కార్లపై కొనసాగుతున్న ఆఫర్లు
నగదు డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన బహుమతులు
డిసెంబర్ 31 వరకు కొనసాగే అవకాశం
నిల్వలను తగ్గించుకునేందుకు కంపెనీల ప్రయత్నాలు
పండుగ సీజన్ ముగిసిపోయినా కార్ల విషయంలో మాత్రం ఆఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. వివిధ కార్ల కంపెనీలు నగదు డిస్కౌంట్లు, ఇతరత్రా బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆటో డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వాహన రిటైలర్ల దగ్గర 75–80 రోజులకు సరిపోయే నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుంది.
వాహన విక్రయాల గణాంకాలకు సంబంధించిన వాహన్ పోర్టల్ ప్రకారం నవంబర్‌లో తొలి ఇరవై రోజుల్లో 1,77,362 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, కార్ల కంపెనీలన్నీ కలిసి నవంబర్‌లో సుమారు 3,25,000 నుంచి 3,30,000 వరకు వాహనాలను హోల్‌సేల్‌గా డీలర్లకు సరఫరా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాహన నిల్వలను తగ్గించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి.
‘‘ఏడాది చివరన పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు సాధారణంగా ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీలర్ల దగ్గర ఏకంగా 65–70 రోజులకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సంస్థలు భారీగా డిస్కౌంట్లకు తెరతీశాయి. ఇది ఒక రకంగా కార్ల కొనుగోలుదార్లకు అసాధారణ అవకాశంలాంటిదే’’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మొబిలిటీ వర్గాలు తెలిపాయి.
30% వరకు..
కంపెనీలు అధికారికంగా రేట్ల తగ్గింపు లేదా డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్ 31 వరకు డీలర్ల దగ్గర చాలామటుకు మోడల్స్ ధరలపై (ఎక్స్‌షోరూమ్) 20–30 శాతం డిస్కౌంటును కొనుగోలుదార్లు ఆశించవచ్చని ఎఫ్‌ఏడీఏ వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ తెలిపారు.
అంతగా అమ్ముడు కాని మోడల్స్ పేరుకుపోయినా, లేక అమ్ముడవుతున్న స్థాయికి మించి ఉత్పత్తి చేసినా.. ఆ నిల్వలను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మరోవైపు, పెళ్ళిళ్ల సీజన్, ప్రమోషనల్ ఆఫర్లు మొదలైనవి ప్యాసింజర్ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. గణనీయంగా నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తయారీ కంపెనీలు సరఫరాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు.
ఆఫర్ల వెల్లువ..
→ ఎరీనా షోరూమ్‌లలో మారుతీ సుజుకీ ఇండియా తమ ఆల్టో కే10, వ్యాగన్‌ఆర్, సెలీరియో, ఎస్‌ప్రెసో కార్లపై రూ. 20,000–35,000 వరకు రిబేట్ ఇస్తోంది. వేరియంట్లను బట్టి స్విఫ్ట్‌పై రూ. 25,000–50,000 వరకు, బ్రెజాపై రూ. 10,000–20,000 వరకు డిస్కౌంట్ ఉంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,000 ఎక్సే్చంజ్ బోనస్, మోడల్‌ను బట్టి రూ. 2,100–2,300 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లకు ఇది అదనమని పేర్కొన్నాయి.
→ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ. 35,000–45,000 వరకు, ఆరాపై రూ. 20,000 వరకు, ఐ20పై 20,000–45,000 వరకు, ఎక్స్‌టర్‌పై (నిర్దిష్ట వేరియంట్స్‌పై) రూ. 20,000–30,000 వరకు, వెన్యూపై 45,000–50,000 వరకు (వేరియంట్‌ను బట్టి), వెర్నాపై రూ. 70,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇక టక్సన్‌పై రూ. 50,000, అయానిక్ 5 ఈ–ఎస్‌యూవీపై రూ. 2 లక్షల మేర డిస్కౌంట్లు ఇస్తోంది.
→ టాటా మోటార్స్ కూడా అ్రల్టోజ్‌పై రూ. 25,000, పంచ్‌పై (ఐసీఈ వెర్షన్) రూ. 20,000 నగదు డిస్కౌంట్ ఇస్తోంది. అటు టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ సెడాన్, నెక్సాన్ ఎస్‌యూవీల ధరలు (ఐసీఈ మోడల్స్) వరుసగా రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షలు, రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
→ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కొన్ని మోడల్స్‌లో నిర్దిష్ట వేరియంట్లపై, లభ్యతను బట్టి, పరిమిత కాలంపాటు ఆఫర్లు అందిస్తోంది. బొలెరో నియోపై రూ. 70,000 వరకు, స్కారి్పయో ఎన్‌పై రూ. 50,000, థార్ 4 ్ఠ4పై రూ. 1.25 లక్షలు క్యాష్ డిస్కౌంటు ఇస్తోంది. ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్‌పై ఏకంగా రూ. 3 లక్షల నగదు డిస్కౌంట్ ఉంటోంది.
→ హోండా కార్స్ ఇండియా, జీప్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తదితర కార్ల కంపెనీలు కూడా ఏడాది ఆఖరు నాటికి నిల్వలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment