పేదింటికి పట్టా! | government decided to give house documents to poor | Sakshi
Sakshi News home page

పేదింటికి పట్టా!

Published Tue, Dec 30 2014 11:08 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

పేదింటికి పట్టా! - Sakshi

పేదింటికి పట్టా!

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలివ్వనున్నట్టు సర్కారు ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు 1.01 లక్షల (అధికారిక లెక్కల ప్రకారం) కట్టడాలు క్రమబద్ధీకరణకు నోచుకోనున్నాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై ప్రభుత్వం తుది కసరత్తు పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో విధివిధానాలపై ఏక్షణంలోనైనా ఉత్తర్వులు వెలువడనున్నాయి. సర్కారు స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 125 గజాల్లోపు గృహాలను ఉచితంగా క్రమబద్ధీకరించనుంది.

దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఆదాయపరిమితిని రూ.2లక్షలుగా నిర్ధారించిన సర్కారు.. విలువైన స్థలాలు అక్రమార్కులు వశంకాకుండా జాగ్రత్త పడుతోంది. ఆహారభద్రత, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డును ప్రామాణికంగా తీసుకొని అర్హుల స్థితిగతులను నిర్ణయించనుంది. జిల్లావ్యాప్తంగా 18,130 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాగా, దీంట్లో వ్యవసాయ 11,922, వ్యవసాయేతర 6,207 ఎకరాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం లెక్క తేల్చింది.

ఈ క్రమంలోనే జిల్లాలో 1.01 లక్షల తాత్కాలిక నిర్మాణాలు, 6,040 పక్కా కట్టడాలు ప్రభుత్వ స్థలాల్లో వెలిసినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో వీటన్నింటిని క్రమబద్ధీకరించడం ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వం.. లోటు నుంచి గట్టెక్కాలంటే స్థలాల క్రమబద్ధీకరణే శరణ్యమని భావిస్తోంది. ఈ క్రమంలోనే క్రమబద్ధీకరణవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. కటాఫ్ తేదీని గత జూన్2ను నిర్ణయించిన ప్రభుత్వం.. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.

126 -250 గజాల్లోపు స్థలాలకు 50% ధర
మధ్యతరగతి ప్రజలపై కాసింత కరుణచూపిన సర్కారు.. ఆయావర్గాలు నివసిస్తున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ ధర వర్తింపులో కొంత ఊరటనిచ్చింది. 126- 250 చదరపు గజాల్లోపు నిర్మాణ దారుల నుంచి 50శాతం రిజిస్ట్రేషన్ రేటును వ సూలు చేయాలని నిర్ణయించింది. ఆపై 256- 500 గజాల వరకు 75శాతం, ఆపై నిర్మాణాలకు 100 రుసుము తీసుకొని చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. కాగా, ఏ సంవత్సరం ధరలను వర్తింపజేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుత రిజిస్ట్రేషన్ ధరలను అమలు చేస్తారని తెలుస్తోంది.

ఇది వాస్తవమైతే మాత్రం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో క్రమబద్ధీకరణలు జరిగే అవకాశాల్లేవు. ఇప్పటికే కొన్ని చోట్ల మార్కెట్ ధరకంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రెగ్యులరైజ్‌కు వీలు కల్పించినా వినియోగించుకునేందుకు దరఖాస్తుదారులు ముందుకొచ్చే అవకాశాలు స్వల్పమేనని చెప్పవచ్చు. అఖిల పక్షం సిఫార్సులు, జిల్లా యంత్రాంగం సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అందుకనుగుణంగా జీఓలో నిబంధనలను పొందుపరచాలని నిర్ణయించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement