
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) 2.74 కోట్ల మంది ప్రజలున్నారని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర నిబంధనల ప్రకారం ఈ సంఖ్య తక్కువ ఉందని, కానీ రాష్ట్రంలో ఉదారంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ ఉదారంగా సాయం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా బీపీఎల్ సంఖ్యను నిర్ధారించామన్నారు.
2 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ రేషన్ కార్డులు కేవలం బియ్యం కోసమేనన్నారు. వరుసగా మూడు నెలలు బియ్యం తీసుకోని వారి కార్డులు రద్దవుతున్నాయన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. అయితే బియ్యం తీసుకోబోమని ఎవరైనా తమకు విన్నవిస్తే.. ఆయా కార్డులపై ఒక స్టాంప్ వేసి అవి రద్దు కాకుండా చూస్తామని చెప్పారు.
వారం పది రోజుల్లో పూర్తి చెల్లింపులు..
రబీలో రికార్డు స్థాయిలో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఈటల తెలిపారు. వారం రోజుల్లోగా చివరి గింజ వరకూ రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. వారం పది రోజుల్లోగా కొన్న ధాన్యానికి పూర్తిస్థాయిలో చెల్లింపులు జరుపుతామన్నారు. డీలర్లకు కమీషన్ పెంచే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment