నేటి నుంచి ఉచిత అన్నభాగ్య
బెంగళూరు : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలతో పాటు అంత్యోదయ లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల ఉచితంగా బియ్యం, గోధుమలు వితరణ చేయనున్నారు. రాయితీ ధరల్లో ఉప్పు, వంటనూనెను కూడా ప్రభుత్వం అందజేయనుంది. బెంగళూరులోని విధానసౌధాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేటి (శుక్రవారం) ఉదయం 12 గంటలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. యూనిట్‌కు (ఒకరు ఉన్న కుటుంబానికి) రూ.5కిలోల బియ్యం లేదా నాలుగు కిలోల బియ్యం కిలో గోధుమలు లెక్కన గరిష్టంగా 25 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా వితరణ చేయనున్నారు.
అదేవిధంగా రూ.20 చొప్పున లీటర్ వంటనూనెను, రూ.2లకు కిలో అయోడైజ్డ్ ఉప్పును ప్రభుత్వం అందజేయనుంది. ఇదిలా ఉండగా గతంలో మాదిరిగానే లబ్ధిదారులకు చక్కెర, కిరోసిన్‌ను కూడా ఇవ్వనుంది. అదేవిధంగా ఏపీఎల్ కార్డుదారులకు కూడా కిలో రూ.15 చొప్పున బియ్యాన్ని రూ.10 చొప్పున గోధుమలను రాయితీ ధరల్లో జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా అందజేయనున్నారు. మే 1 నుంచి నూతనంగా బీపీఎల్, లేదా ఏపీఎల్ కార్డు పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ కిలో రూ.1 చొప్పున గరిష్టంగా 30 కిలోల బియ్యాన్ని అన్నభాగ్య పథకం కింద వితరణ చేస్తున్న విషయం తెలిసిందే.