదు.. 2024లో ఐఎంఏ బోర్డులో మొత్తం 17 మంది ఆఫీస్‌ బేరర్లు ఉంటే.. అందులో కేవలం ఒకరే మహిళా ప్రతినిధి. అంటే.. దేశ ఆరోగ్య రంగంలో విధాన రూపకల్పన స్థాయిలో, నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా చాలా తక్కువగా ఉంది.  

»   వైద్య విద్య – 2021 గణాంకాల ప్రకారం.. ఎంబీబీఎస్‌ స్థాయిలో 51 శాతం మంది పురుషులు ఉంటే.. మహిళలు 49 శాతం మంది ఉన్నారు. అదేవిధంగా ఎండీ స్థాయిలో 47 శాతం మంది పురుషులు ఉంటే.. 53 శాతం మంది మహిళలు ఉన్నారు. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా మేఘాలయ, పశి్చమ బెంగాల్, అసోం, రాజస్థాన్, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ఆరోగ్య రంగంలో మహిళల సంఖ్య మరీ తక్కువగా ఉంది.  

క్యాట్‌తో సహా అన్నిటికీ ఇంతే!
ఇక దేశంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు, ఇతర ప్రముఖ బీసూ్కళ్లలో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్యను చూస్తే పురుషులు 64 శాతంగా ఉన్నారు. మహిళలు కేవలం 36 శాతమే. ఇదే ధోరణి దేశంలోని దాదాపు అన్ని వృత్తివిద్యా కోర్సుల పరీక్షల్లోనూ కొనసాగుతోంది.  

మహిళా వీసీలు ఆరు శాతమే
మహిళల సమస్యలను అవగాహన చేసుకునేలా పిల్లలకు అకడెమిక్‌ స్థాయిలోనే చిన్న వయసులోనే బోధన, శిక్షణ ఇవ్వడం ప్రారంభించాలి. ఇది విద్యాసంస్థలతోనే సాధ్యమవుతుంది. అలాంటి యూనివర్సిటీలు, కాలేజీల్లో మహిళల ప్రాతినిధ్యం మరీ దారుణంగా ఉంది. 2015లో దేశంలో మొత్తం యూనివర్సిటీల సంఖ్య 431గా ఉంటే.. అందులో మహిళా వీసీలు కేవలం 13 మంది. అంటే.. 3 శాతం మాత్రమే. 

అదేవిధంగా 2021లో మొత్తం యూనివర్సిటీల సంఖ్య 1,164గా ఉంటే.. అందులో మహిళా వీసీలు 70 మంది (6 శాతం) మాత్రమే. ప్రపంచంలో టాప్‌ 200 యూనివర్సిటీలను చూస్తే.. వీటిలో 50 వర్సిటీలకు మహిళలు వీసీలుగా ఉన్నారు. అంతర్జాతీయంగా 25 శాతం మంది మహిళలు వీసీలుగా ఉంటే.. భారత్‌లో అది కేవలం ఆరు శాతమే.   

చదువుల్లోనూ వెనుకబాటే.. 
ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే డిప్లొమాలు, అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సులు, ఇంజనీరింగ్‌ టెక్నాలజీ ప్రోగ్రామ్స్, పీజీ స్థాయిలో ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కోర్సుల్లో చేరే మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే నేటికీ తక్కువగానే ఉంది.  యూజీ కోర్సుల్లో  52 శాతం మంది అబ్బాయిలు ఉంటే.. అమ్మాయిలు 48 శాతంగా ఉన్నారు. అలాగే డిప్లొమా స్థాయి కోర్సుల్లో బాలురు 64 శాతంగా ఉంటే.. బాలికలు 36 శాతమే ఉన్నారు. 



డిగ్రీ స్థాయి ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కోర్సుల్లో పురుషులు 71 శాతం ఉంటే.. మహిళలు కేవలం 29 శాతం మందే ఉన్నారు. అదేవిధంగా పీజీ స్థాయి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో 68 శాతం మంది పురుషులు ఉంటే.. మహిళల ప్రాతినిధ్యం 32 శాతమే. మొత్తంగా చూస్తే స్టెమ్‌ కోర్సుల్లో చేరే వారిలో అబ్బాయిలు 70 శాతం, అమ్మాయిలు 30 శాతంగా ఉన్నారు.  



ఈ దేశం మహిళలది కాదా..!
పై గణాంకాలను విశ్లేషిస్తే.. భారత్‌ మహిళలది కాదా.. అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ  గణాంకాలు కేవలం అంకెలు, సంఖ్యలు కాదు. ఇది ఒక సమాజంగా మొత్తం మన వైఫల్యం.  ఎందుకంటే.. దేశంలో మహిళలపై దారుణాలు చేస్తూ, వారిని అణగదొక్కుతూ, రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తున్నాం. తమను అణచివేస్తున్న వ్యవస్థను పెంచి పోషిస్తున్న పురుషులనే మళ్లీ మహిళలు తమకు రక్షణ కల్పించమని వేడుకోవాల్సి వస్తోంది. మహిళలపై దారుణం చేసి చంపిన ప్రతిసారీ మనం రోడ్డుమీదకు వచ్చి కన్నీరుకార్చి వారిని రక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాం. 

కాని మనం కోరుతున్న మార్పు రావడం లేదు. ఇది ఇలాగే కొనసాగకూడదు. మహిళలు న్యాయమైన హక్కుల కోసం తమ గళం విప్పాలి. అన్ని రంగాల్లోనూ మహిళలకు భద్రత, ప్రాతినిధ్యం న్యాయమైన హక్కు. దేశంలో ప్రతి మహిళకు గౌరవం దక్కాలి. ఆమె డిమాండ్‌లను వినాలి. ప్రతి మహిళా ప్రభుత్వ కార్యాలయానికి, పోలీస్‌ స్టేషన్‌కు, పార్లమెంట్‌లోకి ధైర్యంగా వెళ్లగలిగి ఇది తనది, తనకు ఇక్కడ సమానమైన హక్కు, ప్రాతినిధ్యం ఉందని విశ్వసించగలగాలి. అప్పుడే ఈ దేశంలో మహిళలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం!!  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement