Poverty line
-
పేదరికం పై పైకి!
యూకేను దెబ్బతీసిన కోవిడ్, యుద్ధాలు ప్రపంచదేశాలన్నింటి మాదిరిగానే యూకే కూడా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడింది. ఇక అఫ్గానిస్తాన్ యుద్ధం, ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ల మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఫలితంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీని ప్రభావం యూకేపై కూడా పడింది. – గారెత్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్ (కంచర్ల యాదగిరిరెడ్డి): కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని రకరకా లుగా మార్చేసిందనడంలో సందేహం లేదు! ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. కొందరికి కొత్త ఉద్యోగాలు వస్తే.. ఇంకొందరికి ఉన్నవి ఊడిపోయాయి. ఉద్యోగాలు ఉన్నా వేతనాలు తగ్గా యి. ముఖ్యంగా ప్రపంచం మొత్తమ్మీద పేదరికం పెరిగింది. ప్రపంచ బ్యాంకు మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎలా పెరిగింది? ఎందరు పేదలుగా మారిపోయారు? పేదరికం పెంచిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక మంది ఆదాయాలు పడిపోయాయని, ఫలితంగా దేశంలో 10 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే పేదరికం పెరగడం అనేది కోవిడ్ వల్ల మాత్రమే జరిగిన పరిణామం కాదని, లెక్కలు తప్పడం వల్ల నిన్నమొన్నటివరకూ పేదల సంఖ్య స్పష్టంగా ప్రపంచానికి తెలియలేదని ప్రపంచ బ్యాంకు అంటోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన వ్యయాన్ని లెక్కవేయడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పేదలు తక్కువగా ఉన్నట్లు కనిపించిందని, వాస్తవానికి వీరి సంఖ్య చాలా ఎక్కువని, గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కోవిడ్ వచ్చిపడటంతో పేదరికం మరింత పెరిగిపోయిందని చెబుతోంది. ఉద్యోగాలు, ఆదాయంపై ప్రభావం కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవడం తెలిసిందే. అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం ఇది కేవలం ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామందికి ఆదాయం తగ్గింది. మరికొంతమంది ఇళ్లూ కోల్పోయారు. ఫలితంగా పేదరికమూ పెరిగింది. పేదల్లోని దిగువ 40 శాతం మందికి 2021లో సగటు ఆదాయం 6.7 శాతం తగ్గిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో ధనికులైన 40 శాతం మందిలో ఈ తగ్గుదల కేవలం 2.8 శాతం మాత్రమే. కోవిడ్ దెబ్బ నుంచి కోలుకోలేకపోవడం పేదల ఆదాయం తగ్గేందుకు కారణమైంది. అయితే ధనికుల్లో సగం మంది తమ కష్టాల నుంచి బయటపడటం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం యూకేలో కోవిడ్ దాదాపు ఏడు లక్షల మందిని పేదరికంలోకి నెట్టేసింది. కోవిడ్‌కు ముందు జనాభాలో 15 శాతం మంది పేదరికంలో మగ్గుతుండగా.. తదనంతర పరిస్థితుల్లో ఇది 23 శాతానికి చేరుకోవడం గమనార్హం. అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం 2021లో పేదరికంలో ఉన్న జనాభా 11.6 శాతం. అంటే సుమారు నలభై లక్షల మంది. అయితే కోవిడ్ ముట్టడించిన 2020తో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన అంశం. యూరప్ విషయానికి వస్తే, చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైంది. యూరోపియన్ కమిషన్ ప్రాంతంలో సుమారు కోటీ ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు డిబేటింగ్ యూరప్ సంస్థ చెబుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ మూడొంతుల మంది వేతనాలు తగ్గాయి. దీంతో ఇక్కడ కూడా పేదరికం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా లెక్క అలా.. మనది ఇలా రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ పేదలే అని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కోవిడ్ కంటే ముందు ఇంతకంటే ఎక్కువ ఆదాయమున్న వారు కూడా మహమ్మారి కారణంగా పేదలుగా మారిపోయారని అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారి మోతాదు 7.8 శాతం నుంచి 9.1 శాతానికి చేరుకుందని లెక్క గట్టింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కూడు, గుడ్డ, నీడలకు కావాల్సినంత కూడా సంపాదించలేని వారే పేదలు. ఈ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సగటున 1.90 డాలర్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మన దేశంలో ఈ మూడింటితో పాటు ఆరోగ్యం, విద్య కూడా పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా వర్గీకరిస్తున్నాం. భారత్‌లో పేదరికాన్ని కొలిచేందుకు ‘టెండుల్కర్ మెథడాలజీ’ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం మనిషి మనుగడ సాగిచేందుకు కావాల్సిన కనిష్ట మోతాదు కేలరీలకు అయ్యే ఖర్చుతో పాటు, దుస్తులు, నివసించేందుకు పెట్టే వ్యయాన్ని బట్టి పేదలా? కాదా? అన్న వర్గీకరణ జరుగుతుంది. 2021 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే వీరి సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేతీరున లేదు. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగానూ, కేరళ, పంజాబ్ వంటిచోట్ల తక్కువగానూ ఉంది. 2020లోనే పేదల సంఖ్య సుమారు ఏడు కోట్లకు చేరుకుందని రెండు, మూడేళ్లలోనే ఈ సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబతున్నాయి. 16.3 కోట్ల దిగువ మధ్యతరగతి? రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు పేదలైతే..5.5 డాలర్లు సంపాదించేవారిని దిగువ మధ్య తరగతి వారిగా పరిగణిస్తున్నారు. ఈ వర్గీకరణలోకి వచ్చేవారు దేశం మొత్తమ్మీద 16.3 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. పేదరికంపై నడ్జ్ ఫౌండేషన్ పోరు ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లాభాపేక్ష లేని సంస్థ. పేదరిక నిర్మూలన మా లక్ష్యం. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా నడుపుతున్నాం. వీరికోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాల్లో అమలవుతోంది. సమాజ సేవ చేయాలనుకునే సీఈవో, సీఓఓలకూ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారు 30 మంది సీఈవో, సీఓఓలు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రుణాలిచ్చేందుకు, వడ్డీ సబ్సిడీలు కల్పించేందుకు ఆలోచన చేసి అమలు చేయడం వీరు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.– సుధా శ్రీనివాసన్, సీఈవో,ద నడ్జ్ ఫౌండేషన్ -
ఆవిష్కరణ..: పవర్ బుల్స్ సృష్టించారు!
గాలి మార్పు కోసం సొంత గ్రామానికి వెళ్లారు ఈ దంపతులు. గాలిలో మార్పు సంగతి ఏమిటో గానీ... పేదరైతు జీవితంలో మార్పుకు శ్రీకారం చుట్టే యంత్రాన్ని ఆవిష్కరించారు. ‘ఎలక్ట్రిక్ బుల్’ ఇచ్చిన ఉత్సాహంతో సామాన్య రైతుకు ఉపయోగపడే మరిన్ని యంత్రాల రూపకల్పనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు... కోవిడ్ కరకు మేఘాలు దట్టంగా అలుముకున్న రోజులవి. ఎటు చూసినా వర్క్ ఫ్రమ్ హోమ్లే! ‘ఊరెళదామా... కాస్త మార్పుగా ఉంటుంది’ భర్త తుకారామ్‌ను అడిగింది సోనాలి వెల్జలి. ‘ఇది సరిౖయెన టైమ్. కచ్చితంగా వెళ్లాల్సిందే’ అన్నాడు తుకారామ్. మార్పు సంగతి ఏమిటోగానీ, ఊరికెళ్లాలి అనే వారి నిర్ణయం పేదరైతు వ్యవసాయంలో కొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. వృత్తిరీత్యా పుణె(మహారాష్ట్ర)లో నివసించే సోనాలి–తుకారామ్ దంపతులు తమ స్వగ్రామం అందేర్సల్కు వెళ్లారు. పండగలకో, పబ్బాలకో ఊరికి వెళ్లినా... ఇలా వెళ్లి అలా వచ్చేవారు. ఈసారి మాత్రం చాలా తీరిక దొరికింది. ఆ తీరిక ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది. సోనాలి ఏ రైతుకుటుంబాన్ని పలకరించినా ఒకేలాంటి కష్టాలు. పెద్దరైతులు తప్ప రెండెకరాలు, మూడెకరాలు ఉన్న పేదరైతులు యంత్రాలను ఉపయోగించే పరిస్థితి లేదు. అలా అని పశువులు అందుబాటులో లేవు. కూలీల కొరత మరో సమస్య. కూలీలు అందుబాటులో ఉన్నా డబ్బు మరో సమస్య. ఒకరోజు చిన్నరైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి భర్తతో మాట్లాడింది సోనాలి. దంపతులు ఇద్దరూ ఇంజనీర్లే. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకున్న తరువాత వారికి ‘ఎలక్ట్రిక్ బుల్’ అనే ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో రాత్రనకా, పగలనకా ఆ కాన్సెప్ట్‌పై పనిచేయడం మొదలు పెట్టారు. విషయం తెలిసి ఊళ్లో వాళ్లు గుంపులు గుంపులుగా వీరి ఇంటికి వచ్చేవాళ్లు. వారందరూ పేదరైతులే. పనిలో పనిగా తమ సమస్యలను ఏకరువు పెట్టేవాళ్లు. ‘నా పొలంలో ట్రాక్టర్‌లాంటి పెద్ద యంత్రాలను ఉపయోగించడం వీలు కాదు. ఎద్దుల ద్వారా మాత్రమే సాధ్యం అయ్యే వ్యసాయం మాది. కానీ అవి మా దగ్గర లేవు’ అన్నాడు ఒక రైతు. నిజానికి ఇది ఈ రైతు సమస్య మాత్రమే కాదు ఎందరో రైతుల సమస్య. తయారు కాబోతున్న ‘ఎలక్ట్రిక్ బుల్’ గురించి పేదరైతుల ఆసక్తి గమనించిన తరువాత సోనాలి– తుకారామ్లలో పట్టుదల మరింతగా పెరిగింది. వారి కృషి ఫలించి ఎట్టకేలకు ‘ఎలక్ట్రిక్ బుల్’ తయారైంది. సాంకేతిక నిపుణుల బృందం ఈ యంత్రాన్ని పరీక్షించి ఓకే చెప్పింది. పేదరైతులకు అందుబాటు ధరలలో ఉండే ఈ బుల్‌తో విత్తనాలు చల్లడం నుంచి పిచికారి చేయడం వరకు ఎన్నో పనులు చేయవచ్చు. రైతుకు ఖర్చు బాగా తగ్గు తుంది. ఒక్కసారి ఫుల్‌గా రీఛార్జి చేస్తే నాలుగు గంటల పాటు పనిచేస్తుంది. ‘ఆరు, ఏడు మంది కూలీలతో మూడు రోజులలో చేసే పొలం పనిని ఈ యంత్రం ద్వారా గంటల వ్యవధిలోనే పూర్తి చేయగలిగాను. ట్రాక్టర్ కొనలేని, అద్దెకు తెచ్చుకోలేని చిన్న రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అంటున్నాడు సుభాష్ చవాన్ అనే రైతు. పరీక్షదశలో భాగంగా అతడు ఎలక్ట్రిక్ బుల్‌ను ఉపయోగించి ‘శభాష్’ అంటూ కితాబు ఇచ్చాడు. తమ స్టార్టప్ ‘కృషిగటి’ ద్వారా ఎలక్ట్రిక్ బుల్ల అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు సోనాలి–తుకారామ్ దంపతులు. ‘నాలోని ఇంజనీరింగ్ స్కిల్స్ పేదరైతులకు మేలు చేయడానికి ఉపయోగపడినందుకు సంతోషంగా ఉంది. ఎలక్ట్రిక్ బుల్ దగ్గరే ఆగిపోవాలనుకోవడం లేదు. రైతులకు రకరకాలుగా ఉపయోగపడే ఆరు రకాల యంత్రాలను రూపొందించనున్నాం. మన దేశంలోనే కాదు, ఎన్నోదేశాల్లో ఉన్న రైతులకు ఉపకరించే యంత్రాలు రూపొందించాలనేది మా భవిష్యత్ లక్ష్యం’ అంటుంది సోనాలి. -
30 గంటలకు ఒక కొత్త బిలియనీర్
దావోస్: కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అసమానతలు పెరిగిపోయినట్టు ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తెలిపింది. కరోనా కాలంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ (బిలియన్ డాలర్లు అంతకుమించి సంపద కలిగినవారు) కొత్తగా పుట్టుకువచ్చినట్టు చెప్పింది. ఈ ఏడాది ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఈ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా దావోస్‌లో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికకు ‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ (బాధ నుంచి లాభం/కరోనా కాలంలో పేదల కష్టాల నుంచి లాభాలు పొందడం) అని పేరు పెట్టింది. పెరిగిన ధరలతో బిలియనీర్లకు పంట దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయినట్టు తెలిపింది. దీంతో ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు తమ సంపదను ప్రతి రెండు రోజులకు బిలియన్ డాలర్లు (రూ.7,700 కోట్లు) చొప్పున పెంచుకున్నట్టు వివరించింది. 573 మంది కొత్త బిలియనీర్లు కరోనా విపత్తు సమయంలో (రెండేళ్ల కాలంలో) కొత్తగా 573 మంది బిలీయనీర్లు పుట్టుకొచ్చినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దీన్ని ప్రతి 30 గంటలకు ఒక బిలీయనీర్ ఏర్పడినట్టు తెలిపింది. 26 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి ఈ ఏడాది 26.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని అంచనా వేస్తున్నట్టు ఆక్స్‌ఫామ్ ప్రకటించింది. ప్రతి 33 గంటలకు పది లక్షల మంది పేదరికంలోకి వెళ్తారని వివరించింది. 23 ఏళ్ల కంటే రెండేళ్లలో ఎక్కువ కరోనాకు ముందు 23 ఏళ్లలో ఏర్పడిన సంపద కంటే కరోనా వచ్చిన రెండేళ్లలో బిలియనీర్ల సంపద ఎక్కువ పెరిగినట్టు ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ‘‘ఇప్పుడు ప్రపంచంలోని బిలియనీర్ల సంపద విలువ ప్రపంచ జీడీపీలో 13.9 శాతానికి సమానం. 2000లో ప్రపంచ జీడీపీలో బిలియనీర్ల సంపద 4.4 శాతమే’’అంటూ ప్రపంచంలోని అసమానతలను ఆక్స్‌ఫామ్ తన నివేదికలో ఎత్తి చూపింది. ‘‘కార్మికులు తక్కువ వేతనానికే, దారుణమైన పరిస్థితుల మధ్య ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అధిక సంపద పరులు వ్యవస్థను దశాబ్దాలుగా రిగ్గింగ్ చేశారు. వారు ఇప్పుడు ఆ ఫలాలను పొందుతున్నారు. ప్రైవేటీకరణ, గుత్తాధిపత్యం తదితర విధానాల మద్దతుతో ప్రపంచ సంపదలో షాక్‌కు గురిచేసే మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు’’అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఈడీ గ్యాబ్రియెల్ బుచెర్ అన్నారు. ఆకలి కేకలు.. ‘‘మరోవైపు లక్షలాది మంది పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మనుగడ కోసం వారు తదుపరి ఏం చేస్తారన్నది చూడాలి. తూర్పు ఆఫ్రికా వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి ఆకలితో చనిపోతున్నారు. ఈ స్థాయి అసమానతలు మానవత్వంతో మనుషులు కలిసి ఉండడాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఈ ప్రమాదకరమైన అసమానతలను అంతం చేయాలి’’అని బుచెర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఇంధన సంస్థలైన బీపీ, షెల్, టోటల్ ఎనర్జీ, ఎక్సాన్, చెవ్రాన్ కలసి ప్రతి సెకనుకు 2,600 డాలర్ల లాభాన్ని పొందాయని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. రికార్డు స్థాయి ఆహార ధరలతో శ్రీలంక నుంచి సూడాన్ వరకు సామాజికంగా అశాంతిని చూస్తున్నాయని.. 60% తక్కువ ఆదాయం కలిగిన దేశాలు రుణ సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది. సంపన్నుల ఐశ్వర్యం ‘‘2,668 బిలియనీర్ల వద్ద 12.7 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది. ప్రపంచంలో అట్టడుగున ఉన్న 301 కోట్ల ప్రజల (40 శాతం) ఉమ్మడి సంపద కంటే టాప్ 10 ప్రపంచ బిలియనీర్ల వద్దే ఎక్కువ ఉంది. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తి 112 ఏళ్లు కష్టపడితే కానీ.. అగ్రస్థానంలో ఒక వ్యక్తి ఏడాది సంపాదనకు సరిపడా సమకూర్చుకోలేని పరిస్థితి నెలకొంది’’అని ఆక్స్‌ఫామ్ నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాలు ఈ నెల 22న దావోస్‌లో ప్రారంభం కాగా, 26న ముగియనున్నాయి. -
ఫీజు కట్టాల్సిందే.. ఆ మటా ఉత్తిమాటే..!
సాక్షి, నారాయణపేట రూరల్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు ప్రక్రియ ఇటు ప్రభుత్వం ప్రకటించడానికి, అటు అధికారులు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైంది. ఏటా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నోటిఫికేషన్లో వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు మినహాయింపును చేర్చుతూనే వస్తోంది. కానీ నిబంధనల ప్రకారం ఏ ఒక్కరికీ అది ఉపయోగపడటం లేదు. పొంతనలేని వార్షిక ఆదాయం కారణంగా ప్రతి ఒక్కరూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టెన్త్ విద్యార్థులు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 11 రకాలైన విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. వాటిలో సింగారం క్రాస్‌రోడ్డులో ఉన్న సీబీఎస్ఈ విద్యాలయం మినహాయిస్తే మిగితా వాటిలోని పదో తరగతి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ పరీక్షలకు హాజరవుతారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 753 మంది, 70 లోకల్‌బాడీ స్కూల్లలో 5,280, మూడు ఎయిడెడ్ స్కూళ్లలో 102 మంది, 45 ప్రైవేటు పాఠశాలల్లో 1,315 మంది, 11 కేజీబీవీల్లో 504 మంది, ఒక జ్యోతిరావుఫూలే స్కూల్లో 73మంది, రెండు మాడల్ స్కూల్లలో 192 మంది, రెండు మైనార్టీ గురుకులలో 135, ఆరు సోషల్ వెల్ఫేర్‌లో 480, ఒక ట్రైబల్ వెల్ఫేర్‌లో 79మందితో కలుపుకుని మొత్తం 4,354 మంది బాలురు, 4,597 మంది బాలికలతో కలిసి 8,961 మంది టెన్త్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. చదవండి: (రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 706 రోజుల తర్వాత..) వెనకబడిన వారికి మినహాయింపు అన్నిరకాల యాజమాన్య పాఠశాలల్లో ఈ ఏడాది మే 11నుంచి 17వరకు జరిగే టెన్త్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వార్షిక ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయా పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఫీజు చెల్లింపుతో పాటు విద్యార్థి వారి కుటుంబ ఆదాయ ధ్రువపత్రం అందించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.20వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.24 వేలలోపు వార్షిక ఆదాయం నిబంధన విధించడంతో ఏ ఒక్కరికీ ఈ ప్రయోజనం చేకూరడంలేదు. రాష్ట్రంలో ఏ పథకమైనా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఇందుకు గరిష్ఠ ఆదాయం రూ.లక్షకు పైగానే ఉంటుంది. కానీ టెన్త్ విద్యార్థులకు వచ్చేసరికి ఇంత తక్కువగా కేటాయించారు. అయితే గత 30ఏళ్లుగా ఇదే డిజిట్ కొనసాగిస్తున్నారని, 2015 నుంచి మార్చాలని ఎస్ఎస్సీ బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసిన మార్పు జరగడంలేదని తెలుస్తోంది. దీంతో 8,165 మంది వెనకబడిన కులాల విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతుంది. హాస్టల్లో చదువుతున్న వారికి ప్రత్యేకం బీసీ విద్యార్థులు ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న విద్యార్థులకు ఆ శాఖ కమిషనర్ ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కొందరు ఫీజు రాయితీ పొందగలిగారు. మక్తల్ గరŠల్స్‌లో 8, బాయ్స్‌లో 17, ఊట్కూర్ బాయ్స్‌లో 9, మద్దూర్ గరŠల్స్‌లో 14, కన్మనూర్ 5, ధన్వాడ మాడల్ స్కూల్లో 1, నారాయణపేట వైదిక పాఠశాలలో 4 చొప్పున 58మంది, అదేవిధంగా కేజీబీవీల్లో చదువుతున్న మొత్తం 504 మంది బాలికలకు ఫీజు రాయితీ వచ్చింది. కానీ పేరెంట్స్ వార్షిక ఆదాయ ధ్రువపత్రంతో మాత్రం కాదనేది విస్పష్టం. అదేవిధంగా 14 సంవత్సరాల వయస్సు కంటే తక్కువగా ఉన్న వారు మెడికల్ సర్టిఫికెట్తో పాటు రూ.300 చెల్లించి ప్రభుత్వ పరీక్షల విభాగానికి చలాన్ కట్టి జిల్లాలో 55మంది పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత తీసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు ఇలా.. ఏటా అక్టోబర్‌లోనే టెన్త్ పరీక్ష ఫీజు షెడ్యూల్డ్ విడుదల చేసే బోర్డు అధికారులు రెండేళ్లుగా కరోనా కారణంగా ఆలస్యంగా విద్యాబోధన ప్రారంభం కావడంతో ఈసారి సైతం పరీక్ష ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ టెన్త్ బోర్డు గతనెల చివరన విడుదల చేశారు. అయితే రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉండగా సప్లమెంటరీ విద్యార్థులు 3సబ్జెక్టులోపుకు రూ.110, మూడు దాటితే రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు రూ.185 కట్టాల్సి ఉంటుంది. వీటిని సంబందిత హెచ్ఎంలకు ఈనెల 14 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించాల్సి ఉండగా, రూ.50 జరిమానాతో ఫిబ్రవరి 24వరకు చెల్లించాల్సి ఉండింది. ఇక రూ.200తో మార్చి 4వరకు, ఆఖరులో రూ.500 అపరాధ రుసుం చెల్లిస్తే మార్చి 14వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం ఎస్ఎస్సీ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని అన్నియాజమాన్య పాఠశాలల హెచ్ఎంలకు వాటి ప్రతిని అందించాము. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే తప్పకుండా వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కుటుంబానికి రూ.20వేలు, పట్టణాల్లో రూ.24వేలు దాటకూడదు. అలాంటి దరఖాస్తు ఒక్కటి కూడా రాలేదు. కేవలం బీసీ హాస్టల్‌కు చెందిన 58, కేజీబీవీలకు చెందిన 504తో కలిపి 531మంది ఫీజు రాయితీతో పరీక్షకు హాజరవుతున్నారు. – రాజేంద్రకుమార్, జిల్లా పరీక్షల విభాగ అధికారి -
కరోనాతో కొత్తగా 16 కోట్ల మంది నిరుపేదలు
న్యూఢిల్లీ/దావోస్: కరోనా సంక్షోభంతో ప్రపంచదేశాలు ఆర్థికంగా కునారిల్లినప్పటికీ అపరకుబేరుల సంపద పెరిగిపోతూనే ఉంది. పేదలు నిరుపేదలుగా మారుతూ ఉండటంతో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ రెండేళ్ల కాలంలో మరో 16 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోయారని పేదరిక నిర్మూలనకు పాటుపడే స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో వెల్లడైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్‌ఫామ్ సంస్థ ఆర్థిక అసమానతలపై వార్షిక నివేదిను ‘‘ఇన్‌ఈక్వాలిటీ కిల్స్’’పేరుతో విడుదల చేసింది. కరోనా మహమ్మారి బిలియనీర్ల పాలిట బొనాంజాగా మారిందని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక హింస నెలకొంది. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తున్నాయి. దీని కారణంగా నిరుపేదలు చితికిపోతున్నారు. ఇప్పటికైనా ధనవంతులపై మరిన్ని పన్నులు వేసి వారి సంపదను వెనక్కి తీసుకువస్తే ఎందరి ప్రాణాలనో కాపాడిన వారు అవుతారు’’అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియెలా బచర్ వ్యాఖ్యానించారు. బిలియనీర్లు జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, బిల్ గేట్స్ సహా ప్రపంచంలోని టాప్–10 జాబితాలో ఉన్న వారి ఒక్క రోజు సంపాదన దాదాపుగా 130 కోట్ల డాలర్లు (రూ 9,658 కోట్లు) ఉంది. ► ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 10 మంది సంపాదన 70 వేల కోట్ల డాలర్లు (రూ. 52 లక్షల కోట్లు) నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లుకు (రూ. 111 లక్షల కోట్లకు పై మాటే) చేరుకుంది. ► ప్రపంచంలోని నిరుపేదలైన 310 కోట్ల మంది కంటే ఈ పది మంది ఆరు రెట్లు అధిక సంపన్నులు ► ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా రోజుకి సగటున 21 వేల మంది ప్రాణాలను తీస్తున్నాయి. 310 కోట్ల మంది నిరుపేదల కంటే 10 మంది కుబేరుల సంపాదనే ఎక్కువ భారత్‌లో 84% కుటుంబాల ఆదాయం తగ్గింది భారత్‌లో కరోనా మహమ్మారి కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేసింది. 2021లో దేశంలోని 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయి ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. అదే సమయంలో కోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రికార్డు స్థాయిలో ఏడాదిలోనే రూ.57.3 లక్షల కోట్లకు (77,500 కోట్ల అమెరికా డాలర్లు) చేరుకుంది. జనాభాలో ఆర్థికంగా దిగువన ఉన్న 50 శాతం జనాభా జాతి సంపదలో 6 శాతం మాత్రమే కలిగి ఉన్నారు. ► భారత్‌లో కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య ఏడాదిలో 39% పెరిగింది. వందకోట్లకు పైగా ఆస్తి ఉన్న కోటీశ్వరులు 102 నుంచి 142కి పెరిగారు ► భారత్‌లో టాప్–10 కోటీశ్వరుల దగ్గరున్న సంపదతో దేశంలో ఉన్న పిల్లలు ప్రాథమిక, ఉన్నత విద్యకూ కావల్సిన నిధులను 25 ఏళ్ల పాటు సమకూర్చవచ్చును. ► టాప్– 10 కోటీశ్వరులు రోజుకు రూ. 7.42 కోట్లు ఖర్చు పెట్టినా... వారివద్ద ప్రస్తుతమున్న ఆస్తి మొత్తం హరించుకుపోవడానికి 84 ఏళ్లు పడుతుంది. ► కోటీశ్వరుల్లో 10 శాతం మందిపై అదనంగా ఒక్క శాతం పన్ను వసూలు చేస్తే 17.7 లక్షలు అదనంగా ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు. ► 98 మంది బిలియనీర్లపై ఒక్క శాతం అదనంగా పన్ను వసూలు చేస్తే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఏడేళ్లకు పైగా నడపడానికి నిధులు సమకూరుతాయి. ► కరోనా సంక్షోభ సమయంలో భారత్‌లో మహిళల్లో 28 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. మూడింట రెండొతుల ఆదాయాన్ని కోల్పోయారు. -
అత్యంత పేద రాష్ట్రాల జాబితా విడుదల.. అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం కేరళ
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత పేద రాష్ట్రాలు బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు తన తొలి జాతీయ బహుముఖీన పేదరిక సూచిక(ఎంపీఐ) నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం బిహార్ జనాభాలో సగానికి పైగా.. అంటే 51.91 శాతం మంది నిరుపేదలే ఉన్నారు. జార్ఖండ్‌లో 42.16 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37.79 శాతం మంది దారిద్య్రం అనుభవిస్తున్నారు. జనాభాలో 36.65 శాతం మంది పేదలతో నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, 32.67 శాతం మంది పేదలతో ఐదు స్థానంలో మేఘాలయ ఉన్నాయి. ఇక అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో కేరళ(0.71 శాతం), గోవా(3.76 శాతం), సిక్కిం(3.82 శాతం), తమిళనాడు(4.89 శాతం), పంజాబ్(5.59 శాతం) ముందు వరుసలో నిలిచాయి. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలిలో 27.36 శాతం, జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌లో 12.58 శాతం, డయ్యూ డామన్‌లో 6.82 శాతం, చండీగఢ్‌లో 5.97 శాతం మంది పేదలు ఉన్నారు. అతి తక్కువగా పుదుచ్చేరిలో 1.72 శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారు. లక్షద్వీప్‌లో 1.82 శాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో 4.30 శాతం, ఢిల్లీలో 4.79 శాతం మంది పేదలు ఉన్నట్లు తేలింది. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రజల సంఖ్యలోనూ బిహార్‌దే అగ్రస్థానం కావడం గమనార్హం. దేశంలో బహుముఖీన పేదరిక సూచికను తయారు చేయడానికి ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి చేసిన మెథడాలజీని ఉపయోగించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ఆధారంగా తీసుకున్నట్లు తెలిపింది. -
2030 నాటికి దారిద్య్రంలోకి మరో 20.7 కోట్ల మంది
ఐక్యరాజ్యసమితి: కరోనా వైరస్ దీర్ఘకాలంగా కొనసాగుతూ ఆర్థిక రంగంపై తీవ్రంగా చూపిస్తున్న ప్రభావం వల్ల 2030 నాటికి అదనంగా మరో 20.7 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి పడిపోతారని ఐక్యరాజ్య సమితి తాజా అధ్యయనం వెల్లడించింది. వీరిలో మహిళల సంఖ్య 10.2 కోట్లు ఉంటుందని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం నిరుపేదల సంఖ్య 100 కోట్లు దాటిపోతుందని ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) నివేదికలో తెలిపింది. కోవిడ్ వివిధ దేశాలపై చూపిస్తున్న ప్రభావం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దెబ్బ తీస్తున్న విధానం వంటివి వచ్చే దశాబ్ద కాలంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఆ అ«ధ్యయనం అంచనా వేసింది. వచ్చే పదేళ్లలో 4.4 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు వెళతారని గతంలో ఐఎంఎఫ్ అంచనా వేసింది. తాజాగా యూఎన్డీపీ అన్ని కోణాల నుంచి సమాచారాన్ని సేకరించి, విశ్లేషణ చేసి అదనంగా 20.7 కోట్ల మంది పేదరికంలోకి వెళతారని, కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం మరో పదేళ్లు ఉంటుందని యూఎన్డీపీ అధ్యయనం అంచనా వేసింది. ప్రపంచ దేశాలన్ని కలసికట్టుగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు డిజిటలైజేషన్, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత రంగాల్లో పెట్టుబడుల్ని పెంచితే 14.6 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకురావచ్చునని తెలిపింది. -
యాప్‌తో ఉద్యోగం
అక్షర జ్ఞానాన్ని ఇస్తే గురువని, ఆర్థిక సహాయం చేస్తే దాత అని, ఆపదలో ఉన్నవాళ్లని ఆదుకుంటే దేవుడని అంటారు. ‘‘ఈ కరోనా కాలంలో సోనూ సూద్ మా పాలిట దేవుడు’’ అని పలువురు వలస కార్మికులు అంటున్నారు. ప్రత్యేక బస్సుల్లో వలస కార్మికులు తమ తమ ప్రాంతాలకు వెళ్లే ఏర్పాటు చేశారు సోను. కొందరినైతే ఏకంగా ఫ్లయిట్లో కూడా పంపించారు. ఇప్పుడు సహాయంపరంగా ఇంకో మెట్టు ఎక్కారు. కరోనా కారణంగా చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారందరి కోసం సోనూ సూద్ ఓ కొత్త æయాప్‌ను తయారు చేయించారు. ఈ యాప్ ద్వారా అవసరంలో ఉన్నవారి అర్హతలను బట్టి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ‘‘అర్హులందరికీ తప్పకుండా ఈ యాప్‌తో సాయం అందుతుంది’’ అంటున్నారు సోనూ సూద్. -
బీపీఎల్ కుటుంబాలకే ఇళ్ల స్థలాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల స్థలాల పంపిణీకి దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలనే అర్హులుగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రాష్ట్రంలో ఇళ్లు లేనివారందరికీ సంతృప్త స్థాయిలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి దశలవారీగా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే.. దీన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు లబ్ధిదారుల ఎంపికతోపాటు కొన్ని నిబంధనలను మార్చాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ఆగకుండా కొనసాగించడంలో భాగంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం నిబంధనలను ప్రభుత్వం స్వల్పంగా సవరించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసినందున కొత్త నిబంధనల ప్రాతిపదికగా వారి జాబితాను పునఃపరిశీలించి.. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలనే ఎంపిక చేసి జాబితాను సవరించనున్నారు. అనంతరం సవరించిన జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మార్చిన నిబంధనలతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉషారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నివాస స్థలం పట్టా ధర రూపాయే.. ► పేదలకు ఇచ్చే స్థలం పట్టా ధరను రూపాయిగా నిర్ణయించారు. కన్వేయన్స్ డీడ్ రూపంలో ఇవ్వదలిచినందున స్టాంప్ పేపర్‌కు రూ.10, లామినేషన్‌కు రూ.10 కలిపి రూ.21గా ఖరారు చేశారు. ► కొత్త నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలను విక్రయించడానికి వీలుకాదు. ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఐదేళ్లు నివాసం ఉన్న తర్వాత అత్యవసరమైతేనే వేరే వారికి విక్రయించవచ్చు. ► పేదల పట్టాలను కన్వేయన్స్ డీడ్ రూపంలో ఇవ్వనుంది. డూప్లికేషన్ లేకుండా చేయడం, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా చేయడం కోసమే ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. -
కొత్త రేషన్ కార్డులేవీ?
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల (ఆహార భద్రత) కోసం లబ్ధిదారుల పడిగాపులు తప్పడం లేదు. ప్రభుత్వం ఇటీవల కార్డులు జారీ చేస్తామని ప్రకటించడంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని నాలుగు నెలలు దాటినా ఇంతవరకు ఒక్కరికీ కొత్త రేషన్‌కార్డు జారీ కాలేదు. విచారణ దశలోనే దరఖాస్తులు మగ్గిపోతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో రెవెన్యూ అధికారులు గత తీరికలేకుండా ఉండటంతో కార్డుల మంజూరు, దరఖాస్తుల వెరిఫికేషన్ మరుగున పడింది. ఈ ప్రక్రియను పూర్తిచేయడంలో జాప్యం కారణంగా దాదాపు 90 శాతం దరఖాస్తులు మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా రేషన్ సరుకులు అందక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అన్నీ పరిశీలన దశలోనే.. - ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా మొత్తం 26,080 దరఖాస్తులు గ్రామ స్థాయి రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరిశీలనలోనే ఆగిపోయాయి. మరో 11,522 దరఖాస్తులు తహసీల్దార్ల పరిశీలనలో, 993 దరఖాస్తులు అసిస్టెంట్ కమిషనర్ పరిశీలనలో, 1,768 దరఖాస్తులు డీఎస్ఓ పరిశీలనలో ఉన్నాయి. - ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 23,511 దరఖాస్తులు రాగా జిల్లా సివిల్ సప్లైస్ అధికారులకు కేవలం 148 దరఖాస్తులు (హార్డ్ కాపీలు) మాత్రమే చేరాయి. వాటిని ఓకే చేసి కమిషనరేట్‌కు పంపించారు. మిగతావి వివిధ దశల్లో రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. - ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 39,795 కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా 31,908 దరఖాస్తులను అధికారులు పరిశీలించాల్సి ఉంది. - ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 42,188 దరఖాస్తులు వచ్చాయి. అందులో 32,030 దరఖాస్తులు విచారణలో ఉన్నాయి. - ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 29,539 దరఖాస్తులు రాగా వాటిలో 28,713 మండల స్థాయిలో, మిగతా దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. - ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఈ ఏడాది కొత్త కార్డులకు, మార్పుచేర్పుల నిమిత్తం 28,777 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయి. తహసీల్దార్ల వద్ద, డీఎస్ఓ, కమిషనరేట్ పరిధిలో 27,845 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 932 దరఖాస్తులకు మోక్షం లభించింది. - ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 83,536 దరఖాస్తులు రాగా అందులో 83,412 దరఖాస్తులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. మిగతా వాటిలో కొన్ని ఆమోదం పొందగా మరికొన్నింటిని తిరస్కరించారు. - ఉమ్మడి వరంగల్ జిల్లాలో 27,294 దరఖాస్తులు వస్తే 23,175 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. - ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో 81,386 దరఖాస్తులు రాగా అందులో 68,816 దరఖాస్తులను అధికారులు పరిశీలనలోకి తీసుకున్నారు. వాటిలో 8,406 దరఖాస్తులకు ఆమోదం లభించగా 60,410 పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగేళ్లుగా ఎదురుచూపు నాకు గతంలో రేషన్ కార్డు ఉండేది. ఆన్లైన్ విధానం వచ్చాక దాన్ని తొలగించడంతో సరుకులు రావడం లేదు. దీంతో కొత్త రేషన్ కార్డు కోసం 2014 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ కార్డు రాలేదు. మూడు నెలల కిందట మీ–సేవ ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ అదే పరిస్థితి. – బూర్ల వెంకటేష్, దండేపల్లి, మంచిర్యాల జిల్లా రెండుసార్లు దరఖాస్తు చేసిన నాకు రేషన్ కార్డు లేదు. గతంలో తల్లిదండ్రులతో 2002లో ఇచ్చిన కార్డులో నా పేరు ఉంది. నాకు మూడేళ్ల క్రితం పెళ్లి కావడంతో భార్యాపిల్లలతో వేరుగా ఉంటున్న. ఇప్పటివరకు రెండుసార్లు రేషన్ కార్డు కోసం తహసీల్దార్ కార్యాలయంలో, మరోసారి మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటివరకు రేషన్ కార్డు ఇవ్వలేదు. – రౌతు రాజేందర్, మోతుగూడ, ఆసిఫాబాద్ మండలం అంతా ఆన్లైన్లోనే.. రేషన్ కార్డుల మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం విచారణ జరిపి రేషన్ కార్డు జారీ చేస్తున్నాం. ఒక్కోసారి ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇబ్బందులు వస్తున్నాయి. – కష్ణప్రసాద్, డీఎస్ఓ, నిజామాబాద్ -
నాన్నకు చేదోడుగా.. నాగలి లాగుతూ..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతు కష్టం చూస్తే మనస్సు చలించకమానదు. తనకున్న వ్యవసాయ భూమిని దున్నడానికి ట్రాక్టర్ని గానీ, ఎద్దులను గానీ అరువు తెచ్చకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఆ రైతుది. కుటుంబ పరిస్థితులు తెలిసిన అతని ఇద్దరు కూతుర్లు చిన్నవాళ్లే అయిన తండ్రికి చేదోడుగా నిలిచారు. ఎలాగైనా పొలం సాగుచేసి వచ్చే పంటతో కొంతైనా తమ కష్టాలు తీర్చుకోవాలనే ఆశతో తండ్రితో పాటు పొలం చేరారు. అంతేకాకుండా తండ్రికి సాయంగా నాగలిని చెరోవైపు లాగుతూ భూమిని చదును చేశారు. ఝాన్సీ జిల్లాలోని బాడ్గాన్కు చెందిన 60 ఏళ్ల అచేయ్లాల్ ఓ పూరి గుడిసెలో దారిద్ర్యరేఖకు దిగువన జీవనం సాగిస్తున్నాడు. ఓ వైపు వ్యవసాయంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం.. మరోవైపు అధిక సంతానం అతని కుటుంబాన్ని దుర్భర పరిస్థితుల్లోకి నెట్టాయి. అచేయ్లాల్కు ఆరుగురు ఆడపిల్లలు కావడంతో వారి పెళ్లిళ్లు చేయడం ఓ సామాన్య రైతుగా అతనికి తలకు మించిన భారంగా మారింది. అయినప్పటికి బతుకు మీద ఆశతో కాలంతో పోరాడుతూ.. నలుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. మిగిలిన ఇద్దరు కూతుళ్లలో రవీనా 8వ తరగతి, శివాని 7వ తరగతి చదువుతున్నారు. బడికి సెలవుల సమయంలో బాలికలిద్దరు పొలం చేరి తండ్రికి సహాకరించారు. వర్షాలు బాగా పడి.. మంచి పంట రావాలని వారు కోరుకుంటున్నారు. తాము ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదని ఆ బాలికలు చెబుతున్నారు. పేదరికంలో ఉన్న అచేయ్లాల్కు 1.5 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. అతని కుటుంబం ధరించే దుస్తులు కూడా గ్రామస్థులు దానం చేసినవే. అంత దుర్భర జీవితం గడుపుతున్న ఆ కుటుంబం.. బీదలకు ప్రభుత్వం అందించే ఇళ్ల నిర్మాణ పథకంలో తమను లబ్ధిదారులుగా చేర్చాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. -
దారిద్య్ర రేఖకు దిగువన 2.74 కోట్ల మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) 2.74 కోట్ల మంది ప్రజలున్నారని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర నిబంధనల ప్రకారం ఈ సంఖ్య తక్కువ ఉందని, కానీ రాష్ట్రంలో ఉదారంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ ఉదారంగా సాయం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా బీపీఎల్ సంఖ్యను నిర్ధారించామన్నారు. 2 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ రేషన్ కార్డులు కేవలం బియ్యం కోసమేనన్నారు. వరుసగా మూడు నెలలు బియ్యం తీసుకోని వారి కార్డులు రద్దవుతున్నాయన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. అయితే బియ్యం తీసుకోబోమని ఎవరైనా తమకు విన్నవిస్తే.. ఆయా కార్డులపై ఒక స్టాంప్ వేసి అవి రద్దు కాకుండా చూస్తామని చెప్పారు. వారం పది రోజుల్లో పూర్తి చెల్లింపులు.. రబీలో రికార్డు స్థాయిలో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఈటల తెలిపారు. వారం రోజుల్లోగా చివరి గింజ వరకూ రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. వారం పది రోజుల్లోగా కొన్న ధాన్యానికి పూర్తిస్థాయిలో చెల్లింపులు జరుపుతామన్నారు. డీలర్లకు కమీషన్ పెంచే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
అప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్టు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 28 శాతం ప్రజలు ఆర్థికంగా ఎదిగినప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్లని టీఆర్ఎస్ సభ్యుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనుసరిస్తున్న తీరు చూస్తుంటే సమీప భవిష్యత్తులో అది సాధ్యపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం శాసనసభలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక పట్టణాలకు పెద్ద సంఖ్యలో వలస వచ్చారని, కాని వారికి అక్కడా జీవనోపాధి సరిగ్గా దొరక్క మురికివాడలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. జాతీయ సగటు (37 శాతం) కంటే ప్రస్తుతం తెలంగాణ పట్టణా జనాభా (39 శాతం) ఎక్కువగా ఉందని, కొత్త నగర పంచాయితీలు, పురపాలక సంఘాలు ఆవిర్భవిస్తే అది 45 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. -
జీవించే హక్కుకు దిక్కెవరు?
దేశ సేవంటే పేదరికాన్నీ, నిరక్షరాస్యతనూ, ఆరోగ్య నిర్భాగ్యాన్నీ, ఆర్థిక అసమానతలనూ రూపుమాపటమేనని నెహ్రూ అభిప్రాయపడ్డారు. ముందుతరాలు రాజ్యాంగ వైఫల్యాన్ని ఎత్తిచూపితే అందుకు కారణం రాజ్యాంగం కాదనీ, దాని అమలుకై గద్దెనెక్కిన శక్తులేననీ అంబేడ్కర్ హెచ్చరించారు. ఒక గొప్ప వ్యవస్థను రూపొందించుకుని, మనకు మనం సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగం దశాబ్దాలు గడచినా సజావైన అమలుకు నోచుకోక పోవటం బాధాకరం. మరో గణతంత్ర దినోత్సవానికి దేశం సిద్ధమవుతోంది. ఎర్రకోట సాక్షిగా మాటలు కోటలు దాటి జనాన్ని ముంచెత్తుతాయి. అద్భుతాలు జరుగుతాయని అరవయ్యేళ్లుగా ఎదురుచూస్తున్న జనం తమవి పగటి కలలేనని మరోమారు పెదవి విరుస్తారు. ప్రజలు నిర్లిప్తంగా, నిస్తేజంగా జీవించేందుకేనా ఒక మహత్తర రాజ్యాంగం నిర్మితమైంది? రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులతో తమ తలరాతలు మారిపోతాయని ఆశించే ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీ కాదా? మానవ హక్కుల, ప్రాథమిక హక్కుల పరిరక్షణలే ప్రాతిపదికగా మన గణతంత్ర వ్యవస్థలో రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు తమ పాత్రను ఏ మేరకు అర్థవంతంగా పోషిస్తున్నాయి? ఓట్లు వేసి ఏలికలనెన్నుకునే ఓటున్న మారాజులు ప్రభుత్వాల పనితీరుని సమీక్షించుకోవలసిన అవసరముంది కదా! 1948 నాటి విశ్వజనీన సమాన హక్కుల పత్రం మనిషి జన్మతః స్వేచ్ఛాప్రియుడనీ, సమభావన, సమానావకాశాలతో ఎదగడానికి వ్యక్తి స్వేచ్ఛను సభ్యదేశాలు కాపు కాయాలనీ పేర్కొనగా, ఇదే పత్రం అనేకానేక పౌర, రాజ కీయ హక్కులను మానవ హక్కులుగా నిర్ధారించింది. భారత రాజ్యాంగం సైతం దాదాపు మానవ హక్కులన్నింటినీ ప్రాథమిక హక్కులనే పేరిట పౌరులకు హామీ ఇచ్చి, వీటి అమలుకు ప్రభుత్వాన్నే జవాబుదారీ చేసింది. జనమంతటికీ కూడూ, గూడూ కల్పించడం జీవించే హక్కుకు పునాది కాగా ఈ హక్కు కల్పనతో సర్కారీ వైఫల్యాలు మనలని నివ్వెరపరుస్తున్నాయి. మానవ హక్కులను కాలరాసి జనం తలరాతలని తారుమారు చేసే ఏలికల గుణగణాలను ఈ సందర్భంగా తర్కించుకోవాలి. శాంతి స్టార్ బిల్డర్స్ కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం కూడూ గూడూ ప్రజలకు ఇవ్వలేని ప్రభుత్వ పాలనలో రాజ్యాంగం విఫలమైనట్టేనని వ్యాఖ్యానించింది. ఈ తీర్పు తరువాత పదిహేడేళ్ల కాలంలో పరిస్థితి ఎలా ఉంది? దారిద్య్ర రేఖ దిగువ దృశ్యం ప్రపంచంలోని 119 ఆకలి పీడిత దేశాల జాబితాలో భారత్ నూరవ స్థానంలో ఉంది. అన్నపూర్ణ వంటి మన దేశంలో 194 మిలియన్ల ప్రజలు పస్తుల పాలవుతున్నారు. అంతర్జాతీయ పేదరిక సూచీ (2013)లో భారత్ స్థానం ప్రముఖంగానే ఉంది. జనాభాలో 30 శాతం దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. సవరించిన ప్రమాణాల ప్రాతిపదికగానే 2012 నాటికి జనాభాలో 20.6 శాతం దారిద్య్ర రేఖకు కింద ఉన్న వారితో చేరారు. 2011–2012 నాటికి జనాభా పద్దులో 12.4 శాతం దరిద్ర నారాయణులే. 2013 అంతానికి గూడు కరువైన భారతీయులు 78 మిలియన్లు. 11 మిలియన్లు జనం రోడ్లు, ప్లాట్‌ఫారాల మీద బతుకులు వెళ్లదీస్తున్నారు. 10.78 మిలియన్ల నివాస గృహాల కొరత ఉందని కేంద్రమే తేల్చింది. ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని నిరుద్యోగం 8.3 శాతం (1983) నుంచి 3.46 శాతానికి (2016) తగ్గినట్టు కాకి లెక్కలు వేసినా ఇదంతా వాపేననీ, బలుపు కాదనీ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలతో మూతపడుతున్న పరిశ్రమలు ఉపాధికి గండికొట్టాయనీ, 2016లో 17.7 మిలియన్లుగా ఉన్న ఉద్యోగ భద్రత లేని చిరుద్యోగులు, వచ్చే రెండేళ్లలో 18 మిలియన్లు దాటిపోతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ జోస్యం చెప్పింది. ఏతావాతా ప్రైవేటు, పారిశ్రామిక రంగాలలో ఉపాధి పొందుతున్న 475 మిలియన్ల బడుగుజీవులకు గాను 400 మిలియన్లకు ఉద్యోగ భద్రత నాస్తి. ఇదిలా ఉండగా ప్రపంచ ఆహార భద్రతా నివేదిక ప్రకారం (2017) దేశంలో 190.7 మిలియన్ల ప్రజలకు పోషకాహార సరఫరా లేదు. 51.4 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతుండగా, 30 శాతం నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఎదిగే బాలలు పౌష్టికాహార లేమి కారణంగా రోజూ 3,000 మంది అసువులు బాస్తున్నారు. 65 మిలియన్ల జనం మురికివాడలలో మగ్గుతుంటే వీరిలో 17 శాతం దాకా పట్టణాలలో జీవిస్తున్నారు. కేటాయించిన సబ్సిడీ ఆహారంలో సగం పైగా అర్హులకు చేరడం లేదు. 410 మిలియన్ల బతుకులు ఒక్కపూట, అరకొర తిండితో గడుస్తున్నాయి. ఆకలిచావులు సాధారణమైపోయాయి. ఇదీ వర్తమాన భారతం. ‘వెలిగిపోతోంద’ని నమ్మబలికిన మన దేశంలో కోట్లాది ఓటర్ల జీవించే హక్కు పట్టపగలు దోపిడీకి గురవుతుండగా మానవ హక్కులను రక్షిస్తున్నామని మనకి మనం కితాబిచ్చుకుంటామా? వేల కోట్లు గుమ్మరించి ఎన్నికల ప్రక్రియ ద్వారా మనం ఏలికలనెన్నుకోవడం ఎవరి ప్రయోజనం కోసం? కనీస అవసరాలు తీర్చమని ప్రభుత్వాన్ని అడుక్కోవలసిన దుస్థితి ఎందుకు దాపురిస్తోంది? ఆ చురకలు అవమానం కాదా? ప్రభుత్వ పరంగా మానవహక్కుల చట్టం, ఆ చట్టం అమలు కోసం దేశ వ్యాప్తంగా హక్కుల కమిషన్, ఉపా«ధి హామీ కోసం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం, విద్యా హక్కు చట్టం వంటివి అమలులోకి తెచ్చినా, ఈ చట్టాలూ, ఈ పథకాల అమలు తీరుతెన్నుల మీద నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా దేశ న్యాయవ్యవస్థ అనేక సందర్భాలలో ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం మీద చురకలు వేయడం, సజావైన ప్రజా పాలన కోసం కోర్టులు సూచనలు ఇవ్వడం ప్రభుత్వానికి తలవంపులు కాదా? బతికే హక్కు అర్థవంతంగా ఉండాలనీ, ‘మృగజీవనం’ కారాదనీ జస్టిస్ భగవతి ఫ్రాన్సిస్ కొరాలీ కేసులో స్పష్టం చేశారు. రాజ్యాంగపు 21వ అధికరణాన్ని విశ్వజనీన మానవహక్కు పత్రంలోని 5వ ఆర్టికల్ తోనూ, అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల అవగాహనలోని 7వ ఆర్టికల్తోనూ అనుసంధానించి జీవించే ప్రాథమిక హక్కును నిర్వచించిన 80వ దశకపు ఫ్రాన్సిస్ కొరాలీ తీర్పు తర్వాతి కాలంలో రాజ్యాంగ ధర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మహిళలూ, బాలల రక్షణ, సంక్షేమం ప్రభుత్వ విధిగా పేర్కొన్న హుస్సేనీరా ఖాటూన్ తీర్పు తర్వాత కూడా విచారణ ఖైదీల అంశంలో సరైన సంస్కరణలు చేపట్టలేదు. దేశంలోని 1,387 జైళ్లలో 68 శాతం అండర్‌ట్రయల్ ఖైదీలే. వీరిలో 40 శాతం ఆర్నెల్లకు పైబడి బందీలుగా కాలం గడిపేశారు. వీరిలో సగంపైగా జామీనుదార్లను సమర్పించుకోలేని నిస్సహా యులే. వీరందరి జీవించే హక్కును చట్టం సాక్షిగా చట్టుబండలు చేయడం ప్రాథమిక హక్కులకు పాతర వేయడమే కదా! చదువుకోవటం ప్రాథమిక హక్కు. ప్రభుత్వం అందరికీ విద్యావకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు 1992లో మోహినీజైన్ కేసులో ప్రకటించింది. ఏళ్లూ పూళ్లూ గడిపి చట్టం తెచ్చినప్పటికీ అమలులో మాత్రం ప్రభుత్వం నీరసిం చింది. 2011 జనాభా లెక్కల రీత్యా 78 లక్షలమంది బాలలు బతుకుతెరువుకోసం బరువులెత్తుతుంటే, 8.4 కోట్లమంది చిన్నారులు స్కూళ్లకు వెళ్లలేని దురదృష్టవంతులు. ఉపాధి కోసం శ్రమించే చిట్టితల్లులు 43 శాతమైతే, బాలురు 57 శాతం. 2016 వార్షిక విద్యా సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ భారతంలో 11–14 ఏళ్ల లోపు 3.5 శాతం, 15–16 ఏళ్లలోపు 13.5 శాతం బాలలున్నారు. వీరిలో 25 శాతం పాఠశాల చదువుకు అర్ధాంతరంగా మంగళం పాడేస్తున్నారు. 14 ఏళ్లలోపు చిన్నారులను శ్రమకు గురిచేయడం వారి బాల్యాన్ని దోపిడీ చేయడమవుతుందని ఇటు భారత రాజ్యాంగమూ, అటు పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తున్నప్పటికీ, బాలల హక్కులను దోపిడీకి గురిచేయడం, రాజ్యాంగ వ్యవస్థ మన్నుతిన్న పాములా మిన్నకుండిపోవటం తన వైఫల్యం కాదని ప్రభుత్వం దబాయించగలదా? ‘బాండెడ్ లేబర్’అరాచకత్వాన్ని రూపుమాపాలని బంధు ముక్తి మోర్చా కేసు (1983)లో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి తాఖీదునిచ్చింది. అయితే 1978–2015 మధ్యకాలంలో కట్టు బానిసల పునరావాసానికై విడుదల చేసిన రూ. 81.826 కోట్లలో సగంపైగా నిధుల్ని రాష్ట్రాలు వాపసు చేసినట్లు మే 2016లో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ నివేదిక వెల్లడించింది. ఇదీ మన అధికార యంత్రాంగపు నిర్వాకం. మరణశయ్య మీద ఆరోగ్యం ఇక ఆరోగ్య హక్కు అనారోగ్యం పాలై మరణశయ్య ఎక్కింది. ఆరోగ్య హామీకి ప్రభుత్వం పూచీకత్తు నివ్వకపోవటం మానవ హక్కులకు గండి కొట్టటమేనని జాతీయ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయం. సుప్రీంకోర్టు సైతం ఈ దిశలో కొన్ని తీర్పులిచ్చింది. విన్సెంట్–పనికుర్లంగార కేసు (1987)లో జస్టిస్ రంగనాథ మిశ్రా ఆరోగ్యం మహా భాగ్యాన్ని ప్రాథమిక హక్కుగా ప్రస్తావిం చగా, మహీందర్ సింగ్ చావ్లా కేసులో (1996) జస్టిస్ రామస్వామి, పట్నాయక్ల ధర్మాసనం, ఈ హక్కును పటిష్టంగా ప్రభుత్వం అమలు చేయాలని వక్కాణించింది. అయితే 2000–01లో జీడీపీలో ఒక్క శాతం కూడా ఆరోగ్య హక్కు కోసం కేటాయింపు చేయలేని కేంద్రం 2009–10కి ఈ పద్దుకింద ఖర్చు అంచనాను 1.45 శాతంగా నిర్ధారించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం 1999–2002 కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ, ప్రాదేశిక పాలనా సంస్థలూ జీడీపీలో కేవలం 1.3 శాతమే ఆరోగ్యం కోసం వెచ్చించాయని వెల్ల డించింది. పేద దేశాలుగా పేరొందిన ఆఫ్రికా దేశాల్లోనే జీడీపీలో 3 శాతంపైన ఆరోగ్యం ఖాతాలో ఖర్చు రాయడం విశేషం. కేంద్రం ఇటీవల వెలువరించిన 2017 నాటి జాతీయ ఆరోగ్య పాలసీలో జీడీపీలో 2.5 శాతం మొత్తాన్ని ప్రజారోగ్యం పద్దుకు కేటాయించాలని సంకల్పించింది. దీంతో దేశం ఆరోగ్యకరమైన జనాభాతో కిక్కిరిసిపోతుందని మురిసిపోతోంది. దేశంలోని 12,760 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిపడా మంచాలే లేవు. పెరిగే రోగులకు ఆసుపత్రులూ, వైద్యులూ, వైద్య నిపుణులూ, సహాయ సిబ్బంది, పరికరాల లేమీ కొట్టొచ్చినట్లున్న దుస్థితిలో నిధుల లేమి మాయదారి రోగంగా సంతరించుకోవటం ఆరోగ్య దౌర్భాగ్యానికి నిలువెత్తు నిదర్శనం. దేశ సేవంటే పేదరికాన్నీ, నిరక్షరాస్యతనూ, ఆరోగ్య నిర్భాగ్యాన్నీ, ఆర్థిక అసమానతలనూ రూపుమాపటమేనని నెహ్రూ అభిప్రాయపడ్డారు. ముందుతరాలు రాజ్యాంగ వైఫల్యాన్ని ఎత్తిచూపితే అందుకు కారణం రాజ్యాంగం కాదనీ, దాని అమలుకై గద్దెనెక్కిన శక్తులేననీ అంబేడ్కర్ హెచ్చరించారు. ఒక గొప్ప వ్యవస్థను రూపొందించుకుని, మనకు మనం సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగం దశాబ్దాలు గడచినా సజావైన అమలుకు నోచుకోకపోవటం బాధాకరం. వెలుగులు విరజిమ్మే భారత్‌ను ఆవిష్కరించడం కోసం రాజ్యాంగ సందేశాల్ని తు.చ. తప్పకుండా అమలు చేయాలనీ మరోసారి నేతలూ, ప్రజలూ గుర్తు చేసుకోవాలి. (రేపు గణతంత్ర దినోత్సవం) - వేదాంతం సీతారామావధాని వ్యాసకర్త భారత సుప్రీంకోర్టు మాజీ సెక్రటరీ జనరల్ ఈ–మెయిల్ : sitharam.avadhani@gmail.com -
‘అన్నభాగ్య’పై అసంతృప్తి
నాణ్యతలేని క్షీరభాగ్య పౌరసరఫరాల శాఖ సర్వేలో వెల్లడైన విషయాలు బెంగళూరు: ప్రభుత్వం అమలుచేస్తున్న అన్నభాగ్య, క్షీరభాగ్య పథకాలపై ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. అన్నభాగ్యలో భాగంగా పేదలకు అందజేస్తున్న ఆహారపదార్థాలు పేదలకు ఏ మాత్రం సరిపోవడం లేదు, అంతేకాదు క్షీరభాగ్యలో భాగంగా విద్యార్థులకు అందజేస్తున్న పాలలో నాణ్యతా లోపం కారణంగా చిన్నారులు తాగలేని పరిస్థితి ఏర్పడింది. 2015-16 ఏడాదికి అన్నభాగ్య, క్షీరభాగ్య అమలు విషయమై డెరైక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు 70 శాతం మంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు 2013లో ప్రారంభమైన అన్నభాగ్య పథకం ద్వారా కుటుంబంలోని ఒక్కొక్కరికి ఐదు కేజీల ఆహారధాన్యాలు (4 కేజీల బియ్యం, కేజీ గోధుమలు లేదా రాగులు) ఉచితంగా అందజేస్తున్నారు. వీటితో పాటు ఒక కేజీ చక్కెర, పామాయిల్, ఐదు లీటర్ల కిరోసిన్‌ను సబ్సిడీ ధరకు అందజేస్తున్నారు. ఇక ఇదే సందర్భంలో అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్న వారికి కుటుంబానికి 35 కేజీల ఆహారధాన్యాలు (బియ్యం, గోధుమలు, రాగులు కలుపుకొని) ఉచితంగా అందజేస్తున్నారు. ఇక ఈ పథకాల అమలు తీరుకు సంబంధించి డెరైక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఒక్కో హోబలిలో(గ్రామంలో) మూడు బీపీఎల్ కుటుంబాలు, మూడు అంత్యోదయ అన్నయోజన ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలను ఈ సర్వేలో భాగస్వాములను చేశాయి. ఈ సర్వేలో 2,25 6బీపీఎల్ కుటుంబాలు, 2,232 అంత్యోదయ అన్నయోజన ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలు భాగస్వాములయ్యాయి. కాగా, ఈ సర్వేలో పాల్గొన్న 75 శాతం బీపీఎల్ కుటుంబాలు, 50 శాతం అంత్యోదయ అన్నయోజన లబ్ధిదారులు తమకు ప్రభుత్వం అందజేస్తున్న ఆహారధాన్యాలు ఏ మూలకు సరిపోవడం లేదని ఈ సర్వేలో వెల్లడించాయి. ఇక ఈ సర్వేలో పాల్గొన్న కుటుంబాలన్నీ కూడా తమకు అందజేస్తున్న ఆహారధాన్యాలను మరో పది కేజీలకు పెంచాలని సర్వేలో కోరాయి. నాణ్యత లేని పాలు..... ఇక చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రారంభించిన ‘క్షీరభాగ్య’పై సైతం ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలతో పాటు పాఠశాలల్లో ఇస్తున్న పాలను చిన్నారులు తాగడానికి ఇష్టపడడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. 748 పాఠశాలలు, అంగన్వాడీలకు చెందిన మొత్తం 3,740 మంది విద్యార్థులను ఈ సర్వేలో భాగస్వాములను చేయగా, వీరిలో నుండి 642 మంది విద్యార్థులు తాము అసలు పాలను తాగలేకపోతున్నామని చెప్పారు. క్షీరభాగ్యలో భాగంగా సరఫరా చేస్తున్న పాలలో నాణ్యత లోపించడం, పాలు వాసన వస్తుండడంతో తాము పాలను తాగలేకపోతున్నామని ఈ సర్వేలో విద్యార్థులు వెల్లడించారు. -
నేటి నుంచి ఉచిత అన్నభాగ్య
బెంగళూరు : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలతో పాటు అంత్యోదయ లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల ఉచితంగా బియ్యం, గోధుమలు వితరణ చేయనున్నారు. రాయితీ ధరల్లో ఉప్పు, వంటనూనెను కూడా ప్రభుత్వం అందజేయనుంది. బెంగళూరులోని విధానసౌధాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేటి (శుక్రవారం) ఉదయం 12 గంటలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. యూనిట్‌కు (ఒకరు ఉన్న కుటుంబానికి) రూ.5కిలోల బియ్యం లేదా నాలుగు కిలోల బియ్యం కిలో గోధుమలు లెక్కన గరిష్టంగా 25 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా వితరణ చేయనున్నారు. అదేవిధంగా రూ.20 చొప్పున లీటర్ వంటనూనెను, రూ.2లకు కిలో అయోడైజ్డ్ ఉప్పును ప్రభుత్వం అందజేయనుంది. ఇదిలా ఉండగా గతంలో మాదిరిగానే లబ్ధిదారులకు చక్కెర, కిరోసిన్‌ను కూడా ఇవ్వనుంది. అదేవిధంగా ఏపీఎల్ కార్డుదారులకు కూడా కిలో రూ.15 చొప్పున బియ్యాన్ని రూ.10 చొప్పున గోధుమలను రాయితీ ధరల్లో జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా అందజేయనున్నారు. మే 1 నుంచి నూతనంగా బీపీఎల్, లేదా ఏపీఎల్ కార్డు పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ కిలో రూ.1 చొప్పున గరిష్టంగా 30 కిలోల బియ్యాన్ని అన్నభాగ్య పథకం కింద వితరణ చేస్తున్న విషయం తెలిసిందే. -
పేదింటికి పట్టా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలివ్వనున్నట్టు సర్కారు ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు 1.01 లక్షల (అధికారిక లెక్కల ప్రకారం) కట్టడాలు క్రమబద్ధీకరణకు నోచుకోనున్నాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై ప్రభుత్వం తుది కసరత్తు పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో విధివిధానాలపై ఏక్షణంలోనైనా ఉత్తర్వులు వెలువడనున్నాయి. సర్కారు స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 125 గజాల్లోపు గృహాలను ఉచితంగా క్రమబద్ధీకరించనుంది. దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఆదాయపరిమితిని రూ.2లక్షలుగా నిర్ధారించిన సర్కారు.. విలువైన స్థలాలు అక్రమార్కులు వశంకాకుండా జాగ్రత్త పడుతోంది. ఆహారభద్రత, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డును ప్రామాణికంగా తీసుకొని అర్హుల స్థితిగతులను నిర్ణయించనుంది. జిల్లావ్యాప్తంగా 18,130 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాగా, దీంట్లో వ్యవసాయ 11,922, వ్యవసాయేతర 6,207 ఎకరాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం లెక్క తేల్చింది. ఈ క్రమంలోనే జిల్లాలో 1.01 లక్షల తాత్కాలిక నిర్మాణాలు, 6,040 పక్కా కట్టడాలు ప్రభుత్వ స్థలాల్లో వెలిసినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో వీటన్నింటిని క్రమబద్ధీకరించడం ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వం.. లోటు నుంచి గట్టెక్కాలంటే స్థలాల క్రమబద్ధీకరణే శరణ్యమని భావిస్తోంది. ఈ క్రమంలోనే క్రమబద్ధీకరణవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. కటాఫ్ తేదీని గత జూన్2ను నిర్ణయించిన ప్రభుత్వం.. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. 126 -250 గజాల్లోపు స్థలాలకు 50% ధర మధ్యతరగతి ప్రజలపై కాసింత కరుణచూపిన సర్కారు.. ఆయావర్గాలు నివసిస్తున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ ధర వర్తింపులో కొంత ఊరటనిచ్చింది. 126- 250 చదరపు గజాల్లోపు నిర్మాణ దారుల నుంచి 50శాతం రిజిస్ట్రేషన్ రేటును వ సూలు చేయాలని నిర్ణయించింది. ఆపై 256- 500 గజాల వరకు 75శాతం, ఆపై నిర్మాణాలకు 100 రుసుము తీసుకొని చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. కాగా, ఏ సంవత్సరం ధరలను వర్తింపజేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుత రిజిస్ట్రేషన్ ధరలను అమలు చేస్తారని తెలుస్తోంది. ఇది వాస్తవమైతే మాత్రం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో క్రమబద్ధీకరణలు జరిగే అవకాశాల్లేవు. ఇప్పటికే కొన్ని చోట్ల మార్కెట్ ధరకంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రెగ్యులరైజ్‌కు వీలు కల్పించినా వినియోగించుకునేందుకు దరఖాస్తుదారులు ముందుకొచ్చే అవకాశాలు స్వల్పమేనని చెప్పవచ్చు. అఖిల పక్షం సిఫార్సులు, జిల్లా యంత్రాంగం సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అందుకనుగుణంగా జీఓలో నిబంధనలను పొందుపరచాలని నిర్ణయించింది. -
సైకిళ్ల కొనుగోళ్లకు నిరుపేదలకు రుణాలివ్వాలి: హీరో సైకిల్స్
హైదరాబాద్: దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదలు సైకిళ్లు కొనుగోలు చేయడానికి వారికి మైక్రోఫైనాన్స్ ద్వారా తగిన ఆర్థిక తోడ్పాటునందించాల్సిన అవసరం ఉందని హీరో సైకిల్స్ కో-చైర్మన్, ఎండీ పంకజ్ ముంజాల్ పేర్కొన్నారు. ఇందుకు తాము ఆర్థిక సంస్థలతో భాగస్వాములు కావడానికి సిద్ధంగా వున్నామని చెప్పారు. దేశంలోదారిద్య్రరేఖకు దిగువన 40 కోట్లమంది ప్రజలున్నారని, సైకిళ్లు వారికి అందించగలిగితే వారి జీవనానికి అవి ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రపతి 79వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో ముంజాల్ పాల్గొన్నారని హీరో సైకిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రణబ్ ముఖర్జీ జన్మదినం సందర్భంగా రాష్ట్రపతి భవన్ సిబ్బందికి 50 కస్టమైజ్డ్ హీరో సైకిళ్లను బహుమతిగా ప్రదానం చేశామని పేర్కొంది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఉన్న రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయ పిల్లలకు స్కాలర్షిప్లను ముంజాల్ ప్రదానం చేశారని వివరించింది. -
ఇక ‘భద్రతా కార్డు’..!
ఆదిలాబాద్ అర్బన్ : కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.. అయితే రేషన్ కార్డు అనే పేరుకు బదులు ‘కుటుంబ ఆహార భద్రత కార్డు’ అని కొత్తగా పేరు తీసుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ ఇక ‘రేషన్ కార్డు’ లింకు తెగిపోనుంది. ఈ కార్డు స్థానంలో ‘కుటుంబ ఆహార భద్రత కార్డు’ రానుంది. ఇది కేవలం రేషన్ సరుకులు తీసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుకు బదులుగా ‘కుటుంబ అహార భద్రత కార్డు’ తెలంగాణ ప్రభుత్వం పేరిట జారీ కానుంది. ఇందులో భాగంగానే అర్హులైన ప్రజలందరికీ ‘ఆహార భద్రత కార్డు’ (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) ఇచ్చేందుకు ఈ నెల 15 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దీంతోపాటు అర్హులైన వారికి పింఛన్లు, కుల, ఆదాయ, విద్యార్థులకు సంబంధించిన ఇతర సర్టిఫికెట్లను ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకోనున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియ చేపట్టేందుకు ఈ నెల 7న హైదరాబాద్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ముఖ్యకార్యదర్శుల సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్ తగిన సూచనలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాకు మార్గదర్శకాలు అందాయి. ఇందులో భాగంగానే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ‘భద్రత కార్డు’ ప్రక్రియ ఇలా... దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ నిత్యావసర వస్తువులు అందించేందుకు ‘తెలంగాణ రాష్ట్ర కుటుంబ ఆహార భద్రతా కార్డు’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. ఈ కార్డు కోసం ప్రజలు గ్రామాల్లోని వీఆర్వోలకు, లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వీరిని ఈ ప్రక్రియ గ్రామ ఇన్‌చార్జీలుగా నియమించారు. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలుగా ఉండగా, ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున మొత్తం 1732 మంది అధికారులు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంటుంది. ఈ నెల 15 వరకు ‘భద్రతా కార్డు’ దరఖాస్తులతో పాటు, పింఛన్లు, ఇతర తహశీల్దార్ ద్వారా జారీ చేయబడే సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన వారందరూ ఆహార భద్రతా కార్డులకు తెల్లకాగితంపై తమ వివరాలను రాసి సంబంధిత అధికారులు అందించాలని కలెక్టర్ ఎం.జగన్మోహన్ కోరారు. వీఆర్వోలకు, కార్యదర్శులకు అందించిన దరఖాస్తులన్నీ గ్రామాల వారీగా విభజించి ఆహార భద్రతా కార్డు, పింఛన్లు, సర్టిఫికెట్ల దరఖాస్తులను వేరు చేస్తారు. ఇలా గ్రామాల వారీగా విభజించిన దరఖాస్తులను ఈ నెల 15 నుంచి పర్యవేక్షణ జరుపుతారు. ప్రతీ మండలానికి ఆరుగురు ప్రత్యేక అధికారుల చొప్పున పర్యవేక్షించేందుకు నియమించారు. వీరు వివిధ గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వయంగా సంబంధిత గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ప్రజలు దరఖాస్తులు పెట్టుకున్న తీరు.. అర్హులా.. కాదా.. అనేది తేల్చుతారు. ఒక వేళ ‘బోగస్’గా కూడా ఆహార భద్రతా కార్డు జారీకి అర్హులని గుర్తిస్తే ఈ ఆరుగురు అధికారులే బాధ్యులవుతారు. జిల్లా వ్యాప్తంగా 52 మండలాల్లో మండలానికి ఆరుగురు అధికారులు చొప్పున మొత్తం 312 మంది అధికారులను నియమించారు. ఇందులో ఎంపీడీవోలు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు ముఖ్యులుగా ఉంటారు. ఇప్పటికే 85 వేల దరఖాస్తులు జిల్లాలో ప్రస్తుతం 6,72,288 రేషన్ కార్డులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,617 చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉండడం.. పీడీఎఫ్ బియ్యం పక్కదారి పట్టడం వంటి వాటిని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి బోగస్ రేషన్ కార్డుల ఏరివేత చేపట్టింది. ఇందులో 81,700 రేషన్ కార్డులను బోగస్‌గా గుర్తించి తొలగించారు. అయితే.. గతంలో చేపట్టిన రచ్చబండ, ప్రజాపథం కార్యక్రమాలు, ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 85 వేల మంది తమకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అప్పట్లో ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ఈ దరఖాస్తులు అలాగే ఉన్నాయి. ఇదిలా ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 7,78,613 కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 8,28,042 కుటుంబాలు ఉన్నట్లుగా లెక్క తేలింది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులకు ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసి ఈపీడీఎస్ విధానం ద్వారా సరుకులు కేటాయిస్తున్నారు. కొత్త కార్డులు ఇచ్చేందుకు... - ఎం.జగన్మోహన్, కలెక్టర్ రేషన్ కార్డులకు బదులు తెలంగాణ ప్రభుత్వం కుటుంబ ఆహార భద్రతా కార్డును జారీ చేయనుంది. ఇందుకు ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మొదట గ్రామాల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. 15 నుంచి ప్రతి దరఖాస్తును మండల అధికారులు ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తారు. ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోచ్చు. అర్హులందరికీ ‘ఆహార భద్రత కార్డు’లు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం తరఫున కృషి చేస్తాం. -
ఎన్ఎఫ్బీఎస్ సాయం స్వల్ప పెంపు
ఒంగోలు టౌన్ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబానికి తాత్కాలిక ఉపశమనం కలిగేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీఎస్) నగదును స్వల్పంగా పెంచింది. ఇప్పటివరకు ఈ పథకం కింద ఐదువేల రూపాయల నగదు అందిస్తుండగా, గతేడాది ఏప్రిల్ నుంచి పదివేల రూపాయల సాయం అందేలా చర్యలు తీసుకుంది. అది కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం నుంచి ఠంచనుగా నగదు విడుదల అవుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలుకాకపోవడంతో ఈ పథకం ఉండీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ పథకం కింద సాయాన్ని పెంచడంతోపాటు నేరుగా బాధిత కుటుంబానికే నగదు జమయ్యేలా చర్యలు చేపట్టింది. రెవెన్యూ డివిజనల్ అధికారి తన డివిజన్ పరిధిలో ఎవరైనా కుటుంబ యజమాని మరణిస్తే దానిని ధ్రువీకరిస్తూ ఆన్లైన్ ద్వారా అతని కుటుంబ వివరాలను సెర్ప్ ఉన్నతాధికారులకు పంపాలి. కేంద్రం సూచనలను ఆధారం చేసుకొని ప్రాధాన్యతా క్రమంలో నగదు అందిస్తారు. ఆ మూడు కేటగిరీల వారికి వర్తించదు కుటుంబ యజమాని మరణిస్తే మూడు కేటగిరిలకు చెందిన వారికి వర్తించదు. ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజన, ఆపద్బంధు పథకం కింద ఏమైనా ఆర్థిక సాయం పొందిన వారికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తించదు. కలెక్టర్ ఆదేశాలతో క్లియర్ ఎన్ఎఫ్బీఎస్ దరఖాస్తులు గతంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండేవి. అనేకమంది విసుగు చెంది మిన్నకుండేవారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయకుమార్ దీనిపై దృష్టి సారించారు. జిల్లాలో కొన్ని నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను గుర్తించి బాధిత కుటుంబాలకు యుద్ధప్రాతిపదికన అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికీ కొంతమంది వివరాలు రాకపోతే కొన్నేళ్ల నుంచి మరణించిన కుటుంబ యజమానులను గుర్తించి వారి జాబితాలను సిద్ధంచేసి నగదు అందించారు. 2012 ఆగస్టు నుంచి 2014 ఆగస్టు వరకు ఈ పథకం కింద 13వేల 502మందిని గుర్తించి 5వేల రూపాయల చొప్పున 6కోట్ల 75లక్షల 10వేల రూపాయలు బాధితులకు అందేలా చూశారు. -
32 రూపాయలొస్తే.. పేదలు కానట్లే!!
పేదరికం ప్రమాణాలు మారిపోతున్నాయి. గ్రామాల్లో రోజుకు 32 రూపాయలు, నగరాల్లో 47 రూపాయల కంటే ఎక్కువగా ఖర్చుపెట్టేవాళ్లెవరినీ పేదల కింద లెక్క వేయక్కర్లేదని కేంద్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ ఒకటి సూచించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇది పెద్ద దుమారాన్నే లేపేలా ఉంది. ప్రతిపక్షాలతో పాటు అధికారపక్షానికి చెందినవాళ్లు, సాక్షాత్తు కేంద్ర మంత్రులు కూడా ఈ పేదరికం లెక్కలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కలన్నీ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, దీన్ని తాను తగిన స్థాయిలో లేవనెత్తుతానని కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రంగరాజన్ నేతృత్వంలోని ఓ కమిటీ ఈ పేదరికం అంచనాలను రూపొందించింది. ఈ లెక్కప్రకారం చూస్తే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు పేదవారు. ఇంతకుముందు 2011 సంవత్సరంలో అయితే గ్రామాల్లో రూ. 27, నగరాల్లో రూ. 33 కంటే ఎక్కువ ఖర్చుపెట్టేవాళ్లు పేదలు కారని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఆ మొత్తం కొంత పెరిగిందన్నమాట. పేదలు కానివాళ్లంతా తమ ఆహారానికి, విద్యకు, ఆరోగ్యానికి తగినంత సంపద కలిగి ఉంటారని చెబుతున్నారు. అంటే.. భవిష్యత్తులో అలాంటివాళ్లకు ప్రభుత్వం అందించే ఉచిత పథకాలను వీరికి వర్తింపజేయక్కర్లేదని కూడా ప్రభుత్వాలు చెప్పే అవకాశం ఉంది. సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు నరేష్ అగర్వాల్ కూడా ఈ లెక్కలను ఖండించారు. రంగరాజన్‌కు తాము రోజుకు వంద రూపాయలు ఇచ్చి, పల్లెలో ఎలా బతకాలో చూపించమంటామని అగర్వాల్ అన్నారు. -
రాబందులు చిక్కేనా?
కలెక్టరేట్ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుం బాల కోసం ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తోంది. ఇటు పౌరసరఫరాల శాఖ అధికారులతోపాటు అటు ఎఫ్‌సీఐ అధికారులు కుమ్మక్కవడం వల్ల ఈ పథకం పేదోడికన్నా పెద్దోళ్లకే ప్రయోజనం చేకూరుస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అర్సపల్లిలో పీ డీఎస్ బియ్యం పట్టుబడడంతో ఈ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈనెల 14వ తేదీన నగరంలోని అర్సపల్లి ప్రాంతం లో గల ఓ రైస్‌మిల్లుపై పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలి సిందే. లారీలో ఉన్న 202 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం కనిపించడంతో మిల్లును సీజ్ చేశా రు. ఆ మిల్లులో 1,381 క్వింటాళ్ల ధాన్యం, 273 క్వింటాళ్ల బియ్యం, 4 క్వింటాళ్ల నూకలు ఉన్నాయి. వీటి విలువ రూ. 29.35 లక్షలని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఇన్చార్జి కలెక్టర్ డి.వెంకటేశ్వరరావుకు నివేదిక సమర్పించారు. ఇదీ వరుస? పీడీఎస్ బియ్యం ఎఫ్‌సీఐ గోదాం నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అవుతోంది. తిరిగి ఆ దుకాణాలనుంచి రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసి జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, సంచులు మార్చి ఎఫ్‌సీఐకి లెవీ రూపంలో తరలిస్తున్నారు. ఇలా నెలనెలా టన్నుల కొద్దీ బియ్యం ఎఫ్‌సీఐనుంచి రేషన్ దుకాణాలు, రైస్ మిల్లుల మీదుగా ప్రయాణించి ఎఫ్‌సీఐని చేరుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని భారత్ ఇండస్ట్రీస్, రామకృష్ణ అగ్రో ఇండస్ట్రీస్, మురళీ కృష్ణ ఇండస్ట్రీస్, సముద్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌లు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే అధికారులు మాత్రం ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. పక్క రాష్ట్రాలకూ రూపాయి కిలో బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేసి, నగరంలోని మారుమూల ప్రాంతం లో ఉన్న రైస్‌మిల్లులలో రీసైక్లింగ్ చేసి ఎఫ్‌సీఐతోపాటు పక్కనున్న మహారాష్ట్రలోని ధర్మాబాద్, నాందేడ్, జాల్నా, కర్ణాటకలోని బీదర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడం వల్ల అక్రమా ర్కులు తమ దందాకు జిల్లాను అడ్డాగా మార్చుకున్నారని తెలుస్తోంది. వీరు జిల్లాలోని రేషన్ షాప్లనుంచే కాకుండా ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలనుంచీ రేషన్ బి య్యాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ దందాలో రైస్‌మిల్లర్లతోపాటు జిల్లా పౌరసరఫరాల శాఖ, ఎల్ఎంఎస్ పాయింట్లు, ఎఫ్‌సీఐ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలున్నాయి. చర్యలు కరువు నగరంలో ఇంత పెద్ద ఎత్తున రూపాయి బియ్యం పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువైంది. ఒకే రైసుమిల్లులో సుమారు రూ. 30 లక్షల వరకు అక్రమ సరుకును గుర్తించినా తీసుకున్న చర్యలు శూన్యమే. వారం క్రితం అర్సపల్లిలోని ఓ రైస్‌మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నా.. ఇప్పటికీ సరైన వివరాలు సేకరించలేకపోయారు. కనీసం రికార్డులు సైతం తనిఖీ చేయలేదని తెలుస్తోంది. బియ్యం లెక్కలు వేయడం తప్ప అధికారులు ఈ కేసులో పురోగతి సాధించలేకపోయారు. నిందితుడిని తప్పించారా? కలెక్టర్ ప్రద్యుమ్న బదిలీ కాగానే అక్రమార్కులను కాపాడే యత్నాలు మొదలయ్యాయి. తన మిల్లుపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయం తెలుసుకొని రామకృష్ణ అగ్రో ఇండస్ట్రీస్ యజమాని మహమూద్ పారిపోయిన విషయం తెలిసిందే. గురువారం ఆయన మిల్లుకు వచ్చారని, విచారణ జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. కాగా అసలు నిందితుడు మహమూద్‌ను ఈ కేసు నుంచి తప్పించి, ఆయన స్థానంలో మరొకరిని చూపేందుకు అధికారులు యత్నిస్తున్నారని తెలుస్తోంది -
భారత్ జనాభా 123 కోట్లు!
న్యూఢిల్లీ: భారతదేశ జనాభా 2012, మార్చి 1 నాటికి 123 కోట్లకు చేరింది. ఇక 2011-12లో దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 27 కోట్లు. ఈ వివరాలను కేంద్ర ప్రణాళిక శాఖ సహాయమంత్రి రాజీవ్ శుక్లా గురువారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 2011, మార్చి 1 నాటికి దేశ జనాభా 121 కోట్లుగా ఉన్నట్టు ఆయన తెలిపారు. 2004-05తో పోలిస్తే దేశంలో పేదరికం రేటు 2011-12 నాటికి 37.2 శాతం నుంచి 21.9 శాతానికి తగ్గిందని మంత్రి వివరించారు. 1993-94 నుంచి 2004-05 మధ్యకాలంతో పోలిస్తే 2004-05 నుంచి 2011-12 మధ్యకాలంలో మూడు రెట్లు వేగంగా పేదరికం రేటులో తగ్గుదల నమోదైనట్టు తెలిపారు.