కరోనాతో కొత్తగా 16 కోట్ల మంది నిరుపేదలు | Over 16 crore more people forced into poverty in two years | Sakshi
Sakshi News home page

కరోనాతో కొత్తగా 16 కోట్ల మంది నిరుపేదలు

Published Tue, Jan 18 2022 4:41 AM | Last Updated on Tue, Jan 18 2022 4:41 AM

Over 16 crore more people forced into poverty in two years - Sakshi

న్యూఢిల్లీ/దావోస్‌: కరోనా సంక్షోభంతో ప్రపంచదేశాలు ఆర్థికంగా కునారిల్లినప్పటికీ అపరకుబేరుల సంపద పెరిగిపోతూనే ఉంది. పేదలు నిరుపేదలుగా మారుతూ ఉండటంతో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ రెండేళ్ల కాలంలో మరో 16 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోయారని పేదరిక నిర్మూలనకు పాటుపడే స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్‌ అధ్యయనంలో వెల్లడైంది.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ దావోస్‌ సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్‌ఫామ్‌ సంస్థ ఆర్థిక అసమానతలపై వార్షిక నివేదిను ‘‘ఇన్‌ఈక్వాలిటీ కిల్స్‌’’పేరుతో విడుదల చేసింది. కరోనా మహమ్మారి బిలియనీర్ల పాలిట బొనాంజాగా మారిందని ఆక్స్‌ఫామ్‌ నివేదిక పేర్కొంది. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక హింస నెలకొంది. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తున్నాయి.

దీని కారణంగా నిరుపేదలు చితికిపోతున్నారు. ఇప్పటికైనా ధనవంతులపై మరిన్ని పన్నులు వేసి వారి సంపదను వెనక్కి తీసుకువస్తే ఎందరి ప్రాణాలనో కాపాడిన వారు అవుతారు’’అని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గాబ్రియెలా బచర్‌ వ్యాఖ్యానించారు.
బిలియనీర్లు జెఫ్‌ బెజోస్, ఎలన్‌ మస్క్, బిల్‌ గేట్స్‌ సహా ప్రపంచంలోని టాప్‌–10 జాబితాలో ఉన్న వారి ఒక్క రోజు సంపాదన దాదాపుగా 130 కోట్ల డాలర్లు (రూ 9,658 కోట్లు) ఉంది.

► ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 10 మంది సంపాదన 70 వేల కోట్ల డాలర్లు (రూ. 52 లక్షల కోట్లు) నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లుకు (రూ. 111 లక్షల కోట్లకు పై మాటే) చేరుకుంది.  
► ప్రపంచంలోని నిరుపేదలైన 310 కోట్ల మంది కంటే ఈ పది మంది ఆరు రెట్లు అధిక సంపన్నులు  
► ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా రోజుకి సగటున 21 వేల మంది ప్రాణాలను తీస్తున్నాయి.


310 కోట్ల మంది నిరుపేదల కంటే   10 మంది కుబేరుల  సంపాదనే ఎక్కువ
భారత్‌లో 84% కుటుంబాల ఆదాయం తగ్గింది
భారత్‌లో కరోనా మహమ్మారి కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేసింది. 2021లో దేశంలోని 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయి ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. అదే సమయంలో కోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రికార్డు స్థాయిలో ఏడాదిలోనే రూ.57.3 లక్షల కోట్లకు (77,500 కోట్ల అమెరికా డాలర్లు) చేరుకుంది. జనాభాలో ఆర్థికంగా దిగువన ఉన్న 50 శాతం జనాభా జాతి సంపదలో 6 శాతం మాత్రమే కలిగి ఉన్నారు.  

► భారత్‌లో కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య ఏడాదిలో 39% పెరిగింది. వందకోట్లకు పైగా ఆస్తి ఉన్న కోటీశ్వరులు 102 నుంచి 142కి పెరిగారు
► భారత్‌లో టాప్‌–10 కోటీశ్వరుల దగ్గరున్న సంపదతో దేశంలో ఉన్న పిల్లలు ప్రాథమిక, ఉన్నత విద్యకూ కావల్సిన నిధులను 25 ఏళ్ల పాటు సమకూర్చవచ్చును. 
► టాప్‌– 10 కోటీశ్వరులు రోజుకు రూ. 7.42 కోట్లు ఖర్చు పెట్టినా... వారివద్ద ప్రస్తుతమున్న ఆస్తి మొత్తం హరించుకుపోవడానికి 84 ఏళ్లు పడుతుంది.  
► కోటీశ్వరుల్లో 10 శాతం మందిపై అదనంగా ఒక్క శాతం పన్ను వసూలు చేస్తే 17.7 లక్షలు అదనంగా ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు.  
► 98 మంది బిలియనీర్లపై ఒక్క శాతం అదనంగా పన్ను వసూలు చేస్తే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఏడేళ్లకు పైగా నడపడానికి నిధులు సమకూరుతాయి.  
► కరోనా సంక్షోభ సమయంలో భారత్‌లో మహిళల్లో 28 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. మూడింట రెండొతుల ఆదాయాన్ని కోల్పోయారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement